India vs Australia: హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్ సిక్స్‌లు, హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్ 171

హర్మన్ ప్రీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో.. సెమీస్ చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది భారత్.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ గెలవాలంటే ఆస్ట్రేలియా 171 పరుగులు చేయాలి.

ఓపెనర్లు స్మృతి మంధాన, షెషాలీ వర్మ నిలకడగా ఆడటంతో భారత్ పవర్ ప్లే (6 ఓవర్లు)లో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.

భారత్ 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ బౌలింగ్‌లో షెఫాలీ వర్మ ఔటైంది. షెఫాలీ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసింది.

స్మృతి మంధాన రనౌట్, నిరాశలో జెమీమా రోడ్రిగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మృతి మంధాన రనౌట్

స్మృతి రనౌట్

వన్‌డౌన్‌లో జెమీమా క్రీజులోకి వచ్చింది.

కానీ, కాసేపటికే స్మృతి మంధాన రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

హామిల్టన్ వేసిన బంతిని జెమీమా బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా రివర్స్ స్వీప్ ఆడి, బంతి ఎటు వెళ్తుందోనని క్రీజులోనే నిలబడి చూస్తూ ఉండిపోయింది. కానీ, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న స్మృతి మంధాన రన్ వస్తుందనే అంచనాతో అప్పటికే సగం పిచ్ దాటి ముందుకు వచ్చేసింది.

జెమీమా వెనక్కి తిరిగి చూసి అసలు విషయం గ్రహించే లోపే.. ఆస్ట్రేలియా ఫీల్డర్ జార్జియా వేర్‌హామ్ బంతిని అందుకుని బెయిల్స్‌ను పడగొట్టడంతో స్మృతి రనౌట్ కావాల్సి వచ్చింది.

'నిజానికి అక్కడ అస్సలు రన్ తీసే అవకాశమే లేదు, కానీ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ లోపం వల్ల భారత్ కీలక వికెట్ కోల్పోయింది' అని క్రిక్ ఇన్ఫో పేర్కొంది.

మంధాన అవుట్ అయి వెళ్తూ, నిరాశలో ఉన్న జెమీమా భుజం తట్టి ఓదార్చడం విశేషం.

ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 37 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసింది. దీంతో భారత్ 83 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ దూకుడు.. హ్యాట్రిక్ సిక్స్‌లు

స్మృతి అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తనదైన శైలిలో ధాటిగా ఆడింది.

27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకుంది.

తాను క్రీజులోకి వచ్చాక ఒక్క 18వ ఓవర్‌లో తప్ప దాదాపుగా ప్రతీ ఓవర్‌లోనూ కనీసం ఒక బౌండరీ బాదిన హర్మన్ ప్రీత్ కౌర్ చివరి ఓవర్‌లో చెలరేగింది.

సోఫీ మోలినెక్స్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టు స్కోరును పెంచింది.

19వ ఓవర్‌ పూర్తయ్యాక జెమీమా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ ఒక ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించింది.

జెమీమా 28 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 34 పరుగులు చేసింది. హర్మన్, జెమీమా జోడి స్కోర్ బోర్డుకు 45 బంతుల్లో 64 పరుగులు జోడించింది.

విమెన్స్ క్రికెట్, టీ20 విమెన్స్ వరల్డ్ కప్, క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ, భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

గెలవకపోతే...

ఐసీసీ టీ20 విమెన్స్ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ గెలిచి 8 పాయింట్లతో పటిష్టమైన స్థానంలో ఉంది. ఆ జట్టు నెట్ రన్‌రేట్ (+4.724) కూడా చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ సెమీస్ చేరడం ఖాయం.

అయితే ప్రస్తుతం 6 పాయింట్లతో ఉన్న భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే 6 పాయింట్లతోనే నిలిచి టోర్నీ నుండి వైదొలగాల్సి వస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) సెమీస్ చేరుకుంటాయి.

కానీ, ఆసీస్‌పై భారత్ గెలిస్తే.. భారత్ కూడా 8 పాయింట్లతో సమానంగా నిలుస్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికా (+0.633) నెట్ రన్‌రేట్ కంటే భారత్ (+2.268) రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది కాబట్టి, భారత్ సులభంగా సెమీఫైనల్ చేరుకుంటుంది

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)