నీట్ యూజీ పరీక్షను రద్దు చేసిన ఎన్‌టీఏ.. ‘పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు’ అని రాహుల్ గాంధీ ఎందుకన్నారు?

చదివే సమయం: 5 నిమిషాలు

పేపర్ లీకైందని వస్తున్న వార్తల నేపథ్యంలో నీట్ (యూజీ)-2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రద్దు చేసింది.

మే 3న నిర్వహించిన ఈ పరీక్షను కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రద్దు చేసినట్లు ఎన్‌టీఏ పేర్కొంది.

ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనుంది.

రాజస్థాన్‌లో పేపర్ లీకేజ్‌కు సంబంధించి మే 10న వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంబీబీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (యూజీ) పరీక్షకు ఈసారి సుమారు 22 లక్షల మంది హాజరయ్యారు.

ఈ పరీక్ష రద్దయిన నేపథ్యంలో వారంతా మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే, దీనికోసం ఎటువంటి అదనపు రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.

నీట్ (యూజీ) పరీక్ష రద్దు కావడంపై మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

''ఇదెంత మాత్రం పరీక్ష కాదు, నీట్ ఇప్పుడొక వేలంపాటగా మారిపోయింది'' అని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

నీట్ పరీక్ష రద్దు కావడంపై విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ దిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించింది.

''దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు. ఎంతో కష్టపడి చదివి పరీక్షకు సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తును కేవలం ఐదు వేల రూపాయలకు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో అమ్మేశారు'' అని ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖడ్ ఆరోపించారు.

''పేపర్ లీక్ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇలా పేపర్ లీక్‌లు జరుగుతూ ఉన్నాయంటే, పరీక్షల నిర్వహణలో మోదీ ప్రభుత్వం, ఎన్‌టీఏ సమర్థంగా వ్యవహరించలేదనేదీ ఇది స్పష్టం చేస్తోంది'' అని అన్నారు.

ఎన్‌టీఏ ఏం చెబుతోంది?

దేశంలోని మెడికల్ కాలేజీలలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులలో ప్రవేశం కోసం 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' (నీట్) పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తుంది.

''ఈ వ్యవహారం (పేపర్ లీక్)పై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దర్యాప్తులో ఎన్‌టీఏ పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. అవసరమైన పత్రాలను, సమాచారాన్ని అందిస్తుంది'' అని ఎన్‌టీఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పేర్కొంది.

నీట్ మళ్లీ రాయడానికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని ఎన్‌టీఏ తెలిపింది.

గతంలో విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేస్తామని, అలాగే ఈ పరీక్షను ఎన్‌టీఏ తన సొంత వనరులతో నిర్వహిస్తుందని పేర్కొంది.

''సీబీఐ దర్యాప్తుకు ఎన్‌టీఏ పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. దర్యాప్తుకు అవసరమైన అన్ని రకాల సామాగ్రిని, రికార్డులను, పూర్తి సహకారాన్ని అందిస్తుంది'' అని ఎన్‌టీఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్'లో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

నీట్ రీ-ఎగ్జామ్ కోసం పరీక్షా కేంద్రాలను కూడా మార్చబోమని ఎన్‌టీఏ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తును మే 8వ తేదీనే కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించామని వెల్లడించింది. వాటి నివేదిక ఆధారంగా, ప్రస్తుతం జరిగిన పరీక్షా ప్రక్రియను కొనసాగించడం సాధ్యం కాదని తేలిందని, పారదర్శకతను కాపాడటం కోసం ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించుకున్నామని పేర్కొంది.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

నీట్ పరీక్షపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

''నీట్-2026 ప్రశ్నాపత్రం లీక్ వార్త విన్నాను. ఇదిక ఎంతమాత్రం పరీక్ష కాదు. నీట్ ఇప్పుడు ఒక వేలంపాటగా మారిపోయింది. పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్‌లో అనేక ప్రశ్నలను విక్రయించారు'' అని 'ఎక్స్'లో రాశారు.

''22 లక్షల మందికిపైగా విద్యార్థులు రాత్రీపగలు కష్టపడి, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడాది పొడవునా నీట్ పరీక్షకు చదువుకున్నారు. కానీ, ఒక్క రాత్రిలో వారి భవిష్యత్తు బహిరంగ వేలంపాటలా మారిపోయింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత పదేళ్లలో 89 సార్లు పేపర్ లీక్‌లు. 48 సార్లు రీ-ఎగ్జామ్స్ జరిగాయి. ప్రతీసారీ అవే వాగ్దానాలు, ఆ తర్వాత అదే నిశ్శబ్దం'' అని రాహుల్ గాంధీ విమర్శించారు.

''మోదీ జీ, మీరు ప్రతి వైఫల్యాన్ని ప్రజలపైకి నెట్టేసినప్పుడు, అందులో పేద పిల్లల భవిష్యత్తు కూడా కలిసిపోతుంది. 22 లక్షల మంది పిల్లల నమ్మకం పటాపంచలైపోయింది. భారత యువత కలలకు మోదీ ప్రభుత్వం కంటే పెద్ద ముప్పు మరొకటి లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''నీట్-2026 పరీక్ష రద్దయింది. 22 లక్షల మందికిపైగా విద్యార్థుల కష్టం, త్యాగం, కలలను అవినీతిమయమైన బీజేపీ వ్యవస్థ అణచివేసింది'' అంటూ రాహుల్ గాంధీ మరో 'ఎక్స్' పోస్టులో రాశారు.

''ఒక తండ్రి అప్పు చేశారు, ఒక తల్లి తన నగలను అమ్మారు, లక్షలాది మంది విద్యార్థులు రాత్రంతా మేల్కొని చదువుకున్నారు. చివరకు వారికి దక్కిందేమిటంటే, పేపర్ లీక్, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి'' అని తీవ్రంగా విమర్శించారు.

''ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న నేరం. పేపర్ లీక్ మాఫియా ప్రతిసారీ తప్పించుకుంటోంది. దాని ఫలితంగా తలెత్తే పరిణామాలకు నిజాయితీ గల విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ అదే మానసిక ఒత్తిడిని, ఆర్థిక భారాన్ని, అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

''ఒకవేళ ఒకరి తలరాతను శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే, ఇక విద్యకు అర్థం ఏమిటి? ప్రధానమంత్రి చెబుతున్న సోకాల్డ్ 'అమృత కాలం' దేశానికి 'విషకాలం'లా మారిపోయింది'' అని ఆయన ఆరోపించారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీ సహా పలువురు నాయకులు స్పందించారు.

''కఠిన శిక్ష ఒక్కటే దీనికి పరిష్కారం''

ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) 'ఎక్స్‌'లో స్పందిస్తూ, ''ఈ పేపర్ లీక్‌లకు సంబంధించి తక్షణమే బాధ్యులను గుర్తించి జవాబుదారీ చేయాలి. కఠినమైన శిక్ష ఒక్కటే దీనికి పరిష్కారం'' అని పేర్కొంది.

పలు మీడియా నివేదికల ప్రకారం, నీట్ ప్రశ్నపత్రం రాజస్థాన్, కేరళలో లీక్ అయినట్లు సమాచారం.

ఈ పేపర్ లీక్ ఆధారాలను రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ప్రాథమిక విచారణలో కనుగొంది. ఆ నివేదికల ప్రకారం, ప్రశ్నపత్రానికి సంబంధించిన ఒక పీడీఎఫ్ ఫైల్ కేరళ నుంచి రాజస్థాన్‌లోని సీకర్‌కు చేరినట్లు తెలిసింది.

ఈ అంశంపై రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, ''ప్రభుత్వం ఎంత సున్నితంగా స్పందించిందో చూడండి. పేపర్ లీక్ వాస్తవాలు వెలుగులోకి రాగానే ప్రభుత్వం వెంటనే పరీక్షను రద్దు చేసి సీబీఐ విచారణకు ఆదేశించింది" అని చెప్పారు.

''ప్రశ్నపత్రంలోని 320 ప్రశ్నలలో 120 ప్రశ్నలు లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కేరళలో అయినా, సీకర్‌లో అయినా సరే, దోషులు ఎవరూ తప్పించుకోలేరు. ప్రభుత్వం ఈ విషయాన్ని అణచివేయాలని చూస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ వాస్తవానికి వెంటనే పరీక్ష రద్దు అయింది, సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది'' అని ఆయన పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)