తెలంగాణ : డాక్టర్ లేకుండా కాన్పు చేసిన ఏఎన్ఎం, తల్లీబిడ్డా మృతి, తల్లి చితాభస్మంలో కత్తెర... అసలేం జరిగింది?

ప్రసవం, తల్లీబిడ్డ మృతి, ప్రభుత్వాస్పత్రి, వైద్యులు, మహిళలు

ఫొటో సోర్స్, SANJEEVARAO

ఫొటో క్యాప్షన్, వనజ, సంజీవరావు పెళ్లిఫోటో
    • రచయిత, గరికపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో వనజ అనే మహిళకు ఓ ఎన్ఎం కాన్పు చేశారు. ప్రసవానంతరం తల్లీబిడ్డ మృతిచెందారు.

బాలింత అంత్యక్రియల తర్వాత చితా భస్మంలో సర్జరీలకు వాడే కత్తెర దొరికిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై స్పందించి విచారణకు ఆదేశించింది.

మరోపక్క ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖామంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్‌లో తెలిపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏఎన్ఎం జ్ఞానేశ్వరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించామని తెలిపారు.

ఈ నేపథ్యంలో గుండాల పీహెచ్‌సీలో అసలేం జరిగిందో బీబీసీ అందిస్తున్న రిపోర్ట్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏం జరిగింది?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగుండాల మండలంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన శంభునిగూడెంకు చెందిన గర్భిణి వనజ (20)కు పురిటినొప్పులు రావడంతో జూన్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుండాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు.

అయితే ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యుడు డాక్టర్ సుధీప్ అందుబాటులో లేరు. దీంతో అక్కడే ఉన్న ఏఎన్ఎం ప్రసవం చేశారు. కానీ కాన్పు తర్వాత శిశువులో చలనం లేకపోవడంతో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని అక్కడి సిబ్బంది సూచించారు.

అయితే అంబులెన్స్ రెండు గంటలు ఆలస్యంగా సాయంత్రం 4గంటల సమయంలో వచ్చాక, ఇల్లెందు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే పాప చనిపోయిందని అక్కడి వైద్యులు చెప్పారు.

మరోవైపు బాలింత వనజకు రక్తస్రావం ఆగకపోవడం, గర్భసంచి నుంచి తీవ్రంగా రక్తం వస్తుండడంతో అక్కడినుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందారని ఖమ్మం వైద్యులు వెల్లడించారు.

‘‘ వనజ గుండాల పీహెచ్‌సీలో గర్భిణిగా నమోదు చేసుకుని మాతా-శిశు ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకున్నారు. జూన్ 13న పురిటి నొప్పులతో, అత్యంత క్లిష్ట పరిస్థితిలో పీహెచ్‌సీకి చేరుకున్న ఆమె మృత శిశువుకు జన్మనిచ్చారు. అనంతరం తీవ్రరక్తస్రావం జరగడంతో వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఇల్లెందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అన్ని విధాలుగా చికిత్స అందించినప్పటికీ, తీవ్రమైన రక్తస్రావం కారణంగా హీమరేజిక్ షాక్, అనంతరం కార్డియాక్ అరెస్ట్ తో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు’’ అని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

ప్రసవం, తల్లీబిడ్డ మృతి, ప్రభుత్వాస్పత్రి, వైద్యులు, మహిళలు
ఫొటో క్యాప్షన్, గుండాల పీహెచ్‌సీ

వైద్యుల నిర్లక్ష్యమే కారణం: వనజ భర్త

గుండాల పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా కాన్పు చేయడం వల్లే తన భార్య, అప్పుడే పుట్టిన కుమార్తె చనిపోయారని మృతురాలు వనజ భర్త సంజీవరావు బీబీసీతో చెబుతూ విలపించారు.

''పురిటి నొప్పులు రాగానే వెంటనే మా గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన గుండాలలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లాం. అక్కడ సిబ్బంది కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కాన్పు చేశారు.అందుకే తల్లీబిడ్డల ప్రాణాలు పోయాయి.

బిడ్డ చనిపోయినా బతికే ఉందని చెప్పారు. ప్రసవం తర్వాత బిడ్డలో అస్సలు చలనం లేదు. ఇదేంటని అడిగితే ఒక్కోసారి నవజాత శిశువులు అలానే ఉంటారని మెరుగైన వైద్యం కోసం ఇల్లెందుకు తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు. పుట్టిన బిడ్డ మూడు కేజీలు బరువు ఉండడంతో పీహెచ్‌సీ సిబ్బంది మాట విని ఇల్లెందుకు తీసుకువెళ్లాం. కానీ అప్పటికే చనిపోయిన బిడ్డను తీసుకువచ్చారని అక్కడి వైద్యులు మాతో అన్నారు.

మా బిడ్డ అక్కడే చనిపోయిందని గుండాల పీహెచ్‌సీ సిబ్బందికి తెలుసు. అక్కడి నుంచి మమ్మల్ని పంపించివేయడానికే ఇల్లెందు తీసుకెళ్లాలని చెప్పారు'' అని సంజీవరావు ఆరోపించారు.

ప్రసవం, తల్లీబిడ్డ మృతి, ప్రభుత్వాస్పత్రి, వైద్యులు, మహిళలు

ఫొటో సోర్స్, SANJEEVARAO

ఫొటో క్యాప్షన్, చితాభస్మంలో కత్తెర

చితాభస్మంలో కత్తెర

భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోవడంపై సంజీవరావు ఆవేదన వ్యక్తంచేశారు.

''ఇల్లెందు ఆస్పత్రిలో నా భార్యకు రక్తస్రావం ఆగక పోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వెంటనే ఖమ్మం తీసుకెళ్లగా ఐసీయూలో ఉంచారు. కాసేపటికి పరిస్థితి విషమించి చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.

అంత్యక్రియల అనంతరం కర్మకాండల్లో భాగంగా వనజ మృతదేహం దహనం చేసిన చోట చితాభస్మం సేకరిస్తుండగా చికిత్సకు ఉపయోగించే కత్తెర బయటపడింది'' అని వనజ భర్త సంజీవరావు బీబీసీకి తెలిపారు.

ప్రసవం, తల్లీబిడ్డ మృతి, ప్రభుత్వాస్పత్రి, వైద్యులు, మహిళలు
ఫొటో క్యాప్షన్, డాక్టర్ సుదీప్

‘ప్రసవం కోసం వచ్చేటప్పటికే పరిస్థితి బాలేదు’’

వనజ డెలివరీ సమయంలో తాను పీహెచ్‌సీలో లేని మాట నిజమేనని గుండాల పీహెచ్‌సీ డాక్టర్ సుదీప్ బీబీసీతో చెప్పారు . అదేరోజు తనకు మరొక ఊరిలో వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమం ఉన్నందున అక్కడికి వెళ్లానని, వనజకు 14వ తేదీ డెలివరీ డేట్ ఇవ్వడంతో 13వ తేదీన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వెళ్లానని అయన చెప్పారు.

''గర్భిణి వనజ వచ్చేటప్పటికే పరిస్థితి బాగోలేదు. వాస్తవానికి ఆమె పీహెచ్‌సీకి వచ్చేసరికి ఆమె గర్భసంచి నుంచి బిడ్డ తల బయటికి వచ్చింది. నర్సులు కూడా అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎం జాగ్రత్తగానే డెలివరీ చేసి శిశువును బయటకు తీశారు. పుట్టిన బిడ్డలో చలనం లేదని గమనించారు. అయితే ఒక్కోసారి పుట్టగానే చలనం లేకపోయినా కొద్దిసేపటికి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇల్లెందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

అలాగే బాలింత వనజ పరిస్థితిని గమనించి ఇల్లెందు ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. డెలివరీ విషయంలో మా సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం కనబర్చలేదు. కొన్ని అరుదైన సందర్భాల్లోనే ఇలా జరుగుతుంది. నిజంగానే ఇది దురదృష్టకర సంఘటన'' అని సుదీప్ బీబీసీతో చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ బీబీసీకి తెలిపారు. గుండాల పీహెచ్‌సీ డాక్టర్ సుదీప్‌ని ఇప్పటికే సస్పెండ్ చేశామని, ఆరోజు డెలివరీ చేసిన ఏఎన్ఎం, అక్కడి సిబ్బంది తీరుపై విచారణ జరుపుతున్నామని, వారిది తప్పని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఘటన జరిగిన కీలక సమయంలో విధులకు గైర్హాజరైన గుండాల పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుదీప్‌ను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆరోగ్యశాఖామంత్రి ప్రకటన తెలిపింది.

ప్రసవం, తల్లీబిడ్డ మృతి, ప్రభుత్వాస్పత్రి, వైద్యులు, మహిళలు
ఫొటో క్యాప్షన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ నాయక్

ఆ కత్తెరతో మాకు సంబంధం లేదు

వనజ అంత్యక్రియల తర్వాత చితాభస్మంలో కత్తెర దొరికిందని సంజీవరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారని అయితే అసలు ఆపరేషన్ చేయలేదు కాబట్టి కత్తెర వాడాల్సిన అవసరం రాలేదని డీఎంహెచ్‌వో బీబీసీతో అన్నారు.

''నార్మల్ డెలివరీ కాబట్టి ఎక్కడ కుట్లు కూడా వేయాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం నాకున్న అవగాహన బట్టి ఆ కత్తెర శరీరంలో నుంచి వచ్చింది కాదు. ఆ కుటుంబానికి జరిగింది అన్యాయమే. వారికి నష్టపరిహారం ఎలా చెల్లిస్తారు అన్నది మా శాఖ ఉన్నతాధికారులు విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటారు'' అని చెప్పారు.

ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు గంటల వ్యవధిలో మృతి చెందడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. మొత్తం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించినట్టు కమిషన్ పీఆర్‌ఓ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు సూచించడానికి ఓ కమిటీని నియమించింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, జాయింట్ డైరెక్టర్ (మాతా-శిశు ఆరోగ్యం) డాక్టర్ సుధీర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ తుకారామ్ , డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి. రవిబాబు సభ్యులుగా ఓ ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ బృందం పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక సమర్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)