ఏసియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ : పాకిస్తాన్‌పై గెలుపుతో భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్

ఏసియన్ గేమ్స్ 2026లో గోల్డ్ మెడల్‌, పాకిస్తాన్‌పై విజయం, జపాన్
ఫొటో క్యాప్షన్, స్వర్ణపతకంతో భారత క్రికెట్ జట్టు సభ్యులు
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

జపాన్ వేదికగా జరుగుతున్న ఏసియన్‌ గేమ్స్‌లో టీ20 క్రికెట్ విభాగంలో భారత జట్టు స్వర్ణం సాధించింది.

పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది.

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అర్థ సెంచరీలతో రాణించారు.

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 192 పరుగులకే పరిమితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏసియన్ గేమ్స్ 2026లో గోల్డ్ మెడల్‌, పాకిస్తాన్‌పై విజయం, జపాన్
ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.

అభిషేక్, తిలక్ దూకుడు

కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

వైభవ్ సూర్యవంశీ 15 పరుగులు చేసి ఔటైనప్పటికీ, అభిషేక్ శర్మ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అప్పటికే పవర్‌ప్లేలో భారత్ 81/2 స్కోరు సాధించింది. మొత్తంగా అభిషేక్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులు చేసి, ఎనిమిదో ఓవర్లో అరాఫత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

అయితే, అభిషేక్ ఔటయ్యాక శ్రేయస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ (20)లు ఆచితూచి ఆడారు. వీరిద్దరూ వెంటవెంటనే ఔటయ్యాక, క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, శివమ్ దూబే దూకుడుగా ఆడారు. తిలక్ వర్మ 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు, శివమ్ దూబే 15 బంతుల్లో 27 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దానియాల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

ఏసియన్ గేమ్స్ 2026లో గోల్డ్ మెడల్‌, పాకిస్తాన్‌పై విజయం, జపాన్
ఫొటో క్యాప్షన్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

పవర్ ప్లేలో కట్టడి..

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. పాక్ కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాత్ (10), ఉస్మాన్ ఖాన్ (3) త్వరగానే పెవిలియన్ చేరారు.

అయితే, హసన్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులకే పరిమితమైంది.

స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి ఏసియన్ గేమ్స్ 2026లో గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)