'తనతో పుట్టిన కవల సోదరి.. సవతి సోదరి అని తెలిసినప్పుడు..'

- రచయిత, జెన్నీ క్లీమాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
మిచెల్, లావినియా ఓస్బోర్న్ అనే కవలల మధ్య ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. కానీ, సెప్టెంబర్ 2022లో లావినియా తన డీఎన్ఏ పరీక్ష ఫలితాల ఈమెయిల్ ఓపెన్ చేసేప్పుడు, ఆమె మనసు ఏదో కీడు శంకించింది.
"నా మనసుకి ముందే తెలుసు కాబోలు" అని లావినియా అన్నారు.
ఆ పరీక్షా ఫలితాలు ఒక విస్తుపోయే నిజాన్ని బయటపెట్టాయి: ఒకేసారి పుట్టినప్పటికీ, మిచెల్ - లావినియాల తండ్రులు వేర్వేరు. వీరి తల్లి సహజంగానే గర్భం దాల్చారు, ఇరువురు ఆమె గర్భాశయంలోనే పెరిగారు, కేవలం నిమిషాల వ్యవధిలో ఆ తల్లికి జన్మించారు - కానీ వీరు హాఫ్ సిస్టర్స్.
49 ఏళ్ల మిచెల్, లావినియాలు 'హెటెరోపేటర్నల్ సూపర్‌ఫెకండేషన్' అనే అత్యంత అరుదైన బయోలాజికల్ ప్రక్రియ వల్ల జన్మించారు. ఒక మహిళ ఒకే రుతుచక్రంలో ఒకటి కంటే ఎక్కువ అండాలను విడుదల చేయడం, ఆ అండాలు వేర్వేరు పురుషుల వీర్యకణాలతో ఫలదీకరణం చెందడం, ఆ పిండాలు రెండూ గర్భధారణ కాలం తట్టుకుని జీవించడం వల్ల ఇది జరుగుతుంది.


బాల్యంలోనే సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 20 కేసులు మాత్రమే గుర్తించారు. బీబీసీ రేడియో 4 సిరీస్ 'ది గిఫ్ట్' కోసం నెలల తరబడి పరిశోధన చేసిన తర్వాత, బ్రిటన్‌లో ఇలా వేర్వేరు తండ్రులకు జన్మించిన కవలలుగా నమోదైన వారు వీరిద్దరేనని తేలింది.
ఈ నిజం లావినియాను తీవ్రంగా కలచివేసింది. బాల్యంలో అనేక ఇబ్బందులు పడుతూ, వేర్వేరు ఇళ్లలో, సంరక్షకుల వద్ద పెరిగిన ఈ కవలలు ఒకరికొకరు అండగా నిలిచారు. ఈ సమయంలో వారికి ఉన్న ఏకైక భరోసా.. వారిద్దరి తోడు మాత్రమే.
"నాకు సంబంధించిన వ్యక్తి ఆమె, నా జీవితంలో కచ్చితంగా ఉంటుందని నమ్మిన తోడు, నాకు గ్యారెంటీగా ఉన్న ఏకైక బంధం. కానీ, ఒక్కసారిగా అది కాదని తేలిపోయింది" అని లావినియా అన్నారు.
కానీ, లావినియా ఈ విషయాన్ని తన సోదరికి ఫోన్ చేసి చెప్పినప్పుడు, మిచెల్ స్పందన మరోలా ఉంది.
"నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. నిజంగా ఇలా జరుగుతుందా అని ఇప్పటికీ వింతగా అనిపిస్తుంది. ఇది చాలా విచిత్రం, అత్యంత అరుదైన విషయం. కానీ, ఇది వినగానే నాకు అన్నీ అర్థమయ్యాయి" అని మిచెల్ అన్నారు.
కుటుంబ నేపథ్యం - గతం
1976లో నాటింగ్‌హామ్‌లో వీరిద్దరికీ జన్మనిచ్చినప్పుడు వారి తల్లి ఒక 19 ఏళ్ల యువతి.
"మా అమ్మ తన సవతి తండ్రి చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. తన చిన్నతనమంతా ఫోస్టర్ కేర్ హోమ్స్‌లోనే గడిచింది" అని మిచెల్ వివరించారు.
తమ తండ్రి ఎవరని ఎప్పుడు అడిగినా, 'జేమ్స్' అనే వ్యక్తి అని ఆ తల్లి చెప్పేది.
"ఆయనెప్పుడూ మాతో లేరు" అని మిచెల్ అన్నారు.
వారికి తల్లి కూడా ఎక్కువగా తోడు లేరు. వీరికి ఐదేళ్ల వయసున్నప్పుడు, లండన్ విశ్వవిద్యాలయంలో సీటు రావడంతో ఆమె పిల్లలను నాటింగ్‌హామ్‌లోనే వదిలి వెళ్లారు. తన బెస్ట్ ఫ్రెండ్ తల్లి వద్ద వారిని వదిలేశారు, ఆ పిల్లలు ఆమెను 'నానమ్మ' అని పిలిచేవారు.
"నానమ్మ చాలా కఠినంగా ఉండేవారు. ప్రేమగా మాట్లాడటం, దగ్గరకు తీసుకోవడం వంటివి ఉండేవి కావు. నాకు ఉన్న ఏకైక తోడు మిచెల్ మాత్రమే" అని లావినియా చెప్పారు.
తన సోదరి పక్కన ఉంటే చాలు, తనకు రక్షణగా ఉన్నట్లు అనిపించేదని, "లోకంతో పోరాడటానికి మేమిద్దరం ఒక్కటిగా ఉన్నామనే భావన ఉండేది" అని మిచెల్ అన్నారు.
పిల్లలకు 10 ఏళ్లు వచ్చాక లండన్‌లో ఉన్న వారి తల్లి దగ్గరకు వెళ్లారు. కానీ, కొన్ని ఏళ్లలోనే లావినియా, మిచెల్‌లను మళ్లీ పాత ఫోస్టర్ హోమ్‌కు పంపించేశారు. అమ్మ తమను ఎందుకు దూరం పెడుతుందో వారికి అర్థం కాలేదు.
"శారీరకంగా, మానసికంగా ఆమె మాకు ఎప్పుడూ అందనంత దూరంలోనే ఉన్నారు" అని లావినియా అన్నారు.

విస్తుపోయే నిజాలు
చాలాకాలం దూరంగా ఉన్న జేమ్స్, ఈ కవలలు యుక్తవయసులో ఉన్నప్పుడు మళ్లీ వారి జీవితాల్లోకి వచ్చారు.
లావినియా ఆయన్ను శోధించి పట్టుకున్నారు - జేమ్స్లో తన పోలికలు ఉన్నాయని ఆమె నమ్మినా, మిచెల్ మాత్రం ఆయన తన తండ్రి అని ఎప్పుడూ నమ్మలేదు. ఆమె మనసులో ఏదో మూల అనుమానం ఉంటూనే ఉండేది.
2021 చివరి నాటికి, వారి తల్లికి 'డిమెన్షియా' (జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధి) రావడంతో ఆమెను ఏమీ అడిగే అవకాశం లేకుండా పోయింది. జేమ్స్ ఫోటో చూసిన మిచెల్‌కు, ఆయన తన తండ్రి కాదని మరింత బలంగా అనిపించింది.
"అస్సలు పోలికలే లేవు అనిపించింది. అందుకే నేను ఒక కిట్ కొనుక్కున్నాను" అని మిచెల్ చెప్పారు.
డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నప్పుడు వారితో పాటు వారి కుటుంబం నిజాలు కూడా తెలుస్తాయి.
అయితే, తన పరీక్షా ఫలితాలు లావినియాపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయం మిచెల్ అప్పట్లో ఆలోచించలేదు. సరిగ్గా వీరి తల్లి మరణించిన రోజే, 2022 ఫిబ్రవరి 14న ఆ ఫలితాలు వచ్చాయి.
మిచెల్ తండ్రి వరుసలో జేమ్స్ పేరు ఎక్కడా లేదు - అంటే ఆయన ఆమె తండ్రి కాదు.
కొన్నివారాలు ఆరా తీసిన తర్వాత, తన తండ్రి పేరు అలెక్స్ అని మిచెల్ తెలుసుకున్నారు. ఆయన వీరి తల్లి స్నేహితురాలి సోదరుడు.
అలెక్స్ కుటుంబాన్ని మిచెల్ సంప్రదించగా, ఆయన చాలా ఏళ్లుగా మద్యపానానికి, మాదకద్రవ్యాలకు బానిసై రోడ్లపైనే గడుపుతున్నారని వారు చెప్పారు.
తర్వాత మిచెల్, లావినియాలు ఒలివిన్ అనే మహిళను కలిశారు. ఆమె తమ ఇద్దరికీ వరుసకు సోదరి (ఫస్ట్ కజిన్) అవుతుందని మిచెల్ భావించారు.
"ఆమె నాకు రక్త సంబంధీకురాలిగా అనిపించింది" అని మిచెల్ అన్నారు.
కానీ, లావినియాకు అలా అనిపించలేదు. ఒలివిన్ తన కుటుంబ ఫోటోలు చూపించినప్పుడు, అందులో తన పోలికలు ఏవీ లావినియాకు కనిపించలేదు.
దాంతో లావినియా కూడా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. మిచెల్ ఫలితాల కంటే భిన్నంగా వస్తాయని ఆమె ఊహించలేదు కానీ, అలెక్స్ కుటుంబం తనది కాదేమో అన్న పెరుగుతున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు.
"నాకు కేవలం ఒక స్పష్టత కావాలని అనుకున్నాను" అని లావినియా అన్నారు.
తన కవల సోదరి నిజానికి తన సవతి సోదరి అనే నిజాన్ని తెలుసుకున్నపుడు లావినియా తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు.
"ఈ పరిస్థితిలోకి నేను వెళ్లేలా చేసినందుకు మిచెల్‌పై నాకు కోపం వచ్చింది, ఎందుకంటే ఈ వాస్తవం నాకు ఇష్టం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే, మరిన్ని నిజాలు బయటపడటం అప్పుడే ముగియలేదు.

లావినియా తన ఫలితాలను నిశితంగా గమనించగా, జేమ్స్ కూడా తన తండ్రి కాదని తేలింది.
తన తండ్రి ఎవరనేది తెలుసుకోవడంపై లావినియాకు పెద్దగా ఆసక్తి లేకపోయినా, మిచెల్ మాత్రం నిజం కనుగొనాలని నిశ్చయించుకున్నారు. తన సోదరి ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించి, లావినియా కన్నతండ్రి ఆర్థర్ అని మిచెల్ గుర్తించారు. వీరిద్దరూ కలిసి వెస్ట్ లండన్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు.
"ఆయన కొంచెం కంగారుగా ఉన్నారు, కానీ నాలాగే చాలా ఉత్సాహవంతుడు" అని లావినియా అన్నారు.
వారి భేటీ ముగిసే సమయానికి, ఆమె ఆర్థర్ బుగ్గపై ముద్దు పెట్టింది.
"నాకు తెలియకుండానే అలా చేయాలనిపించింది, ఏదో ఒక శక్తి నన్ను ఆయన వైపు లాగినట్లు అనిపించింది" అన్నారు లావినియా.
లావినియా, ఆర్థర్ అప్పటి నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. నెలలో అప్పుడప్పుడు కలుసుకుంటారు, తరచుగా మిచెల్ కూడా వారితో ఉంటారు.
"నాకంటూ ఒక చోటు దొరికిందని అనిపిస్తోంది, ఆ చోటు నా తండ్రి తోడు" అని లావినియా అన్నారు.
మిచెల్ కూడా తనను నాన్న అని పిలవవచ్చని ఆర్థర్ చెప్పారు.
తర్వాత జరిగిన ఒక సమావేశంలో, తమ జననం గురించి ఆ కవలలు ఆర్థర్‌ను అడిగారు.
"మీ అమ్మ ఒకసారి ఏడుస్తూ నా తలుపు తట్టింది. ఆమె ఏదో షాక్‌లో ఉండి ఉండవచ్చు, తనకు రక్షణ లేదని భావించి నా దగ్గరకు వచ్చింది" అని ఆర్థర్ అన్నట్లు మిచెల్ చెప్పారు.
ఆ సమయంలో అసలు ఏం జరిగిందో స్వయంగా చెప్పడానికి వారి తల్లి ఇప్పుడు మన మధ్య లేదు. కానీ, తనకు అవసరమైన సమయంలో ఆమె తన వద్దకు వచ్చారని ఆర్థర్ అన్నారు.
మిచెల్ కూడా తన కన్నతండ్రి అలెక్స్‌ను కొత్తగా పరిచయమైన బంధువుల ద్వారా కలవగలిగారు.
"ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారు" అని మిచెల్ చెప్పారు.
వారిద్దరి మధ్య పోలికలు కాదనలేనంతగా ఉన్నాయి.
"ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డను. కానీ, భవిష్యత్తులో ఆయన అవసరం ఉందని నాకు అనిపించలేదు. కేవలం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే కలిశాను" అని మిచెల్ అన్నారు.

విడదీయలేని ప్రత్యేక బంధం
తమ ఇద్దరికీ వేర్వేరు తండ్రులు ఉన్నారనే విషయం తమ తల్లికి ముందే తెలుసా, లేదా అనేది ఆ కవలలకు ఇప్పటికీ తెలియదు.
"ఆ అనుమానం ఆమెను ఎంతగా వేధించి ఉంటుందో. ఆమె ఏదో ఒకటి గమనించి ఉండవచ్చు లేదా ఏదో ఒకటి అనుకొని ఉండవచ్చు" అని లావినియా అన్నారు.
"ఆ విషయం అమ్మకు తెలుసని అనుకుంటున్నాను, కానీ ఆమె ఆ నిజాన్ని అస్సలు ఒప్పుకోలేకపోయారు" అని మిచెల్ అన్నారు.
భిన్న కవలలుగా, లావినియా - మిచెల్ తమ మధ్య ఉన్న తేడాలను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నారు. డీఎన్ఏ ద్వారా తెలిసిన నిజాలు మొదట ఆ తేడాలను స్పష్టంగా చూపించినా, వారి మధ్య ఉన్న ప్రత్యేక బంధం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది.
"మేమిద్దరం ఒక అద్భుతం. మా మధ్య ఉన్న ఈ అనుబంధం ఎన్నటికీ విడదీయలేనిది" అని లావినియా అన్నారు.
మిచెల్ కూడా తల ఊపి, "తను నా కవల సోదరి, ఏ నిజం కూడా దాన్ని మార్చలేదు" అని ముగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































