You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'భూతల నరకకూపం': భారత్ గురించి వివాదాస్పద పోస్ట్ షేర్ చేసిన ట్రంప్, ఇండియా ఏమందంటే..
పుట్టుకతో పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) గురించి రేడియో హోస్ట్, సంప్రదాయ రచయిత మైకేల్ సావేజ్ రాసిన వివాదాస్పద పోస్టును అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ షేర్ చేశారు.
ప్రస్తుత చట్టాలు, గర్భం దాల్చిన మహిళలు తొమ్మిదో నెలలో అమెరికాకు వలస వచ్చి, స్థానిక చట్టాల ద్వారా లబ్ధి పొందేందుకు అనుమతిస్తున్నాయని ఆ పోస్ట్‌లో సావేజ్ పేర్కొన్నారు.
ట్రంప్ షేర్ చేసిన మైకేల్ సావేజ్ ప్రకటనలో ఇలా ఉంది, "ఇక్కడ పుట్టిన బిడ్డకు తక్షణమే పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత చైనా, భారత్ లేదా ప్రపంచంలోని మరేదైనా నరకప్రాయమైన దేశం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకొస్తారు. ఇది ఎంతోదూరంలో లేదు. ఇకపై ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడరు."
ట్రంప్ ఆ పోస్ట్ షేర్ చేసిన తర్వాత, భారత్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ కూడా గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వివాదాస్పద సోషల్ మీడియా రీపోస్ట్ వల్ల జరిగిన నష్టాన్ని నివారించేందుకు అమెరికా ఆ తర్వాత ప్రయత్నించింది. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ, "భారత్ ఒక గొప్ప దేశమని, అక్కడ నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారని అధ్యక్షుడు అన్నారు" అని తెలిపారు.
భారత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అమెరికా ప్రతినిధి ఈ ప్రకటన చేశారు. అయితే, "భారత్ గొప్ప దేశం"అని ట్రంప్ ఎప్పుడు, ఎక్కడ అన్నారో స్పష్టత ఇవ్వలేదు.
దీనిపై భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం రాత్రి మాట్లాడుతూ, "మేం ఆ పోస్టును, ఆ తర్వాత రాయబార కార్యాలయం స్పందనను పరిశీలించాం. ఈ వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో చేసినవి, అనుచితమైనవి. సుదీర్ఘకాలంగా పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్న భారత్, అమెరికా సంబంధాలను ఇవి ప్రతిబింబించవు" అని అన్నారు.
దీనికి ముందు, వారాంతపు విలేఖరుల సమావేశంలో ఇదే విషయమై అడిగినప్పుడు "కొన్ని వార్తలు చూశాం. ఇప్పటికైతే చెప్పగలిగింది ఇంతే" అని సమాధానమిచ్చారు.
అసలు ఆ పోస్ట్‌లో ఏముంది?
ప్రస్తుతం, అమెరికాలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చర్చనీయాంశంగా మారింది.
"ఈరోజు నేను సుప్రీం కోర్టులో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై విన్న వాదనల గురించి మాట్లాడబోతున్నాను. ఆ వాదనలు నాకు చిరాకు తెప్పించాయి, ఎందుకంటే, అంతా న్యాయపరిభాషలో ఉంది" అని ట్రంప్ షేర్ చేసిన పోస్ట్‌లో మైకేల్ సావేజ్ రాశారు.
"అమెరికా రాజ్యాంగం విమాన ప్రయాణం మొదలుకావడానికి ముందు రాసింది. ఇక టెలివిజన్, ఇంటర్నెట్, రేడియోల గురించి చెప్పనక్కర్లేదు" అని ఆయన అన్నారు.
"వలసదారుల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. వలసదారులు తమ హక్కులను లాక్కుంటున్నారని అమెరికన్లు భావిస్తున్నారు" అని ఆ పోస్ట్‌లో ఉంది.
"అందుకు ఎంతోకాలం పట్టదు. ఇకపై ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడరు. ఇక్కడికి వస్తున్న వలసదారులకు కూడా ఈ దేశం పట్ల విధేయత లేదు, అది గతంలోనూ లేదు."
అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌పై (ఏసీఎల్‌యూ) ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇలా రాశారు, "మాఫియా కుటుంబాలన్నీ కలిపి చేసిన దానికంటే వీళ్లే దేశానికి ఎక్కువ హాని చేశారు. వీళ్లు ల్యాప్‌టాప్‌లు పట్టుకుని తిరిగే గుండాలు. మనల్ని దోచుకున్నారు, మనల్ని రెండో తరగతి పౌరుల్లా చూశారు, 'మూడో ప్రపంచ' దేశాలు మనపై ఆధిపత్యం చెలాయించేందుకు వీలు కల్పించారు. మన జెండాను అవమానించారు."
"అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌కు చెందిన న్యాయవాది అయిన వాంగ్, అమెరికా గుర్తింపును నాశనం చేసి, దాన్ని చైనాకు కాలనీగా మార్చాలని కోరుకుంటున్నారు, కానీ అది కేవలం చైనాకు మాత్రమే పరిమితం కాదు, భారత్‌కు కూడా వర్తిస్తుంది."
ఈ నెల ప్రారంభంలో, బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను పరిమితం చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సుప్రీం కోర్టు సందేహం వ్యక్తం చేసింది.
అక్రమ వలసదారుల పిల్లలకు, తాత్కాలికంగా అమెరికాకు వచ్చే కొంతమందికి అమెరికా పౌరసత్వం ఇవ్వడం నిలిపివేయాలనే విషయంతో చాలామంది న్యాయమూర్తులు ఏకీభవించలేదు.
అక్రమ వలసలను అరికట్టేందుకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను పరిమితం చేయడం చాలా అవసరమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.
కానీ, అలా చేస్తే శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని తల్లకిందులు చేయడంతో పాటు అమెరికాకు హాని చేస్తుందని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు.
తీవ్రంగా స్పందించిన ప్రతిపక్షాలు
ట్రంప్ చేసిన ఈ పోస్ట్ తర్వాత, భారత్‌లోని ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది.
"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను 'నరకం' అని వ్యాఖ్యానించారు. ఇది అత్యంత అవమానకరం. భారత్‌కు వ్యతిరేకం. ఇది ప్రతి భారత పౌరుడినీ బాధించింది" అని కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో రాసింది
ఈ విషయంపై ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడితో మాట్లాడి, తీవ్ర నిరసన తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
"మోదీ గత చరిత్రను బట్టి చూస్తే, ఆయన ట్రంప్‌తో ఏమైనా చెప్పగలరనుకోవడం కష్టం. ట్రంప్ భారత్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు, మోదీ మౌనంగా వింటూనే ఉన్నారు. నరేంద్ర మోదీ ఒక బలహీనమైన ప్రధాన మంత్రి, దాని కారణంగా యావత్ దేశం బాధపడుతోంది" అని కాంగ్రెస్ రాసింది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. "మోదీ ప్రియమిత్రుడు, 'నమస్తే ట్రంప్' భారత్‌ను దూషిస్తూ, అత్యంత అవమానకరమైన పదాన్ని వాడిన పోస్టును షేర్ చేశారు. ఈ అసంబద్ధ ప్రేలాపనలపై మోదీ నోరుమెదపడం లేదు" అని రాశారు.
"నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. మోదీ మీరెందుకు భయపడుతున్నారు? అమెరికా పురోగతిలో భారతీయులు కీలకపాత్ర పోషించారు. అమెరికా ప్రభుత్వం ఎదుట ఈ విషయాన్ని లేవనెత్తకుండా మనల్ని అడ్డుకుంటున్నది ఏంటి?" అని ఖర్గే ప్రశ్నించారు.
విదేశాంగ ప్రతినిధి ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ స్పందిస్తూ, "మానవ శరీరంలో ఏదో ఒక భాగం మాయమైనట్లు, ఈ సమాధానంలోనూ ఏదో మాయమైంది. మీరనుకున్నట్లు నరకం కాదని, మాది 5000 ఏళ్ల పురాతన నాగరికత అని లేచి గట్టిగా చెప్పే ధైర్యమైనా ఉండాలి" అన్నారు.
"భారత్‌ను 'నరకం' అని పిలవడానికి డోనల్డ్ ట్రంప్‌కు ఎంత ధైర్యం? భారతీయులను 'ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు' అని పిలవడానికి ఆయనకు ఎంత ధైర్యం? బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అనే అంశంపై ఆయన యూఎస్ సుప్రీంకోర్టులో ఈ మాటలు అంటారా?" అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ అన్నారు.
మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆమె అన్నారు.
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ట్రంప్‌ను ఉద్దేశించి ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "మేం లేవగానే, భారతీయులను కించపరుస్తూ మాట్లాడినట్లు చూశాం. మీరు దీన్నో అలవాటుగా మార్చుకున్నారు కాబట్టి మళ్లీ చెప్పాల్సిన అవసరముంది."
"మీరు ప్రజలు మాట్లాడుకునే స్థాయిని దిగజార్చుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కేవలం విచారకరమైనవి మాత్రమే కావు, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానివి. వాటిని మేం మర్చిపోలేం, మిమ్మల్ని అంత సులభంగా క్షమించలేం" అని రాశారు.
"భారతదేశాన్ని అవమానించడం ద్వారా మీరు వార్తల్లోకి ఎక్కొచ్చు. కానీ భారత్‌కు మీ ఆమోదం అవసరం లేదు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి గౌరవం, ప్రతిభ, నాగరికత అనే వారసత్వం ఉంది. మీ దురుసు మాటలతో భారత్‌ను నిర్వచించలేరు" అని ఆప్ నాయకుడు మనీశ్ సిసోదియా అన్నారు.
"భారత్‌ను నరకం అని పిలవడం ఆ దేశాన్ని అవమానించడం కాదు, కానీ అది మీ అజ్ఞానాన్ని, అహంకారాన్ని బయటపెడుతుంది" అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)