అమ్మ డైరీ: తల్లిని చంపిన హంతకుడి కోసం ముగ్గురు కొడుకుల 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం

ఫొటో సోర్స్, Justice for Jean
- రచయిత, కేటీ హంటర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
2009లో ఇంటర్‌పోల్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో ఇది మొదలైంది.
ఇంటర్‌పోల్ అధికారులు.. 53 ఏళ్ల జీన్ హాన్లాన్ గ్రీస్‌లోని క్రేట్ ద్వీపంలో కనిపించకుండా పోయినట్లు చెప్పేందుకు ఆమె తల్లిదండ్రులకు కాల్ చేశారు. జీన్ చిన్న కుమారుడు మైకేల్ పోర్టర్‌కు ఆయన అన్న రాబర్ట్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు.
"కనిపించకుండా పోవడం ఏమిటి? అని నేను ఆశ్చర్యపోయాను" అని మైకేల్ అన్నారు.
స్కాట్లాండ్లోని డమ్ఫ్రీస్కు చెందిన ఆ ముగ్గురు అన్నదమ్ముల జీవితాలు ఆ తర్వాత వారు ఊహించని విధంగా మారిపోయాయి.
"ఏదో ఘోరం జరిగి ఉంటుందని అనుకున్నా, కానీ అదేమై ఉంటుందో నాకూ తెలియదు" అని మైకేల్ చెప్పారు.

లెర్నింగ్ డిజెబిలిటీస్ (నేర్చుకునే లోపాలు) ఉన్న ఒక బిడ్డను చూసుకోవడం కోసం జీన్ హాన్లాన్ క్రేట్ ద్వీపానికి వెళ్లాల్సి ఉంది. కానీ, ఆమె అక్కడికి సమయానికి చేరుకోకపోవడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.
"మా అమ్మకు ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, ఆమె చాలా నమ్మకస్థురాలు. ఆమె ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండేది" అని మైకేల్ గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో మైకేల్ మాన్స్‌ఫీల్డ్‌లో నివసిస్తుండగా, ఆయన ఇద్దరు సోదరులు రాబర్ట్, డేవిడ్ డమ్ఫ్రీస్లో ఉన్నారు. ఆ ముగ్గురూ వెంటనే క్రేట్ ద్వీపానికి విమానం ఎక్కారు.
"మేమంతా అంతగా భావోద్వేగాలకు లోనయ్యే వాళ్లం కాదు. కానీ, అది ఒక బలమైన, భావోద్వేగ క్షణం. మేం ఏమీ మాట్లాడుకోలేదు, కేవలం ఒకరినొకరు కౌగిలించుకుని రోధించాం. ఆ ప్రయాణం అంతా నిశ్శబ్దంగా గడిచింది. ఎందుకంటే, మా దగ్గర మాట్లాడుకోవడానికి ఏముంది?" అన్నారు మైకేల్.
ఈ క్రమంలోనే హెరాక్లియన్ సముద్ర తీరంలో ఒక 30 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైందంటూ ఆ సోదరులకు సమాచారం అందింది. అయితే, వారి తల్లి వయస్సు 50 ఏళ్లకు పైబడి కావడంతో చనిపోయింది వేరే మహిళ అయి ఉండొచ్చని భావించారు, తమ తల్లి బతికే ఉండొచ్చన్న ఆశతో ఉన్నారు.
ఏదేమైనా, ఆ మృతదేహం జీన్ హాన్లాన్దేనా? కాదా? అని నిర్ధరించుకోవడానికి వారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక చోట కుప్పగా పడి ఉన్న బట్టలను చూసి, అవి తన తల్లివేనని మైకేల్ వెంటనే గుర్తుపట్టారు.
ఆసుపత్రులలో పనిచేసిన అనుభవం ఉన్న అన్నదమ్ములు రాబర్ట్, డేవిడ్.. ఆ మృతదేహాన్ని చూసేటప్పుడు మానసికంగా సిద్ధంగా ఉండేలా మైకేల్‌కు ధైర్యం చెప్పారు.
"వారు నన్ను సిద్ధం చేయడాన్ని నేను గౌరవిస్తున్నప్పటికీ, ఒకవేళ అది మా అమ్మే అయితే, నేను ఆమెను చూసే చివరి క్షణం ఇదే అవుతుందని మనసులో అనిపించింది" అని మైకేల్ అన్నారు.

అనుమానాస్పద గాయాలు
తాము చూడబోయే పరిస్థితిని తట్టుకునేలా ఆ ముగ్గురు అన్నదమ్ములు ఎంత ప్రయత్నించినప్పటికీ, అక్కడ వారు చూసిన దృశ్యం వారిని తీవ్రంగా కలచివేసింది: "మేం కనీసం ఆమెను ముట్టుకోలేకపోయాం, కౌగిలించుకోలేకపోయాం. అదే మాకు అత్యంత కష్టంగా అనిపించింది" అని మైకేల్ అన్నారు.
ఆ అన్నదమ్ములకు వెంటనే అనుమానం వచ్చింది. వారి తల్లి కనిపించకుండా పోయిన రాత్రి, హెరాక్లియన్లోని ఒక కేఫ్‌లో ఆమె ఒక వ్యక్తితో కలిసి ఉన్నట్లు సమాచారం ఉంది. ఆమె తల వెనుక భాగంలో తీవ్రమైన గాయాలు ఉండటంతో, అది ప్రమాదవశాత్తూ జరిగినది కాదని వారు బలంగా నమ్మారు.
గ్రీక్ అధికారులు మొదట జీన్ హాన్లాన్ది ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగానే తేల్చారు. కానీ, పోస్ట్‌మార్టం నివేదికను రెండవసారి సమీక్షించాల్సిందిగా ఆ సోదరులు ఒత్తిడి తెచ్చారు. దానికి కొంత సమయం పట్టినప్పటికీ, రెండేళ్ల తర్వాత నివేదిక వచ్చింది. అందులో ఆమె మరణానికి ముందు ఘర్షణ జరిగినట్లుగా ఆ గాయాలు స్పష్టం చేస్తున్నాయని ఉంది.
"మేం ఈ విషయంలో పోరాడకుండా ఉండి ఉంటే, ఆమె ఒంటిపై ఉన్న ఆ ఇతర గాయాల గురించిన నిజం మాకు ఎప్పటికీ తెలిసేది కాదు. ఈ విషయమే నన్ను తీవ్రంగా కలచివేస్తోంది" అని మైకేల్ చెప్పారు.
దీంతో న్యాయం కోసం ఆ సోదరుల పోరాటం ప్రారంభమైంది.

జీన్ గతంలో స్కాట్లాండ్లోని నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పనిచేశారు. అయితే, 40 ఏళ్ల వయసులో ఆమె చేసిన మొదటి విదేశీ పర్యటన (క్రేట్ ద్వీపం) తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ట్రిప్ ఆమెలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనను రేకెత్తించింది.
జీన్ కొన్నాళ్లపాటు ట్రావెల్ ఇండస్ట్రీలో పనిచేసి, ఆ తర్వాత గ్రీస్ దేశానికి మారిపోయి అక్కడ టావెర్నాల్లో (హోటళ్లలో) పనిచేయడం ప్రారంభించారు.
అది "ఆమెకు నచ్చిన ప్రదేశం", క్రేట్ ద్వీపాన్ని, అక్కడి ప్రజలను ఆమె ఎంతగానో ప్రేమించారు. అలాంటి ప్రదేశంలోనే ఆమె దారుణంగా మరణించడం దిగ్భ్రాంతిని కలిగించింది.
"చనిపోయిన వారి తరఫున మాట్లాడటం బతికున్న వారి బాధ్యత" అని మైకేల్ అన్నారు.
2009 నుంచి ఇచ్చిన వందలాది ఇంటర్వ్యూలలో ఆయన ఈ మాటను పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు.
ఆ తర్వాత సంవత్సరాల్లో గ్రీక్ అధికారులు ఈ కేసును నాలుగుసార్లు మూసివేసి, మళ్లీ తెరిచారు. జీన్ హాన్లాన్ మరణంతో సంబంధం ఉందంటూ అనుమానంతో ఇద్దరు వ్యక్తులను విచారించారు కూడా.
ఈ కేసు గ్రీస్‌లోని 'క్రైమ్‌వాచ్' లాంటి ఒక ప్రముఖ టీవీ షోలో కూడా ప్రసారమైంది. కానీ, ప్రతిసారీ విచారణ ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపించినప్పుడల్లా, ఏదో ఒక పెద్ద అడ్డంకి ఎదురై దర్యాప్తు ఆగిపోయేది.
వేధింపులే కారణమా?
జీన్ హాన్లాన్ కేసు గురించి అందరికీ తెలియజేయడానికి, ప్రచారం కల్పించడానికి 2019లో మైకేల్, అలాగే రాబర్ట్ కుమార్తె రెబెక్కా కలిసి క్రేట్ ద్వీపానికి వెళ్లారు. పలువురు బ్రిటిష్, గ్రీక్ పాత్రికేయులు ఈ పర్యటనను కవర్ చేసినప్పటికీ, దీనివల్ల ఎటువంటి నిర్ణయాత్మకమైన పురోగతి లభించలేదు.
ఇది ముగింపు లేని పోరాటంగా మారిందని చెబుతూ, "ఇది మమ్మల్ని ఎంతలా కుంగదీస్తుందో మాటల్లో చెప్పలేం. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ఆమె కథను ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచడానికి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ఆలోచన చేయడం, నిధుల సేకరణ కోసం సరికొత్త మార్గాలను వెతకడమే పనిగా మారింది" అని మైకేల్ అన్నారు.
అయితే, 2023 చివర్లో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఆ సోదరులు 'హారిస్ వెరామన్' అనే ప్రైవేట్ డిటెక్టివ్‌ను (ఇన్వెస్టిగేటర్) నియమించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆయన ఈ కేసును సరికొత్త కోణంలో పరిశీలించి, ముఖ్యంగా జీన్ హాన్లాన్ రాసుకున్న వ్యక్తిగత డైరీపై దృష్టి పెట్టారు. 2009 ప్రారంభంలో తాను కొద్దిరోజుల పాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత దూరం పెట్టిన ఒక వ్యక్తి గురించి ఆమె ఆ డైరీలో రాసుకున్నారు.
జీన్ రాసిన డైరీతో పాటు ఇతర ఆధారాలను బట్టి చూస్తే, ఆ నిందితుడు ఒక 'తిరస్కరణను తట్టుకోలేని స్టాకర్' కావొచ్చని, ఆ బంధం తెగిపోవడాన్ని ఆయన అంగీకరించలేకపోయారని, అలాగే ఆమె వేరే వ్యక్తితో సంబంధంలో ఉందని తప్పుగా ఊహించుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

కోర్టు విచారణ, తుది తీర్పు
వెరామన్ ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి, పాత వాంగ్మూలాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. జీన్ హాన్లాన్ కనిపించకుండా పోయిన ఆ రాత్రి, 'కేఫ్ మెరీనా'లో ఆమె ఎవరితో కలిసి ఉన్నారనేది ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది.
అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు గానీ, డీఎన్ఏ ఆధారాలు గానీ లేవు. అయినప్పటికీ, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ తన రిపోర్టులో.. ఆమె ఆ రాత్రి సదరు అనుమానితుడితోనే కలిసి బయటకు వెళ్లినట్లు తేల్చారు. వెరామన్ సమర్పించిన ఈ రిపోర్టు ఆధారంగానే చివరకు ఈ కేసు కోర్టు మెట్లు ఎక్కింది.
తమ తల్లి చనిపోయిన 17 ఏళ్ల తర్వాత.. మైకేల్, రాబర్ట్, డేవిడ్ ముగ్గురూ ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని (నిందితుడిని) కోర్టు బోనులో చూసేందుకు తిరిగి క్రేట్ ద్వీపానికి చేరుకున్నారు.
విచారణ ప్రారంభంలో ఈ ముగ్గురు సోదరులు కోర్టులో సాక్ష్యం చెప్పారు. తమ తల్లి ఆ అనుమానితుడితో చాలా మర్యాదపూర్వకంగానే బంధాన్ని తెంచుకున్నారని, అయినా ఆయన ఆమెను నిరంతరం "వేధిస్తూనే" ఉన్నారని వారు విశ్వసించారు.

విచారణ రెండవ రోజున, నిందితుడి సోదరి ఇచ్చిన సాక్ష్యం ఈ కేసును ఊహించని మలుపు తిప్పింది. తన సోదరుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన సరైన సమయంలో మందులు వేసుకోకపోతే చాలా ఆవేశంగా ప్రవర్తిస్తారని ఆమె సాక్ష్యం చెప్పారు. జీన్ హాన్లాన్తో ఉన్న సమయంలో ఆయన మందులు వేసుకోలేదని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
అయితే, ఈ కేసులో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం పరస్పర విరుద్ధంగా ఉంది. జీన్ రాసిన డైరీ ప్రకారం, వారి బంధం ఎక్కువ కాలం సాగినట్లు స్పష్టమవుతున్నప్పటికీ, తాము కేవలం నాలుగు లేదా ఐదు రోజులు మాత్రమే కలిసి ఉన్నామని ఆయన ఒక సందర్భంలో చెప్పారు.
విచారణ సమయంలో మైకేల్, రాబర్ట్, డేవిడ్‌లకు వినడానికి అత్యంత కష్టంగా అనిపించిన సాక్ష్యం ఒక ఫోరెన్సిక్ నిపుణురాలి (పాథాలజిస్ట్) నుంచి వచ్చింది. ఆమె కోర్టులో సాక్ష్యం చెబుతూ.. జీన్ తల వెనుక భాగంలో బలంగా తగలడమే మరణానికి ప్రధాన కారణమని, నీళ్లలో పడేసే సమయానికి ఆమె బతికే ఉండే అవకాశం ఉందని తెలిపారు.
న్యాయమూర్తులు, సాధారణ పౌరులతో కూడిన మిశ్రమ సభ్యుల జ్యూరీ ఆ నిందితుడే జీన్ హాన్లాన్ను హత్య కేసులో దోషిగా ఏకగ్రీవంగా తేల్చేందుకు సుమారు మూడు గంటల సమయం తీసుకుంది. అయితే, నిందితుడి మానసిక అనారోగ్యం కారణంగా ఆయనకు శిక్షార్హత (డిమినిష్డ్ రెస్పాన్సిబిలిటీ) తగ్గుతుందని కోర్టు అభిప్రాయపడింది.
ట్రయల్ సమయంలో ముగ్గురు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి జీవితంలో ఇలాంటి క్షణం రావడం ఇదే మొదటిసారి కాదు. ఎట్టకేలకు 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, తమ తల్లి హత్య కేసులో ఒకరు దోషిగా తేలారు.
కోర్టు దోషికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినప్పటికీ, ఆయన అప్పీల్‌పై విచారణ ముగిసే వరకు ప్రస్తుతానికి జైలుకు పంపడం లేదు. గ్రీక్ చట్టం ప్రకారం, అప్పీల్‌తో సహా పూర్తి న్యాయ ప్రక్రియ ముగిసే వరకు దోషిగా తేలిన వ్యక్తి పేరును సాధారణంగా బయట పెట్టకూడదు.
కోర్టు వెలుపల జీన్ హాన్లాన్ కుమారులు పాత్రికేయులతో మాట్లాడారు.
ఎట్టకేలకు తమ తల్లికి విముక్తి లభించిందని.. తాను చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉందని మైకేల్ చెప్పారు.
"ఈ రోజు కోసం మేమంతా ఎంతో కష్టపడి పోరాడాం" అన్నారు.
అయితే, దోషిగా తేలిన వ్యక్తిని వెంటనే జైలుకు పంపకపోవడంపై ముగ్గురు సోదరులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
'మా అమ్మ ఆవేదన విన్నందుకు కృతజ్ఞతలు'
"పరిచయం లేని కొందరు వ్యక్తులు (జ్యూరీ సభ్యులు) ఒక గదిలో కూర్చుని మా అమ్మ గొంతుకను(డైరీ, సాక్ష్యాలు) విని, సరైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఇది చివరగా దక్కిన విజయం. మా అమ్మ ఆవేదనను విన్నందుకు నేను కృతజ్ఞుడను" అని జీన్ పెద్ద కొడుకు రాబర్ట్ పోర్టర్ అన్నారు.
"ఈ కేసు దాదాపు ఒక ముగింపునకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, అయితే ఆ వ్యక్తి జైలుకు వెళితే బాగుండేదని నా అభిప్రాయం" అని జీన్ రెండో కొడుకు డేవిడ్ పోర్టర్ అన్నారు.
2012 నుంచి ఈ కుటుంబం తరఫున వాదిస్తున్న వారి న్యాయవాది అపోస్టోలోస్ జిరిటాకిస్ మాట్లాడుతూ,"నా కెరీర్లో నేను అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన కేసు ఇదే. ఇది ఒక గొప్ప విజయం, ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత తమకు న్యాయం జరిగిందని ఆ కుటుంబం ఇప్పుడు భావిస్తోంది" అన్నారు.
"ఈ ఫలితాన్ని ఒక తీపి - చేదు అనుభవంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఆయన దోషిగా తేలినప్పటికీ, మానసిక అనారోగ్యం ఉన్నట్లు కోర్టు గుర్తించడం వల్ల ఆయనను ప్రస్తుతానికి జైలుకు పంపలేదు" అని న్యాయవాది వివరించారు.
గత 17 సంవత్సరాలుగా ఈ సోదరులు ఊహించని ఎన్నో పరిణామాలను ఎదుర్కొంటూ వచ్చారు. గతంలో ఎన్నో ఒడిదొడుకులను భరించిన వీరికి.. ఇంకా అప్పీల్ విచారణను ఎదుర్కోవాల్సి ఉందనే విషయం తెలుసు. కానీ ప్రస్తుతానికి మాత్రం, ఇన్నేళ్ల సుదీర్ఘ వేదన తర్వాత, తమ తల్లికి న్యాయం జరిగిందనే ఒక చిన్న ఊరట వారిలో ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































