900 కేజీల అడవి దున్న కొమ్ములతో పొడవడంతో గాల్లో గిరికీలు కొడుతూ ఎగిరిపడిన వృద్ధుడు

ఫొటో సోర్స్, facebook.com/mike.macleod
- రచయిత, బ్రాండన్ డెనన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
వయోమింగ్‌లోని ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్‌లో సుమారు 900 కేజీల బరువున్న అడవిదున్న వేగంగా వచ్చి పొడవడంతో ఓ వృద్ధుడు గాల్లోకి ఎగిరిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. గడ్డిలో పడుకుని ఉన్న ఓ అడవి దున్నను ఓ బాలుడు, అతని తాత ఫోటో తీస్తున్నారు. ఈ సమయంలో అది ఒక్కసారిగా లేచి వారిని తరిమినట్లు కనిపించింది.
ఈ సంఘటనలో గాయపడిన పడిన వ్యక్తి 65ఏళ్ల ఐసోమ్ మెక్ డేనియల్ అని అమెరికన్ మీడియా పేర్కొంది.
అడవిదున్న దాడిలో ఆయనకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన "తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని" ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
డేనియల్ను ఆసుపత్రికి తరలించారని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఈ దాడికి సంబంధించి నేషనల్ పార్క్ సర్వీస్ ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు.
దీనిపై స్పందన కోసం బీబీసీ నేషనల్ పార్క్ సర్వీస్‌ను సంప్రదించింది.


ఫొటో సోర్స్, facebook.com/mike.macleod
"అడవి దున్నలు ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే ఎల్లోస్టోన్‌లో ఇతర జంతువుల కంటే ఇవే ఎక్కువ మందిని గాయపరిచాయి" అని నేషనల్ పార్క్ సర్వీస్ తన వెబ్సైట్లో పేర్కొంది.
"అవి మనుషుల కంటే 3 రెట్లు వేగంగా పరిగెత్తగలవు. అందువల్ల వాటికి అవసరమైనంత స్థలం ఇవ్వడం చాలా ముఖ్యం" అని సైట్లో పేర్కొంది.
"ఎల్లో స్టోన్ సందర్శకులు దున్నపోతులకు కనీసం 25 గజాల(75 అడుగులు) దూరంలో ఉండాలి. ఫోటోల కోసం వాటికి దగ్గరగా వెళ్లొద్దు" అని నేషనల్ పార్క్ సర్వీస్ సూచిస్తోంది.
ఈ సంఘటన ఎల్లోస్టోన్ సరస్సు సమీపంలోని బ్రిడ్జ్ బే క్యాంప్ గ్రౌండ్లో జరిగింది.
మెక్ డేనియల్, ఆయన మనవడు దున్నకు చాలా దగ్గరగా వెళ్లారు. వాళ్లు దాని దగ్గరకు వెళ్లి కెమెరాలను బయటకు తీసినప్పుడు దున్న కంగారుపడినట్లు కనిపించి అటూఇటూ దొర్లుతూ ఒక్కసారిగా పైకి లేచింది.
ఆ సమయంలో అక్కడకు ఒక తెల్ల ట్రక్కు నెమ్మదిగా రావడంతో దున్న ట్రక్కు పైకి ఎగిరి దూకింది. అది చూసి డ్రైవర్ ట్రక్కును వేగంగా నడపటంతో దున్న డేనియల్, ఆయన మనవడివైపు వచ్చింది.
దీంతో వాళ్లు భయపడి చెట్లలోకి పరుగెత్తేందుకు ప్రయత్నించారు. అయితే అది డేనియల్ను కొమ్ముతో పొడిచింది.
"ఆ దున్నపోతు తన ఎడమ కొమ్ముతో అతడిని వెనుక నుంచి పొడిచింది" అని ఆ ఘటనను రికార్డ్ చేసిన మైక్ మాక్లియోడ్ స్థానిక పత్రిక కౌబాయ్ స్టేట్ డైలీతో చెప్పారు.
"ఆయన గాలిలో గిరికీలు కొడుతూ పక్కకు పడిపోయారు. ఆయనకు కాలు నొప్పిగా ఉన్నప్పటికీ చాలా సేపు స్పృహలోనే ఉన్నారు" అని మాక్లియోడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, facebook.com/mike.macleod
ఎల్లో స్టోన్ వేసవిలో రద్దీగా ఉంటుంది. ఏడాది మొత్తం పార్కుకు వచ్చే వాళ్లలో జూన్, జూలై, ఆగస్టులోనే దాదాపు 60శాతం మంది వస్తారు.
జూలై జంతువులకు 'సంతానోత్పత్తి' కాలం. ఈ సమయంలో దున్నల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు అధికంగా ఉంటాయని కొలరాడోలోని లారామీ ఫూతిల్స్ బైసన్ కన్జర్వేషన్ హెర్డ్‌లో సైంటిఫిక్ లీడ్ జెన్నిఫర్ బార్‌ఫీల్డ్ చెప్పారు.
"అది వాటి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఏడాదిలో ఇతర సమయాలతో పోలిస్తే ఆ సమయంలో అవి అనూహ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది" అని ఆమె తెలిపారు.
జంతువుల సంభోగ కాలంలో సురక్షితంగా ఉండే వాహనంలో ఉండి పరిశీలించడమే తప్ప, తమ టీమ్ అడవి దున్నలకు దూరంగా ఉంటుందని బార్‌ఫీల్డ్ అన్నారు.
"మీ భద్రత కోసం అడవి దున్నల నుంచి కనీసం 25 గజాల దూరంలో ఉండండి" అంటూ అడవి దున్నలను చూసేందుకు నడిచి వెళ్లేవారికి ఆమె సలహా ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























