‘‘మేం బాధపడుతుంటే ప్రపంచం నిద్రపోతోందని పాలస్తీనా పిల్లలు భావించకూడదు’’

ఫొటో సోర్స్, UNHRC
‘‘నివేదికను తయారుచేసేటప్పుడు మీరు ఇజ్రాయెల్ సైనికులతో ఎందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఓ చిన్నారిని చంపడాన్ని గర్వకారణమన్నట్టు వీడియో తీయడం ద్వారా ఇజ్రాయెల్ సైనికులు మాతోనే కాదు, ప్రపంచం మొత్తంతో మాట్లాడారు’’
ఈ వ్యాఖ్యలు ప్రసిద్ధ భారతీయ న్యాయకోవిదుడు, ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్‌వి. ఆయన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ) స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ అధ్యక్షునిగా గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఒక చరిత్రాత్మక నివేదికను సమర్పించారు.
గాజాలోని పాలస్తీనా పిల్లలను ఇజ్రాయెల్ ఓ క్రమపద్ధతిలో ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని ఈ నివేదిక ఆరోపిస్తోంది.
గాజాలోని పాలస్తీనా ప్రజల భవిష్యత్తును, ఉనికిని నాశనం చేయడమే ఈ దాడుల లక్ష్యమని కమిషన్ నిర్ధరించింది. అయితే ఈ నివేదికను ఇజ్రాయెల్ తిరస్కరించింది.


ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలున్నాయి?
ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అనంతరం జస్టిస్ మురళీధర్ తిరిగి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
సుప్రీంకోర్టు ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదా ఇచ్చింది.
మానవ హక్కుల మండలి నవంబరు 2025లో ఒక స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు కమిషన్ అధిపతిగా ఆయనను నియమించింది.
ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, తూర్పు జెరూసలం సహా ఇజ్రాయెల్‌కు సంబంధించి ఈ దర్యాప్తు కమిషన్ నివేదిక అందించింది.
నివేదికకు సంబంధించిన పలు అంశాలపై జస్టిస్ మురళీధర్ బీబీసీ రిపోర్టర్ జుగల్ పురోహిత్‌తో మాట్లాడారు .
తాము బాధపడుతుంటే ప్రపంచం నిద్రపోతోందని పాలస్తీనా పిల్లలు ఎన్నడూ భావించకూడదని ఆయన అంటున్నారు.
పాలస్తీనా సమాజాన్ని పూర్తిగా బలహీనపరచడం ఇజ్రాయెల్ వ్యూహమని జస్టిస్ మురళీధర్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ నిర్బంధ కేంద్రాల్లో పాలస్తీనా పిల్లలపై జరుగుతున్న లైంగిక హింస, ప్రభుత్వ స్థాయిలో ఒక వ్యవస్థీకృత దాడి అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి మద్దతుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేదా ఇజ్రాయెల్‌ను వివరాలు అడిగారా అని మేం ఆయన్ను ప్రశ్నించాం.
"ఖచ్చితంగా, ఖచ్చితంగా. నేను ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఈ నివేదిక మొత్తం ముసాయిదా రూపంలో ఇజ్రాయెల్‌కు పంపించాం. మేం గాజాకు వెళ్లాలనుకుంటున్నామని వారికి చెప్పాం. మేము ఆక్రమిత పాలస్తీనా భూభాగంలోకి వెళ్లాలనుకుంటున్నామని తెలియజేశాం. కానీ వారు స్పందించలేదు" అని ఆయన చెప్పారు.
తమకు అందిన సమాచారానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అధికారుల వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని ఇప్పటికీ సమర్పించవచ్చని మురళీధర్ అంటున్నారు.
వారి తాజా నివేదికలో పాలస్తీనా చిన్నారులపై జరిగిన హింస, నేరాలపై జరిపిన దర్యాప్తు వివరాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ క్షిపణులతో దాడి చేయడంతో ఈ ఘటనలన్నీ ప్రారంభమయ్యాయి. ఈ దాడిలో 1,200 మంది మరణించగా, 250 మందికి పైగా బందీలుగా దొరికిపోయారు.
దీనికి ప్రతిస్పందనగా హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యను ప్రారంభించింది.
అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులలో 21,000 మంది పిల్లలు సహా 73,000 మందికి పైగా మరణించారని హమాస్ నియంత్రణలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి కూడా ఈ గణాంకాలను విశ్వసనీయమైనవిగా పరిగణిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల విషయంలో అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన పాలస్తీనా పిల్లల దృశ్యాలు పదేపదే వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా గాజా నగరంలో జరిగిన ప్రాణనష్టం, శిథిలాలు, గాజా స్వరూపం ఎలా మారిపోయిందో తెలియజేస్తున్నాయి.
''పిల్లల రక్షణ కోసం మూడు అంతర్జాతీయ చట్టాలున్నాయి. వీటిలో ఒకటి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం. ఇందులో సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనతో పాటు, చిన్నారుల హక్కుల పరిరక్షణ కూడా భాగం’’ అని జస్టిస్ మురళీధర్ వివరించారు.
‘‘రెండోది అంతర్జాతీయ మానవతా చట్టం. ఇందులో జెనీవా ఒప్పందం కూడా భాగం. యుద్ధ సమయంలో సంబంధిత దేశాలు ఎలా ప్రవర్తించాలో ఇది వివరిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా తెల్ల జెండా చూపిస్తే, వారిపై కాల్పులు జరపకూడదు’’
అంబులెన్స్‌లపై దాడి చేయకూడదనేది కూడా ఇందులో భాగమే.
‘‘ఇదంతా మానవతా చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఆక్రమణదారుని బాధ్యతలను వివరిస్తుంది’’ అని ఆయన తెలిపారు.
మూడోది అంతర్జాతీయ క్రిమినల్ చట్టం. ఈ మూడు చట్టాలు కూడా చిన్నారులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని స్పష్టంగా పేర్కొంటున్నాయి. పిల్లలను దాడి చేయగలిగిన లక్ష్యాలుగా చట్టం అంగీకరించదు" అని మురళీధర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
నివేదికకు ఆధారాలేంటి?
నివేదిక రూపకల్పనలో కమిషన్ ఏదైనా ప్రత్యేక పద్ధతిని అనుసరించిందా అని బీబీసీ జస్టిస్ మురళీధర్‌ను ప్రశ్నించింది.
''దీని కోసం ఎంతమంది సాక్షులను విచారించారు? గాజాకు నేరుగా వెళ్లలేకపోయారు కాబట్టి మీరు విచారించిన సాక్షులు ఎక్కడివారు?'' అని అడిగింది.
"మీ ప్రశ్న సరైనదే. కానీ కమిషన్ ఒక దర్యాప్తు సంస్థ. అది తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ కాదు. అది నిర్ణయాలు తీసుకోదు. ఏ కథనానికైనా, సంఘటనకైనా ఎప్పుడూ రెండు కోణాలు ఉంటాయి. ఒకటి బాధితుల కోణం. మరొకటి దాడి చేసినవారి కోణం. దర్యాప్తు కోసం అనేక బహిరంగ సమాచార వనరులను ఆధారంగా తీసుకున్నాం"
"బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, చిన్నారులు, అలాగే చికిత్స కోసం గాజా నుంచి బయటకు వెళ్లగలిగిన వారి వ్యక్తిగత వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, పాత్రికేయుల సాక్ష్యాలను సేకరించాం" అని మురళీధర్ చెప్పారు.
గాజాలో ప్రజలకు చికిత్స అందించిన వైద్యులు తమ కళ్లారా చూసినవాటిని కూడా నివేదికకు ఆధారంగా చేసుకున్నామని జస్టిస్ మురళీధర్ అంటున్నారు.
"మేం ఒక్క సమాచార వనరుపై మాత్రమే ఆధారపడలేదు. మా ప్రక్రియను నివేదికలోని ఎనిమిది, పది పేరాల్లో వివరంగా తెలియజేశాం. ఒకే సమాచారాన్ని అనేక విధాలుగా ధృవీకరించుకున్నాం" అని ఆయన వివరించారు.
"ప్రతి ఘటనకు ఒక కాలక్రమం ఉంటుంది. దానికి భౌగోళిక స్థానం, అలాగే ఉపగ్రహ చిత్రాలు కూడా ఉంటాయి. దాని ఆధారంగా మేం ఘటన జరిగిన ప్రదేశాన్ని నిర్ధరిస్తాం. ఇందుకోసం ఘటన జరిగిన సమయంలో ఇజ్రాయెల్ సైనికులు అక్కడ ఉండే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి వారి స్థానాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం" అని న్యాయమూర్తి మురళీధర్ చెప్పారు.
"మా బృందంలో ఆయుధాలు, యుద్ధ సామగ్రి, సైనిక ప్రణాళికలను అధ్యయనం చేసే ఒక సైనిక విశ్లేషకుడు కూడా ఉన్నారు. ఈ కమిషన్‌లో జెండర్ నిపుణులు, ఫోరెన్సిక్ సైబర్ క్రైమ్ నిపుణులతో సహా 12 మంది ఉన్నారు"
చాలా మంది ప్రజలు కమిషన్‌కు వీడియో, ఆడియో క్లిప్‌లు, ఫోటోలను పంపించారని, కమిషన్ విశ్వసనీయమైన, ధృవీకరించదగిన సాక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని ఆయన తెలిపారు.
''అయినప్పటికీ మేం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో, ఇజ్రాయెల్ సైన్యంతో లేదా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడలేదని మీరు అనొచ్చు. కాబట్టి నా సమాధానం ఏంటంటే మేం నివేదికను రూపొందించిన ప్రతిసారీ దానిని ముందుగానే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి పంపుతాం.
నివేదికకు తుది రూపం ఇవ్వకముందే 'మీరు ఇది తప్పుగా చెప్పారు లేదా దీనికి సంబంధించిన ఇతర సాక్ష్యాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది' అని వాళ్లు చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్లు స్పందించలేదు" అని మురళీధర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇజ్రాయెల్ సైన్యమే తామేం చేసిందో ప్రపంచానికి చెప్పింది'
తాను ఆ ముసాయిదాను పాలస్తీనా అధికారులకు కూడా పంపానని, వారి వ్యాఖ్యల తర్వాత నివేదికలో కొన్ని అంశాలు సవరించామని జస్టిస్ మురళీధర్ అన్నారు.
"అంతే కాకుండా నివేదికను సిద్ధం చేస్తున్నప్పుడు కమిషన్ ఛైర్మన్‌గా నేనే స్వయంగా ఇజ్రాయెల్ అధికారులకు 'మేము మిమ్మల్ని, మీ ప్రజలను కలవాలనుకుంటున్నాం. గాజాకు వెళ్లాలనుకుంటున్నాం' అని ఒక లేఖ పంపాను, కానీ వారు స్పందించలేదు," అని ఆయన అన్నారు.
"ఇజ్రాయెల్ సైనికులే సొంతంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 16 ఏళ్ల బాలుడిని చంపినట్టు సైనికుల్లో ఒకరు చెప్పారు. ఆ వీడియోలో ఆ సైనికుడే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రజలు కూడా అది చూడొచ్చు’’ అని మురళీధర్ చెప్పారు.
‘‘మేం ఇజ్రాయెల్ సైన్యంతో మాట్లాడలేదని చాలా మంది అంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక పసిబిడ్డను చంపామని గర్వంగా చెబుతూ ప్రపంచమంతటితోనూ మాట్లాడింది'' అని మురళీధర్ వివరించారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ నిస్సిమ్ వటూరి చేసిన ఓ పోస్టును ఈ నివేదిక ప్రస్తావించింది. అక్టోబరు 7వ తేదీ ఘటన తర్వాత అక్టోబరు 9న సోషల్ మీడియాలో ఆయన ఈ పోస్టు చేశారు.
"గాజాను నాశనం చేయండి. మరేదీ మాకు సంతృప్తినివ్వదు. అక్కడ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకూడదు. చివరగా మిగిలిన ప్రజలందరినీ తరిమివేయండి. తద్వారా వారు మళ్లీ కోలుకోకుండా చేయాలి అని ఆయన ఆ పోస్టులో రాశారు" అని మురళీధర్ చెప్పారు.
" జనవరి 30, 2025న ఆయన మళ్ళీ 'గాజా ఉగ్రవాదులతో నిండి ఉంది, అక్కడ పుట్టిన ప్రతి బిడ్డ పుట్టుకతోనే ఉగ్రవాది' అన్నారు. ఇతర రాజకీయ నాయకులపై వారి అభిప్రాయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఇంటర్నెట్‌లో చూడవచ్చు. వాటిని ఎవరూ ఖండించలేదు'' అని ఆయన తెలిపారు.
"ఇజ్రాయెల్ అధికారులు మా నివేదికకు 18 పేజీల ఖండనను సిద్ధం చేసి ప్రజల్లో పంపిణీ చేశారు. వారు దానిని మాకు పంపించకుండానే మాపై 'వివక్ష, పక్షపాతం' ఆరోపణలు చేశారు. మా నివేదిక తప్పు అని నిరూపించే ఏవైనా ఆధారాలు ఇజ్రాయెల్ వద్ద ఉంటే, వారు వాటిని ఇప్పటికీ సమర్పించవచ్చు" అని మురళీధర్ బీబీసీతో వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























