రైళ్ల రద్దు, విద్యాసంస్థలకు సెలవులు, నిత్యావసరాలు రెడీ చేసుకుంటున్న ప్రజలు.. అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోందంటే

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖలో మొదలైన గాలులు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు 'అర్నబ్‌' తుపాను కదులుతున్న వేళ రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అక్టోబర్‌ 27, 28 తేదీల్లో 53 రైళ్లను రద్దు చేశారు.

ప్రభావిత జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ముందు జాగ్రత్త చర్యగా దాదాలు 1800 తుపాను సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తుపాను తీరం దాటే సమయంలో భారీగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న వేళ అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ప్రజలు కూడా తుపాను నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం కనిపించింది.

విశాఖ నగరంలోని రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లన్నీ రద్దీగా కనిపించాయి. ప్రజలు పెద్దఎత్తున నిత్యవసర వస్తువులు కొనుగోెలు చేయడం కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో తుపాను…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం…మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాను కేంద్రీకృతమై ఉంది.

గడిచిన ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను…విశాఖపట్నానికి 220 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 340 కిలోమీటర్లు, బాపట్లకు 410 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు మంగళవారం మధ్యాహ్నం తెలిపింది.

తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

అక్టోబర్‌ 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావం ఉన్నందున సముద్రంలోకి వెళ్లొద్దని అధికారుల సూచన

పాఠశాలలకు సెలవులు

తుపాను ప్రభావంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

అక్టోబర్‌ 27, 28 తేదీల్లో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్‌, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

అవసరమైతే పాఠశాల భవనాలను తుపాను పునరావాస కేంద్రాలుగా వినియోగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, సెలవుల తేదీలు జిల్లాలవారీగా మారే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత జిల్లా అధికారుల ప్రకటనలను గమనించాలి.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖలో సముద్రం అల్లకల్లోలం

తుపాను ప్రభావంతో 53 రైళ్లు రద్దు

ప్రయాణికుల భద్రత దృష్ట్యా అక్టోబర్‌ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో నడిచే 53 రైళ్లను రద్దు చేశారు.

విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ పోర్టు, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం, నరసాపురం, గుంటూరు తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

విశాఖపట్నం–కిరండూల్‌ నైట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం–కోరాపుట్‌ ప్యాసింజర్‌ సహా పలు రైళ్ల సర్వీసులను కూడా రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.

ప్రయాణికులు తమ రైలు సర్వీసు స్థితిగతులను అధికారిక రైల్వే వెబ్‌సైట్‌ లేదా ఇతర అధికారిక సమాచార మార్గాల్లో తనిఖీ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో తీరం వెంబడి జోరువానలు

విమాన ప్రయాణికులకు సూచనలు

తుపాను ప్రభావంతో విశాఖ, విజయవాడల నుంచి రాకపోకలు సాగించే విమానాలపై అంతరాయాల ముప్పు ఉండటంతో ఎయిర్‌ ప్యాసింజర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా అసోసియేషన్లు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేస్తున్నాయి.

"విమాన సర్వీసుల్లో మార్పులు లేదా ఆలస్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే తమ విమానాల స్టాటస్ తనిఖీ చేసుకోవాలి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తాజా సమాచారం తెలుసుకోవాలి." అని విశాఖ ఎయిర్‌ ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓ. నరేష్‌ కుమార్‌ బీబీసీతో చెప్పారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, తీరం ప్రాంతంలో వీస్తున్న గాలులకు బీబీసీ ప్రతినిధి లక్కోజు శ్రీనివాస్ గొడుగు ఎగిరిపోతున్న దృశ్యం

అక్టోబర్‌ 28న తీరం దాటే అవకాశం

తుపాను అక్టోబర్‌ 28 ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి బీబీసీకి తెలిపారు.

తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని, గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.

తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అధికారుల హెచ్చరికలతో కూరగాయలు కొనుగోలు చేస్తున్న విశాఖ ప్రజలు

తుపాను సహాయక చర్యలకు 1,763 కేంద్రాలు సిద్ధం

అర్నబ్‌ తుపాను వేళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్టోబర్‌ 28న తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున, ముందస్తు సన్నద్ధతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,763 తుపాను పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు.

తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, రైతు బజార్ల ముందు బారులు తీరిన విశాఖ ప్రజలు

విశాఖ తీరంలో పరిస్థితి…

బంగాళాఖాతంలో అర్నబ్ తుపాను తీవ్రత పెరుగుతుండటంతో విశాఖ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో తీరం వైపు ఎవరిని రానివ్వకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తీరంలో అలలు ఉద్ధృతి కనిపిస్తోంది. విశాఖలో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే మత్స్యకారులు తమ పడవలను హార్బర్‌కు చేర్చారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, నిత్యవసర సరకులు కొనుగోలు చేస్తున్న ప్రజలు

వ్యవసాయశాఖ సూచనలు…

తుపాను ప్రభావం వ్యవసాయ రంగంపైనా పడే ప్రమాదం ఉందని ఏపీ వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు.

"బలమైన గాలులకు వరి పంట నేలకొరిగే ప్రమాదం ఉండగా, భారీ వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. దీనివల్ల ధాన్యం నాణ్యత, దిగుబడిపై ప్రభావం పడవచ్చు. కూరగాయల పంటలకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది" అని అల్లూరి జిల్లా చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారి అప్పలస్వామి చెప్పారు.

పొలాల్లో నీరు నిలవకుండా మురుగునీటి కాలువలను శుభ్రం చేసుకోవాలని, ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వ్యవసాయ శాఖ సూచించింది. నిల్వ చేసిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను టార్పాలిన్‌ పట్టాలతో కప్పి ఉంచాలని తెలిపింది.

అయితే…వాస్తవంగా ఎంత పంట దెబ్బతిందన్నది తుపాను ప్రభావం తగ్గిన తర్వాత చేపట్టే నష్టం అంచనాల్లో తేలనుందని అప్పలస్వామి తెలిపారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, ముందు జాగ్రత్తగా సరకులు సిద్ధం చేసుకుంటున్న ప్రజలు

సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని హెచ్చరించారు.

తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను పాటించాలని కోరారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖ, ఆంధ్రప్రదేశ్, అర్నబ్ తుపాను
ఫొటో క్యాప్షన్, వర్షంలో తడుచుకొని వెళ్తున్న మహిళ

సహాయక చర్యలపై ప్రభుత్వ దృష్టి

తుపాను సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

లోతట్టు, ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలకు తరలించడం, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచడం వంటి చర్యలపై అధికారులు దృష్టి సారించారు.

తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, బలమైన గాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)