‘‘బందిపోట్లకు ఉరిశిక్ష పడితే నా ప్రాణాలు పణంగాపెట్టి వారిని కాపాడతా’’ అని జేపీ ఎందుకన్నారు?

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 10 నిమిషాలు

1960లో చంబల్ బందిపోట్లు లొంగిపోవడం ప్రారంభమైంది. ప్రసిద్ధ చంబల్ బందిపోటు మాన్‌సింగ్ కొడుకైన తహసీల్దార్ సింగ్ నైని జైలులోని తన గది నుంచి సర్వోదయ నాయకుడు వినోబా భావేకు ఒక లేఖ రాశారు.

తహసీల్దార్ సింగ్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆయన చంబల్ తిరుగుబాటుదారుల సమస్యల గురించి చర్చించడానికి వినోబాను కలవాలనుకున్నారు.

చంబల్ నది లోయల్లో యాక్టివ్‌గా ఉండే ఈ వ్యక్తులు 'బందిపోట్లు' అనే పదాన్ని ఇష్టపడలేదు. దానికి బదులుగా తమను తాము వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తిరుగుబాటుదారులుగా అభివర్ణించుకున్నారు.

చంబల్ లోయలు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అనే మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ లోయలలోని భూభాగం ఎంత ఎగుడుదిగుడుగా ఉంటుందంటే, పది నుంచి ఇరవై మీటర్లకు మించి ఏమీ కనిపించదు.

ఆ సమయంలో వినోబా భావే కశ్మీర్‌లో పాదయాత్రలో ఉన్నప్పటికీ, తహసీల్దార్ సింగ్ రాసిన లేఖ ఆయన్ను చంబల్ లోయలకు వచ్చేలా ప్రేరేపించింది.

జేపీని కలవాలని సూచన

1960 మేలో ఆయన చంబల్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ యాత్రలో రిటైర్డ్ మేజర్ జనరల్ యదునాథ్ సింగ్ ఆయనతోపాటు వెళ్లారు. వినోబా భావే చేసిన ప్రయత్నాల వల్ల 20 మంది బందిపోట్లు ఆయనకు లొంగిపోయారు. వారు న్యాయస్థానాలు విధించే శిక్షను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు.

వారి శిక్షాకాలం పూర్తయ్యాక వ్యవసాయం చేసుకుంటూ నేరరహిత జీవితం గడపడానికి వీలుగా భూదాన్ ద్వారా పొందిన భూమిని వారికి ఇచ్చారు. కానీ ఈ చర్యలో ఎదురైన పరిపాలన, న్యాయపరమైన అడ్డంకులు ఇతర బందిపోట్లు తమ ఆయుధాలను విడిచిపెట్టకుండా నిరోధించాయి. ఫలితంగా తర్వాత 11 సంవత్సరాల పాటు ఒక్క బందిపోటు కూడా లొంగిపోలేదు.

1971లో చంబల్‌కు చెందిన ప్రసిద్ధ బందిపోటు మాధో సింగ్ తన ప్రతినిధి జగ్‌రూప్‌ సింగ్‌ను, వినోబా భావేను కలవడానికి పంపారు. చంబల్‌కు తిరిగి వెళ్లి బందిపోట్లను తమ ఆయుధాలను అప్పగించేలా ఒత్తిడి చేయడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆయనను అభ్యర్థించారు.

ప్రభాష్ జోషి, అనుపమ్ మిశ్రా, శ్రవణ్ కుమార్ గార్గ్ వారి 'చంబల్‌కి గన్స్, గాంధీ కే చరణ్ మే' పుస్తకంలో ఇలా రాశారు.

"వినోబా ఆ రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అందుకే ఆయన ఈ విషయంలో తన అశక్తతను వ్యక్తం చేశారు. అయితే జయప్రకాశ్ నారాయణ్‌ను కలవమని జగ్‌రూప్ సింగ్‌కు సలహా ఇచ్చారు"

"అప్పుడు మాధో సింగ్ కాంట్రాక్టర్ వేషంలో జయప్రకాశ్ నారాయణ్‌ను పట్నాలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఆయన జయప్రకాశ్ నారాయణ్ సహాయకుడు సచ్చిదా బాబుకి తన పేరు రామ్ సింగ్ అని చెప్పారు"

జేపీతో మాధో సింగ్ సమావేశం

జయప్రకాశ్ నారాయణ్‌ను మాధో సింగ్ కలిశారు.

"చంబల్ తిరుగుబాటుదారులు లొంగిపోవాలనుకుంటున్నారనే సందేశాన్ని నేను వారి నుంచి తెచ్చాను. వినోబా భావే నన్ను మీ వద్దకు పంపారు" అని ఆయనతో చెప్పారు.

మధ్యప్రదేశ్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసిన డాక్టర్ రణ్‌ధీర్ సింగ్ రుహల్ తన 'చంబల్ కే బాఘీ' అనే పుస్తకంలో ఇలా రాశారు.

"జయప్రకాశ్ నారాయణ్ ఒక నిమిషంపాటు మౌనంగా ఉండి ఆ తర్వాత, 'నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. పైగా బంగ్లాదేశ్ బాధ్యత కూడా నాపై ఉంది'' అని అన్నారు.

ప్రతికూల సమాధానం విన్న రామ్‌సింగ్ తన అసలు పేరు చెప్పి "బాబూజీ, నేను మాధో సింగ్‌ని. నేనే స్వయంగా మీ పాదాల చెంతకు వచ్చాను. మీరు చంబల్ లోయ పని చేపడితే, ముఠాలన్నింటినీ లొంగిపోయేలా చేసే బాధ్యత నేను తీసుకుంటాను" అని అన్నారు.

అప్పుడు జేపీ "మాధో సింగ్, నువ్వు స్వయంగా నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను ఈ దిశగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. నువ్వు నా ఆశ్రమంలో ఉన్నంత కాలం దాని గురించి ఆలోచిస్తాను" అని మాధో సింగ్‌తో చెప్పారు.

మాధో సింగ్ శేఖోదేవర ఆశ్రమంలో ఒక నెలపాటు బస చేశారు. ఆయన మాధో సింగే అని జయప్రకాశ్ నారాయణ్ నిర్ధరించుకున్న తర్వాత చంబల్ లోయలోని బందిపోట్లు లొంగుబాటు బాధ్యతను ఆయన స్వయంగా చేపట్టారు.

ఆ సమయంలో చంబల్ లోయలో ఇద్దరు బందిపోట్లపై అత్యధిక బహుమతి ఉండేది. వారిలో ఒకరు మోహర్ సింగ్. ఆయనపైపై రెండు లక్షల రూపాయల బహుమతి ఉండేది. ఆయనపైన, ఆయన ముఠాపైనా 80 హత్యలు, 350 దోపిడీల ఆరోపణలు ఉండేవి.

ఆయన ముఠాకు, పోలీసులకు మధ్య 76 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వారు ప్రతిసారీ తప్పించుకున్నారు. మాధో సింగ్‌పై లక్షా 5వేల రూపాయల రివార్డు ఉంది. ఆయన 23 హత్యలు, 500 కిడ్నాప్‌ల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు.

చంబల్ లోయల్లోకి రావడానికి ముందు ఆయన సైన్యంలోని రాజ్‌పుతానా రైఫిల్స్‌లో ఒక సంవత్సరం పాటు నర్సుగా పనిచేశారు.

ఆపరేషన్ పెర్సుయేషన్‌

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులకు జేపీ లేఖలు రాశారు. ఆయన తన సహచరులైన మహావీర్ భాయ్, హేమ్‌దేవ్ శర్మలకు ఈ బాధ్యతలు అప్పగించారు.

ముఖ్యమంత్రుల నుంచి ప్రోత్సాహకరమైన స్పందనలు రావడంతో 1971 డిసెంబర్ 13న బందిపోట్లకు ఒక విజ్ఞప్తి చేశారు. వారు సాధారణ జీవితం గడపడానికి వీలుగా తమ ఆయుధాలను వదిలివేయాలని ఆయన వారికి సలహా ఇచ్చారు.

జేపీ, మాధో సింగ్‌ల విజ్ఞప్తి ఉన్న కరపత్రాలను చంబల్ లోయ అంతటా పంపిణీ చేశారు. ఆ తర్వాత, బందిపోట్లను తమ డిమాండ్లను అంగీకరించేలా ఒప్పించడానికి తదుపరి ఆరు నెలల పాటు 'ఆపరేషన్ పెర్సుయేషన్' కొనసాగింది.

మాధో సింగ్ చంబల్ ప్రాంతానికి చేరుకుని తన కనుసన్నల్లో ఉన్న బందిపోటు ముఠాలకు జేపీ సందేశాన్ని చేరవేశారు. సర్వోదయ కార్యకర్తలు, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన 'చంబల్ వ్యాలీ పీస్ మిషన్' బృందం మాధో సింగ్ ప్రభావానికి వెలుపల ఉన్న బందిపోట్లను సంప్రదించడానికి బయలుదేరింది.

చంబల్ ముఠాలు, అక్కడి సమాజం గురించి అంతర్గత సమాచారం తెలిసిన మాజీ బందిపోటు లోక్‌మాన్ శర్మ, తహసీల్దార్ సింగ్ బందిపోట్లతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో చాలా ఉపయోగపడ్డారు.

బందిపోటు జీవితం నుంచి బయటపడటానికి ఇది ఒక మంచి అవకాశమనీ, ఉరిశిక్ష ఉండదనీ, శిక్ష అనుభవించిన తర్వాత వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళవచ్చని వారు బందిపోట్లకు వివరించారు.

"విచారణలన్నీ ఒకేచోట జరగాలనేది బందిపోట్లు విధించిన షరతు. దీని ప్రకారం గ్వాలియర్‌లోని సెంట్రల్ జైలులో ఉన్న ఒక ప్రత్యేక కోర్టులో అన్ని విచారణలు జరిగాయి. వాటి తీర్పులు కూడా నాలుగు సంవత్సరాలలోపే వెలువడ్డాయి" అని డాక్టర్ రణధీర్ సింగ్ రుహల్ రాశారు.

''ఎవరికీ మరణశిక్ష విధించకూడదు. వారిని బహిరంగ జైలులో ఉంచాలి. వారి చేతులకు సంకెళ్లు వేయకూడదు'' అనే షరతులు విధించారు.

ప్రభుత్వ షరతులు

ఈ ఆపరేషన్ గురించి మధ్యప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినప్పుడు మొదట్లో వారి వైఖరి అంత ప్రోత్సాహకరంగా లేదు.

మధ్యప్రదేశ్ పోలీస్ మాజీ డైరెక్టర్ జనరల్ కిర్పాల్ థిల్లాన్ తన ఆత్మకథ 'టైమ్ ప్రెజెంట్ అండ్ టైమ్ పాస్ట్ మెమోయిర్స్ ఆఫ్ ఎ టాప్ కాప్'లో ఇలా రాశారు.

"1971 ప్రారంభంలో ప్రధాన బందిపోటు ముఠాలన్నీ లొంగిపోవాలని నిర్ణయించుకున్నాయని బందిపోటు మాధో సింగ్ నుండి నాకు ఒక సందేశం అందింది. ఆయన అప్పటికే జయప్రకాశ్ నారాయణ్‌తో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను సంప్రదించారు"

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ చంద్ర సేథికి కూడా ఈ విషయం తెలుసు. స్థానిక అధికారులను బందిపోట్లు నమ్మరని, తాము లొంగిపోవడానికి సిద్ధమవుతున్న మోరేనాలో నన్ను నియమించాలని మాధో సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

నేరాలను అరికట్టడానికి 'లొంగిపోవడం' సరైన మార్గం కాదని నేను భావించినందున ఈ ప్రణాళికలో భాగం కావడానికి నిరాకరించాను. అయినప్పటికీ నేను మధ్యప్రదేశ్ ఐజీతో మాట్లాడి మాధో సింగ్ ప్రతినిధికి ఆయనతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాను’’ అని థిల్లాన్ రాశారు.

జయప్రకాశ్ నారాయణ్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఒక లేఖ రాశారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల మధ్య దిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ మూడు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.

బందిపోట్లతో సంప్రదింపులు మొదలయ్యాయి. బందిపోట్లు అక్కడ స్వేచ్ఛగా సంచరించడానికి వీలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని స్వేచ్ఛా మండలంగా ప్రకటించింది. అక్కడ పోలీసు కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ పని కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయలు, నాలుగు తెల్లటి జీపులను అందించింది.

లొంగిపోయిన బందిపోట్లకు భూమి, పరిశ్రమలకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ హాస్టళ్లలో వారి పిల్లలకు విద్యకు హామీ ఇస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం బందిపోట్లను కొన్ని షరతులు నెరవేర్చమని కూడా కోరింది. డాక్టర్ రణధీర్ సింగ్ రుహల్ ఇలా రాశారు.

"తమ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని బందిపోట్లకు చెప్పారు. లొంగిపోయే ముందు దోపిడీ, హత్య వంటి కార్యకలాపాలను వెంటనే ఆపివేయాలి. తమ ఆయుధాలను మరెవరికీ ఇవ్వకూడదు"

లొంగిపోయిన బందిపోట్లకు పూలమాలలు వేయడంగానీ, ఊరేగించడం గానీ జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారి నేరాలను గౌరవిస్తున్నామనే భావన కలిగించే విధంగా లొంగిపోయే సమయంలో ఎలాంటి వేడుక జరగదని కూడా పేర్కొంది.

లొంగిపోయిన ప్రదేశం వద్ద భారీ జనసమూహం

ఏప్రిల్ 11న జేపీ తన భార్య ప్రభాదేవితో కలిసి గ్వాలియర్‌కు బయలుదేరారు. ఆయన బందిపోట్లతో చర్చలు జరిపి లాంఛనంగా లొంగిపోయే ముందు వారికి భరోసా ఇవ్వాలనుకున్నారు.

ఇందుకోసం జౌరాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పగారాను వేదికగా ఎంచుకున్నారు. అక్కడ బందిపోట్లు లొంగిపోయే ముందు సమావేశం కావాల్సి ఉంది. జనసమూహాలకు దూరంగా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడ జయప్రకాశ్ నారాయణ్, ఆయన సహచరులు బస చేసిన ఒక డాక్ బంగ్లా కూడా ఉంది.

ప్రభాస్ జోషి, అనుపమ్ మిశ్రా, శ్రవణ్ కుమార్ గార్గ్ ఇలా రాశారు.

"లొంగిపోయే కార్యక్రమాన్ని బయటకు చెప్పడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. దీనివల్ల బందిపోట్లు హీరోలుగా మారతారనేది వారి ఆలోచన. లొంగిపోయే ముందు మోహర్ సింగ్ జేపీని కలిశారు. ఏమైనా చెప్పాలా అని జేపీ ఆయన్ను అడిగారు. దానికి మోహర్ సింగ్ 'మేము ఇప్పటికే మీ ముందు లొంగిపోయాం.. చెప్పడానికి ఏమీ లేదు'' అని బదులిచ్చారు.

పగారా, ధౌరేరాలో పండుగ వాతావరణంతో జనసమూహం గుమిగూడింది. బందిపోట్లు, వారి బంధువులు, సాధారణ ప్రజలు, సర్వోదయ కార్యకర్తలు అందరూ హాజరయ్యారు. ఏప్రిల్ 14న ప్రధాన కార్యక్రమానికి ముందు పగారాలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక గుడారంలో బందిపోట్లు జేపీ ఎదుట లొంగిపోయారు.

సర్వోదయ మహిళలు ఆయనకు రాఖీలు కట్టారు. వారిని ఉద్దేశించి జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ, "ఎవరికీ మరణశిక్ష విధించరు. ఒకవేళ అలా జరిగితే వారిని కాపాడటానికి నా ప్రాణాలను పణంగా పెడతా" అని అన్నారు.

ఆయుధాలను కింద పెట్టిన బందిపోట్లు

ఏప్రిల్ 14న జరిగిన లొంగిపోయే కార్యక్రమం మోహర్ సింగ్ ముఠాకు చెందిన నారాయణ్ పండిట్ ప్రకటనతో ప్రారంభమైంది. బందిపోట్ల తరపున మాట్లాడుతూ పండిట్ "తిరుగుబాటు సోదరులమైన మా తరపున ప్రజలందరికీ రామ్ రామ్" అని అన్నారు.

మోహర్ సింగ్, సారు సింగ్‌లు మొదటగా వేదికపైకి వచ్చారు. వారు జనసమూహానికి అభివాదం చేసి, మహాత్మా గాంధీ విగ్రహ పాదాల వద్ద తమ ఆయుధాలను ఉంచారు. మోహర్ సింగ్‌ను జేపీ ఆలింగనం చేసుకున్నారు. జేపీ భార్య ప్రభావతి మోహర్ సింగ్‌కు రామాయణ ప్రతులు, వినోబా గీతా ప్రకరణాలను బహూకరించారు.

మొదటి రోజున 82 మంది బందిపోట్లు ఒక్కొక్కరుగా లొంగిపోయారు. ఏప్రిల్ 16వ తేదీన మరో లొంగుబాటు కార్యక్రమం జరిగింది. మాధో సింగ్, మఖన్ సింగ్, జగ్జిత్ సింగ్, రూప్ సింగ్, హర్‌విలాస్ ముఠాలకు చెందిన 81 మంది తిరుగుబాటుదారులు లొంగిపోయారు.

అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి మాధో సింగ్ మాట్లాడుతూ ‘‘నా తప్పులకు మీ మధ్య క్షమాపణ చెప్పే అవకాశం లభించడం నా గొప్ప అదృష్టం’’ అని అన్నారు.

మాధో సింగ్‌ను కలిసిన టైమ్ జర్నలిస్ట్

లొంగిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన ఏకైక అమెరికన్ పాత్రికేయుడు టైమ్ మ్యాగజైన్ విలేఖరి విలియం స్టీవార్ట్.

ఆయన 1972 మే 1వ తేదీన టైమ్ పత్రికలో ఇలా రాశారు.

"పొడుగ్గా ఉండే బందిపోటు మాధో సింగ్‌ను ఒక ఇంటిలోని చిన్న గదిలో మేం కలిశాం. ఆయన పోలీసు యూనిఫాంలో ఉన్నారు. ఆయన దగ్గర ఒక ఆటోమేటిక్ రైఫిల్ ఉంది. ఆయుధాన్ని అప్పగించడానికి ఏమైనా సంకోచం ఉందా అని నేను ఆయన్ను అడిగాను"

ఆయన ఇలా బదులిచ్చారు. 'మరణం ఎదురైనా సరే, మేము ఇచ్చిన మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటాము. కొన్నిసార్లు జైలు గురించి ఆలోచించడానికే మాకు భయంగా ఉంటుంది. కానీ మా నాయకులు కూడా సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారని మేము గుర్తుంచుకుంటాం'

జైలుకు వెళ్తామని భయపడుతున్న తిరుగుబాటుదారులతో "మీరు అద్దె కూడా కట్టనవసరం లేని అద్దె ఇంట్లో నివసిస్తున్నట్టు ఊహించుకోండి" అని తాను చెప్పినట్టు మాధో సింగ్ స్టీవార్ట్‌కు తెలిపారు.

మరుసటి రోజు ఉదయం పదివేల మంది ప్రజల సమక్షంలో మాధో సింగ్ ఒక ఎత్తయిన వేదికపై జయప్రకాశ్ నారాయణ్ ముందు తన ఆయుధాలను కింద పెట్టి అక్కడున్న ప్రజలకు క్షమాపణ చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న పోలీస్ చీఫ్ పాదాలకు నమస్కరించారు. సాయంత్రానికల్లా 167 మంది బందిపోట్లు లొంగిపోయారు.

'ప్రతి ఒక్కరూ నా పిల్లల లాంటివారే' అని జయప్రకాశ్ నారాయణ్ టైమ్ మ్యాగజైన్ విలేఖరికి చెప్పారు.

స్వల్పకాల శిక్షల తర్వాత బందిపోట్లు విడుదల

ఈ వేడుక గురించి మధ్యప్రదేశ్ మాజీ పోలీస్ చీఫ్ కిర్పాల్ ధిల్లాన్ ఆత్మకథలో మరో విధంగా వివరించారు.

"వేడుక సమయంలో బందిపోట్లు విచిత్రమైన దుస్తులు ధరించి ఉన్నారు. ఆయుధాలను తలలపైన పట్టుకుని దుర్గామాత, మహాత్మా గాంధీ పేరుతో నినాదాలు చేస్తున్నారు. వారు మహాత్మా గాంధీ పెద్ద చిత్రపటం ముందు తమ ఆయుధాలను కింద పెట్టారు" అని రాశారు.

అక్కడ ఉన్న ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు లొంగిపోయిన ఒప్పందంలోని షరతుల ప్రకారం ఈ బందిపోట్లపై విచారణ జరిపారు. కొన్ని రోజుల తర్వాత వారిలో చాలామంది స్వల్పకాల శిక్షలు అనుభవించి జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం 66 మంది తిరుగుబాటుదారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వారిలో కొందరు తమ శిక్షలపై హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీల్ చేసుకున్నారు.

గ్వాలియర్, సాగర్‌లో మొదటి విచారణ తర్వాత 45 మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. విచారణల వేగాన్ని ఈ వాస్తవం ద్వారా అంచనా వేయవచ్చు. అక్టోబర్ 1973 నాటికి గ్వాలియర్‌లో కోర్టుకు సమర్పించిన 435 కేసులలో 345 కేసులు, సాగర్‌లో సమర్పించిన 211 కేసులలో 115 కేసులు పరిష్కారమయ్యాయి.

1983 నాటికి లొంగిపోయిన బందిపోట్లందరూ జైలు నుండి విడుదలయ్యారు. మోహర్ సింగ్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారుగానీ 8 సంవత్సరాల తరువాత 1980లో ఆయన విడుదలయ్యారు. విడుదలైన తర్వాత మాధో సింగ్ ఇంద్రజాల ప్రదర్శనలు చేయడం ప్రారంభించి ఈ వృత్తిలో బాగా ప్రాచుర్యం పొందారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)