పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే

చదివే సమయం: 4 నిమిషాలు

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు (సోమవారం) ప్రకటించనున్నారు.

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే విడతలో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. తమిళనాడులో కూడా ఒకే విడతలో ఏప్రిల్ 23న ఓటింగ్ ముగిసింది.

ఇక పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగింది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్‌ అంచనావేశాయి.

కేరళ, తమిళనాడుల విషయానికొస్తే, ఆయా రాష్ట్రాల్లో యూడీఎఫ్, డీఎంకేలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాల్లో పేర్కొన్నాయి.

అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే

ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి చెందిన 294 సీట్లకు గాను 293 సీట్ల ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి.

ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21న జరగనుంది. ఫలితాలు మే 24న వెల్లడవుతాయి.

మరోవైపు, రెండు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలైన మగ్రహట్ వెస్ట్, డైమండ్ హార్బర్‌లకు 15 పోలింగ్ కేంద్రాల్లో మే 2న (శనివారం) రీపోలింగ్ జరిగింది.

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీకి 148 స్థానాలు అవసరం.

గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా టీఎంసీని గద్దె దించాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎగ్జిట్ పోల్స్ భిన్న కథనాలను తెలియజేస్తున్నాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని చెప్పాయి.

ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ చేపట్టడం వల్ల ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి.

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఆ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య 12 శాతం.

గత ఏడాది అక్టోబర్‌లో ఎస్‌ఐఆర్ ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 7.66 కోట్లు.

ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనోజ్ కుమార్ అగర్వాల్ చెప్పారు.

అస్సాంలో హ్యాట్రిక్ గెలుపును బీజేపీ సాధిస్తుందా?

అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఇక్కడ 126 స్థానాలు ఉండగా మెజారిటీ మార్కు 64. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే ఆధిక్యం ఇస్తున్నాయి.

బీజేపీ మూడోసారి అస్సాంలో అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు.

రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా చెబుతోంది.

కేరళలో యూడీఎఫ్‌దే పైచేయా?

కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజారిటీకి 71 స్థానాలు కావాలి.

కేరళను పదేళ్లుగా లెఫ్ట్ ఫ్రంటే పాలిస్తోంది.

ఇప్పటి వరకు కేరళ అసెంబ్లీ ఎన్నికలు చాలా వరకు ద్విముఖ పోటీయే సాగింది.

ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్, ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేశాయి. చాలా వరకు యూడీఎఫ్ అధికారంలో రావొచ్చని పేర్కొన్నాయి.

అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బలమైన 'త్రిముఖ పోటీ' ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికలకు ముందు అంచనావేశారు.

గత పది సంవత్సరాలుగా కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌తో పాటు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మధ్య ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

తమిళనాడులో డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందా?

ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు... మూడో పార్టీ కూడా చాలా బలంగా ఉంది. అదే తమిళనాడు సినీ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది.

మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఏదైనా పార్టీ లేదా కూటమికి 118 సీట్లు అవసరం.

చాలా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమే అధికారంలోకి వస్తుందని అంచనావేశాయి.

యాక్సిస్ మై ఇండియా వంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే కూటమి, టీవీకే మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేశాయి.

పుదుచ్చేరిలో ప్రభుత్వం ఎవరిది?

నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి కూడా గత నెలలో ఎన్నికలు జరిగాయి.

పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఇప్పటికే అధికారంలో ఉంది.

ఈ అసెంబ్లీలో ఉన్నది 30 సీట్లుకాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ మార్క్ 16.

చాలా ఎగ్జిట్ పోల్స్ తిరిగి బీజేపీయే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)