పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
నెల్లాళ్లపాటు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. పశ్చిమబెంగాల్లో అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు భారతీయ జనతాపార్టీ చావోరేవో అన్నట్టుగా తలపడ్డాయి.
పశ్చిమబెంగాల్‌తోపాటు దక్షణాదిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి,ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోనూ ఎన్నికలు జరిగాయి. కానీ దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమబెంగాల్‌పైనే ఉంది.
ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పతాకశీర్షికలుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఓటర్ల జాబితా సవరణ కారణంగా దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించారు.
ఇక నాలుగోసారి మమతాబెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది కూడా మే 4వ తేదీనే తేలిపోనుంది.
మరోపక్క ఎలాగైన పశ్చిమబెంగాల్లో పాగా వేయాలని బీజేపీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తోంది. ఈసారి అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించింది.
మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనున్న తరుణంలో కోల్‌కతా నగరం ప్రశాంతంగా కనిపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోపక్క తాజాగా ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరపనున్నట్టు ప్రకటించారు.
ఈ నియోజకవర్గ ఫలితాన్ని మే 24న ప్రకటించనున్నారు.
దీంతో మే 4వ తేదీ పశ్చిమబెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, 293 స్థానాల ఫలితాలు మాత్రమే వెల్లడికానున్నాయి.