You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఓ 10 ఏనుగులు వచ్చి ఇంటిముందు నిలబడ్డాయి, రాత్రంతా బయటకు రాలేకపోయాం’
- రచయిత, జేవియర్ సెల్వ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
"సాయంత్రం 5:30 గంటలకు నేను ఇంటి బయట బట్టలు ఉతుకుతున్నాను. వాళ్ళు 'ఏనుగు, ఏనుగు' అని అరిచారు. నేను లేచి ఇంట్లోకి పరుగెత్తేలోపే అది నా ముందు ప్రత్యక్షమైంది. నేను వేగంగా ఇంట్లోకి పరుగెత్తే క్రమంలో నా చేయి తలుపుకు బలంగా తగిలింది. దాంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఒక్క క్షణం ఉంటే .. నేను చనిపోయి ఉండేదానిని" తేయాకు తోటలో పని చేసే సుగంధి బీబీసీతో చెప్పిన మాటలివి.
"కొన్ని రోజుల కిందట 10 ఏనుగులు ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాయి. ఆ ఏనుగులు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి తర్వాతి రోజు తెల్లారి 7 గంటలకు వెళ్లాయి. అవి అక్కడ ఉన్నంతసేపు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాను" కుజివ్యాల్ గ్రామస్థురాలు మినీ తన అనుభవాన్ని వివరించారు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని గూడలూరు అటవీ సంరక్షణ కేంద్రంలో ఏనుగులు జనావాసాల్లోకి రావడం వల్ల ప్రాణ నష్టం పెరుగుతోంది.
దీనిని నివారించడానికి అటవీ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది.
అయినప్పటికీ స్థానిక ప్రజలు ఆందోళన తగ్గడం లేదు.
అడవుల నరికివేత వల్లనే ఏనుగులు ఇళ్ల మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు దీనితో ఏకీభవిస్తున్నారు.
గూడలూరు పూర్వీకుల భూముల సమస్యను పరిష్కరించడమే దీనికి ఏకైక శాశ్వత పరిష్కారమని చాలామంది అంటున్నారు.
అదే సమయంలో మనిషి- జంతువుల సంఘర్షణ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్ కూడా ఉంది.
దశాబ్దాలుగా పెరుగుతున్న సమస్య
తమిళనాడు, కేరళ, కర్ణాటకలో విస్తరించిన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ పర్యావరణపరంగా కీలక అటవీ ప్రాంతం. ఇక్కడ ఉండే వన్యప్రాణులు 3 రాష్ట్రాల్లోని అడవులలో తిరుగుతూ ఉంటాయి.
అటవీ శాఖ బీబీసీతో పంచుకున్న సమాచారం ప్రకారం.. గతేడాది 3 రాష్ట్రాల్లో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో 484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గూడలూర్ అటవీ సంరక్షణ కేంద్రంలో 120కి పైగా ఏనుగులు ఉన్నట్లు తేలింది.
ఈ డివిజన్‌లోని 6 అటవీ సంరక్షణ కేంద్రాలలో గత 10ఏళ్లలో ఏనుగుల దాడుల్లో సుమారు 100 మంది మరణించారు. సగటున ప్రతి ఏటా 8 నుంచి 10 మంది ఏనుగుల దాడిలో చనిపోతున్నారు.
30ఏళ్లుగా ఇక్కడ విస్తరిస్తున్న తేయాకు, కాఫీ తోటలు, నివాస, వాణిజ్య భవనాల వల్ల అడవులు తగ్గుతున్నాయి.
దీంతో అడవుల్లో ఒకచోట నుంచి మరోచోటకు వెళుతున్న ఏనుగులు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయి.
గతేడాది మేలో పకానా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మిషాబ్ దుకాణం నుంచి ఇంటికి వస్తుండగా ఏనుగు దాడిలో చనిపోయారు. దీంతో ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలని స్థానికులు నిరసన చేపట్టారు.
ఇటీవల ఇలాంటి నిరసనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో ఇక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు బీబీసీ ఈ ప్రాంతంలో పర్యటించింది.
గూడలూరు అటవీ సంరక్షణ కేంద్రంలోని నివాస ప్రాంతాలు, అడవిలోని గిరిజన గ్రామాలలో ప్రజలతో మాట్లాడింది.
గత పదేళ్లలో మనిషి-ఏనుగుల సంఘర్షణ పెరిగిందని అనేక మంది స్థానికులు బీబీసీతో చెప్పారు.
'చీకటి పడ్డాక బయటకు రావాలంటే భయం'
గూడలూరు అటవీ సంరక్షణ ప్రాంతం గిరిజన గ్రామాలతో పాటు ఇతర నివాస ప్రాంతాల మిశ్రమం.
ఇక్కడ ప్రైవేట్ టీ ఎస్టేట్‌లతో పాటు తమిళనాడు టీ ఎస్టేట్స్ కార్పొరేషన్ యాజమాన్యంలోని ఎస్టేట్‌లు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.
తేయాకు తోటల్లో పని చేసే కార్మికుల కోసం ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేశారు. వీటిని లైన్ సెటిల్‌మెంట్లు అని పిలుస్తారు. ఏనుగులు ఈ లైన్ సెటిల్మెంట్ల చుట్టూ రోజూ తిరుగుతాయని స్థానికులు చెప్పారు.
"ఏనుగులు ఇక్కడున్న పనస పండ్ల కోసం వస్తాయి. రాత్రి 7గంటల తర్వాత షాపుకు కూడా వెళ్లలేకపోతున్నాను" అని చెరమ్బడిలోని ప్రైవేట్ టీ ఎస్టేట్ క్వార్టర్స్‌లో నివసించే విజయలక్ష్మి చెప్పారు.
"ఇటీవల 9 ఏనుగులు తమ పిల్లలతో వచ్చాయి. అటవీ శాఖ వారు వచ్చి పేలుడు పదార్థాలతో వాటిని తరిమివేశారు. కానీ అవి ఎక్కువ దూరం వెళ్లవు. మళ్లీ వస్తాయి. రాత్రి 9 గంటల తర్వాత అటవీ శాఖ వారు 'ఏనుగు ఉంది. బయటకు రావద్దు' అని మైకులో చెబుతారు. మేము బయటకు వెళ్లం" అని చెల్లమ్మాళ్ చెప్పారు.
ఏనుగుల కారణంగా కొన్నేళ్లుగా తమ జీవనం మారిపోయిందని స్థానికులు చెప్పారు.
ఏనుగుల భయం వల్ల రాత్రంతా బయటకు రాలేకపోతున్నామని, తమ ఇళ్లలోనే ఖైదీలుగా మారిపోయినట్లు వివరించారు.
కుళియవల్ గ్రామం కటునాయకర్ గిరిజనుల ఆవాసం. ఈ ఊరు దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉంది.
గ్రామం నుంచి ప్రధాన రహదారిని చేరుకోవాలంటే, మట్టి రోడ్డు మీద ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాలి. బీబీసీ బృందం ఈ గ్రామాన్ని సందర్శించింది.
"గత వారంలో ఒక రోజు మా ఇంటి దగ్గరకు 10 ఏనుగులు వచ్చాయి. ఆ ఏనుగుల గుంపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి, మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కదల్లేదు. మేము రాత్రంతా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. కట్టెల కోసమో, నీళ్ల కోసమో బయటకు వెళితే అవి అకస్మాత్తుగా వస్తాయి. ప్రతీరోజూ మేము భయంతో బతుకుతున్నాం" అని కుళివయల్ గ్రామస్థురాలు మినీ చెప్పారు.
అటవీశాఖ అధికారులకు రాత్రంతా జాగారమే
జనావాసాల్లోకి వచ్చే ఏనుగుల్ని తరిమి కొట్టే బాధ్యతను అటవీ శాఖ బృందాలకు అప్పగించారు.
ఈ బృందాలు సాయంత్రం 5 గంటలకు సమావేశమవుతాయి. రేంజర్ల సూచనల మేరకు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు వెళతాయి.
అటవీ శాఖ అధికారులతో కలిసి బీబీసీ బృందం రెండు రోజులు పర్యటనకు వెళ్లినప్పుడు సాయంత్రం 6.30 గంటలకు జనావాసాలకు దగ్గర్లోనే ఏనుగులు గుంపులు గుంపులుగా ఉండటాన్ని అటవీ శాఖ డ్రోన్ గుర్తించగలిగింది.
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్‌లు అడవిలోకి వెళ్లి ఏనుగుల గుంపును తరిమిన కాసేపటికే మరో ప్రాంతం నుంచి పిలుపు వస్తుంది. దీంతో వారు అక్కడకి వెళ్లాల్సి వస్తుంది.
ఓవెలి, నడుకాని, పండలూరు, పిడర్కాడు, చెరమ్బడి గూడలూరు అనే 6 అటవీ సంరక్షణ కేంద్రాల్లో ఇదే పరిస్థితి.
నడుక్కానిలో అటవీ శాఖకు చెందిన జెనెపూల్ ఎకో పార్క్ కాంప్లెక్స్‌లో ఒక కంట్రోల్ రూమ్ ద్వారా ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.
ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన 45 ప్రదేశాలలో ఏఐ టెక్నాలజీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఏనుగుల కదలికలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు.
ఈ సమాచారాన్ని గ్రామస్థులకు అందించేందుకు వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేశారు.
ప్రతీ అటవీ రేంజ్‌లో ఫారెస్ట్ రేంజర్ల నెంబర్లను ప్రజలకు ఇచ్చారు. ఏనుగులు వస్తే సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్, ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.
స్కూలు పిల్లల్ని ఇళ్ల వద్ద దిగబెడుతున్న అధికారులు
రమేశ్ కుమార్‌కి కోలపల్లి గ్రామంలో షాపు ఉంది. ఏనుగులే కాకుండా ఇతర వన్యప్రాణులు కూడా నివాస ప్రాంతాల్లోకి రావడం వల్ల తమ ఉపాధి దెబ్బ తింటోందని ఆయన చెప్పారు
"మేము మూడు తరాలుగా ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నాము. కొన్నేళ్లుగా ఇక్కడికి వచ్చే ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులుల సంఖ్య బాగా పెరిగింది. గతంలో పొద్దున్నే ఆరింటికి షాపు తెరిచి పది గంటలకు మూసేవాళ్ళం. వ్యాపారం, ఆదాయం బాగుండేవి. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకే దుకాణం కట్టేయాల్సి వస్తోంది. ఉదయం 8 గంటల తర్వాతే దుకాణం తెరవగలుగుతున్నాం. ఆదాయం సగానికి తగ్గిపోయింది. అందరికంటే స్కూలు పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది" అని ఆయన చెప్పారు.
ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండే కైయున్ని, కన్నంపల్లి ప్రాంతాల్లో స్కూళ్ల నుంచి విద్యార్థుల్ని అటవీ శాఖ అధికారులు ఇళ్ల దగ్గర దిగబెడుతున్నారు.
గూడలూరు అటవీ పార్కు సహజ స్వరూపమే కాకుండా అక్కడి వాతావరణం కూడా మనుషులు-ఏనుగుల సంఘర్షణలో ప్రధానంగా ఉంది.
పండలూరు, దేవాల, చెరంగోడుతో సహా అనేక ప్రాంతాలలో మంచు దట్టంగా కురుస్తుంది.
అక్కడ ఐదు అడుగుల అవతల ఏముందో కూడా కనిపించదు. దీనివల్ల ఏనుగులు రాకను గుర్తించకపోతే అవి దాడి చేసే అవకాశం ఉంది.
దీనివల్ల పని మీద వేరే ఊరు వెళ్లిన వారు రాత్రిపూట గ్రామానికి రావడం లేదని, తర్వాతి రోజు వస్తున్నారని చెరంగోడ్ మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడైన అమ్సా.. బీబీసీతో చెప్పారు.
ఏనుగులు, ఇతర వన్యప్రాణుల వల్ల టీ తోట కార్మికులు తమ ఉద్యోగాలను వదిలి మైదాన ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెరమ్బడికి చెందిన ప్రైవేట్ టీ ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ కట్టూరాజా చెప్పారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
గూడలూరులో ఏనుగుల సమస్యకు ప్రధాన కారణం అడవులు ముక్కలు ముక్కలుగా విడిపోవడమేనని ఒసై ఎకోసిస్టమ్ వ్యవస్థాపకుడు కాళిదాసన్ అన్నారు.
ఏనుగుల సమస్య విషయంలో అటవీ శాఖ చేపట్టిన చర్యల గురించి గూడలూరు జిల్లా అటవీ అధికారి దేవరాజ్ వివరించారు.
"ఇతర అటవీ ప్రాంతాలతో పోలిస్తే, గూడలూరు అటవీ రిజర్వ్‌లో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడి అడవులు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. వాటి మధ్యలో నివాస ప్రాంతాలు, ఎస్టేట్‌లు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.
"అడవిలో కందకాలు తవ్వడం, ఏనుగుల ఆహారం కోసం మొక్కలు నాటడం వంటి చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలు అటవీ శాఖకు మరింత సహకరిస్తే వన్య ప్రాణుల ముప్పు మరింత తగ్గుతుంది" అని దేవరాజ్ చెప్పారు.
ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పరిష్కారం కోసం ప్రతిపాదించిన ప్రణాళికల గురించి విచారించడానికి నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య తనిన్యును బీబీసీ పలుమార్లు సంప్రదించింది. అయినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
నీలగిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి కమాలి వివరణ కోసం బీబీసీ ఆయనను సంప్రదించింది. అయితే ఆయన నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)