తెలంగాణ: ‘ఇక్కడే డైనోసార్లు నడిచాయి’... మంచిర్యాల జిల్లాలో బయటపడిన శిలాజ పాదముద్రలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

డైనోసార్

భారీ డైనోసార్లు ఒకదాని వెంట మరొకటి నడుచుకుంటూ వెళ్లాయి. అలా నడుచుకుంటూ వెళ్లడంతో ఏర్పడిన శిలాజ పాదముద్రలను తెలంగాణలో పరిశోధకులు గుర్తించారు.

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగావ్ గ్రామం అరుదైన చరిత్రకు వేదికగా మారింది. భారీ డైనోసార్లతోపాటు బేబీ డైనోసార్ పాదముద్రలు ఇక్కడ కనిపించాయి.

సున్నపు రాయి ఉపరితలం (బెడ్స్)పై కోట్ల సంవత్సరాల తర్వాత కూడా చెక్కుచెదరకుండా శిలాజ పాదముద్రలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలోని గోదావరి-ప్రాణహిత బేసిన్‌లో ఇప్పటికే డైనోసార్ల ఎముకలు లభించగా.. తాజా పరిశోధనల్లో పాదముద్రలు కనిపించడం విశేషంగా చెప్పవచ్చు.

ఇవి జురాసిక్ కాలంలో సుమారు 20 కోట్ల సంవత్సరాల కిందటి డైనోసార్ల పాదముద్రలుగా పరిశోధకులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డైనోసార్ల పాదముద్రలు
ఫొటో క్యాప్షన్, డైనోసార్ల పాదముద్రలు

14 భారీ పాదముద్రలు

సాలిగావ్ గ్రామ శివారులోని నల్ల చెరువు అలుగు పారే దిగువ భాగంలో సున్నపురాతి నేలపై డైనోసార్ పాదముద్రలు బయటపడ్డాయి.

మొత్తం 14 అడుగులు భారీ పరిమాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా బేబీ డైనోసార్ పాదముద్రలు సుమారు 50 వరకు ఉన్నాయిక్కడ.

‘‘అవి డైనోసార్ల పాదముద్రలే. రెండు రకాల డైనోసార్ల అడుగులున్నాయి'' అని భారత్‌కు చెందిన ప్రముఖ పాలియెంటాలజిస్ట్, దిల్లీ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగం ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

తొలిసారిగా తెలంగాణలో గుర్తింపు

ఈ శిలాజ పాదముద్రలను తొలిసారిగా బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టోరల్ ఫెలో సంగీత దాస్ గుప్తా, మరో పరిశోధకుడు ఆంటోనీ పాల్ రోజరియో గుర్తించి పరిశోధనలు చేశారు.

''2013లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మంచిర్యాల ప్రాంతంలో డైనోసార్ పాదముద్రల సమాచారం తెలిసింది. అవి ఏ స్థాయిలో ఉన్నాయి, వాటి శాస్త్రీయతపై మాకు సమాచారం లేదు'' అని చెప్పారు.

తర్వాత 2020-2022 మధ్య ఐఐటీ బాంబేలో ఉండగా పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్‌లో భాగంగా ఈ ప్రాంతంలో పరిశోధనలు చేశామని సంగీత ఈమెయిల్ ద్వారా బీబీసీకి వివరించారు.

అలా వీరి పరిశోధనతో డైనోసార్ శిలాజ పాదముద్రలు వెలుగులోకి వచ్చాయి.

ఈ పరిశోధన ఫలితాలు 2025 మార్చిలో హిస్టారికల్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.

''మా పరిశోధన డైనోసార్స్‌పై మరింత అధ్యయనానికి బాటలు వేయనుంది. ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్లో డైనోసార్స్ ఎముకలు ఎక్కువగా దొరికాయి. ఇప్పుడు వాటి పాదముద్రలు కనిపించడంతో.. కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్స్ ఎలా నివసించేవి.. ఎలా నడిచేవి.. ఎలా కలిసి జీవించేవి వంటి అంశాలపై పరిశోధనకు మార్గం లభించినట్లవుతుంది'' అని సంగీత దాస్ గుప్తా చెప్పారు.

''ఈ ట్రాక్ సైట్‌లో థారోపాడ్ డైనోసార్ గంటకు సుమారు 3.82 కిలోమీటర్ల వేగంతో నడిచినట్లుగా భావిస్తున్నాం. సారోపాడ్ డైనోసార్ ట్రాక్ సైట్ 14 మీటర్ల పొడవుతో ఉంది. ఈ డైనోసార్లు గంటకు 2.3 కిలోమీటర్ల వేగంతో నడిచినట్లుగా మా పరిశోధనలో తేలింది'' అని సంగీత దాస్ గుప్తా బీబీసీతో చెప్పారు.

సంగీత దాస్ గుప్తా
ఫొటో క్యాప్షన్, దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్

జురాసిక్ యుగం నాటి గుర్తులంటున్న పరిశోధకులు

డైనోసార్స్ పాదముద్రలు ఏర్పడిన లైమ్ స్టోన్స్ బెడ్స్ అనేవి ప్రాణహిత-గోదావరి గోండ్వానా బేసిన్‌కు సాలిగావ్ గ్రామానికి ఈశాన్య దిశలో ఏర్పడ్డాయి.

ఇవి జురాసిక్ యుగం ఆరంభానికి సంబంధించినవి. అంటే, దాదాపు 20 కోట్ల సంవత్సరాల నాటి పాదముద్రలుగా పరిశోధకులు భావిస్తున్నారు. వీటిని శిలాజ పాదముద్రలు (ఫాజిల్ ఫుట్ ప్రింట్స్)గా పిలుస్తుంటారు.

''మా పరిశోధనలో డైనోసార్స్ శిలాజ పాదముద్రలు నాలుగు విభిన్నమైన ట్రాక్‌లలో గుర్తించాం'' అని సంగీత వివరించారు.

డైనోసార్ల పాదముద్రలు

పెద్ద డైనోసార్లు ఒకేవైపు నడిచిన ఆనవాళ్లు

పాదముద్రల సమాచారం తెలిసినప్పుడు, నేను బీబీసీ ప్రతినిధిగా అక్కడికి వెళ్లాను.

అక్కడ 14 భారీ పాదముద్రలు ఒకే డైరెక్షన్ (ఒకే దిశ)లో నడిచినట్లుగా ఉన్నాయి.

అవి సారోపాడ్, థారోపాడ్ అనే రెండు రకాల డైనోసార్ల పాదముద్రలుగా తెలంగాణకు చెందిన శిలాజ అన్వేషకుడు సముద్రాల సునీల్ బీబీసీతో చెప్పారు.

''ఇక్కడి పాదముద్రలు బట్టి చూస్తే... ముందుగా బేబీ డైనోసార్ నడుచుకుంటూ వెళ్లింది. తర్వాత సారోపాడ్ డైనోసార్ వెళ్లింది. ఎందుకంటే బేబీ డైనోసార్ పాదముద్రలు కొన్ని మాత్రమే మిగిలాయి. అంటే, వాటి అడుగులపై పెద్ద డైనోసార్ అడుగు వేయడంతో పెద్ద పాదముద్రలు ఏర్పడ్డాయి'' అని సునీల్ చెప్పారు.

సారోపాడ్ డైనోసార్ వెళ్లాక, థారోపాడ్ డైనోసార్ వెళ్లినట్లుగా స్పష్టమవుతోందని వివరించారాయన.

''సారోపాడ్ పాదముద్రలపై థారోపాడ్ డైనోసార్ ముద్రలు కనిపిస్తున్నాయి. సారోపాడ్ డైనోసార్ పాదముద్రలు, ఏనుగు పాదముద్ర ఆకారంలో ఉంటే.. థారోపాడ్ పాదాలకు ముందువైపు మూడు వేళ్లు ఉంటాయి'' అని చెప్పారు.

గజిబిజిగా చిన్న డైనోల పాదముద్రలు

ఇవి కాకుండా చిన్న పాదముద్రలు చాలానే కనిపించాయి. అవన్నీ కూడా ఒక డైరెక్షన్‌లో కాకుండా గజిబిజిగా వేర్వేరు దిక్కులకు నడిచినట్లు ఉన్నాయి.

''బేబీ డైనోసార్స్ పాదముద్రలు సుమారు 50 వరకు ఉన్నాయి. అవి ఆడుకుంటూ, వేర్వేరు వైపులకు పరిగెత్తడంతో అలా ఏర్పడి ఉండవచ్చని అంచనా'' అని శిలాజ అన్వేషకుడు సముద్రాల సునీల్ వివరించారు.

డైనోసార్ల పాదముద్రలు, బీబీసీ రిపోర్టింగ్
ఫొటో క్యాప్షన్, సారోపాడ్ రకానికి చెందిన పాదముద్రలు ఏనుగు పాదం తరహాలో ఉంటాయని వివరించిన శిలాజ అన్వేషకుడు సముద్రాల సునీల్

ఒక్కోదాని మధ్య రెండు అడుగుల దూరం

డైనోసార్ పాదముద్రలపై మనిషి నడవడం కొంచెం కష్టమే. అవి కొంచెం దూరం దూరంగా ఉన్నాయి.

పరిమాణంలో డైనోసార్స్ పెద్ద జీవులు కనుక, వాటి పాదముద్రల్లో ఒకదానికి, మరొక దానికి మధ్య రెండు నుంచి రెండున్నర అడుగుల దూరం ఉంది.

ఈ పాదముద్రలు 55-73 సెం.మీ. పొడవుతోను, 37-49 సెం.మీ. వెడల్పుతోను ఉన్నట్లు సంగీత దాస్ గుప్తా తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

ఎలా ఏర్పడ్డాయి? ఇప్పటికీ ఎందుకు ఉన్నాయి?

సాలిగావ్ శివారులో సున్నపురాయి బెడ్స్ ఉన్నాయి. రాయి కొన్ని పొరలు భూమి ఉపరితలం నుంచి తొలగిన తర్వాత ఒక పొరపై డైనోసార్ పాదముద్రలు కనిపిస్తున్నాయి.

సారోపాడ్ రకానికి చెందిన పాదముద్రలు ఏనుగు పాదం తరహాలో ఉంటాయి.

థారోపాడ్ రకానికి చెందిన పాదముద్ర ముందువైపు వేళ్ల ముద్రలు కూడా కనిపిస్తున్నాయి. వేళ్ల జాయింట్స్, గోళ్ల ముద్రలు కూడా కొన్ని అడుగుల్లో స్పష్టంగా ఏర్పడ్డాయి.

ఒక పాదముద్ర మాత్రం దాదాపు అర అడుగు లోతులో ఏర్పడింది.

''సారోపాడ్ రకానికి చెందిన పాదముద్ర అది. చాలా బరువైన జీవి కనుక అక్కడ బురద లేదా మట్టి లూజ్‌గా ఉండటంతో ఎక్కువ లోతులో పడి ఉంటుంది'' అని సముద్రాల సునీల్ వివరించారు.

''డైనోసార్స్ నడిచినప్పుడు అవన్నీ బురదనేలలు అయ్యి ఉండొవచ్చు. అందుకే అవి నడిచి వెళ్లినప్పుడు పాదముద్రలు ఏర్పడ్డాయి'' అని సముద్రాల సునీల్ వివరించారు.

ఆ తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా నేలలు ఎండిపోయి పాదం ముద్ర పడి ఉంటుంది. అలా అవ్వడానికి సుమారు కోటి సంవత్సరాల సమయం పడుతుందని చెప్పారాయన.

గతంలో డైనోసార్ పాదముద్రలు రాజస్థాన్‌లో కనిపించినట్లు ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ తెలిపారు.

''డైనోసార్స్ ఖండాంతర జీవులు. ప్రాణహిత - గోదావరి బేసిన్‌లో గోండ్వానా డిపాజిట్లున్నాయి. ఆ సమయంలో శిలాజాలు ఏర్పడ్డాయి. అవన్నీ నదులు, చెరువుల వద్ద డిపాజిట్ అయ్యాయి'' అని చెప్పారు.

సారోపాడ్, థారోపాడ్ డైనోసార్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సారోపాడ్, థారోపాడ్ డైనోసార్లు

సారోపాడ్, థారోపాడ్ డైనోసార్లు అంటే ఏమిటి?

డైనోసార్లలో రకాలున్నాయి. వీటిల్లో సారోపాడ్, థారోపాడ్ ముఖ్యమైన రకాలుగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

భారత్‌లో ఇప్పటివరకు లభించిన ఆనవాళ్ల మేరకు జురాసిక్ పీరియడ్, ఆ తర్వాత కాలంలో సారోపాడ్, థారోపాడ్ రకానికి చెందిన డైనోసార్లు నడయాడినట్లు ఆనవాళ్లున్నాయి.

ఈ రెండు రకాల మధ్య తేడాలను ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ బీబీసీకి వివరించారు.

''సారోపాడ్ డైనోసార్స్ సాధారణంగా పెద్ద జీవులు. ఈ భూమిపై నివసించిన పెద్ద జీవుల్లో సారోపాడ్ డైనోసార్స్ ఒకటని చెప్పవచ్చు. ఇవి 30-40 మీటర్ల ఎత్తుతోపాటు 70-100 టన్నుల బరువు ఉంటాయి.

పుర్రె పరిమాణం చిన్నగా ఉంటుంది. నాన్ సెరైటెడ్ అంటే రంపం లాగా కాకుండా దంతాలు సాధారణంగా ఉంటాయి. వీటికి పొడవైన మెడ, తోక ఉంటాయి. నాలుగు కాళ్ల మీద నడుస్తాయి. సారోపాడ్ రకం డైనోసార్స్ శాకాహారులు'' అని వివరించారు.

థారోపాడ్ రకం డైనోసార్లు మాంసాహార జీవులని చెప్పారాయన.

''థారోపాడ్ డైనోసార్స్‌కు పెద్ద పుర్రె ఉంటుంది. ముందు కాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. దానివల్ల అవి రెండు కాళ్లపైనే నడుస్తాయి. చాలా పొడవైన తోక ఉంటుంది. వీటి ఎత్తు 7-12 మీటర్ల వరకు ఉంటుంది. బరువు 2-9 టన్నుల వరకు ఉంటుంది. దంతాలు రంపంలా ఉంటాయి'' అని చెప్పారు.

అలాగే సారోపాడ్ రకం డైనోసార్స్ నడిస్తే ఏనుగు పాదాల తరహాలో పాదముద్రలు ఏర్పడితే, థారోపాడ్ రకానివి ముందు భాగంలో మూడు వేళ్లు ఉంటాయి. ఇలా ఉండటాన్ని ట్రై డక్టైల్ అని చెబుతారని జీవీఆర్ ప్రసాద్ వివరించారు.

డైనోసార్ల పాదముద్రలు గుర్తించిన ప్రాంతం
ఫొటో క్యాప్షన్, పాదముద్రలు గుర్తించిన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగావ్ గ్రామం శివారు

1970-80లలో గుర్తింపు

తెలంగాణలో డైనోసార్ల ఉనికి నాలుగైదు దశాబ్దాల కిందటే వెలుగులోకి వచ్చింది.

ప్రాణహిత-గోదావరి బేసిన్‌లో డైనోసార్లు తిరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి.

1975లో కోట ఫార్మేషన్ నేలల్లో సారోపాడ్ రకానికి చెందిన 'బారపాసారస్ టాగోరై' డైనోసార్ శిలాజ ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి మహారాష్ట్రలోని శిరోంచ ప్రాంతంలో లభించాయి.

ఆ తర్వాత తెలంగాణలో తొలిసారిగా 1988లో ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి ప్రాంతంలో మరోసారి డైనోసార్ శిలాజ ఎముకలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త పి.యాదగిరి గుర్తించారు.

ప్రస్తుతం పాదముద్రలు కనిపించిన సాలిగావ్ గ్రామానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వేమనపల్లి ఉంటుంది.

''యాదగిరి గుర్తించిన సారోపాడ్ డైనోసార్‌కు కోటసారస్ యెమనపల్లిన్సిస్ అని పేరు పెట్టారు. కోటసారస్ అంటే కోట ఫార్మేషన్ అని, వేమనపల్లి గ్రామంలో దొరికాయి కాబట్టి గుర్తుగా యెమనపల్లిన్సిస్ అని పేరు పెట్టారు'' అని ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

యాదగిరి చేసిన పరిశోధన ఫలితాలు 2010లో వెర్టిబ్రేట్ పాలియెంటాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం, ప్రస్తుత మంచిర్యాల జిల్లా వేమనపల్లి సమీపంలో రాజారం గ్రామం వద్ద 12 డైనోసార్లకు చెందిన 840 శిలాజ ఎముకలు లభించాయి. ఇవి 16 కోట్ల సంవత్సరాల కిందటి డైనోసార్ ఎముకలుగా అంచనా వేశారు. దాదాపు 2400 క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు చేపట్టినట్లుగా పరిశోధనా పత్రంలో ఉంది.

మంచిర్యాల జిల్లా వేమనపల్లి సమీపంలో రాజారం గ్రామంలో డైనోసార్ల శిలాజ ఎముకలు గుర్తించారు
ఫొటో క్యాప్షన్, 12 డైనోసార్లకు చెందిన 840 శిలాజ ఎముకలు లభించింది ఇక్కడే

''రాకాసి బొక్క'' - ఎముకలు దొరికిన ప్రదేశం

ఎముకలు లభించిన ప్రాంతానికి బీబీసీ వెళ్లింది. రాజారం గ్రామం నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో అడవి వంటి ప్రదేశంలో ఇది ఉంది.

ఈ ప్రదేశం గురించి కాస్త యుక్త వయసులో ఉన్న వారికి తెలియడం లేదు. గ్రామానికి వెళ్లి మేం అడిగినప్పుడు తెలియదని వారు చెప్పారు.

కొందరు వయసు మళ్లిన వారు మాత్రం ఆ ప్రదేశం తెలుసని చెప్పారు.రాజారం గ్రామస్థులు లక్ష్మయ్య, శంకర్‌లు డైనోసార్ ఎముకలు లభించిన ప్రదేశాన్ని మాకు చూపించారు.

చుట్టూ చెట్ల మధ్య ఎండిపోయిన నీటి మడుగు తరహాలో ఆ ప్రదేశం ఉంది. అక్కడ తవ్విన మట్టిని చుట్టూ వేయడంతో ఆ ప్రదేశం చిన్న గొయ్యిని తలపిస్తోంది.

దీన్ని స్థానికులు 'రాకాసి బొక్క'గా పిలుస్తుంటారు.

రాక్షసి బల్లుల (డైనోసార్ల) ఎముకలు లభించిన ప్రదేశం కావడంతో అలా పిలుచుకుంటున్నట్లుగా లక్ష్మయ్య చెప్పారు.

''చాలా ఏళ్ల కిందట ఇక్కడ తవ్వారు. ఆ సమయంలో రాక్షసి బల్లుల ఎముకలు దొరికాయని చెప్పారు. చాలా కాలం పాటు టెంట్లు వేసుకుని తవ్వకాలు జరిగాయి. ఇక్కడ దొరికిన బొక్కలను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు'' అని లక్ష్మయ్య చెప్పారు.

డైనోసార్ల అవశేషాలు
ఫొటో క్యాప్షన్, బి.ఎం బిర్లా సైన్స్ మ్యూజియంలో పొందుపరిచిన ఫోటోలో కనిపిస్తున్న డైనోసార్ల అవశేషాలు

బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రదర్శన

రాజారం గ్రామంలో లభించిన శిలాజ ఎముకలను 1988లో యాదగిరి నేతృత్వంలో హైదరాబాద్ తీసుకువచ్చి 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా'లో ఉంచారు.

తర్వాత బీఎం బిర్లా సైన్స్ సెంటర్‌కు తరలించి అక్కడ డైనోసార్ స్కెలిటన్ నిర్మాణం తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు.

ప్రస్తుతం బిర్లా సైన్స్ సెంటర్ 'డైనోసారమ్'లో ఈ డైనోసార్ అస్థిపంజరం కనిపిస్తుంటుంది.

దీని పుర్రె భాగం తవ్వకాలలో లభించలేదు. యూఎస్ఏలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో నమూనా ఆధారంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పుర్రె తయారు చేసి అతికించినట్లు బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచిన సమాచారం మేరకు తెలుస్తోంది.

ఈ డైనోసార్ స్కెలిటన్ 14.2 మీటర్ల పొడవు, 3.7 మీటర్ల ఎత్తుతో కనిపిస్తుంటుంది. అది జీవించి ఉన్న సమయంలో 40 టన్నుల బరువు ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

డైనోసార్ల పాదముద్రలు

పాదముద్రలు పరిరక్షించాలంటున్న పరిశోధకులు

ప్రస్తుతం డైనోసార్స్ పాదముద్రలు కనిపించిన సాలిగావ్‌లోని ప్రదేశం ముప్పు అంచున ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

''సున్నపు రాతి ప్రాంతం కావడంతో తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ లభించే రాళ్లను ఇళ్ల పునాదుల్లో వాడుతుంటారు. ఈ ప్రాంతం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి'' అని సముద్రాల సునీల్ అన్నారు.

ఈ విషయంపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను బీబీసీ సంప్రదించింది.

"డైనోసార్ శిలాజ పాదముద్రల ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలూ జరగకుండా చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా తవ్వకాలు చేసేందుకు వీల్లేదు. స్థానిక అధికారులను కూడా అప్రమత్తం చేసి ఏ విధమైన తవ్వకాలకూ ఆస్కారం లేకుండా చూస్తాం" అని కలెక్టర్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)