You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఒపెక్ అంతానికి ఇదే ఆరంభం’- కూటమి నుంచి యూఏఈ వైదొలగడంపై నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే...
చమురు ఉత్పత్తి దేశాల ప్రధాన కూటమి ఒపెక్, ఒపెక్ ప్లస్ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది.
ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చరిత్రాత్మకమైన అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.
ఈ సమయంలో, దాదాపు 60 సంవత్సరాల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం తమ ''దీర్ఘకాలిక వ్యూహాన్ని, ఆర్థిక దృక్పథాన్ని, మారుతున్న శక్తి వనరుల స్వరూపాన్ని'' ప్రతిబింబిస్తుందని యూఏఈ తెలిపింది.
ఈ కూటమి నుంచి ఎటువంటి బాధ్యతలు లేకుండా విముక్తి పొందడం దేశానికి మరింత వెసులుబాటును ఇస్తుందని యూఏఈ ఇంధన మంత్రి సుహైల్ అల్ మజ్రూయి చెప్పారు.
ఒపెక్ ఏర్పాటు
ఒపెక్‌ను 1960లో ఐదు దేశాలు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజ్వెలా కలిసి ప్రారంభించాయి. చమురు ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, సభ్య దేశాలకు స్థిరమైన ఆదాయాన్ని అందించేందుకు ఉత్పత్తిని సమన్వయం చేయాలనే ఉద్దేశ్యంతో ఒపెక్ ఏర్పాటైంది.
కాలక్రమేణా ఈ కూటమిలో సభ్యదేశాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఐదు వ్యవస్థాపక సభ్య దేశాలతో పాటు, అల్జీరియా, ఈక్వెటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు కూడా ఉన్నాయి.
1967లో ఈ కూటమిలో యూఏఈ చేరింది. ఈ దేశం వైదొలుగుతుండటంతో ఇక 11 దేశాలే ఒపెక్ కూటమిలో ఉంటాయి. ఒపెక్ ప్లస్ కూటమిలో రష్యాతో పాటు 10 నాన్-ఒపెక్ సభ్యదేశాలు కూడా ఉన్నాయి.
యూఏఈ వైదొలగడం వల్ల కలిగే ప్రభావం ఏంటి?
యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం ఈ కూటమికి అతిపెద్ద ఎదురుదెబ్బలా కనిపిస్తుంది. ''ఒపెక్ అంతానికి ఇదొక ఆరంభం'' అని ఎంఎస్‌టీ ఫైనాన్సియల్ ఎనర్జీ రీసెర్చ్ హెడ్ సౌల్ కవోనిక్ అన్నారు.
''యూఏఈ వైదొలగడంతో.. ఒపెక్ తన సామర్థ్యంలో సుమారు 15 శాతాన్ని కోల్పోనుంది'' అని చెప్పారు.
ఈ నిర్ణయం ఒపెక్‌కు, అలాగే సౌదీ అరేబియాకు భారీ ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే, ఈ కూటమికి సుప్రీం లీడర్‌గా సౌదీ అరేబియానే భావిస్తారు.
యూఏఈ లాంటి దీర్ఘకాలిక ఒపెక్ సభ్యదేశం వైదొలగడం ఈ కూటమిలో గందరగోళాన్ని సృష్టించి, ఈ గ్రూప్‌ను బలహీనపరుస్తుందని బ్రిటీష్ వార్తా పత్రిక ది గార్డియన్ రిపోర్టు చేసింది.
భౌగోళిక రాజకీయాల నుంచి ఉత్పత్తి కోటాల వరకు ఎన్నో విషయాల్లో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, ఒపెక్ కూటమి మాత్రం కలసికట్టుగా ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది.
''గత కొన్నేళ్లుగా ఉత్పత్తి కోటాలను పట్టించుకోకుండా దాదాపు గరిష్ఠ ఉత్పత్తి విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది యూఏఈ. దీంతో చివరికి, సౌదీ అరేబియానే అసలైన నాయకత్వ ఒపెక్ దేశంగా నిలిచింది'' అని బ్లాక్ గోల్డ్ ఇన్వెస్టర్స్ సీఈవో, ఒపెక్ పరిశీలకులు గ్యారీ రోస్ అన్నారు.
''అదనపు ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న ఏకైక దేశం ఇది. దీనిలో రష్యా భాగం కావడం మంచిది. దీనివల్ల సరఫరాను పెంచే సామర్థ్యంపై దానికి కొంత నియంత్రణ లభిస్తుంది'' అని చెప్పారు.
తాజా ఒపెక్ డేటా ప్రకారం.. యూఏఈ వార్షికంగా 2.9 మిలియన్ బ్యారళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది.
ఒపెక్‌లో సౌదీ అరేబియా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. వార్షికంగా 9 మిలియన్ బ్యారళ్ల చమురును వెలికి తీస్తుంది.
రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టు ప్రకారం, ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఒపెక్ ప్లస్ వాటా ఫిబ్రవరిలో సుమారు 48 శాతం నుంచి మార్చిలో 44 శాతానికి పడిపోయిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది.
ఉత్పత్తి కోతలు మరింత స్పష్టంగా కనిపిస్తుండటంతో... ఏప్రిల్‌లో మరింత దిగజారే అవకాశం ఉందని అంటున్నారు.
''ఒక్కసారి యుద్ధం వాతావరణం చల్లబడి, పరిస్థితి సాధారణ స్థితి వచ్చిన తర్వాత ప్రపంచ మార్కెట్లో యూఏఈ తన వాటాను పెంచుకునేందుకు మార్గం సుగమం అవుతుంది'' అని ఏడీసీబీ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ మోనికా మాలిక్ రాయిటర్స్‌తో అన్నారు.
దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
ట్రంప్ సంతోషిస్తారా?
యూఏఈ ఒపెక్ కూటమి నుంచి వైదొలగడం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విజయంగా చూడొచ్చు. ప్రపంచాన్ని ఒపెక్ దోచుకుంటుందని ట్రంప్ అంతకుముందు ఆరోపించారు.
సౌదీ అరేబియా, ఇతర ఒపెక్ దేశాలు ధరలు తగ్గించాలని జనవరిలో ఆయన పిలుపునిచ్చారు. సుంకాలు విధిస్తానని బెదిరించారు.
మధ్య ప్రాచ్యంలో యుద్ధం వల్ల ఎన్నడూ లేనంతగా చమురు సరఫరాలు పడిపోయాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించిన సమయంలో యూఏఈ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఫలితంగా ఈ ఏడాది ఇంధన ధరలు సగటున సుమారు పావు వంతు పెరిగాయని తెలిపింది. ఇదే సమయంలో కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణా యుద్ధానికి ముందు స్థాయికి తిరిగి రావడానికి ఆరు నెలల వరకు పట్టవచ్చని పేర్కొంది.
''ఆదాయంలో అత్యధిక భాగాన్ని ఆహారం, ఇంధనంపై ఖర్చు చేసే నిరుపేద ప్రజలే ఎక్కువగా ప్రభావితమవుతారు" అని ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త ఇందర్‌మీత్ గిల్ అన్నారు.
హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా, ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం వల్ల ప్రపంచ ఇంధన సరఫరాలపై తక్షణ ప్రభావం పడకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని ఉంటుందని చెప్పారు.
ఈ దేశం తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎక్కువగా పెట్టుబడి పెట్టినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలంలో అత్యంత ఎక్కువగా చమురును ఉత్పత్తి చేయాలనుకుంటోంది యూఏఈ.
ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడంతో రాబోయే దశాబ్దాల్లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని, కానీ మార్కెట్లో అస్థిరత పెరుగుతుందని క్యాపిటల్ ఎకనామిక్స్‌లోని చీఫ్ క్లైమేట్, కమోడిటీ ఎకనామిస్ట్ డేవిడ్ ఆక్స్లీ చెప్పారు.
యూఏఈ చిన్న దేశమైనప్పటికీ.. ఇతర సభ్య దేశాలు కూడా వైదొలిగినా లేదా దాని ఫలితంగా రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించుకున్నా దాని ప్రభావం గణనీయంగా ఉండవచ్చని ఆయన అన్నారు.
యూఏఈ ఈ నిర్ణయం తీసుకునేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ వచ్చిందని అరబ్ ఎనర్జీ క్లబ్ సెక్రటరీ జనరల్, క్రిస్టల్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరోల్ నఖ్లే బీబీసీకి చెప్పారు.
''ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అబుదాబి ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది. కానీ, తరచుగా గ్రూపు కోటాల వల్ల పరిమితులను ఎదుర్కొంది. ముఖ్యంగా కొంతమంది సభ్యదేశాలు ఈ నిబంధనలను సమానంగా పాటించనప్పుడు.." అని ఆయన అన్నారు.
ఒపెక్ సభ్యదేశంగా ఇరాన్ కార్యకలాపాలు యూఏఈ నిర్ణయాన్ని మరింత బలోపేతం చేసి ఉండవచ్చని కూడా నఖ్లే అన్నారు.
''మిగిలిన ఒపెక్ కూటమిని ఐక్యంగా ఉంచడం సౌదీ అరేబియాకు కష్టం కావొచ్చు. అంతర్గత నిబంధనలు పాటించడం, మార్కెట్‌ను నిర్వహించడం ఇప్పుడు మొత్తం ఒకటే తన భుజాలపై మోయాల్సి ఉంటుంది'' అని కవోనిక్ అన్నారు. ఇతర ఒపెక్ సభ్య దేశాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవచ్చన్నారు.
''మధ్యప్రాచ్యం, చమురు మార్కెట్లో ప్రాథమిక భౌగోళిక రాజకీయ మార్కును ఇది ప్రతిబింబిస్తుంది'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)