'అగధ' రివ్యూ: క్షుద్ర గ్రహణం రాత్రి ఏం జరిగింది ?

అగధ సినిమా రివ్యూ, ఎంఎస్ రాజు

ఫొటో సోర్స్, X/MSraju

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

నిర్మాతగా మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం లాంటి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించిన ఎంఎస్ రాజు.. దర్శకుడిగా యువ నటీనటులతో వినూత్నమైన కథలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సూపర్ నేచురల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా 'అగధ' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అది బస్తర్ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతం. క్షుద్ర గ్రహణం రాత్రి మహిమ (ఉల్కా గుప్తా)ను ఓ నలుగురు దుండగులు అడవిలో వెంబడిస్తారు.

వాళ్ల నుంచి తప్పించుకున్న మహిమ కొన్నాళ్లకు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది.

అంతకుముందు అదే కుటుంబంలో వరుసగా కొన్ని ఆత్మహత్యలు చోటుచేసుకుంటాయి. మహిమ చావు వెనుక ఏదో దుష్టశక్తి ఉందని గ్రహిస్తుంది మహాదేవి (కామాక్షి బస్కర్ల).

ఇంతకీ ఈ మహాదేవి ఎవరు? తనకున్న ప్రత్యేకమైన శక్తులు ఏమిటి? మహిమ చావు వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనేది మిగతా కథ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అగధ సినిమా రివ్యూ, ఎంఎస్ రాజు

ఫొటో సోర్స్, YT/Sri Adi Varaha Productions

పాయింట్ పాతదే కానీ..

'దుష్టశక్తులు, దైవ శక్తులు' నేపథ్యంగా బోలెడు కథలు వచ్చాయి. ఓ చెడు శక్తి సమాజానికి కీడు తలపెట్టాలని చూస్తుంది. దానికి 'దైవశక్తి' అడ్డుకట్ట వేస్తుంది. అగధ పాయింట్ కూడా అదే.

కాకపోతే, దర్శకుడు ఈ కథ చెప్పడానికి ఎంచుకున్న ప్రజెంటేషన్ కొత్తగా ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ అడవిలో కథ ఓపెన్ చేయడం, అంతుచిక్కని చీకటి గుహ, వరుసగా చావులు, మహాదేవి పాత్ర నిర్మాణం.. ఇవన్నీ కూడా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ అనుభూతిని ఇస్తాయి.

తొలి సగంలో దర్శకుడు ఎంచుకున్న సన్నివేశాలు కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. గర్భిణి ఆత్మహత్య, అదే ఇంట్లో మరో ఆమ్మాయికి ఆత్మ ఆవహించడం, మహాదేవి ఆత్మలతో మాట్లాడటం.. కథ ఓపెనింగ్‌లో చూపించిన చీకటి గుహ.. ఇవన్నీ తొలి సగంలో సస్పెన్స్‌ను కొనసాగిస్తూ ముందుకు వెళ్తాయి. విరామానికి ముందు వచ్చే ఘట్టంలో 'సూపర్ నేచురల్ హారర్' అంశాలు బలంగా కుదిరాయి.

అగధ సినిమా రివ్యూ, ఎంఎస్ రాజు

ఫొటో సోర్స్, YT/Sri Adi Varaha Productions

గుహ గుట్టు ఏమిటి?

సస్పెన్స్ కథలతో ఓ సమస్య ఉంటుంది. ఎంతసేపు సస్పెన్స్‌లో పెట్టినా ప్రేక్షకులు భరిస్తారు. కాకపోతే ఆ సస్పెన్స్‌లో బలం ఉండాలి. సస్పెన్స్ వీడాక కూడా కథను క్లైమాక్స్ వరకూ ఆసక్తిగా నడిపించాలి.

ఈ విషయంలో అగధ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది.

గ్రహణం రోజు రాత్రి గుహలో ఏం జరిగిందనేది మొదటి నుంచి చాలా హైప్ ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే అగధ చుట్టూ చాలా అంచనాలు పెంచారు.

అంతిమంగా ఒక నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పడానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ అంచనాలు పెంచారనే భావన ప్రేక్షకుడిలో కలిగితే తప్పు కాదు.

అగధ సినిమా రివ్యూ, ఎంఎస్ రాజు

ఫొటో సోర్స్, YT/Sri Adi Varaha Productions

అగధ, మహాదేవి మధ్య జరిగే సంఘర్షణలో సన్నివేశాల బలం కనిపించలేదు. చివర్లో మాటలకే పరిమితమైన వైఖరి కనిపిస్తుంది.

దర్శకుడు అగధను ఒక నెగిటివ్ ఎనర్జీగా ట్రీట్ చేశాడు. అది తప్పుకాదు. కాకపోతే దాని చుట్టూ ఉండే డ్రామా, అది కలిగించే నష్టం, వినాశనం ప్రేక్షకుడు ఫీల్ అవ్వగలిగేలా చేయడంలో ఇంకా కసరత్తు చేయాల్సింది.

కామాక్షి చేసిన మహాదేవి పాత్ర ఈ కథకు ప్రధాన బలం. దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉన్నప్పటికీ కథలో కుదిరాయి. కామాక్షి అదే తీవ్రతతో నటించింది. మొదటి నుంచి చివరి దాకా తన పాత్రలో లీనమైంది.

మహిమ పాత్రలో చేసిన ఉల్కా గుప్తా నటన మెప్పిస్తుంది. గుహలో తను ఏం చూసిందనే సస్పెన్స్ ఫస్ట్ హాఫ్‌ను బలంగా ఉంచింది.

సింహా పాత్రలో చేసిన శ్రవణ్ రెడ్డిది ప్రతినాయకుడి పాత్ర. సెకండాఫ్‌లో మంచి ట్విస్ట్ కూడా ఉంది. అగధ ఆవహించే ఆ పాత్రలో తన నటన కొన్ని చోట్ల భయపెట్టగలిగింది. భానుచందర్ పాత్ర అంత ప్రభావవంతంగా అనిపించదు. హరిణి పాత్రలో చేసిన జోవిక నటన హారర్ టచ్ ఇచ్చింది.

అగధ సినిమా రివ్యూ, ఎంఎస్ రాజు

ఫొటో సోర్స్, X/MSraju

కొత్తదనం తెచ్చిన నేపథ్యం

అడవి నేపథ్యం తీసుకోవడం ఓ కొత్తదనం తెచ్చింది. బస్తర్, సాలూరు, ఛత్తీస్‌గఢ్.. ప్రాంతాలను తలపించే ప్రదేశాల్లో చిత్రీకరించడం కథకు ప్రామాణికత తీసుకొచ్చాయి. పాటలు లేకపోవడం కలిసొచ్చింది. నేపథ్య సంగీతం కూడా ఈ జానర్‌కు తగ్గట్టుగా కుదిరింది.

అలాగే కెమెరా పనితనం కూడా సస్పెన్స్ హారర్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. సీజీ వర్క్‌లో మరింత నాణ్యత ఉండాల్సింది.

ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్స్‌లో అగధ ప్రత్యేకంగానే కనిపిస్తుంది. కాకపోతే తొలి సగంలో ఉన్న సస్పెన్స్ రెండో సగంలో కొనసాగి ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉండేది.

గమనిక: సినిమాలో బ్లాక్ మ్యాజిక్‌కు సంబంధించిన అంశాలను నిజమైన శక్తులుగానే చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ఇవి కథలో భాగంగా తీసుకున్న కల్పిత అంశాలు మాత్రమే. ఇలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు తమ విచక్షణతో చూడాల్సి ఉంటుంది.

(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)