ఆస్ట్రేలియా: ఈము కోడిని పట్టుకునేందుకు పోలీసు పాట్లు, సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

ఫొటో సోర్స్, New South wales Police
- రచయిత, లానా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆస్ట్రేలియాలో ఒక పోలీసు అధికారి రోడ్డు మీద ఈము కోడిని తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
ఈ సరదా సంఘటనను స్థానిక పోలీస్ శాఖ తమ రిక్రూట్‌మెంట్ ప్రచారానికి వేదికగా మార్చుకుంది.
సిడ్నీకి పశ్చిమంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాష్‌డేల్ ప్రాంతంలో ఈము కోడి రోడ్డుపైకి వచ్చిందని, దీనివల్ల వాహనదారులకు, ఆ కోడికీ ప్రమాదం ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈము కోడిని రోడ్డు మీద నుంచి పక్కకు పంపించడానికి ఒక యువ పోలీస్ అధికారి దాని వెంట నడవడం మొదలుపెట్టారు.
ఒక దశలో ఆయన వేగాన్ని పెంచి పరుగెత్తినప్పటికీ దాన్ని పట్టుకోలేకపోయారు.


ఫొటో సోర్స్, New South wales Police
"ఈము-సింగ్" పేరుతో ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ఈ వీడియో కింద నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఒక వీక్షకుడు ప్రముఖ కార్టూన్‌ను గుర్తుచేస్తూ "చూడండి అది రోడ్ రన్నర్ పక్షి. కానీ దాని వెనుక ఉన్నది మాత్రం కయోట్ (తోడేలు) కాదు" అని రాశారు.
మంగళవారం నాడు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఈ వీడియోను ఫేస్‌బులో పోస్ట్ చేస్తూ సదరు అధికారి ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆ పక్షి తీవ్రమైన 'ట్రాఫిక్ అంతరాయాన్ని' కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"కొద్దిసేపు సాగిన 'క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్' ఆట తర్వాత ఆ అధికారి ఈము పక్షిని రోడ్డుపై నుండి సురక్షితంగా పక్కకు పంపించగలిగారు. దీంతో ఇబ్బందులు ప్రమాదాలు తప్పాయి" అని పోలీసులు తమ పోస్ట్‌లో రాశారు.
"ఈము కోడి కోసం రోజూ ట్రాఫిక్‌ను మేనేజ్ చేయడం ఎవరికీ సాధ్యపడదు. కానీ పోలీస్ ఉద్యోగంలో ఇవన్నీ భాగమే" అని పేర్కొంటూ "ప్రతి రోజు ఒక కొత్త అనుభవాన్ని" ఇచ్చే కెరీర్ కోరుకునే వారికి రీజియన్లలో పోలీస్ ఆఫీసర్ కావడం ఒక మంచి అవకాశమని వారు సూచించారు.
ఆ పక్షి వెనుక పరిగెత్తిన ఆ 'ఉత్సాహవంతుడైన యువ' అధికారికి ఈ వీడియో ద్వారా వచ్చిన తాత్కాలిక పాపులారిటీని ఆస్వాదిస్తున్నారనిసెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్ అబెర్‌క్రాంబీ తెలిపారు.
ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 90వేల మందికి పైగా చూశారు.
ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి తనే కనుక వెళ్తే ఎలా ఉంటుందో చెబుతూ అబెర్‌క్రాంబీ నవ్వులు పూయించారు.
"ఎవరైనా నన్ను ఈము కోడిని తరమమని అడిగితే, అది ప్రోజాక్ (డిప్రెషన్ టాబ్లెట్) వేసుకున్న ఒక భయపడిన జింక పరుగులా ఉంటుంది. ఎందుకంటే ఆ పక్షితో పోటీ పడేంత వేగం నా దగ్గర లేదు" అని ఆయన జాతీయ వార్తా సంస్థ ఏబీసీతో అన్నారు.
గ్రామీణ, ప్రాంతీయ పరిధిలోని పోలీసులకు రోడ్లపై జంతువులు రావడం గురించి తరచూ ఫిర్యాదులు అందుతుంటాయని, అయితే అవి సాధారణంగా పశువులు లేదా కంగారూలకు సంబంధించినవి అయి ఉంటాయని ఆయన చెప్పారు.
"ఒక పల్లెటూరి పోలీసు జీవితంలో ఉండే కష్టనష్టాలు, అనుభవాలు ఇలానే ఉంటాయి" అని ఆయన అన్నారు.
ఈ వీడియో కొన్ని రోజులుగా చాలా మందిని ఆకట్టుకుంటోంది. దీనిపై ఆన్‌లైన్‌లో పలు హాస్యభరితమైన కామెంట్లు వస్తున్నాయి.
"ఆ పక్షి వెనక్కి తిరిగి అతన్ని తరుముకుంటూ వచ్చే వరకు ఆగండి, అప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత వేగంగా పరిగెత్తగలరో" అని ఒకరు జోక్ చేశారు
"ఆ పక్షి ఎగిరిపోయే ప్రమాదమైతే లేదు" అని మరొకరు రాశారు.
ఇక ఇంకొకరైతే "ఇది ఈము యుద్ధాలను రిపీట్ చేస్తున్నట్లు ఉంది" అని పోస్ట్ చేశారు.
1932లో ఆస్ట్రేలియాలో పంటలను నాశనం చేస్తున్న వేలాది ఈము కోళ్లను నిర్మూలించడానికి అక్కడి సైన్యం చేసిన విఫల ప్రయత్నాన్ని ఉద్దేశిస్తూ ఈ కామెంట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























