ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యాంటెన్నా అంచున నిశ్చితార్థం చేసుకున్న 'స్కైవాకర్స్' జంట అరెస్ట్

న్యూయార్క్, స్కైవాకర్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్
    • రచయిత, ప్రతీక్షా గిల్డియాల్
    • హోదా, న్యూాయార్క్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

న్యూయార్క్ నగరంలోని ఆకాశహర్మ్యమైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ఉన్న యాంటెన్నా అంచుల వరకూ ఎక్కి, నిశ్చితార్థం చేసుకున్నట్లు కనిపించిన జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రష్యన్ జంట 33 ఏళ్ల ఏంజెలా నికోలావ్, 32 ఏళ్ల ఇవాన్ బీర్కస్ ఈ ఆకాశహర్మ్యం చివరి అంచు వరకూ వెళ్లి, ఓ పెద్ద బ్యానర్‌ను ఆవిష్కరించారు. దానిపై "అధికార దాహాన్ని ప్రేమ శక్తి ఓడించినప్పుడు, ప్రపంచమంతా శాంతి నెలకొంటుంది" అని రాసి ఉంది.

న్యూయార్క్, స్కైవాకర్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఫొటో సోర్స్, Reuters

బీర్కస్ మోకాలిపై కూర్చుని, నికోలావ్‌కు ఉంగరం అందిస్తూ ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపించారు, కిందకు దిగే ముందు వారిద్దరూ ముద్దు పెట్టుకున్నారు.

ఆ జంట 1454 అడుగుల (443 మీటర్లు) ఎత్తైన ఆ భవనం పైఅంచున కనీసం 10 నిమిషాలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో సాహసోపేతమైన విన్యాసాలు చేసిన ఈ జంట, 2024లో విడుదలైన 'స్కైవాకర్స్: ఏ లవ్ స్టోరీ' అనే డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రధారులు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
న్యూయార్క్, స్కైవాకర్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఫొటో సోర్స్, Reuters

ఈ ఘటనకు సంబంధించి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎన్‌వైపీడీ) బీబీసీకి తెలిపింది.

బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ ప్రకారం.. వారు దొంగతనం, నిర్లక్ష్యంతో ప్రమాదాలకు కారణమవడం, నేరపూరిత విధ్వంసం(ఇతరుల ఆస్తులకు హాని కలిగించడం), ప్రైవేట్ ప్రదేశంలోకి అనధికారికంగా ప్రవేశించడం, తప్పుడు ప్రవర్తన తదితర అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఈ ఘటన' కారణంగా ఆ టవర్‌కు సరిగ్గా కిందనే ఉన్న అబ్జర్వేషన్ డెక్‌లోని అద్దెదారులకు, సందర్శకులకు, లేదా అతిథులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

"న్యూయార్క్ నగరం నడిబొడ్దున, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ భవనం పైభాగంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అబ్జర్వేషన్ డెక్.. ప్రేమ వ్యక్తీకరణ, పెళ్లి ప్రతిపాదనల వంటి జీవితంలో మరపురాని క్షణాలను అందించే ప్రత్యేక ప్రదేశంగా నిలుస్తుందని చెప్పొచ్చు" అని ఆ ప్రతినిధి తన ప్రకటనలో పేర్కొన్నారు.

న్యూయార్క్, స్కైవాకర్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇవాన్ బీర్కస్, ఏంజెలా నికోలావ్

భవనంలోని 103వ అంతస్తులో వాటర్ టవర్ నిర్వహణ కోసం వినియోగించే ఒక హ్యాచ్ (చిన్నతలుపు లేదా మూత) ద్వారా ఆ జంట లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీస్ వర్గాలు సీబీఎస్‌కి తెలిపాయి.

ఈ అంతస్తుపైకి అందరికీ అనుమతి ఉండదు, కానీ దాని కింది అంతస్తు వరకూ వెళ్లొచ్చు. అయితే, వారు 102వ అంతస్తు నుంచి 103వ అంతస్తుకు ఎలా వచ్చారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మధ్యాహ్నం తర్వాత, ఆ జంట భవనం పైనున్న 200 అడుగుల టెలీకమ్యూనికేషన్స్ యాంటెన్నా పైనుంచి కిందకు దిగడం మొదలుపెట్టారు.

టవర్‌ అంచుకు కాస్త దిగువన ఉన్న ఒక ప్లాట్‌ఫామ్‌కు వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి తన మోకాలిపై కూర్చుని ఆ మహిళకు ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపించారు.

ఆ తర్వాత, వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు, ఆ తర్వాత ఆమె తన మాస్క్ తీసేశారు, ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు.

ఇదంతా భవనం పైనుంచే ఆ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

న్యూయార్క్, స్కైవాకర్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నికోలావ్, బీర్కస్‌లను న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్లాట్‌ఫామ్ పైనుంచి తీసిన ఒక వీడియోను నికోలావ్ షేర్ చేశారు. అలాగే, తనకు బీర్కస్ ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఫోటోను కూడా పంచుకున్నారు.

ఆ జంటతో మాట్లాడేందుకు వెళ్లిన అధికారి నిచ్చెన ఎక్కుతున్న బాడీ కెమెరా ఫుటేజ్‌ను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసింది.

"హలో, ఎలా ఉన్నారు?" అని ఆయన అనడం వినిపిస్తుంది. "దయచేసి మీరు ఉన్నచోటే ఉంటారా? మీరు ఇక్కడ ఉండకూడదు" అన్నారు.

అందుకు నికోలావ్ స్పందిస్తూ, "నేను బానే ఉన్నాను" అని అన్నట్లు వినబడుతుంది.

మీరు ఏ భాషలో మాట్లాడగలరని అధికారులు వారిని అడగ్గా, "రష్యన్" అని నికోలావ్ బదులిచ్చినట్లు ఆ వీడియో రికార్డయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.