You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘శిథిలాల కింద నుంచి నా కొడుకు ఏడుపు వినిపిస్తోంది’, ఓ తల్లి ఆవేదన
- రచయిత, వానిస్సా సిల్వా
- హోదా, లా గువైరా నుంచి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
వెనెజ్వెలాను రెండు భారీ భూకంపాలు అతలాకుతలం చేసినప్పుడు, ఆండ్రీనా వాలెరియో అనే మహిళ ఆఫీసు నుంచి తన రెండేళ్ల కొడుకు శాంటియాగో కోసం పరుగు పరుగున వెళ్లారు.
ఆ సమయంలో లా గువైరాలోని ఆండ్రీనా అత్తవారింట్లో, ఆమె పార్ట్‌నర్ రామ్సెస్ మెండోజాతో ఆ బాబు ఉన్నాడు.
కానీ, ఆమె అక్కడకు చేరుకునే సరికి ఆ అపార్ట్‌మెంట్ భవనం పూర్తిగా కూలిపోయి శిథిలాల దిబ్బలా మారింది. ఆ శిథిలాల్లో చిక్కుకుపోయిన తమ వారి కోసం అప్పటికే ఆమె బావ శామ్యూల్ మెండోజా వెతుకుతున్నారు.
అదే భవనం వద్ద శనివారం నేను ఆండ్రీనాను కలిశాను. తన కొడుకు శాంటియాగో, పార్ట్‌నర్ రామ్సెస్‌తో పాటు అతని తల్లిదండ్రులు, సోదరి, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఆ శిథిలాల కిందే చిక్కుకుపోయారని ఆమె చెప్పారు. అయినా, తమ వాళ్లు జీవించే ఉంటారనే ఆశను ఆమె కోల్పోలేదు.
ఎల్ సాల్వడార్, స్పెయిన్ దేశాల నుంచి రెస్క్యూ టీమ్‌లు శనివారమే అక్కడకు చేరుకున్నాయి.
కానీ, ఆ బృందాలకు ఆ భవనం లోపలికి వెళ్లడం సాధ్యం కాలేదు. అప్పటివరకు ఆ భవనం శిథిలాల నుంచి ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు.
భూకంపం వచ్చిన తర్వాతి రోజు ఆండ్రీనా అక్కడకు వెళ్లినప్పుడు, ఆమెకు ఒక చిన్న బాబు ఏడుపు వినిపించింది.
''నా కొడుకు బతికే ఉన్నాడనే నమ్మకం నాకుంది. ఆ ఏడుపు నా కొడుకుదే అని నా మనసు చెబుతోంది. వాడితో పాటు నా కుటుంబం కూడా కచ్చితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడుతుంది'' అని ఆండ్రీనా నమ్మకంగా చెప్పారు.
చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న కుటుంబాలు
వెనెజ్వెలాలో సంభవించిన ఈ భూకంపాల కారణంగా దేశవ్యాప్తంగా వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఆండ్రీనా, శామ్యూల్ తరహాలోనే వేలాది మంది వెనెజ్వెలా ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం వెతుకుతున్నారు.
భూకంపం వల్ల అత్యంత దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తీరప్రాంతమైన లా గువైరా ఒకటి. ఇక్కడి ప్రజలు తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తూ తమ వారి కోసం గాలిస్తున్నారు.
నేను మాట్లాడిన బాధితులంతా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం అరిచి అరిచి వారి గొంతులు బొంగురుపోయాయి.
దేశవ్యాప్తంగా బాధితులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. కానీ, ఇలాంటి విపత్తును తట్టుకునేందుకు వెనెజ్వెలా సన్నద్ధంగా లేనట్లుగానే కనిపిస్తోంది. నిజానికి ఈ దేశం ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటూనే ఉంది.
మృతదేహాల వాసన
నేను 'హోటల్ ఎడ్వర్డ్' ప్రాంతానికి చేరుకునేసరికి అక్కడ అంతటా మృతదేహాల వాసన వస్తోంది. సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి స్థితిలో శిథిలాల కింద ఉన్నవాళ్లు ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అనిపిస్తోంది.
లా గువైరా పట్టణంలోనే 50కి పైగా దెబ్బతిన్న భవనాలను నేను చూశాను. అధికారిక లెక్కల ప్రకారం, ఈ ప్రాంతంలో 1,400కు పైగా భవనాలు దెబ్బతిన్నాయి.
"గడచిన 123 ఏళ్లలో ఈ దేశం చూసిన అత్యంత దారుణమైన విపత్తు ఇదే" అని వెనెజ్వెలా నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జార్జ్ రోడ్రిగ్జ్ అన్నారు. ప్రస్తుతం అధికారికంగా మరణాల సంఖ్య 1,430కి చేరగా, 3,238 మంది గాయపడ్డారు.
ఇంకా వేలాది మంది ఆచూకీ లేకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారిని కాపాడటానికి రెస్క్యూ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
లా గువైరా వీధుల్లో భారీగా పోలీసు, మిలిటరీ బలగాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు వలంటీర్లు అవసరమైన వారికి మందులు పంచుతున్నారు. నిరాశ్రయులైన వారికి ఇవ్వడం కోసం రోడ్డుపై దుస్తులను కుప్పలుగా పోశారు.
బైక్‌లపై క్షతగాత్రుల తరలింపు
రాత్రి అయ్యేసరికి లా గువైరాలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను వలంటీర్లు కార్లు, వ్యాన్‌లలోకి ఎక్కిస్తున్నారు. ఈ పని చేయడానికి వారి వద్ద ఎలాంటి ప్రత్యేక సామగ్రి, పరికరాలు కూడా లేవు.
దగ్గరలోని ఒక వంతెన కూలిపోవడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పట్టణంలోకి అంబులెన్స్‌లు రాలేకపోయాయి. గాయపడిన వారిని బైక్‌లపై కూర్చోబెట్టుకొని తరలించడాన్ని మా డ్రైవర్ లియో చూశారు.
తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం కోసం బాధితుల బంధువులు రోడ్లపైనే టెంట్లు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడ రోడ్లను మూసివేసి, కూలిపోయిన తమ ఇళ్ల వద్దకు వెళ్లకుండా చేస్తుందోననే భయంతో వాళ్లు అక్కడి నుంచి కదలడం లేదు.
రోగులకు ఫ్రాక్చర్లు
లా గువైరా క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న కారకస్‌లోని ఒక ఆసుపత్రికి నేను వెళ్లాను. అక్కడ 600 మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని, వారిలో ఎక్కువ మందికి ఫ్రాక్చర్స్ అయ్యాయని ఒక డాక్టర్ నాతో చెప్పారు.
భూకంపాన్ని చూసిన చాలా మంది రోగులు తీవ్రమైన ట్రామాకు గురయ్యారని, కొందరు పానిక్ అటాక్స్ బారిన పడుతున్నారని డాక్టర్ తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రి వెలుపల బోర్డుపై మరణించిన వారి పేర్లు, చికిత్స పొందుతున్న వారి వివరాల జాబితాను ఉంచారు. తమ వారి కోసం వెతుకుతున్న ప్రజలు ఆ జాబితాను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.
అదనపు రిపోర్టింగ్: ఇయాన్ ఐక్‌మన్
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)