You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోదీ విజ్ఞప్తి ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందా? నిపుణుల మాటేమిటి
ఇరాన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా మారుతుందని చాలామంది నిపుణులు భావించారు.
ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూతపడినప్పటి నుంచి, భారతదేశంలో కూడా చమురు, గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
గత నెలలో వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదంటూ చాలామంది ప్రజలు ఫిర్యాదులు చేయడం కనిపించింది.
అయితే, ఈ మొత్తం కాలంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ పెరుగుదలేమీ కనిపించలేదు. వినియోగదారులకు ఉపశమనం కలిగించడం కోసం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
కానీ, ఈ వారంలో అకస్మాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక విజ్ఞప్తి చేశారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, ప్రజారవాణా వైపు మొగ్గు చూపాలని ఆయన కోరారు. అలాగే, అనవసరమైన విదేశీ ప్రయాణాలను మానుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనవద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు, రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం వరకు తగ్గించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి మోదీ చేసిన ఈ విజ్ఞప్తి భారత ఆర్థిక వ్యవస్థలో తలెత్తబోయే ఏదో ఒక పెద్ద సంక్షోభాన్ని సూచిస్తోందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ ఘర్షణలు ప్రారంభమైన సమయంలో డాలర్‌తో పోలిస్తే దాదాపు 91 రూపాయల వద్ద ఉన్న రూపాయి విలువ, ప్రస్తుతం డాలర్‌కు 95 రూపాయలను దాటింది.
ఇప్పటివరకు పెరుగుతున్న చమురు ధరల భారాన్ని దేశీయంగా చాలా వరకు ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది.
కానీ, త్వరలోనే దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడటం ప్రారంభం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎరువుల కొరత, యూరియా-అమ్మోనియా ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా ప్రియం కావచ్చన్న అంచనాలున్నాయి.
'అత్యంత అధ్వానమైన పరిస్థితులను' ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ హెచ్చరించారు.
అయితే, కేవలం భారతదేశం మాత్రమే ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు. యుద్ధం ప్రారంభమైన తర్వాత పలు దేశాలు ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టాయి.
చైనా తన చమురు శుద్ధి కర్మాగారాలను తాత్కాలికంగా ఇంధన ఎగుమతులను నిలిపివేయాలని ఆదేశించింది. అయినప్పటికీ అక్కడ పెట్రోల్ ధరలు పెరిగాయి. పైగా విమాన ఇంధనం ప్రియం కావడంతో కొన్ని చైనీస్ ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసులను కూడా తగ్గించుకున్నాయి.
ప్రజలు వాహనాల వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించే లక్ష్యంతో ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాలు ప్రజా రవాణాను (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్) ఉచితం చేశాయి, మరికొన్ని చోట్ల ఛార్జీలను సగానికి తగ్గించాయి.
ఫిలిప్పీన్స్ మార్చి నెలలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శ్రీలంక కూడా ఇంధన రేషనింగ్‌ను అమలు చేసింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఉత్పన్నమవుతున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, భారతదేశం ఈ దిశగా ఇప్పటివరకు ఎందుకు పెద్దగా చర్యలు తీసుకోలేదు? ఎన్నికల కారణంగానే ప్రభుత్వం ఇప్పటివరకు మౌనంగా ఉందా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
'ది లెన్స్' కార్యక్రమంలో కలెక్టివ్ న్యూస్‌రూమ్ 'డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం' ముకేశ్ శర్మ ఈ అంశంపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ ఝా, ఆర్థిక అంశాలపై అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్, 'ది ఎన్ షో' ఎడిటర్ నీరజ్ బాజపేయీ, అలాగే ఆర్థికవేత్త డాక్టర్ దీపా సిన్హాలతో చర్చించారు.
విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవాలి: అశోక్ ఝా
ప్రధాని ప్రకటన తర్వాత ప్రస్తుత పరిస్థితులు ఎంతవరకు ఆందోళనకరంగా ఉన్నాయనే ప్రశ్నకు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ ఝా సమాధానమిస్తూ.. ప్రస్తుతానికైతే పరిస్థితులు అంత ఆందోళనకరంగా ఏమీ లేవని అన్నారు.
ఆయన మాట్లాడుతూ, "ప్రధానమంత్రి చెప్పింది ప్రజలకు ఒక విజ్ఞప్తి మాత్రమే. విదేశీ మారక నిల్వల వ్యవహారం తీవ్రరూపం దాల్చవచ్చని ఆయన హెచ్చరించారు. ఒకవేళ పశ్చిమ ఆసియా యుద్ధం ఇలాగే కొనసాగి, దాని ప్రభావం విదేశీ మారక నిల్వలపై పడుతూ ఉంటే మరికొన్ని రోజుల తర్వాత లేదా ఒక నెల తర్వాత పరిస్థితి తీవ్రంగా మారవచ్చు" అని పేర్కొన్నారు.
"ప్రధాని చెప్పిన దాంట్లో ఒకే ఒక ప్రాధాన్యాంశం ఉంది, అది విదేశీ మారక నిల్వలను కాపాడుకోండి, వాటిని వృథా చేయకండి. అందుకే ఇంధన వినియోగం తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఆయన బంగారం కొనవద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరారు" అని చెప్పారు.
అయితే, ప్రధానమంత్రి విజ్ఞప్తి తర్వాత సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. అదేమిటంటే, ప్రభుత్వమే భారీగా ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తుంటే.. నాయకులు, మంత్రులు, ఎంపీలు విలాసవంతంగా ఖర్చు చేస్తూ ఉంటే.. ప్రజలకు ఇది కేవలం ఒక ఉచిత సలహాలా అనిపిస్తుంది తప్ప, నిజమైన సంక్షోభంలా అనిపించదు.
దీనిపై అశోక్ ఝా స్పందిస్తూ, "బంగారం విషయానికి వస్తే... ఇది భారతీయ మనస్తత్వంలో, సంస్కృతిలో ఒక భాగమైపోయింది. కాబట్టి కేవలం విజ్ఞప్తి చేసినంత మాత్రాన దీని కొనుగోళ్లు తగ్గిపోవు" అని అన్నారు.
''ఇటువంటి స్థితిలో ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని (డ్యూటీ) 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. కానీ దీనివల్ల పెద్దగా ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పెళ్లిళ్లకు, ఇతర పండుగలకు ప్రజలు ఏదో ఒక రకంగా బంగారం కొంటూనే ఉంటారు" అని చెప్పారు.
"కానీ దీనివల్ల జరిగే ఒకే ఒక అవాంఛనీయ పరిణామం ఏమిటంటే.. దేశంలో బంగారం స్మగ్లింగ్ పెరిగిపోతుంది. 1990ల కాలంలో బంగారంపై డ్యూటీని రెండు శాతానికి తగ్గించినప్పుడు స్మగ్లింగ్ చాలా వరకు అదుపులోకి వచ్చిన విషయం మీకు గుర్తుండొచ్చు" అన్నారాయన.
"ఇప్పుడు దానిని రెండు శాతం నుంచి ఆరు శాతానికి, ఆపై ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచారు. దీనివల్ల స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉంది, ఇది ఒక అవాంఛనీయ పరిణామం" అని అశోక్ ఝా అభిప్రాయపడ్డారు.
ఎటువంటి ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా పరిస్థితులు నిలకడగా ఉన్నాయని లేదా త్వరలోనే చక్కబడతాయనే నమ్మకం ప్రజల్లో కలగడానికి ప్రభుత్వం తన ఖర్చులను కొంతవరకు పెంచాలని చెబుతుంటారు.
కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం గనుక ఖర్చులు తగ్గిస్తే, అది మొత్తం ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నపై పూర్వ ఆర్థిక శాఖ కార్యదర్శి స్పందిస్తూ.. కేవలం విదేశీ మారక నిల్వలను తక్కువగా ఖర్చు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని అన్నారు.
"మనకు కావలసింది విదేశీ మారక నిల్వలు పెరగడం. అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎఫ్‌పీఐ) ద్వారానే దేశంలోకి వస్తుంది. కాబట్టి, సరైన విధానాల ద్వారా ఈ రెండింటినీ పెంచేలా చూడాలి" అని పేర్కొన్నారు.
"గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా ఎఫ్‌డీఐ వృద్ధి ప్రతికూలంగా సాగుతోంది. ఇది ఒకే చోట నిలిచిపోవడమో లేదా క్షీణించడమో జరుగుతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో విశ్లేషించి, ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలి. అప్పుడే మన నికర ఎఫ్‌డీఐ వృద్ధి చెందుతుంది" అని అన్నారు.
"అదేవిధంగా గత కొన్ని నెలలుగా ఎఫ్‌పీఐ పెట్టుబడిదారులు కూడా దేశం నుంచి తమ నిధులను వెనక్కి తీసుకువెళ్తున్నారు. వారిని ఎలా అడ్డుకోవాలో కూడా మనం ఆలోచించాల్సి ఉంది. మనం 'లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్' (దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను) అంశాన్ని కూడా పునఃసమీక్షించాలి. అలాగే ఎఫ్‌డీఐకి సంబంధించి గతంలో ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలలో కొన్ని సమస్యలు ఉండేవి. వాటిని ఎలా సరిదిద్దాలనే విషయాలపై కూడా దృష్టి పెట్టాలి" అని అభిప్రాయపడ్డారు.
వృద్ధి రేటుపై పడనున్న ప్రభావం...
ప్రధాని చేసిన ఈ విజ్ఞప్తిని ఒక రకమైన క్రమశిక్షణను అలవర్చే ప్రకటనగా కూడా భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే... ఈ క్రమశిక్షణే రేపు ఒక కొత్త సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందా?
ఈ ప్రశ్నపై సీనియర్ జర్నలిస్ట్, 'ది ఎన్ షో' ఎడిటర్ నీరజ్ బాజపేయీ స్పందిస్తూ, "ప్రధాని చేసిన పొదుపు విజ్ఞప్తి వల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. దీనిపై నాకు కొంత సందేహం ఉంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ విలాసాల కోసం భారీగా ఖర్చు చేసేది కాదు. మనం ఎప్పుడూ కనీస అవసరాలను మాత్రమే తీర్చుకునే ఆర్థిక వ్యవస్థగానే ఉన్నాం" అని అన్నారు.
"మనం నిష్పత్తిని గమనిస్తే... దేశంలో 30 శాతం పెట్రోల్, 70 శాతం డీజిల్ వాడకం ఉంటోంది. ఇందులో డీజిల్ వినియోగం అనేది పూర్తిగా అవసరాల (రవాణా, పరిశ్రమలు) మీద ఆధారపడి ఉంటుంది. డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల పెద్దగా వచ్చే మార్పేమీ ఉండదు, అలాగే పెట్రోల్ వాడకాన్ని బాగా తగ్గించినా కూడా అంతగా తేడా కనిపించదు" అని చెప్పారు.
"మరొక విషయమేమిటంటే, ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి పడితే తప్ప భారతీయ ప్రజలు సాధారణంగా వినరు. కాబట్టి ఈ చర్యలు అంతగా పని చేస్తాయని నేను అనుకోవడం లేదు" అని నీరజ్ బాజ్‌పాయ్ అన్నారు.
''దేశంలో ప్రజారవాణా వ్యవస్థ స్థితిగతులు ఇప్పటికే చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు కేవలం వేరే దారి లేక, తప్పనిసరి పరిస్థితుల్లోనే దీనిని వాడుతున్నారు. ప్రజలకు ఇతర ప్రత్యామ్నాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రధాని విజ్ఞప్తి వెనుక ఉన్న ఉద్దేశం చాలా మంచిదే అయినప్పటికీ, ప్రజలు ఇప్పటికే కనీస స్థాయిలోనే ఇంధనాన్ని వాడుతున్నారు. కాబట్టి దీనిని ఇంకా తగ్గించడం సాధ్యం కాకపోవచ్చు" అని అభిప్రాయపడ్డారు.
ప్రజలు కాస్త చూసుకుని, పొదుపుగా ఖర్చు చేయాలనే ఈ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటుపై లేదా వేగంగా వృద్ధి చెందే అవకాశాలపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం పడుతుందనే ప్రశ్నపై నీరజ్ బాజపేయీ మాట్లాడుతూ.. దీర్ఘకాలంలో దీని ప్రభావం ఉంటుందని చెప్పారు.
ఆయన వివరణ ఇస్తూ, "పొదుపుగా ఉండటం లేదా తక్కువ ఖర్చు చేయడం అనే మాట వినడానికి చాలా బాగుండవచ్చు. కానీ దీనివల్ల జీఎస్టీ వసూళ్లు కూడా తగ్గిపోతాయి. ఒకవేళ నేను రోజుకు మూడు సార్లు వాడే ఒక వస్తువును, మీరు ఒక్కసారే వాడమని చెబితే..."
"సరే, మేము ఒక్కసారే వాడతాం, కానీ మిగిలిన రెండు సార్లకు సంబంధించిన జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించం కదా. దీనివల్ల మీ నెలవారీ జీఎస్టీ వసూళ్లు కూడా పడిపోతాయి. కాబట్టి వృద్ధి రేటుపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ పొదుపు చర్యల వల్ల ఒకవైపు, చమురు సంక్షోభం వల్ల మరోవైపు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది" అని అన్నారు.
"దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఫిరోజాబాద్‌లోని గాజు ఫ్యాక్టరీలు, కోయంబత్తూరులోని పరిశ్రమలు మూతపడుతున్నాయి. మోర్బీలోని టైల్స్ ఫ్యాక్టరీలు కూడా మూతపడుతున్నాయి. ఎందుకంటే మనం వారికి కావలసినంత ఇంధనాన్ని అందించలేకపోతున్నాం" అని చెప్పారు.
"మరోవైపు ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే దుష్ప్రభావం మొదలైంది. గతంలో ప్రభుత్వం జీఎస్టీ ధరలను ఎందుకు తగ్గించిందో ఒక్కసారి గుర్తుచేసుకోండి.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కోసమే అప్పట్లో అలా చేశారు. కానీ ఇప్పుడు మీరే వినియోగాన్ని తగ్గించుకోమని చెబుతున్నారు, అలాంటప్పుడు ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ రాబడి కూడా తగ్గిపోతుంది కదా" అని ఆయన పేర్కొన్నారు.
మధ్యతరగతి, వ్యవసాయం బలోపేతం కావాలి: దీపా సిన్హా
ప్రధాని చేసిన విజ్ఞప్తి వల్ల సామాన్య ప్రజల జీవితాలపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నపై ఆర్థికవేత్త డాక్టర్ దీపా సిన్హా.. 'పెద్దగా పడదు' అని అభిప్రాయపడ్డారు.
"ప్రధాని తన విజ్ఞప్తిలో పేర్కొన్న కొన్ని విషయాలు సామాన్య మానవుడికి అసలు వర్తించవు. ఉదాహరణకు విదేశీ పర్యటనలు చేయవద్దని కోరడం. భారతదేశంలో సామాన్య ప్రజలు ఎలాగూ విదేశాలకు వెళ్లే ఆర్థిక స్థితిలో లేరు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమనడం. మన దేశంలో దాదాపు 80 నుండి 90 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వారు ఎక్కడి నుంచి పని చేయాలి, ఏ సమయంలో పని చేయాలి అనేది వారి చేతుల్లో ఉండే విషయం కాదు" అని అన్నారు.
"ఇది కాకుండా, సామాన్యుడు ఇప్పటికే ప్రజా రవాణానే వినియోగిస్తున్నాడు. ఇక బంగారం విషయానికి వస్తే.. తగినంత డబ్బు ఉన్నప్పుడే ఎవరైనా దానిని కొంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన తీరు చూస్తుంటే, చాలామంది సామాన్య ప్రజలు దానిని కొనే పరిస్థితిలో లేరు" అని దీపా సిన్హా అభిప్రాయపడ్డారు.
"నా ఉద్దేశం ప్రకారం.. ఈ విజ్ఞప్తి నిజానికి ధనవంతులకు చేయాల్సింది. ప్రైవేట్ జెట్లలో ప్రయాణించవద్దని, విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని, బహుశా వారి పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపవద్దని వారిని కోరాల్సింది. ఈ విషయాలన్నీ మన దేశంలో ఉన్న పైస్థాయి 10 నుంచి 20 శాతం ప్రజలకు మాత్రమే పరిమితమైనవి. సామాన్య మానవుడు ఇప్పటికే తప్పనిసరి పరిస్థితుల్లో వీటన్నిటికీ దూరంగానే ఉంటున్నాడు."
"సామాన్యులు ఎంత మొత్తంలో చమురు వాడగలుగుతున్నారు లేదా బంగారం కొనగలుగుతున్నారు? వారు ఇప్పటికీ చాలా మెరుగైన స్థితిలోనేమీ లేరు. అయితే, చివరికి చమురు ధరలు పెరిగితే మాత్రం ఆ భారం సామాన్య మానవుడిపైనే పడుతుంది" అని ఆమె వివరించారు.
మరి మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు దీపా సిన్హా సమాధానమిస్తూ, "ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఉన్న స్థితిని బట్టి చూస్తే, మధ్యతరగతి ప్రజలు ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందనే భావిస్తున్నాను" అని చెప్పారు.
"గత 10 సంవత్సరాల గణాంకాలను మనం గమనిస్తే.. జీతాలు వచ్చే మధ్యతరగతి ప్రజల వాస్తవ వేతనాలు గత కొన్నేళ్లుగా దాదాపు పెరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చమురు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే, వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది" అని వివరించారు.
''మన దేశంలో బంగారం అనేది ఒక భిన్నమైన వస్తువు. మహిళలు తమ పొదుపు మొత్తాన్ని ఎక్కువగా బంగారంపైనే పెట్టుబడిగా పెడతారు. ఎందుకంటే ఒక రకంగా దానిపై వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది. అలాగే పెళ్లిళ్లలో బంగారం తీసుకోవడం, ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం. కానీ, ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి కుటుంబాలలో బంగారం కొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ బంగారం ధరలు పెరిగితే, అది ఎలాగూ జరుగుతుంది. అప్పుడు వారిపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది" అని వివరించారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చేలా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అన్న ప్రశ్నపై దీపా సిన్హా స్పందిస్తూ.. "స్థూలంగా చూస్తే రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది ఉపాధి, ఉద్యోగాలు. ఒకవైపు మన ఆర్థిక వ్యవస్థ అవసరమైనన్ని ఉద్యోగాలను సృష్టించలేకపోతోంది. మరోవైపు వస్తున్న ఉద్యోగాలలో కూడా వేతనాలు తక్కువగా ఉన్నాయి, సామాజిక భద్రత కరువైంది" అని ఆమె అన్నారు.
"ప్రజలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఉండి, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వారి వేతనాలు కూడా పెరుగుతాయని మనం నిర్ధరించగలిగితే, చాలా మంది ప్రజలు ఇటువంటి ఆర్థిక నష్టాలను లేదా ఒడిదొడుకులను తమంతట తామే తట్టుకోగలరు" అని చెప్పారు.
''రెండవ అంశం ఏమిటంటే.. వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రి సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడారు, కానీ ప్రస్తుతం మన వ్యవసాయం రసాయన ఎరువులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది" అని ప్రస్తావించారు.
"రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటే అందులో నష్టాలు ఉన్నాయి. వారు పెట్టే పెట్టుబడి కంటే వారికి వచ్చే అమ్మకపు ధర చాలా తక్కువగా ఉంది. అందువల్ల రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా చేయాలంటే వ్యవసాయ రంగంలో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.
"ఇదే విధంగా వంటనూనెల వినియోగాన్ని తగ్గించుకోమనే సలహా కూడా ఉంది. 40 ఏళ్ల క్రితం భారతదేశంలో వంటనూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం కాదు, మనకు కావాల్సిన నూనెలను మనమే స్వయంగా ఉత్పత్తి చేసుకునేవాళ్లం. వేర్వేరు రాష్ట్రాలలో మన అలవాట్లను బట్టి వాడే ఆవ నూనె, వేరుశనగ నూనె వంటి రకాల స్థానాన్ని.. ప్రస్తుతం పామాయిల్, సోయా ఆయిల్ వంటి విదేశీ నూనెలు ఆక్రమించాయి. వీటిని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
"క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేకపోవచ్చు, కానీ వంటనూనెలను మాత్రం మనం స్వయంగా ఉత్పత్తి చేసుకోగలం. దాని కోసం ప్రభుత్వం ఒక బలమైన విధానాన్ని రూపొందించాలి" అని దీపా సిన్హా సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)