ది గ్యాప్: కావలసిన సైజు జీన్స్‌ దొరక్క చివరకు ఒక దుస్తుల బ్రాండ్‌నే సృష్టించిన జంట కథ..

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దలియా వెంటూరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 11 నిమిషాలు

1960 దశాబ్దం చివరి రోజులు... శాన్‌ఫ్రాన్సిస్కో కొత్త సంస్కృతికి కేంద్ర బిందువుగా మారుతున్న సమయం.

గ్రేట్‌ఫుల్ డెడ్, జానిస్ జోప్లిన్, జిమీ హెండ్రింక్స్ వంటి గాయకుల సంగీతం నగర వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది.

డోనల్డ్, డోరిస్ ఫిషర్‌కు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. డోనల్డ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.

డోరిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పొందిన మొదటి మహిళ. పెళ్లయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు.

డోనల్డ్‌కు ఒక సమస్య వచ్చింది. మార్కెట్లో అతని సైజుకు తగ్గ లివైస్ జీన్స్ దొరకలేదు. ఈ విషయంలో భర్తకు సాయం చేయాలని డోరిస్ నిర్ణయించుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ నిర్ణయం 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖ బ్రాండ్లలో ఒక దానికి బాటలు వేసింది. ఆ తర్వాత అది పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.అది విజయం సాధించింది. అలాగే విజయ శిఖరాల నుంచి పడిపోయింది.

మళ్లీ లేచి శిఖరాగ్రానికి చేరుకుని కుప్పకూలింది. ఇప్పుడు మరోసారి కొత్త తరాన్ని జయిస్తోంది.

పడిన ప్రతీసారీ ఉవ్వెత్తున పైకి లేస్తూ సముద్రపు అలలను తలపించే ఈ విజయగాధను తెలుసుకోవడానికి ముందు ఒకసారి హిప్పీ యుగంలోకి వెళదాం.

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Gap Inc.

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ తమ స్టోర్‌కు 'ప్యాంట్స్ అండ్ రికార్డ్స్' అనే పేరు పెడదామనుకున్నారు. అయితే డోరిస్ 'ది గ్యాప్' అనేపేరు సూచించారు.

తరాల మధ్య అంతరమే "ది గ్యాప్"

లివైస్ జీన్స్ సాంస్కృతిక చిహ్నంగా ఉన్న కాలమది. ఫ్యాక్టరీల్లో కార్మికులు ధరించే ఈ దుస్తుల్ని జేమ్స్ డీన్, రాక్ అండ్ రోల్ వంటి ప్రముఖులు తిరుగుబాటు యూనిఫామ్‌గా మార్చారు.

అందరికీ అవి నచ్చాయి. అవే వేసుకోవడం మొదలు పెట్టారు. అయితే వాటిలో ఒక లోపముందని డోనల్డ్, డోరిస్ గుర్తించారు.

డిపార్ట్‌మెంట్ స్టోర్లలో కూడా లివైస్‌కు సంబంధించి అన్ని రంగులు, సైజులు, స్టైల్స్ అందుబాటులో ఉండేవి కాదు. ప్రజల్లో బాగా ఆదరణ ఉన్నవి వెంటనే అమ్ముడవుతున్నాయి.

లివైస్‌ జీన్స్ తయారు చేసే లివైస్‌ స్ట్రాస్ కంపెనీ ఉత్పత్తి చేసే ప్రతీ వస్తువు లభించేలా ఒక స్టోర్ ప్రారంభించాలని వారు భావించారు. ఈ స్టోర్‌లో ఆ బ్రాండ్‌కు సంబంధించి అన్ని వస్తువులు అందుబాటులో ఉంచారు.

"నేను దుస్తుల వ్యాపారంలోకి రావాలని అనుకోలేదు" అని డోనల్డ్ చెప్పారు.

"లివైస్‌లో బట్టలు కొనడం పీడకల లాంటిది. దాన్ని పక్కన పెట్టి షాపింగ్ అనుభవాన్ని నాలాంటి వాళ్లు కోరుకునే విధంగా తేలిగ్గా, సులభంగా మార్చాలని అనుకున్నాను" అని ఆయన అన్నారు.

లివైస్‌ అడ్వర్టైజింగ్ డైరెక్టర్ బడ్ రాబిన్సన్‌కు ఈ ఆలోచన నచ్చింది. అందుకే షాపులో అన్ని రకాల ప్రొడక్ట్‌లు అందుబాటులో ఉండేలా ప్రతీ రోజూ లివైస్‌ గోదాము నుంచి తాజా ఉత్పత్తుల్ని తెచ్చి పెట్టేందుకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.

1969 ఆగస్టులో డోరిస్ దంపతులు తమ మొదటి స్టోర్ తెరిచారు. యువత, కాలేజ్‌కు వెళ్లే విద్యార్ధులే తమ వినియోగదారులని చెప్పడానికి ఆ స్టోర్‌లో ప్రకాశవంతమైన రంగులతో పాటు పెద్ద శబ్ధంతో సంగీతం వినిపించేది.

ఆ కాలంలో పెద్దవాళ్లు షాపింగ్ చేసే డిపార్ట్‌మెంట్ స్టోర్లలో అలాంటివేమీ ఉండేవి కాదు.

అలా డోనల్డ్, డోరిస్ తమకు తెలియకుండానే ప్రత్యేక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించారు.

ఈ స్టోర్‌లో ఏమి అమ్ముతారో చెప్పడానికి దానికి తనదంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

ఆ సమయంలో యుద్ధాలను చూసినవారు, ఆ తర్వాతి తరం వారి మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తూ వాళ్లు ఆ స్టోర్‌కు 'ది గ్యాప్' అని పేరు పెట్టారు.

రెండు తరాల మధ్య విభిన్న అనుభవాలు, విభిన్న విలువలు, విభిన్నమైన స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఉన్నాయి.

ఓషన్ అవెన్యూలోని రెండు యూనివర్సిటీలు, ఒక హైస్కూలుకు మధ్యనున్న వ్యూహాత్మక ప్రాంతంలో 'ది గ్యాప్' స్టోర్‌ ఉంది.

ఆ లోకేషన్ చూస్తే చాలు, ఆ స్టోర్ యువత కోసమే కానీ వారి తల్లిదండ్రుల కోసం కాదని చెప్పవచ్చు.

ఈ దంపతులిద్దరూ ఆ స్టోర్‌లో రోజువారీగా వేసుకునే దుస్తులు ధరించే పని చేసేవారు.

వారి దుస్తులు కూడా ఆ షాపు ఏంటో, ఎవరి కోసమో చెప్పేవి.

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Gap Inc.

ఫొటో క్యాప్షన్, వ్యాపార నిర్వహణతో పాటు ఇతర అంశాల్లోనూ డోనల్డ్, డోరిస్ దంపతులు కలిసి పని చేశారు

వైరుధ్యాలున్న ప్రపంచంలో సమానత్వం

ఈ స్టోర్‌లో మొదట నుంచి డోరిస్, డోనల్డ్ చెరో 50శాతం పార్ట్‌నర్‌లుగా ఉండేవారు. ఇప్పుడు ఇలాంటివి సహజమైనప్పటికీ, 1969లో ఇది అసాధారణ విషయం.

"నిజం చెప్పాలంటే, మహిళలు కూడా పురుషులు చేసే పని చేస్తే, వారి సంపాదన కూడా పురుషులతో సమానంగా ఉంటుందని నేను అనుకునేదాన్ని" అని స్టోర్ ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత డోరిస్ చెప్పారు.

"అయితే మేము 'గ్యాప్' ప్రారంభించినప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మహిళలు వ్యాపారం చేయగలరని చాలామందికి కనీసం ఆలోచన కూడా రాని కాలం అది" అని ఆమె అన్నారు.

వాళ్లిద్దరూ స్టోర్ కోసం మొత్తం 63వేల అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. ఇద్దరూ చెరో 21వేల అమెరికన్ డాలర్లు పెట్టగా మిగిలిన మొత్తం వారి ముగ్గురు పిల్లల ఖాతాల్లో నుంచి తీసుకుని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. చెప్పినట్లే చెల్లించారు.

ది గ్యాప్ స్టోర్‌లో మొదట పురుషుల జీన్స్, గ్రామో ఫోన్ ద్వారా ప్లే చేసే డిస్కులు అమ్మేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు "జీన్స్ వల్లనే రికార్డులు కొంటున్నారు. రికార్డుల వల్ల జీన్స్ కాదు" అనేది గ్రహించారు. దీంతో తమ స్టోర్ నుంచి మ్యూజిక్ గ్రామోఫోన్ డిస్క్‌లను రికార్డుల్ని తొలగించి దుస్తుల అమ్మకాలపై దృష్టి పెట్టారు.

ప్రస్తుతం స్టోర్లలో కామన్‌గా కనిపించే ఓ విషయం అప్పట్లో విప్లవాత్మకమైనది. దీని సృష్టికర్తలు డోనల్డ్, డోరిస్ దంపతులే. జీన్స్‌ను స్టైల్ ప్రకారం కాకుండా మనుషుల నడుము చుట్టు కొలత సైజు ప్రకారం వర్గీకరించి వేర్వేరుగా ఉంచేవారు. దీని వల్ల కస్టమర్లు తమకు కావల్సిన సైజులో రకాలను ఒకేచోట చూసుకునే అవకాశం ఏర్పడింది.

డోనల్డ్ వ్యాపారిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజంట్ దృష్టితో స్టోర్‌లోని ప్రతీ చదరపు సెంటీమీటర్ స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా గోడలకు అరలను ఏర్పాటు చేశారు.

"ఇలాంటిది ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. అయితే లాజికల్‌గా చూస్తే ఎలా ఎందుకు చేయకూడదనిపించింది" అని డోనల్డ్ అన్నారు.

ఏడాది తర్వాత ఈ దంపతులు శాన్‌జోస్‌లో రెండో స్టోర్ తెరిచారు. 1971 నాటికి వారి అమ్మకాలు రెండున్నర మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అప్పటి నుంచి అమ్మకాలు, స్టోర్ల విస్తరణలో వేగం పెరిగింది.

'ది గ్యాప్' మూడో వార్షికోత్సవం నాటికి అమెరికాలో 25 స్టోర్లు ఏర్పాటయ్యాయి.

1974లో వాళ్లు తమ సొంత దుస్తుల బ్రాండ్ ప్రారంభించారు. తర్వాతి ఏడాదికి వారి స్టోర్ల సంఖ్య 50కి పెరిగింది. నికర లాభాలు 4.3 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

కానీ 'గ్యాప్' కథలో విజయం అనేది సరళ రేఖలా కాకుండా రోలర్ కోస్టర్ రైడ్‌లా మారింది.

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 80లలో జోన్ కాలిన్స్ "డైనాస్టీ" సిరీస్‌లో ధరించిన ఫ్యాషన్ వేర్ ట్రెండ్‌గా మారింది.

నష్టాలతో కష్టకాలం

తర్వాతి కాలంలో "ది గ్యాప్" పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. 1976లో ఒక్కో షేరు 18 డాలర్ల ముఖ విలువతో మార్కెట్‌లో లిస్టైంది.

అయితే అదే నెలలోనే లివైస్‌ స్ట్రాస్ కంపెనీ వాణిజ్య అక్రమాలకు పాల్పడినట్లు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపణలు చేసింది. 'గ్యాప్‌'కు ప్రధాన దుస్తుల సరఫరాదారు, అతి పెద్ద భాగస్వామి మీద వచ్చిన ఈ ఆరోపణలతో ఆ సంస్థ షేరు విలువ ఆ ఏడాది ముగిసే నాటికి 7.25 డాలర్లకు పడిపోయింది.

"షేరు విలువ పడిపోయినప్పుడు మేము తప్పు చేశామని, మమ్మల్ని తొలగించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేశారు" అని డోనల్డ్ తన ఆత్మకథలో రాశారు.

అక్రమాల గురించి ది గ్యాప్ స్టోర్ ఇంటర్నేషనల్‌కు ముందే తెలుసని, అందుకే ఇవి బయటకు రాకముందే వారి షేర్లు అమ్మేశారని ఇన్వెస్టర్లు అనుమానించారు.

అంతే కాకుండా ఆ కంపెనీ మీద 9 దావాలు వేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాటి మీద విచారణ జరిపింది.

విచారణలో అక్రమాలు ఏవీ గుర్తించనప్పటికీ, ది గ్యాప్ తన ఇన్వెస్టర్లకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని అందించలేదని కమిషన్ తెలిపింది. చివరకు గ్యాప్ కంపెనీ 5.8 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.

అయితే దీనికంటే పెద్ద సమస్య ఒకటి గ్యాప్ ముంగిట నిలిచింది.

70ల చివరిలో ప్రజల వేషధారణలో అనూహ్యమైన మార్పు ఒకటి వచ్చి.. క్యాజువల్ వేర్‌ అనేది ఫ్యాషన్ నుంచి కనుమరుగైంది.

పవర్ డ్రెస్సింగ్‌ శకం మొదలైంది. భారీ షోల్డర్ ప్యాడ్‌లు, స్టక్చర్డ్ సూట్‌లు, కలర్ కాంబినేషన్లు, డ్రస్సింగ్‌లో కార్పోరేట్ కల్చర్ విస్తరించింది.

ది గ్యాప్ ప్రారంభించినప్పుడు ఆ ఫ్యాషన్‌ను ఇష్టపడిన యువతరం పెరిగి పెద్దదైంది. దీంతో పాటు డిపార్ట్‌మెంటల్ స్టోర్లు మధ్య పోటీ పెరిగింది.

కాలానికి, ఫ్యాషన్‌కు తగ్గట్లు డోనల్డ్, డోరిస్ తమ స్టోర్లలో భారీ మార్పులు చేయాల్సి వచ్చింది.

ఇందులో భాగంగా బనానా రిపబ్లిక్ అనే దుస్తుల కంపెనీ కొనుగోలు చేశారు. తరవాత పాటరీ బార్న్ అనే గృహోపకరణాల సంస్థను టేకోవర్ చేశారు. అయితే అవి నష్టాల్లో కొనసాగడంతో 14 మిలియన్ డాలర్ల నష్టాలను భరించి వాటిని అమ్మేశారు.

దీంతో తానొక గుణపాఠం నేర్చుకున్నట్లు డోనల్డ్ చెప్పారు.

"నాకు తెలియని వ్యాపారాల్లో ఇకపై ఎన్నడూ అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నా" అని ఆయన చెప్పారు.

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వోగ్ కవర్ పేజ్ మీద లిండా ఎవాంజెలిస్టా, సిండీ క్రాఫర్డ్, క్లాడియా షిఫర్, నవోమి క్యాంప్‌బెల్ వంటి సూపర్ మోడల్స్ గ్యాప్ సంస్థ దుస్తులు ధరించి కనిపించారు.

అమెరికాకు బట్టలు తొడిగిన మిక్కీ డ్రెక్స్లర్

ఈ కాలంలో వ్యాపార విస్తరణలో అత్యంత కీలకమైనది కొత్త వాటిని కొనడం కాదు.. ఉన్న వాటిని విస్తరించడం. అందుకు సమర్థులైన వారిని తమకు తెలియని ఫ్యాషన్ గురించి తెలిసిన వారిని నియమించుకోవడం.

అప్పటికే 50ల్లో పడిన డోనల్డ్ దంపతులు .. యువతకు సంబంధించి ఫ్యాషన్ ట్రెండ్ తెలిసిన వారు తమకు అవసరమనే విషయాన్ని గుర్తించారు.

ఇందుకోసం వాళ్లు 39 ఏళ్ల మిక్కీ డ్రెక్స్లర్‌ను నియమించుకున్నారు. తర్వాతి కాలంలో ఆయన "అమెరికాకు దుస్తులు తొడిగిన వ్యక్తి"గా గుర్తింపు పొందారు.

మొదట డ్రెక్స్లర్ షాపుల్లో పేరుకున్న పాత సరుకు మీద దృష్టి పెట్టారు. వాటి ధరలను తగ్గించారు. 80 లక్షల డాలర్లతో 500 స్టోర్లను ఆధునీకరించారు. స్టోర్లలో మిగతా రంగులు తొలగించి తెల్లరంగు వేశారు. చెక్కతో చేసిన ఫ్లోర్లకి వారానికి రెండుసార్లు పాలిషింగ్ చేశారు.

"ఎక్కువ రిస్క్ లేని ఫ్యాషన్, మంచి అభిరుచి మంచి స్టైల్, ఏదీ అతిగా లేకుండా" మహిళల కోసం కొత్త రంగులు, కొత్త స్టైల్ తెచ్చారు. పిల్లల కోసం 'గ్యాప్ కిడ్స్' 'బేబీ గ్యాప్' తీసుకొచ్చారు.

అయితే మొదట్లో మార్కెట్ సరిగ్గా స్పందించకపోవడంతో షేర్ విలువ పడిపోయింది. అయినప్పటికీ ఆమె గట్టిగా నిలబడ్డారు.

1985లో లైవ్ ఎయిడ్ కన్సర్ట్‌లో మిక్ జాగర్ వేసుకున్న క్లాసిక్ పాకెట్ టీ షర్ట్ వంటి క్యాజువల్, మోడ్రన్ ఫ్యాషన్ మీద ఆమె దృష్టి పెట్టారు.

అది గొప్ప విజయం సాధించింది.

చిన్నగా అమెరికా వెలుపల కూడా 'ది గ్యాప్' స్టోర్లు తెరిచారు. బనానా రిపబ్లిక్‌ను పునరుద్ధరించారు. డ్రెక్స్లర్ ప్లాన్ పని చేయడం మొదలైంది.

అప్పట్లో ఇది "రిటైల్ వ్యాపారం చరిత్రలో ఇది అత్యంత అసాధారణమైన పునరాగమనం" అని న్యూయార్క్ టైమ్స్ అభివర్ణించింది.

80ల చివర్లో ముదురు నీలం రంగులో ఉన్న చతురస్రం లోపల తెలుపు రంగులోపెద్ద అక్షరాలతో జీఏపీ అని కనిపించే లోగోను ప్రారంభించారు.

అది ఆ తర్వాతి దశాబ్దంలో స్వర్ణయుగానికి బాటలు వేసింది.

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిక్ జాగర్ ధరించిన దుస్తులు తర్వాతి కాలంలో అన్ని తరాలకు యూనిఫామ్‌గా మారిపోయాయి.

తిరిగొచ్చిన స్వర్ణ యుగం

1991లో "ది గ్యాప్" 950 స్టోర్లకు చేరుకుని 2 బిలియన్ డాలర్ల అమ్మకాలను సాధించింది.

అమెరికాలో అత్యధికంగా అమ్ముడయ్యే దుస్తుల బ్రాండ్‌లలో ఇది రెండో స్థానానికి చేరుకుంది.

మొదటి స్థానంలో ది గ్యాప్ పాత భాగస్వామి లివైస్‌ ఉండేది. ఈ రెండు సంస్థలు విడిపోయేటప్పుడు కుదిరిన ఒప్పందంలో భాగంగా లివైస్‌ ఆ ఏడాది అమ్మకాలు నిలిపి వేసింది.

"వాళ్లు (లివైస్‌) మమ్మల్ని ముందుగానే వదిలేశారు. దీన్ని బట్టి గ్యాప్ లేబుల్ వారికి ఎంత గట్టి పోటీ ఇచ్చిందో మాకు అర్థమైంది" అని డోనల్డ్ తన ఆత్మకథలో రాశారు.

90వ దశాబ్ధంలో వ్యాపార పరంగా, సాంస్కృతికంగా 'గ్యాప్‌' కంపెనీ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిదని చాలామంది భావిస్తారు.

అమెరికాలోని వోగ్ పత్రిక వందో వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఆ పత్రిక కవర్ పేజీ మీద గ్యాప్ దుస్తులు వేసుకున్న 10 మంది సూపర్ మోడల్స్ కనిపించడమే దీనికి స్పష్టమైన ఉదాహరణ.

1996 ఆస్కార్ వేడుకలకు ప్రముఖ నటి షరాన్ స్టోన్ 'గ్యాప్' కంపెనీకి చెందిన 25 డాలర్ల విలువైన నల్లని టర్టిల్ నెక్ స్వెటర్ ధరించి హాజరయ్యారు.

1998లోనూ గ్యాప్ కంపెనీకి చెందిన తెల్లని వేరా వాంగ్ స్కర్ట్ వేసుకుని ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్నారు.

సాటర్‌డే నైట్ లైవ్ అనే టీవీ షోలో ఆడమ్ శాండ్లర్, డేవిడ్ స్పేడ్, క్రిస్ ఫార్లీ "గ్యాప్‌ గర్ల్స్"గా నటించిన ఒక పేరడీని ప్రసారం చేసింది.

ఇది తమకు లభించిన గొప్ప ప్రశంస అని డోనల్డ్ దంపతులు చెప్పారు.

"మెక్ డోనల్డ్స్ మాదిరిగా అన్నిచోట్లా ఉన్నాయి. సోవియట్ యూనియన్ మాదిరిగా ఒకే కేంద్రంగా నడుస్తాయి. అమెరికాలో మిక్కీ మౌస్‌లాగా" అని న్యూయార్క్ టైమ్స్ గ్యాప్ ఫ్యాషన్ బ్రాండ్‌ గురించి రాసింది.

అమెరికాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డిస్కౌంట్ రిటైల్ స్టోర్లతో పోటీ పడేందుకు 'గ్యాప్' సంస్థ ఓల్డ్ నేవీ అనే తక్కువ ధరల బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇది నాలుగేళ్లకన్నా తక్కువ కాలంలోనే బిలియన్ డాలర్లను అధిగమించిన మొదటి రిటైలర్‌గా నిలిచింది.

1990ల చివరి నాటికి 'గ్యాప్' నికర లాభాలు బిలియన్ డాలర్లను దాటాయి.

43 బిలియన్ డాలర్ల సంపదతో డోనల్డ్, డోరిస్ ఫోర్బ్స్ ర్యాంకింగ్‌లో విడివిడిగా కనిపించినప్పటికీ ఇద్దరూ కలిసి ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 92వ స్థానానికి చేరుకున్నారు.

అయితే కాలాన్ని బట్టి, తరాన్ని బట్టి తరచుగా మారిపోయే ఫ్యాషన్ అనేది చాలా కఠినమైన వ్యాపారం.

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో 'గ్యాప్‌'కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.

ఊహించని ఎదురు దెబ్బలు

వ్యాపార విస్తరణ అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో సానుకూలంగా ఉండదని 'గ్యాప్‌' విషయంలో వెల్లడైంది.

సాంస్కృతిక తిరుగుబాటులో నుంచి పుట్టిన బ్రాండ్ చివరకు దానికి పూర్తిగా వ్యతిరేకమైన కార్పోరేట్ కన్స్యూమరిజం, జనరిక్‌నెస్, బోర్‌డమ్‌కు ప్రతీగా నిలిచింది.

ఇదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 'గ్యాప్‌' ఫ్యాక్టరీల్లో బాల కార్మికులతో పని చేయించడం, అక్కడ అధ్వాన్న పరిస్థితుల గురించి కథనాలు వచ్చాయి.

'గ్యాప్‌' చర్యలు తీసుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

1991లో కంపెనీ లాభాలు బిలియన్ డాలర్ల నుంచి 2002 నాటికి 475 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే సంస్థ తన లాభాల్లో సగానికిపైగా కోల్పోయింది.

1991లోనే 'గ్యాప్‌'‌కు పునర్వైభవం తెచ్చిన డ్రెక్స్లర్‌ను తొలగించారు. ఆమె రాజీనామా చేశారని బోర్డు చెప్పింది. అయితే తనను తొలగించారని ఆమె పదే పదే చెప్పారు.

"ఆ ప్రక్రియ సవ్యంగా సాగలేదని నాకు, డోనల్డ్‌కు బాగా తెలుసు. అయితే మేమిద్దరం కలిసి ఒక అద్భుతాన్ని నిర్మించాం" అని ఆమె అన్నారు.

2003లో సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డోరిస్ మర్చండైజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు.

ఏడాది తర్వాత డోనల్డ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన కుమారుడు బాబ్ ఆ బాధ్యతలు చేపట్టారు. 2009లో డోనల్డ్ చనిపోయారు.

అన్ని కష్టాల్ల ఉన్నా 'గ్యాప్‌' ప్రొఫైల్ అప్పటికీ అసాధారణంగానే ఉంది. 15 బిలియన్ డాలర్ల అమ్మకాలు, లక్షా 34వేల మంది ఉద్యోగులు, 25 దేశాల్లో 3 వేలకు పైగా స్టోర్లు. అయితే 90ల ముందు నాటికి ఉన్న పరిస్థితులతో పోలిస్తే అది చాలా తక్కువ.

90ల చివరి నుంచి 20 ఏళ్లకు పైగా భవిష్యత్ లేని గతంగా మారింది. తన సొంత స్టోర్లలో 80శాతం స్టోర్లను మూసివేసింది. 2023 నాటికి వాటి సంఖ్య 500 కంటే తక్కువకు పడిపోయింది.

అమెరికా, ఫ్యాషన్, బట్టలు, ది గ్యాప్, లివైస్‌, డిజైనింగ్, డోనల్డ్, డోరిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుల్గారి 140వ వార్షికోత్సవ వేడుకలో ఆన్ హాత్‌వే ధరించిన దుస్తులు సంచలనం సృష్టించాయి.

చితా భస్మంలో నుంచి పుట్టిన ఫీనిక్స్ పక్షిలా..

డోరిస్ తన జీవితంలో ఒక అద్భుతాన్ని చూసేంత కాలం జీవించారు. అది 'గ్యాప్‌' పునర్జన్మ.

ప్రపంచం గమనించడానికి కొంత సమయం పట్టినప్పటికీ 2023లో 'గ్యాప్‌'కోలుకోవడం మొదలైంది.

వరుసగా 27 నెలల పాటు 'గ్యాప్‌' షేరు లాభాలు ఆర్జిస్తూ వచ్చింది. 2024లో 1.1 బిలియన్ డాలర్ల లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అది 80 శాతం ఎక్కువ. దీంతో 'గ్యాప్‌' పుంజుకుందని మీడియా, ఫ్యాషన్ ప్రపంచం, విశ్లేషకులు నమ్మారు.

వీటన్నింటి కంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బ్రాండ్ కొత్తగా ఏదో కనుక్కుందనే ప్రచారం.

సమకాలీన ఫ్యాషన్ కల్చర్‌తో కలిసిపోవడం అనేది దానికున్న ప్రత్యేకతను 'గ్యాప్‌' రెండోసారి పునరుజ్జీవనంలో చాటుకుంది.

సంస్థ సీఈఓ రిచర్డ్ డిక్సన్, క్రియేటివ్ డైరెక్టర్ జాక్ పోసెన్ 'గ్యాప్‌' బ్రాండ్ డిజైన్లు ప్రజల్లో విస్తృతంగా ప్రచారమయ్యేలా కొత్త వ్యూహాలను ఎంచుకున్నారు.

కెలిస్ పాడిన 'మిల్క్ షేక్' అనే పాటకు కాట్సేయ్ గ్రూప్ డాన్స్ చేసిన అడ్వర్టయిజ్‌మెంట్ వీడియోను మూడు రోజుల్లో 2 కోట్ల మంది చూశారు.

టిక్‌టాక్‌లో వంద కోట్ల వ్యూస్ ఉన్న జంగిల్ అనే సింగర్ పాడిన "బ్యాక్ ఆన్ 74" మ్యూజిక్ వీడియోను దాదాపు యధాతథంగా తిరిగి నిర్మించారు. ఇందులో నటించిన దక్షిణాఫ్రికా గాయని టైలా, డాన్సర్లు 'గ్యాప్‌' బ్రాండ్ లినెన్ కలెక్షన్ దుస్తులు ధరించారు.

రోమ్‌లో జరిగిన బుల్గారి ఈవెంట్ కోసం ఆన్ హాత్‌వే 'గ్యాప్‌' బ్రాండ్ తెల్లటి కాటన్ షర్ట్ డ్రెస్ వేసుకున్నారు. దానిని 158 అమెరికన్ డాలర్లకు అమ్మకానికి పెట్టినప్పుడు కొన్ని గంటల్లోనే అమ్ముడైపోయింది.

శాండీ లియాంగ్ వంటి ప్రఖ్యాత డిజైనర్ల సహకారంతో 2000ల నాటి డిజైన్లు నిముషాల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి.

ఇప్పుడు 'గ్యాప్‌' బ్రాండ్ వినియోగదారుల్లో ఎక్కువ మంది మిలీనియల్స్, జెన్ జీ వారే.

1969లో తరాల మధ్య అంతరాన్ని సూచించిన "గ్యాప్" అనే పేరు ఇప్పుడు భిన్నమైన, ఒకేసారి అనేక తరాలకు పరిచయమైన బ్రాండ్‌గా నిలుస్తోంది.

2025ను ప్రభావితం చేసిన ప్రముఖ 100 సంస్థలలో 'గ్యాప్' ఒకటని టైమ్ పత్రిక తెలిపింది.

"గ్యాప్" రెండో పునరుజ్జీవనం ఎంత కాలం కొనసాగుతుంది? ఇది నిలబడుతుందా లేక గతంలో మాదిరిగా ఎదురు దెబ్బలు తగులుతాయా అనే ప్రశ్నల్ని కాలానికి వదిలేద్దాం.

తాను స్థాపించిన సంస్థ రెండో పునరుజ్జీవనాన్ని చూసిన డోరిస్ 94 ఏళ్ల వయసులో 2026 మే 2న మరణించారు.

ఆమె తాను సేకరించిన వాటిలో సమకాలీన ప్రైవేటు కళాఖండాల్ని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌కు విరాళంగా ఇచ్చారు. వీటిలో కాల్డర్, డి కూనింగ్, వార్హోల్, లిచ్టెన్‌స్టీన్, సెర్రా వంటి ప్రముఖ కళాకారులు రూపొందించినవి 1100 కంటే ఎక్కువ ఉన్నాయి. వీటిని శాన్ ఫ్రాన్సిస్కో మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో చూడవచ్చు.

భర్తకు సరిపోయే లివైస్‌ ప్యాంట్ వెదికేందుకు మొదలు పెట్టిన ప్రయత్నం తర్వాతి కాలంలో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారుతుందని ఆమె 1969లో ఊహించి ఉండకపోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)