ఒప్పందానికి వచ్చిన ఇరాన్‌కు అమెరికా 300 బిలియన్ డాలర్లు (సుమారు రూ.28 లక్షల కోట్లు) ఇవ్వాలా?

    • రచయిత, డేనియల్ బుష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు మిగతా అన్ని విషయాలపైనా తుది ఒప్పందం కుదుర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కొనసాగుతాయని బుధవారం ప్రకటించిన అమెరికా- ఇరాన్ అవగాహన ఒప్పందం వెల్లడించింది.

ఇది అమెరికాకు భారీ విజయమని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జి-7 సదస్సులో భాగంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు.

ఒప్పందంపై బుధవారం ఎలక్ట్రానికల్‌గా సంతకాలు జరిగాయని, అదిప్పుడు అమల్లోకి వచ్చిందని ఇరు దేశాలు స్పష్టం చేశాయి.

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించాలన్న ట్రంప్ లక్ష్యాన్ని సాధించే తుది శాంతి ఒప్పందం కుదరడానికి రెండు దేశాలు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అమెరికా అధికారులు విలేఖరులతో ఫోన్ సంభాషణల ద్వారా వెల్లడైంది.

ఈ ఒప్పందం వల్ల ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను సంపాదించదని, అభివృద్ధి చేయదని, ఉత్పత్తి చేయదని ట్రంప్ స్పష్టంగా చెబుతూ వస్తున్నారు.

అయితే ఒప్పందంలోని అంశాల గురించి అధికారులు చదివి వినిపించిన దానిలో ఇరాన్ అణ్వాయుధాల గురించి ట్రంప్ చెప్పిన దానికంటే తక్కువ ఉంది.

అవగాహన ఒప్పందంలో ఎక్కువగా కాల్పుల విరమణ పొడిగింపు, రాబోయే 60 రోజుల్లో శాశ్వత అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రెండు దేశాల మధ్య జరుగుతున్న ప్రయత్నాలను వేగవంతం చేయడం గురించి ప్రస్తావన ఉంది.

2015లో జరిగిన అసలు ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఒబామా ప్రభుత్వం 20 నెలలు చర్చలు జరిపింది. ట్రంప్ ప్రభుత్వం దీన్ని కేవలం 2 నెలల్లో సాధించగలదా?

ఇరాన్ కోసం 300 బిలియన్ డాలర్ల ప్రణాళిక

ప్రస్తుతానికి ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో "డౌన్‌ బ్లెండింగ్" చేయడానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది.

ఇది ఇరాన్‌కు ఇచ్చిన "ముఖ్యమైన రాయితీ" అని అమెరికన్ అధికారి ఒకరు అభివర్ణించారు.

అయితే ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం గాఢత తగ్గించే విధానం, ఇందుకు సంబంధించిన గడవు గురించిన సాంకేతిక వివరాలను ఇంకా నిర్ణయించలేదు.

శుక్రవారం ప్రతిపాదిత సంతకం తర్వాత అధికారికంగా ప్రారంభమయ్యే రాబోయే 60 రోజుల చర్చల సందర్భంగా ఈ అంశాలపై ఏకాభిప్రాయానికి రావడానికి ప్రయత్నాలు జరుగుతాయి.

అమెరికా ఇరాన్‌కు ఎలాంటి డబ్బు ఇవ్వబోదని ట్రంప్ కూడా పేర్కొన్నారు. ఆయనకు ఇది చాలా కీలకమైన అంశం.

2016లో ఒబామా ప్రభుత్వం ఇరాన్‌కు1.7 బిలియన్ డాలర్లు చెల్లించడంపై ట్రంప్ విమర్శలు చేశారు.

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒప్పందంకంటే తన ఇరాన్ ఒప్పందం మెరుగైనదని ట్రంప్ నిరంతరం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇరాన్ పట్ల కఠిన వైఖరిని అవలంబించానని నిరూపించుకునేందుకు డబ్బు ఇచ్చే విషయాన్ని కూడా ట్రంప్ ఉపయోగించుకున్నారు.

ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం కనీసం 300 బిలియన్ డాలర్లతో ఇరాన్ పునర్నిర్మాణానికి ప్రాంతీయ భాగస్వాములతో కలిసి ఒక ప్రణాళిక రూపొందించడానికి అమెరికా సహకరిస్తుంది.

అవగాహన ఒప్పందం ప్రకారం ఇరాన్‌‌కు ఒక్క డాలర్ కూడా ఇవ్వాల్సిన అవసరం అమెరికాకు లేదని అమెరికన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇరాన్ అణు కార్యక్రమంపై అస్పష్టత

అయితే ఒప్పందంలో ఉపయోగించిన భాష చాలా అస్పష్టంగా ఉంది. చర్చల ద్వారా యుద్ధానికి పరిష్కారం లభిస్తే భవిష్యత్తులో అమెరికా ఇరాన్‌కు కొన్ని చెల్లింపులు చేసే అవకాశం ఉందని సూచిస్తోంది.

ఇది ట్రంప్, జేడీ వాన్స్‌కు పెద్ద రాజకీయ సమస్యగా మారవచ్చు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరూ తాము కొత్తగా 'ముగింపులేని యుద్ధాలను' ప్రారంభించబోమని వాగ్దానం చేశారు.

ఇరాన్‌కు అమెరికా నుంచి ఎలాంటి ఆర్థిక సాయం నేరుగా అందకున్నా 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' మద్దతుదారులు ఒప్పందంలో అంశాలను వ్యతిరేకించవచ్చు.

ఈ ఒప్పందంపై ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీలోనే విమర్శలు పెరిగాయి.

అవగాహన ఒప్పందం, దానితో ముడిపడి ఉన్న అంశాల గురించి ట్రంప్ ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

కొంతమంది రిపబ్లికన్ సెనేటర్లు ఒప్పందంపై బహిరంగంగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ ఇరాన్‌కు ఎక్కువ రాయితీలు ఇచ్చారని దానికి ప్రతిఫలంగా తగినన్ని పొందలేదని ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ విమర్శించారు.

"ఇరాన్‌ను దాని అణు ఆశయాల నుండి సమర్థవంతంగా నిరోధించలేకపోయారు. హార్ముజ్ జలసంధిని మూసివేయడం లేదా మూసివేస్తామని బెదిరంచడమనే వ్యూహం పని చేస్తుందని ఇరాన్ తెలుసుకుంది. భవిష్యత్తులో దీనిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది" అని పదవీ విరమణ చేస్తున్న లూసియానా సెనేటర్ బిల్ కాసిడీ ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.

"దశాబ్దాలలో ఇదే అతిపెద్ద విదేశాంగ విధాన తప్పిదం" అని రిపబ్లికన్ నేత ఒకరు అన్నారు.

ఒకటిన్నర పేజీల ఒప్పందంలో మరెన్నో ముఖ్యమైన అంశాలకు కూడా చాలా తక్కువ స్థానం కల్పించారు.

హెజ్బొల్లాకు నిధులను ఆపడం సాధ్యమవుతుందా?

ఇరాన్ మీద దాడులు ప్రారంభించడానికి ముందు ఇరాన్ సన్నిహిత గ్రూపులు హిజ్బొల్లా, హమాస్, హౌతీలకు ఇరాన్ నుంచి ఆర్థిక సాయం అందకుండా నిరోధించడం తన ప్రాధాన్యతల్లో ఒకటని ట్రంప్ చెప్పారు.

ఇది ఇజ్రాయెల్‌కు కూడా ప్రాధాన్య అంశం కావడంతో ఇరాన్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.

అవగాహన ఒప్పందంలో పేర్కొన్నట్లుగా 60 రోజులపాటు కాల్పుల విరమణ అనేది ఇజ్రాయెల్‌కు కూడా వర్తిస్తుంది. ఈ ఒప్పందంలో కాల్పుల విరమణ తప్ప హిజ్బొల్లాకు నిధులు, ఆయుధాల నిలిపివేత సహా అనేక ఇతర అంశాల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.

తదుపరి చర్చల్లో హిజ్బొల్లాతో పాటు ఇరాన్ ఇతర సన్నిహిత గ్రూపులకు సాయం అందించడాన్ని ఆపేయడంపై ఇరాన్ మీద ఒత్తిడి తెస్తారో లేదో కూడా తెలియదు.

ఇరాన్ క్షిపణి కార్యక్రమం గురించి కూడా ఇందులో వివరంగా ప్రస్తావించలేదు.

ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇరాన్ అణు కార్యక్రమం.

జెనీవాలో కుదిరిన ఒప్పందం.. తుది సమగ్ర ఒప్పందానికి దారితీస్తుందా లేదా అనే దానిపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.

ఈ ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలు 60 రోజుల్లోగా తదుపరి చర్చలను ముగించాలి. అవసరమైతే ఈ గడువును పొడిగించవచ్చని ఉంది.

ఇంత తక్కువ సమయంలో సమగ్రమైన, శాశ్వతమైన ఒప్పందం కుదురుతుందని రెండు దేశాలకు పూర్తి నమ్మకం లేదనడానికి ఇదొక సూచికగా భావించవచ్చు.

జి-7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ట్రంప్ ఇరాన్‌తో శాశ్వత శాంతి అవకాశాలపై పెద్దగా ఆశలు ఉన్నట్లు మాట్లాడలేదు.

"60 రోజుల్లో మనం ఒక ఒప్పందానికి రాకపోతే ఏమవుతుంది. మనం మళ్లీ బాంబు దాడులు మొదలు పెడతాం" అని ట్రంప్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)