You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐపీఎల్ -2026 : రాజస్థాన్ పోరు సూపరు, ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు
ఐపీఎల్‌లో లీగ్‌దశ మ్యాచ్‌లు ముగిశాయి. రాజస్థాన్ రాయల్స్ ముంబయి ఇండియన్స్‌ను ఓడించడం ద్వారా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో రాజస్థాన్ పరాజయంపై ఆశలుపెట్టుకున్న పంజాబ్ కింగ్స్ 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వాంఖడే స్టేడియంలో ఆదివారం (మే24న) జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓడించి ప్లే ఆఫ్స్‌లో 4వ జట్టుగా నిలిచింది. గెలిస్తేనే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉండటంతో రాయల్స్ బ్యాట్‌కు గట్టిగానే పనిచెప్పింది.
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, 20 ఓవర్లలో 175 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
రాజస్థాన్ జట్టు కష్టాల్లో పడిన ప్రతిసారి, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆ జట్టును ఆదుకున్నాడు. జట్టు బ్యాటింగ్‌లో తడబడిన సమయంలో 15 బంతుల్లో 32 పరుగులు చేసి, బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. తన ఆల్‌రౌండ్ ఆటతో "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు గెలుచుకుని, జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
ఇక ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం నాడే జరిగిన మరో మ్యాచ్‌లో, దిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 40 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 203 పరుగులు చేయగా, కేకేఆర్ 163 పరుగులకే ఆలౌట్ అయింది.
బ్యాటింగ్‌లో ఇబ్బంది
రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ ఆరంభంలో తడబడింది. సాధారణంగా దూకుడుగా ఆడే వైభవ్ సూర్యవంశీ నెమ్మదిగా ఆడితే యశస్వి జైస్వాల్ ధనాధన్ బ్యాటింగ్‌కు దిగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన జైస్వాల్ ఆఫ్-స్పిన్నర్ విల్ జేక్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. జైస్వాల్ 17 బంతుల్లో 27 పరుగులు చేశాడు. తర్వాతి ఓవర్ తొలి బంతికే వైభవ్ సూర్యవంశీని దీపక్ చాహర్ ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 6 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్, 8 బంతుల్లో 14 పరుగులు చేసి అల్లా ఖజన్‌ఫర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.
పవర్‌ప్లే తర్వాత కూడా జట్టు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయింది. కొందరు ఆటగాళ్లకు మంచి ఆరంభం లభించినప్పటికీ, దాన్ని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. షనక 29 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ధ్రువ్ జూరెల్ 38 పరుగులు, డోనవన్ ఫెరీరా 18 పరుగులు చేసి వరుసగా అవుటయ్యారు. దీంతో రాజస్థాన్ 139/6 స్థితిలో కష్టాల్లో పడింది.
ఈ సమయంలో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జోఫ్రా ఆర్చర్ దూకుడైన ఆటతో జట్టుకు ఆశలు కల్పించాడు. కేవలం 15 బంతుల్లోనే 32 పరుగులు బాదాడు. దీంతో రాజస్థాన్ రన్‌రేట్ ఒక్కసారిగా పెరిగింది.
చివరి దశలో రవీంద్ర జడేజా, నంద్రే బర్గర్ ఇద్దరూ కలిసి 9వ వికెట్‌కు 2 ఓవర్లలో 30 పరుగులు జోడించారు. దాంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ తరఫున దీపక్ చాహల్, శార్దూల్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు.
బౌలింగ్‌లోనూ ఆర్చర్ సూపర్
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్ 4వ బంతికే జోఫ్రా ఆర్చర్ రోహిత్ శర్మను డకౌట్ చేశాడు. మూడో ఓవర్‌లో నమన్ ధీర్ (6 పరుగులు) వికెట్‌ను కూడా పడగొట్టాడు.
నాలుగో ఓవర్‌లో, ర్యాన్ రిక్లెటన్ 12 పరుగుల చేసి నాంట్రే బర్గర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆరో ఓవర్‌లో బ్రిజేష్ శర్మ తిలక్ వర్మను (3 పరుగులు) పెవిలియన్‌కు పంపాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్, పవర్‌ప్లే ముగిసే సమయానికి 49/4 స్కోరుతో కష్టాల్లోపడింది.
అయితే సూర్యకుమార్ యాదవ్, విల్ జేక్స్ అద్భుతంగా ఆడి జట్టును గాడిలో పెట్టరు. ఈ జోడీ 63 పరుగులు చేసింది. 33 పరుగులు చేసిన విల్ జేక్స్, 12వ ఓవర్‌లో యశ్ రాజ్ పుంజా బౌలింగ్‌లో అవుటయ్యాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబయి విజయం వైపు అడుగులు వేసింది. చివరి 5 ఓవర్లలో ముంబై విజయానికి 59 పరుగులు అవసరమయ్యాయి.
అలాంటి కీలక సమయంలో ఆర్చర్ మరోసారి ఆటను రాజస్థాన్ రాయల్స్ వైపు మళ్లించాడు. ఆర్చర్ వేసిన ఒక షార్ట్ బాల్‌కు హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. హార్దిక్ 34 పరుగులు చేశాడు. తర్వాత ముంబయి మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది.
17వ ఓవర్‌లో కార్బిన్ బాష్ (2 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (60 పరుగులు) , దీపక్ చాహర్ (8 పరుగులు) వరుసగా అవుటయ్యారు. చివరికి ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 175 పరుగులకే పరిమితమైంది.
దీంతో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే-ఆఫ్స్‌కు చేరాయి.
ప్లే- ఆఫ్స్ మంగళవారం ప్రారంభమవుతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆర్‌సీబీ, టైటాన్స్ క్వాలిఫయర్ 1లో తలపడతాయి. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్, రాయల్స్ పోటీపడనున్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)