దిల్లీ అగ్నిప్రమాదానికి బీఅండ్‌బీ పాలసీనే కారణమా, ఏమిటీ పాలసీ?

మాలవీయనగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన బంధువుల రోదన

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మాలవీయనగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన బంధువుల రోదన
    • రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

దిల్లీ మాలవీయ నగర్‌లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంతో దిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈమేరకు దిల్లీ పర్యటకశాఖా మంత్రి కపిల్ మిశ్రా పీటీఐతో మాట్లాడారు.

''అధికారికంగా బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ విధానాన్ని ఉపసంహరించుకుంటున్నాం. ఈ పాలసీ కింద అనుమతి పొందిన అన్ని సంస్థలను తనిఖీ చేస్తాం'' అని మిశ్రా చెప్పారు.

''నిబంధనలు మీరిన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. ఏదైనా సంస్థ ఈ పాలసీ కింద నమోదు చేసుకుని, 6 గదులను మించి నిర్వహిస్తూ ఉంటే ఆ వ్యాపార సంస్థ లైసెన్సు రద్దు చేస్తాం'' అని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బెడ్ అండ్ బ్రెక్‌ఫాస్ట్ పాలసీ

అసలేం జరిగింది?

దిల్లీలోని మాలవీయనగర్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగి 21మంది ప్రాణాలు కోల్పోయారు. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ పాలసీ కింద అనుమతి పొందిన ఫ్లరిష్ స్టేస్ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌ హోటల్లో ఈ సంఘటన జరిగింది.

ఈ హోటల్‌కు 6 గదులకే అనుమతి ఉన్నా, అనధికారికంగా 20కిపైగా గదులు నిర్వహిస్తోందని అధికారులు మీడియాకు చెప్పారు.

ఈమేరకు హోటల్ యజమాని లవ్‌కేష్ బజాజ్‌ను మాలవీయ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 105, 326 కింద కేసులు నమోదు చేశారు.

బుధవారం మరణించినవారిలో 12 మంది విదేశీయులున్నారు. వీరి పేర్లు, వీరు ఏయే దేశాలకు చెందినవారనే అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

దీనిపై ఆఫ్రికా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు.

దక్షిణ దిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ వివిధ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రమాదానికి గురైన హోటల్

ఫొటో సోర్స్, ANI

ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి

అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది భారతీయుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో శ్రుతికా బర్న్వాల్, తార్జని అగర్వాల్, వార్యా అగర్వాల్ అలియాస్ పర్ల్, ఝవేరి అగర్వాల్, వివేక్ అగర్వాల్, అశోక్ అగర్వాల్, కమలా అగర్వాల్, ప్రేమ్ లతా అగర్వాల్, జీవిషా అగర్వాల్ ఉన్నారు.

వీరిలో అగర్వాల్ పేరున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది.

తమ ఇంటి పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా వీరు ఆస్పత్రికి వచ్చి దగ్గరలోని ఫ్లరిష్ స్టేస్ బీ అండ్‌ బీలో బస చేశారని ఆ పత్రిక కథనం తెలిపింది.

ప్రమాదానికి గురైన హోటల్

ఫొటో సోర్స్, ANI

ఏమిటీ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీ?

నివాస గృహాలను చిన్న స్థాయి వసతి గృహాలుగా ఉపయోగించేందుకు రూపొందించిన చట్టమే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 2007.

ఈ చట్టం ప్రకారం, ఇంటి యజమానులు తమ ఇంట్లోనే కొంత భాగాన్ని పర్యటకులు లేదా అతిథులకు అద్దెకు ఇచ్చి, వసతి, అల్పాహారం సౌకర్యాలను అందించవచ్చు. అయితే ఇందుకు ప్రభుత్వం దగ్గర నమోదు, పరిశుభ్రత, భద్రత, అగ్నిమాపక ప్రమాణాలు, విజిటర్స్ రికార్డు నిర్వహణ వంటి నిబంధనలు పాటించడం తప్పనిసరి.

చిన్న స్థాయి హోం-స్టేలను ప్రోత్సహిస్తూ, పర్యటక రంగాన్ని బలోపేతం చేయడం, స్థానికులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. దీని కింద గరిష్ఠంగా ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

అయితే, దిల్లీ ప్రభుత్వం ఈ పాలసీని సవరించి ఆరు గదుల పరిమితిని ఎనిమిది గదులకు పెంచాలని, గదికి రెండు చొప్పున పదహారు పడకల వసతి ఏర్పాట్లు చేసేందుకు వీలుగా పాలసీని మార్చాలని ఇటీవలి కాలంలో ప్రయత్నాలు చేస్తోంది.

కానీ, దిల్లీ పర్యటక మంత్రి బుధవారం చేసిన బీ అండ్‌ బీ పాలసీ రద్దు ప్రకటన, ప్రతిపాదిత కొత్త పాలసీని రద్దు చేయడం గురించా లేక 2007 నుంచి బీ అండ్‌ బీ చట్టం కింద అమల్లో ఉన్న మొత్తం పాలసీనే రద్దు చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు.

దిల్లీ సౌత్ జోన్‌లో అనధికారికంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాలను సీజ్ చేస్తామని మాలవీయ నగర్‌లో ఘటనాస్థలి వద్ద దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.

అయితే ఈ ఆకస్మిక చర్యల వల్ల స్థానికంగా హోటళ్లలో నివసించే విదేశీయులు ఆందోళన చెందే అవకాశం ఉంది కనుక గురువారం ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

సౌత్ దిల్లీ జోన్‌లో ఈ పాలసీ కింద మొత్తం 133 మంది బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌ లైసెన్సు పొందారని దిల్లీ టూరిజం శాఖ వెబ్‌సైట్‌ డేటా చెబుతోంది.

ఆరు గదులకే అనుమతి ఇస్తున్నప్పటికీ అనేక భవనాల్లో బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పేరిట 20 నుంచి 30 వరకూ గదులు నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో తనిఖీలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.

స్థానిక వ్యాపారి
ఫొటో క్యాప్షన్, స్థానిక ఫార్మసీ షాపు యజమాని శైలేందర్ తిలక్

"విదేశీయుల సంఖ్య తగ్గితే నష్టపోతాం"

ఇప్పుడు బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీని రద్దు చేస్తే ఇక్కడికొచ్చే విదేశీయుల సంఖ్య తగ్గిపోతుందని, వారి ద్వారా స్థానికంగా జరిగే వ్యాపారం పడిపోతుందని కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆ భవనంలో కనీసం మరొక ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలుండాల్సింది. ప్రమాదం జరిగిన భవన యజమానుల్లాంటి కొందరు చేసే తప్పులకు స్థానిక వ్యాపారులందరిపైనా ప్రభావం పడుతోంది. కోట్ల రూపాయల వ్యాపారానికి నష్టం జరుగుతుంది'' అని స్థానికంగా ఫారెక్స్ వ్యాపారం చేస్తున్న యూఎస్ పాండే చెప్పారు.

''ఇక్కడ దాదాపుగా వంద ఫార్మసీ షాపులున్నాయి. ఎక్కువ శాతం వ్యాపారం విదేశీయులదే. వాళ్లలో కొందరు నెలా రెండు నెలలకు సరిపడా, మరికొందరైతే ఏడాదికి సరిపడా మందులు కొంటారు. విదేశీయుల రాక తగ్గిపోతే మందుల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుంది'' అని స్థానిక ఫార్మసీ షాపు యజమాని శైలేందర్ తిలక్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)