You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రెండేళ్ల పాప జ్ఞానేశ్వరి ఎక్కడ? ఆ 40 ఎకరాల తోటలో చిన్నారికి ఏమైంది, దర్యాప్తులో వీడని చిక్కుముడి
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో తండ్రి కోసం వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
చిన్నారి కోసం వందలాది మంది పోలీసులు, గ్రామస్థులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
డ్రోన్ కెమెరాలు, సాంకేతిక పరికరాలు వినియోగించినప్పటికీ, ఇప్పటివరకు దర్యాప్తులో కీలకమైన ఆధారం ఏదీ లభించలేదు.
"ఈ మూడు చక్రాల చెక్క బండితోనే ఎక్కువగా ఆడుకుంటుంది. వద్దమ్మా.. కాళ్ల మీద పడిపోతుందంటే 'మా నాన్న కొన్నాడు, ఈ బొమ్మ నాది' అనేది సార్" అని జ్ఞానేశ్వరి ఆట వస్తువులను చూస్తూ ఆమె తల్లి సుంకర భవాని చెప్పారు.
తండ్రి గణేష్‌తో జ్ఞానేశ్వరికి ఎంతో అనుబంధం ఉండేదని ఆమె బీబీసీతో చెప్పారు.
తోటలోకి వెళ్తున్న తండ్రి వెంట వెళ్లిన జ్ఞానేశ్వరిని తిరిగి ఇంటి వద్ద వదిలేసిన కొద్ది నిమిషాలకే ఆమె కనిపించకుండా పోయింది.
9 రోజులు గడిచినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఆమెతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క మాత్రం మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది.
కానీ, అది కూడా ఎనిమిదో రోజున విచిత్రంగా ప్రవర్తిస్తూ చనిపోయిందని పాప కుటుంబసభ్యులు చెప్పారు.
అసలు జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు ఏం జరిగింది?
తొమ్మిది రోజులుగా ఆందోళన కలిగిస్తున్న ఈ ఘటనలో తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.
అక్కడెలా ఉందంటే...
కాకినాడ జిల్లాలోని తుని జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలోని నర్సీపట్నం రోడ్డు వైపు వెళ్తుంటే, కొండ ప్రాంతంలో సీహెచ్ అగ్రహారం గ్రామం ఉంటుంది. ఇక్కడ పామాయిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రతి తోటకి ఒక కేర్ టేకర్ వారి కుటుంబంతో అక్కడే నివాసం ఉంటుంటారు. అలాంటి కుటుంబమే సుంకర గణేష్‌ది. గణేష్ నివాసముంటున్న 40 ఎకరాల పామాయిల్ తోటలోకి, ఆయన ఇంటికి బీబీసీ బృందం వెళ్లింది.
గణేష్, ఆయన భార్య భవాని, పిల్లలు జ్ఞానేశ్వరి, మరో 6 నెలల బిడ్డతో ఆ 40 ఎకరాల తోటలో నివాసముంటున్నారు. వీరితో పాటు గణేష్ తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. తోట మధ్యలో సుమారు 80 గజాల్లో నిర్మించిన రెండంతస్థుల కాంక్రీట్ బిల్డింగ్‌లో వీరంతా నివాసం ఉంటున్నారు.
పై నుంచి చూస్తే వేలాది పామాయిల్ చెట్ల మధ్య ఈ ఒక్క ఇల్లే కనిపిస్తుంది. ఇంటి ముందు ఒక సీసీ కెమెరా, మామిడి చెట్టు ఉన్నాయి. ఈ మామిడి చెట్టు నీడే జ్ఞానేశ్వరి ఆటల ప్రపంచం.
అక్కడ నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి ఎప్పుడైనా మరో 100 అడుగుల దూరం వరకు వెళ్తుందని తల్లిదండ్రులు గణేష్, భవానీలు బీబీసీతో చెప్పారు.
కానీ, ఆ రోజు తోటకి వెళ్తున్న తండ్రిని వెంబడిస్తూ తోట మధ్యలోని కాలిబాటలో పాప వెళ్లి అదృశ్యమైపోయిందని తల్లిదండ్రులు బీబీసీకి చెప్పారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన (జూన్ 6) రోజు ఏం జరిగిందో ఆ పాప తల్లిదండ్రులు భవానీ, గణేష్‌లు బీబీసీకి వివరించారు.
"శనివారం ఉదయం పాప మాతోనే ఉంది. వాళ్ల నాన్న తోటలో ఏదో పనుందని వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత, పాప కూడా ఆయనతో మామిడి చెట్టు దాటి కొంత దూరం వెళ్లింది. దీంతో ఆయన పాపను వెనక్కి తీసుకువచ్చారు. నేను చిన్నపాపకి(మరో కుమార్తె) స్నానం చేయిస్తుంటే, తోటలో పని ఉంది వెళ్తున్నా పాపని చూసుకోమంటూ జ్ఞానేశ్వరిని గోడ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. నేను జ్ఞానేశ్వరిని పట్టుకున్నాను. దాంతో నాన్న వెళ్లిపోతున్నారని ఏడ్చింది. అదే సమయంలో ఇంట్లోని చిన్నమ్మాయి పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు విని, చిన్నపాపకి పాలు పట్టించడానికి లోపలికి వెళ్లాను. ఎందుకంటే పెద్దమ్మాయి సాధారణంగా ఇక్కడిక్కడే ఆడుకుంటుంది లేదా వాళ్ల నాన్నతో ఉంటుంది" అని జ్ఞానేశ్వరి తల్లి సుంకర భవాని బీబీసీకి చెప్పారు.
"నేను చిన్నపాప పక్కనే పడుకొని ఉంటే, సమీప గ్రామంలోని ఒకాయన వచ్చి, మీ పెద్ద పాప ఏదని నన్ను అడిగారు. మా ఆయన దగ్గరుందని చెప్పాను. కాదు, తోట నుంచి ఒక ఆయన వెళ్తూ మీ పాపని, కుక్క పిల్లని చూశాడంట. పాప దగ్గరకు వెళ్తుంటే, కుక్క వెళ్లనివ్వలేదంట. దగ్గరకు రానివ్వకుండా బెదరగొట్టిందంట... అని చెప్పారు. వెంటనే నా భర్తకు ఆయన ఫోన్ చేస్తే మా పాప మా ఆవిడ దగ్గరే ఉందని చెప్పారు. దీంతో, విషయం తెలిసి ఊళ్లో వాళ్లు వచ్చారు. వారితో కలిసి తోట, కొండంతా వెతికాం. కానీ, పాప కనిపించలేదు" అని భవాని వివరించారు.
ఆ తర్వాత సాయంత్రానికి పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె చెప్పారు.
"మా ఆయన ఏ పని మీద ఊరెళ్లినా, ఇద్దరి పాపలతో ఇదే ఇంట్లో ధైర్యంగా ఉంటాను. నా పని నేను చేసుకుంటాను. పిల్లలను చూసుకుంటాను. ఎప్పుడూ, ఎవరు వచ్చి భయపెట్టింది లేదు. ఇక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది పడే సంఘటన జరిగిందే లేదు" అని భవానీ బీబీసీకి తెలిపారు.
'తెల్లారితే నా గుండెల మీదే కనిపిస్తుంది'
జ్ఞానేశ్వరి తల్లి కంటే తన వద్దే ఎక్కువగా ఉంటుందని తండ్రి గణేష్ చెప్పారు.
"పాప నాతో చాలా క్లోజ్. రాత్రుళ్లు వాళ్లమ్మ దగ్గర పడుకున్నా సరే, ఏ రాత్రి తెలివొచ్చినా.. నా దగ్గరకు వస్తుంది. తెల్లవారి నేను లేచే చూస్తే, నా గుండెలపై పడుకొని కనిపిస్తుంది. లేవగానే ఏదో ఒకటి తింటుంది. ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటుంది. ఇంకా మాటలు సరిగా రావు, నాన్న అనలేక నన్ను 'నాని.. నాని' అని పిలుస్తుంది. ఎవరైనా నామీద చేయి వేసినా ఊరుకోదు. మా నాని మా నాని అని ఏడ్చేస్తుంది" అని పాపతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గణేష్.
అలాంటి పాప ఇప్పుడెలా ఉందో? ఎవరితో ఉందో? ఏం తింటుందో? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన.
సీహెచ్ అగ్రహారంలో తాము నివసిస్తున్న ప్రదేశం చుట్టూ 500 ఎకరాల అటవీ ప్రాంతం ఉంటే, అందులో తాను 40 ఎకరాల్లో ఉన్న పామాయిల్ తోట పనులు చూస్తుంటానని గణేష్ బీబీసీతో చెప్పారు.
ఆ 35 నిమిషాల మధ్యలో...
పాపని జూన్ 6వ తేదీ మధ్యాహ్నం తండ్రి గణేషే ఇంటి వద్ద వదిలిపెట్టి తోటలోకి వెళ్లిపోయారు. అప్పుడేం జరిగిందో ఆయన బీబీసీకి వివరించారు.
"శనివారం ఉదయం 11.50 గంటల వరకు పాప నా దగ్గరే ఉంది. పాపని, కొబ్బరి బొండాలను ఇంటి దగ్గర దించేసి తోటలోకి వెళ్లాను. ఆ తర్వాత ఏమైందో తెలియదు. పాప ఎక్కడో కొండ దగ్గర కుక్కతో కనిపించిందని ఊర్లో ఒకాయన 12.25 గంటలకు ఫోన్ చేసి చెప్తే వెంటనే పరిగెత్తుకుని ఇంటికి వచ్చాను. నేను వదిలిపెట్టిన తర్వాత, పాప కనిపించకుండా పోవడానికి మధ్య కేవలం 35 నిమిషాల సమయమే గడిచింది. ఏం జరిగిందో తెలియడం లేదు" అని గణేష్ బీబీసీకి చెప్పారు
40 ఎకరాల తోటను కేవలం 35 నిమిషాల్లో చిన్నారి దాటగలదా? అనే ప్రశ్నకు గణేష్ 'ఎవరైనా తీసుకెళ్తే తీసుకువెళ్లిపోవచ్చు' అని సమాధానమిచ్చారు.
తోట చుట్టూ ఫెన్సింగ్ ఉన్నప్పటికీ దానిని దాటితే గుర్తించడం కష్టమేనని ఆయన చెప్పారు.
పోలీసులు ఏమన్నారు?
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షిస్తున్నారు.
"పెద్దాపురం సబ్ డివిజన్ హోం గార్డు నుంచి డీఎస్పీ వరకు, అలాగే ఏఎన్ఎస్, డాగ్స్ స్క్వాడ్, డ్రోన్స్ స్వ్కాడ్, ఫారెస్ట్ టీమ్స్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టాం. జ్ఞానేశ్వరి తండ్రికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఆర్థిక లావాదేవీలున్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేశాం. ఇక్కడ గతంలో పని చేసి మానేసిన కూలీలను కూడా ప్రశ్నించాం. వాళ్లు ఆ సమయంలో పని చేసిన విధానం, అప్పుడేమైనా గొడవలు, వారు గమనించిన అనుమానితులు, అలాంటి వారిలో ఈ మధ్య ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఈ తోటలో పని చేసే వీళ్లకి, కూలీలకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయా? అవి కూడా వెరిఫై చేశాం" అని డీఎస్పీ తిలక్ బీబీసీకి చెప్పారు.
"ఈ చుట్టు పక్కల గ్రామాల్లో గంజాయికి అలవాటుపడిన వ్యక్తులను విచారించాం. చుట్టపక్కల సీసీ కెమెరాలు తనిఖీ చేశాం" అని చెప్పారు.
అనూహ్యంగా కుక్క మరణం
పాపతో పాటు అదృశ్యమై మూడు రోజుల తర్వాత ఇంటి తిరిగి వచ్చిన కుక్కకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు 8 కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు.
పోలీసులు మరోసారి ప్రయత్నించేందుకు కుక్కని వినియోగించాలని అనుకున్నారు. కుక్కే చిన్నారి అన్వేషణలో కీలకంగా మారుతుందని అంతా భావించారు. కానీ, కుక్క చనిపోయింది.
పోలీసులు, కుటుంబసభ్యులు చెప్పిన వివరాలు ప్రకారం "చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్నిరోజులుగా జల్లెడ పట్టిన కుక్క, తిరిగి ఇంటికొచ్చిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తూ మృత్యువాత పడింది".
బీబీసీ ఆ ఇంటికి వెళ్లినపుడు ఆ కుక్క ఇనుప బోనులో ఉంది. దాని తీగలను కొరికేందుకు కుక్క ప్రయత్నిస్తోంది. అలాగే తోక సగమే ఉంది. కుక్క తన తోకను తానే కొరికేసిందని కుటుంబసభ్యులు చెప్పారు.
"కుక్క మృతదేహాన్ని ప్రభుత్వ పశు వైద్యశాలకి పంపించాం. కుక్క మరణానికి కారణమేంటో తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నాం" అని తుని రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు.
జ్ఞానేశ్వరి ఆచూకీకి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. లక్ష బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.
జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీని త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు.
దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, నిపుణుల సాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు.
"అసలు పాప ఉందా లేదా అనేది కూడా తెలియడం లేదు. ఇంటి నుంచి రెండు చెట్లు దాటి వెళ్లని పాప, ఇన్ని రోజులుగా కనిపించకపోవడం అర్థం కావడం లేదు" అని పాప తండ్రి గణేష్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)