బోరుబావిలో 230 అడుగుల లోతుకు వెళ్లి 5 ఏళ్ల చిన్నారిని కాపాడిన 11 ఏళ్ల అబ్బాయి

అఫ్గానిస్తాన్, బోరుబావుల మరణాలు, చిన్నారులు
ఫొటో క్యాప్షన్, హజ్రత్ 70 మీటర్ల లోతైన బావిలోకి దిగి జైనుల్లాను రక్షించాడు.
    • రచయిత, మమూన్ డురానీ, ఫ్లోరా డ్రూరీ,
    • హోదా, బీబీసీ విజువల్ జర్నలిజం టీమ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే అంశాలున్నాయి.

సుమారు 70 మీటర్ల లోతున్న బావి అడుగున ఓ బాలుడు ముడుచుకుని కూర్చున్నాడు. అతడి పాదాలను నీరు తాకుతోంది. తలపై నీటి చుక్కలు పడుతున్నాయి. చలికి, భయానికి వణికిపోతున్నాడు.

బావి పైభాగంలో కొందరు వ్యక్తులు నిలబడి, సహాయక సిబ్బంది లోపలికి దించిన కెమెరా ద్వారా అందుతున్న దృశ్యాలను తెరపై చూస్తున్నారు. దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లో స్నేహితులతో ఆడుకుంటుండగా ఐదేళ్ల జైనుల్లా ఎండిపోయిన బోరుబావిలో పడిపోయాడు.

ఫుట్‌బాల్ మైదానం వైశాల్యానికి సమానమైన లోతున్న బావిలో పడినప్పటికీ జైనుల్లా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, బావి వ్యాసం కేవలం 30 సెంటీమీటర్లే ఉండటంతో పెద్దవాళ్లు లోపలికి దిగి అతడిని చేరుకోవడం సాధ్యం కాలేదు.

అంతేకాకుండా, తనను పైకి లాగేందుకు కిందికి దించిన తాడును ఎలా కట్టుకోవాలో అర్థం చేసుకునేంత వయసు కూడా జైనుల్లాకు లేదు.

సహాయక బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరో ముగ్గురు అబ్బాయిలను బావిలోకి దించేందుకు ప్రయత్నించినా, చాలా ఇరుకుగా ఉండటంతో వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. తమను పైకి తీసుకురావాలని వేడుకున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అఫ్గానిస్తాన్, బోరుబావుల మరణాలు, చిన్నారులు
ఫొటో క్యాప్షన్, బోరుబావి నుంచి బాలుడిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్న స్థానికులు

ఐదేళ్ల బాలుడిని కాపాడిన 11 ఏళ్ల బాలుడు

ఈ సమయంలో సహాయక సిబ్బంది 11 ఏళ్ల హజ్రత్ ఉమర్ సాయం కోరారు. గతంలోనూ అతడు ఒక గుంతలో చిక్కుకున్న వ్యక్తిని విజయవంతంగా రక్షించే ప్రయత్నంలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతుంటారు.

అక్కడున్న పెద్దలు బావిలోకి దిగవద్దని హెచ్చరించినప్పటికీ, మామ అనుమతితో హజ్రత్ అందుకు అంగీకరించాడు.

మొదటి ప్రయత్నంలో తన చేతులకు తాడు కట్టి బావిలోకి దించినప్పుడు భుజం, తొడ ఇరుక్కుపోయాయని అతడు గుర్తుచేసుకున్నాడు.

"నొప్పిగా ఉందని నేను అరిచా. వాళ్లు నన్ను తిరిగి పైకి లాగారు" అని చెప్పాడు.

మరోసారి ప్రయత్నించగా ఈసారి బావి అడుగుకు చేరుకోగలిగాడు.

బయట వందలమంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరకు బావి చుట్టూ ఉన్న వ్యక్తులు తాడును మెల్ల మెల్లగా పైకి లాగారు. అలా ఇద్దరు అబ్బాయిలను బయటకు తీసుకువచ్చారు.

అఫ్గానిస్తాన్, బోరుబావుల మరణాలు, చిన్నారులు
ఫొటో క్యాప్షన్, మరో బాలుడితో హజ్రత్

నీటి కొరతతో పెరుగుతున్న లోతైన బావులు

నీటి కోసం సాగుతున్న తీవ్ర అన్వేషణ అఫ్గానిస్తాన్‌లో లక్షలాది లోతైన, ఇరుకైన, బావుల తవ్వకానికి దారితీసింది. దీంతో వ్యవసాయ భూములు ప్రాణాంతకమైన ప్రమాదా కేంద్రాలుగా మారుతున్నాయి.

జైనుల్లా పడిపోయిన బావి రెండేళ్ల కిందటే ఎండిపోయింది. దాన్ని తవ్విన స్థానిక రైతులు బావి పైభాగాన్ని చెక్క దుంగలు, మట్టితో మూసివేశారు. అయితే కాలక్రమేణా చెక్క కుళ్లిపోవడంతో పాటు మట్టి కూడా వదులైంది.

గత ఐదేళ్లలో నీటిని పూర్తిగా తోడేసిన తర్వాత సరిగ్గా మూసివేయని బావుల్లో జైనుల్లా వంటి వందలాది మంది అఫ్గాన్లు పడిపోయారని సహాయక సిబ్బంది చెబుతున్నారు.

ఇలాంటి ఘటనలు 2021 నుంచి 100కు పైగా జరిగినట్లు బీబీసీ నిర్ధరించింది. వీటిలో అత్యధికం దేశ దక్షిణ ప్రాంతాల్లోనే జరిగాయి. బాధితుల్లో ఎక్కువమంది పదేళ్లలోపు పిల్లలే. వీరిలో దాదాపు సగంమంది ప్రాణాలు కోల్పోయారు.

వదిలేసిన బావుల్లో మనుషులు పడిపోవడం దక్షిణాసియాలో కొత్త విషయం కాదు. 2009 నుంచి 2023 మధ్య భారత్‌లో 40 మందికి పైగా పిల్లలు సరిగా మూసివేయని బావుల్లో పడిపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

అయితే, పలు కారణాల వల్ల అఫ్గానిస్తాన్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందని జర్మనీలో నివసిస్తున్న ఆ దేశ ప్రముఖ జలవనరుల నిపుణుల్లో ఒకరైన నజీబుల్లా సాద్ చెబుతున్నారు.

దాదాపు 20 ఏళ్లపాటు అఫ్గానిస్తాన్‌లో మోహరించిన అమెరికా సైన్యం 2021లో వెనుదిరిగింది. నిర్మాణ రంగం, వాణిజ్యం, విదేశీ సాయంపై ఆధారపడిన దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడి కుప్పకూలింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ సాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు.

ఉద్యోగావకాశాలు తగ్గిపోవడంతో ప్రజలు తిరిగి వ్యవసాయ భూములపై ఆధారపడటం ప్రారంభించారు. గతంలో యుద్ధ ప్రాంతాలుగా ఉన్న ఆ భూములు, యుద్ధం ముప్పు తగ్గడంతో మళ్లీ సాగుకు అనుకూలంగా మారాయి.

వాతావరణ మార్పులు, సుదీర్ఘ కరువుల కారణంగా నీటి కొరత తీవ్రం కావడంతో రైతులు భూగర్భ జలాలపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది.

అఫ్గానిస్తాన్, బోరుబావుల మరణాలు, చిన్నారులు
ఫొటో క్యాప్షన్, కెమెరాను బావిలోకి దింపి మానిటర్ ద్వారా బాలుడి కదలికలను గమనించారు.

పెరుగుతున్న బోరుబావుల సంఖ్య

చైనాలో తయారైన చౌకైన సౌర ఫలకాలు అందుబాటులోకి రావడం పరిస్థితిని మరింత దిగజార్చిందని నజీబుల్లా సాద్ చెబుతున్నారు. వీటి సాయంతో రైతులు "రోజంతా నీటిని తోడగలుగుతున్నారు". ఫలితంగా అఫ్గానిస్తాన్‌లో ప్రమాదకరమైన బావుల సంఖ్య పెరిగింది.

బావుల సంఖ్య 2020 నుంచి గణనీయంగా పెరిగిందని సాద్ తెలిపారు. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఐదు లక్షల బావులు ఉన్నాయి. వీటిలో అత్యధికం హెల్మండ్ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా హెల్మండ్, కాందహార్, ఫరా, ఘజ్నీ ప్రావిన్సుల్లో ఎక్కువ బావులు ఉన్నాయి.

ఈ బావుల్లో పడిపోయినవారిని రక్షించేందుకు అవసరమైన సదుపాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇటువంటి సహాయక చర్యల్లో శిక్షణ పొందిన వలంటీర్లు కేవలం ఐదుగురే ఉన్నారు.

దీంతో దక్షిణ ప్రావిన్స్ హెల్మండ్‌కు చెందిన 28 ఏళ్ల మొబైల్ ఫోన్ విక్రేత మీరాజాన్ అబ్దుల్లా ఈ సమస్యకు తనవంతుగా పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నారు.

2021 ఏప్రిల్‌లో తన గ్రామంలో ఓ వ్యక్తి బావిలో పడిపోయిన ఘటన గురించి తొలిసారి విన్నారు. హెల్మండ్ ప్రావిన్స్‌లోని చాంగిన్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు తెరిచుంచిన బావిలో పడిపోయాడు.

"ఆ బాలుడు ఏడుస్తున్నాడు" అని మీరాజాన్ గుర్తుచేసుకున్నారు.

"నాకు చలిగా ఉంది. ఆకలేస్తోంది. దాహంగా ఉంది. చీకటిగా ఉంది. నన్ను ఇక్కడి నుంచి బయటకు తీయండి" అని అతడు పదేపదే అరుస్తున్నాడని మీరాజాన్ చెప్పారు.

ఆ బాలుడిని రక్షించేందుకు మార్గం కనుగొనడానికి గ్రామస్థులకు 48 గంటలు పట్టింది. అయితే ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే బాలుడు మరణించాడు.

మీరాజాన్ తొలుత దీన్ని ఒక విషాదంగా భావించారు. కానీ ఏడాది తర్వాత హైదర్ అనే మరో బాలుడు బావిలో పడిపోవడంతో, ఇలాంటి లోతైన బావుల్లో చిక్కుకున్న పిల్లలను రక్షించేందుకు ఓ మార్గం అవసరమని గుర్తించారు.

కంప్యూటర్‌కు అనుసంధానించిన కెమెరాతో ఓ పరికరాన్ని రూపొందించారు. దీని ద్వారా బావిలో చిక్కుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడో పైనుంచే గుర్తించవచ్చు. అనంతరం ఆ వ్యక్తి ఉన్న చోటుకే తాడును దించి, దాన్ని పట్టుకుని తనకు తాను కట్టుకున్న తర్వాత పైకి లాగవచ్చు.

ఈ పరికరాన్ని పరీక్షించేందుకు అప్పటికి ఐదేళ్ల వయసున్న తన కుమారుడినే 25 మీటర్ల లోతున్న బావిలోకి దించాడు. ఆ ప్రయత్నం విజయవంతమైంది.

అప్పటి నుంచి గత నాలుగేళ్లలో 113 సహాయక చర్యల్లో పాల్గొన్న మీరాజాన్ దాదాపు 70 మందిని కాపాడాడు.

హెల్మండ్ ప్రావిన్స్‌లో నూర్ ఆఘా అనే ఐదేళ్ల బాలుడు 140 మీటర్ల లోతులో నాలుగు గంటలపాటు చిక్కుకుపోయినప్పుడు కూడా మీరాజాన్ తన పరికరంతో అతనిని రక్షించాడు.

అయితే కొందరిని ప్రాణాలతో కాపాడలేకపోయామని మీరాజాన్ చెబుతున్నారు. వారిలో కొందరు బావుల్లోని నీటిలో మునిగి మరణించారు.

అఫ్గానిస్తాన్‌లోని బావులు ప్రాణాపాయాలను సృష్టించడమే కాకుండా, భూగర్భ జలాలను దీర్ఘకాలం పాటు నిలకడగా వినియోగించడంపైనా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

ఏళ్ల తరబడి కొనసాగుతున్న కరువుల కారణంగా బావులను మరింత లోతుగా తవ్వుతున్నారు. కొన్ని బావులు 80 మీటర్ల లోతు ఉండగా, మరికొన్ని ఏకంగా 200 మీటర్ల లోతు వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)