You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తన హిందూ ఐడెంటిటీ గురించి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి చేసిన వ్యాఖ్యలపై చర్చ ఏమిటి? ఎందుకు?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన హిందూ భార్య ఉషా వాన్స్ కూడా క్యాథలిక్ క్రిస్టియన్‌గా మారాలని కోరుకుంటున్నారు.
జేడీ వాన్స్ 2019లో క్రైస్తవ(క్యాథలిక్) మతంలోకి మారారు. అంతకుముందు ఆయన నాస్తికుడిగా ఉండేవారు. అంటే, ఉషాను వివాహం చేసుకున్న సమయంలో ఆయన నాస్తికుడిగానే ఉన్నారు.
తన భార్య ఉషా కూడా ఏదో ఒక రోజు తాను ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గాన్నే అనుసరించాలని ఆశిస్తున్నట్లు జేడీ వాన్స్ గత ఏడాది చేసిన వ్యాఖ్యలు పెద్దయెత్తున చర్చకు దారితీశాయి.
భారత్‌లోని సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరిగింది.
ఉషా వాన్స్ త్వరలో నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ నెల 14న సీబీఎస్ న్యూస్‌కు చెందిన రాబర్ట్ కోస్టాతో ఇంటర్వ్యూలో, తాను మతం మారాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదని ఉషా చెప్పారు.
ఉషా ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆమె భర్త జేడీ వాన్స్ కూడా పక్కనే ఉన్నారు.
"నేను ఎంతో స్థిరమైన, సంతోషకరమైన హిందూ కుటుంబంలో పెరిగాను. నా భర్తకు అనిపించినట్లుగా మరేదో అన్వేషించాలని నాకెప్పుడూ అనిపించలేదు" అని చెప్పారు.
అదే ఇంటర్వ్యూలో జేడీని ఉద్దేశించి "మీకు థెరపీ పని చేయలేదు. చర్చి పని చేసింది" అని ఉషా వాన్స్ అన్నారు.
'వైస్ ప్రెసిడెంటా, నాల్గో బిడ్డకు తండ్రా?'
"నా జీవితంలో ఇద్దరు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని నేను తరచూ సరదాగా అంటుంటాను. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్తానీ. ఆ భారతీయురాలు నా భార్య, పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్ మునీర్" అని ఇటీవల జేడీ వాన్స్ అన్నారు.
అయితే, ఉషాను భారతీయురాలిగా పేర్కొనడం వాస్తవానికి, సరికాదు. ఉషా అమెరికా పౌరురాలు. ఆమె అమెరికాలోనే పెరిగారు. అయినప్పటికీ, తన భార్య గురించి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు కలవరపాటుకు గురిచేసేలా అనిపించాయి.
జేడీ వాన్స్ తన కొత్త ఆత్మకథలో, ఉషాను కలవడానికి ముందు మేరీ అనే మహిళతో తనకు గాఢమైన ప్రేమ వ్యవహారం ఉండేదని రాశారు.
అలాగే, మార్చిలో మిషిగన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. "ఉషా ప్రస్తుతం 22 వారాల గర్భవతి. నాలుగోసారి గర్భంతో ఉన్నారు. నేను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, 'మీరు ఉపాధ్యక్షుడిగా అయినా ఉండాలి, లేదా నాలుగో బిడ్డకు తండ్రిగానైనా ఉండాలి' అని అన్నారు. కానీ, మిత్రులారా నేను ఆమెను ఒప్పించగలిగాను, అందువల్లే నాకు రెండూ దక్కాయి" అని అన్నారు.
ఆ సమయంలో ఉషా ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్నారు.
ఉషా వాన్స్ ఎప్పుడూ తన హిందూ విలువలను, పెంపకాన్ని గర్వంగా ప్రస్తావిస్తారు. సీబీఎస్ ఇంటర్వ్యూలో ఆమె సూటిగా తన భావాలను వ్యక్తం చేయడాన్ని దంపతుల మధ్య విభేదంగా కాకుండా, ఉషా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పలువురు భావిస్తున్నారు.
ఉషా వాన్స్ న్యాయవాది. ఆమె అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ వద్ద లా క్లర్క్‌గా పనిచేశారు. భారతీయ వలసదారుల కుమార్తె అయిన ఉషా దక్షిణ కాలిఫోర్నియాలో పెరిగారు.
తమ దాంపత్య జీవితం, కుటుంబం గురించి ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉన్నాయని రాబర్ట్ కోస్టా ప్రశ్నించినప్పుడు, "ఒక దశలో జేడీ నన్ను మతం మార్చడానికి ఆసక్తి చూపుతున్నారనే భావన ప్రజల్లో ఏర్పడిందని అనుకుంటున్నా. కానీ, అది ఆయన క్యాథలిక్ కావడం వల్ల కలిగిన అపార్థంగా భావిస్తున్నా. తన విశ్వాసాన్ని వ్యాప్తి చేయాలనేది ఆయన మత విశ్వాసంలో ఒక భాగం. కానీ, ఆయన ప్రతిరోజూ నన్ను మతం మార్చుకోమని ఒప్పించేందుకేమీ ప్రయత్నించట్లేదు" అని చెప్పారు.
"నాకు ఉషా చాలా నచ్చుతారు. అధికారాన్ని పొందడం కోసం జేడీ వాన్స్ తన ఐడెంటిటీలోని ఏ విషయాన్నైనా మార్చుకోగలరు. కానీ, ఆయన ఉషను మార్చలేరు" అని అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త రిచర్డ్ హనానియా ఎక్స్‌లో రాశారు.
దక్షిణాసియా చరిత్ర, భారత మధ్యయుగ చరిత్రపై పరిశోధనలు చేసిన స్కాలర్, అమెరికన్ ప్రొఫెసర్ ఆడ్రీ ట్రష్కే ఉషా వ్యాఖ్యలను కీలకమైనవిగా అభివర్ణించారు.
"మత అధ్యయనాల పరిశోధకులకు ఇది ఎంతో ఆసక్తికరమైన అంశం. ఒకరి హిందూ గుర్తింపును మత సిద్ధాంతాలు లేదా ఆచారాల కంటే సంతోషకరమైన దాంపత్య జీవితం, తల్లిదండ్రుల ఆప్యాయతతో అనుసంధానించడం.. అదే సమయంలో, వవస్థీకృతంగా తనను వెలివేసే క్యాథలిక్ సంప్రదాయంలో పిల్లలను పెంచేందుకు అభ్యంతరం లేకపోవడం కూడా ఆసక్తికరం" అని ఆమె అన్నారు.
"మతాన్ని, విశ్వాసం - ఆచరణ లేదా ఈ రెండింటి కలయిక ఆధారంగా నిర్వచించాలా? ఒకవేళ రెండిటి కలయిక అయితే ఏ నిష్పత్తిలో నిర్వచించాలి? అనే అంశంపై పరిశోధకులు తరచుగా చర్చిస్తుంటారు."
"అయితే, ఉషా విషయం సంప్రదాయ చట్రాలలో దేనిలోనూ అంత సులభంగా ఇమడదు. క్యాథలిక్ సంప్రదాయంలో హిందువుల బహిష్కరణ అనేది వ్యవస్థీకృతంగా ఉన్న అంశం. క్యాథలిక్ కానివారు ముఖ్యమైన మత ఆచారాల్లో, మరీముఖ్యంగా కమ్యూనియన్(తనను శిలువ వేసే ముందు రాత్రి యేసు క్రీస్తు తన శిష్యులతో కడసారి భోజనం చేసిన సందర్భం జ్ఞాపకంగా చేసే ప్రార్థన సమావేశం)లో పాల్గొనలేరు" అని ఆమె పేర్కొన్నారు.
జేడీ వాన్స్ రాజకీయాలకు ఉష అడ్డంకా?
"తన పిల్లలు పుస్తకాలు, పండుగలు, ప్రయాణాల ద్వారా హిందూ సంప్రదాయాల గురించి తెలుసని ఉషా అనేకసార్లు చెప్పారు. అయితే, దీన్ని పిల్లలను హిందూ సంప్రదాయంలో పెంచడంగా భావించలేం. నా పిల్లలు కూడా పుస్తకాలు, పండుగలు, ప్రయాణాల ద్వారా అనేక మత, సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు. కానీ, దానివల్ల వారి మత గుర్తింపుని నిర్ణయించలేం" అని ఆడ్రీ ట్రష్కే అన్నారు.
అమెరికాకు చెందిన సంప్రదాయవాద రాజకీయ వ్యాఖ్యాత లారా ఎలిజబెత్ లూమర్ కూడా ఉషాను ప్రశంసించారు. ఇది చాలా బలమైన ప్రకటన అని ఆమె రాశారు.
"ఉషా వాన్స్ చేసింది ఒక బలమైన ప్రకటన. రాజకీయ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఉషాపై పలుమార్లు అవమానకర వ్యాఖ్యలు చేశారు. టక్కర్ మద్దతుదారులను సంతృప్తిపరచడానికి ఉషా క్యాథలిక్ మతంలోకి మారడం తార్కికం కాదు" అని లారా ఎక్స్‌లో రాశారు.
"2028 వరకు టక్కర్ కార్ల్సన్ మద్దతుదారులు ఉషాను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే, ఆమె ఒక బ్రౌన్ హిందూ మహిళ. ఆమె సాధించిన విజయాలెన్ని ఉన్నా ఈ ధోరణి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది" అని పేర్కొన్నారు.
"ఆమె సంపూర్ణ అమెరికన్ కాదని చూపించేందుకు ప్రయత్నిస్తారు. ఆమె భర్త జేడీ ఎంత సహనం ప్రదర్శించినా ఈ వర్గాలు ఆయనకు మద్దతు ఇవ్వవు. ఎందుకంటే, వారిలో జాత్యాహంకార భావనలు, బెదిరింపు రాజకీయాలు, యూదు వ్యతిరేకత, అమెరికా వ్యతిరేక ధోరణులు ఉన్నాయి."
"ఉషా వాన్స్ ఎప్పటికీ మతం మారకూడదని ఆశిస్తున్నా. ఎందుకంటే, అదే ఆమె విమర్శకులను మరింత అసహనానికి గురి చేస్తుంది. ఎవరికోసం ఆమె ఏమీ చేయాల్సిన అవసరం లేదు. తన వ్యక్తిత్వంపై ఉషాకు ఉన్న విశ్వాసం చూస్తే ఆనందంగా ఉంది" అని ఆమె రాశారు.
గత వారం జేడీ వాన్స్ మతం, విశ్వాసంపై రాసిన కొత్త పుస్తకం "కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్" విడుదలైంది.
ఈ పుస్తకంలో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వాన్స్ వివరంగా రాశారు.
తన అమ్మమ్మ వైపు సాధారణ క్రైస్తవ నేపథ్యం, తన తండ్రి వైపు పెంతోకొస్తు విశ్వాసం, కళాశాల దశలో తన నాస్తికత్వం, అనంతరం సంప్రదాయవాద క్యాథలిక్ మతంలోకి మారిన ప్రయాణాన్ని వాన్స్ ఇందులో వివరించారు.
క్యాథలిక్ ఆలోచనలతో ప్రేరణ పొందిన ప్రత్యామ్నాయ రాజకీయ మార్గం నేటి అమెరికా ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సవాళ్లతో పోరాడేందుకు ఉపయోగపడుతుందని వాన్స్ వాదించారు.
క్యాథలిక్ మతంలోకి మారడం ద్వారా అమెరికన్ సంప్రదాయవాద రాజకీయాల్లో ప్రభావశీలురైన జాబితాలోకి వాన్స్ చేరారు.
అమెరికా చారిత్రకంగా ప్రొటెస్టెంట్ మెజారిటీ దేశమైనప్పటికీ, క్యాథలిక్ వర్గాల ప్రభావం అమెరికా సంప్రదాయవాద రాజకీయాలపై గణనీయంగా ఉంది.
వివాహానంతరం ఉషాతో కలిసి సంతానం గురించి ఆలోచించడం ప్రారంభించిన సమయంలో తనని తాను "క్రిస్టియన్ క్యూరియస్"గా భావించానని వాన్స్ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సమయంలో క్యాథలిక్ మతం తనను మేథోపరంగా ఆకర్షించిందని తెలిపారు.
మతం పట్ల తన ఆసక్తి హిందూ సంప్రదాయంలో పెరిగిన ఉషాపై ఒత్తిడిగా మారుతుందేమోనని తాను ఆందోళన చెందానని వాన్స్ పేర్కొన్నారు.
ఉషా తన జీవితంలో మతం సానుకూల పాత్ర పోషించిందని భావించినప్పటికీ, ఆమె వ్యక్తిగత మత విశ్వాసాల గురించి వాన్స్ తన పుస్తకంలో చాలా పరిమితంగానే ప్రస్తావించారు.
ఇటీవల జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ఉద్యమ మద్దతుదారుల్లో అసంతృప్తిని కలిగించాయి.
గత వారం స్విట్జర్లాండ్‌లో కూడా వాన్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన పాకిస్తాన్ పట్ల తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు.
"నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారని నేను సరదాగా చెబుతుంటాను. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్తానీ. ఆ భారతీయురాలు నా భార్య. పాకిస్తానీ, ఫీల్డ్ మార్షల్ మునీర్" అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, సైనికాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ సమక్షంలో అన్నారు జేడీ.
తర్వాత అమెరికా-ఇరాన్ చర్చల్లో పాకిస్తాన్ పాత్రపై ఒక పాకిస్తానీ జర్నలిస్టు ప్రశ్నించగా "నాకు పాకిస్తానీ అంటే ఇష్టం" అని ఆయన సమాధానమిచ్చారు.
అమెరికన్ జాతీయవాదం, ఐడెంటిటీ రాజకీయాల ప్రభావం ఉన్న మాగా ఉద్యమంలో పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై వాన్స్ ప్రదర్శించిన సానుకూలతను అనేక మంది స్వాగతించలేదు.
రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ స్పందిస్తూ, "పాకిస్తాన్‌కు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన చరిత్ర ఉంది. ప్రస్తుతం శాంతి కంటే ఇరాన్ మద్దతు పొందిన ఉగ్రవాద కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది" అని అన్నారు.
మరో రిపబ్లికన్ నేత టిమ్ షీహీ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, "పాకిస్తాన్ ఒక దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించింది. అలాగే ఐసిస్ ద్వారా అయతొల్లా పాలనకు మద్దతిచ్చింది" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)