మూవీ రివ్యూ: దృశ్యం -3 మొదటి రెండు భాగాలను మించిన థ్రిల్ ఇచ్చిందా?

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

మోహ‌న్‌లాల్ న‌టించిన దృశ్యం-3 థియేట‌ర్‌లోకి వ‌చ్చింది. దృశ్యం తొలి రెండు భాగాలు అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్ అయ్యాయి.

ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ థ్రిల్ల‌ర్స్ తీయ‌డంలో నిష్ణాతుడు. తెలుగులో వెంక‌టేశ్‌ న‌టించాడు. అయితే దృశ్యం-3 మ‌ళ‌యాళం నుంచి డ‌బ్ అయి నేరుగా వ‌చ్చేసింది. అందువ‌ల్ల తెలుగులో వెంక‌టేశ్‌తో ఇక లేన‌ట్టే.

పెద్ద‌గా ప్ర‌చారం లేక‌పోయినా తెలుగులో కూడా ఈ సినిమాపై అంచ‌నాలున్నాయి. కార‌ణం మోహ‌న్‌లాల్‌. మ‌రి ఆ అంచ‌నాలు అందుకుందా?

మొద‌టి రెండు భాగాలు క‌థ మ‌న‌కి తెలుసు. జార్జ్ కుట్టి (మోహ‌న్‌లాల్‌) పెద్ద కూతురు అంజు త‌న‌ని తాను రక్షించుకునే క్ర‌మంలో వ‌రుణ్ అనే కుర్రాడి హ‌త్య జ‌రుగుతుంది.

ఆ కుర్రాడి త‌ల్లి పెద్ద పోలీస్ అధికారిణి. ఈ కేసు నుంచి కుటుంబాన్ని ర‌క్షించుకోడానికి జార్జ్ ఏం చేశాడ‌నేది ఫ‌స్ట్ పార్ట్‌.

తన కుమారుడి హ‌త్య కేసులో హంత‌కుడు జార్జే అని నిరూపించ‌డానికి ఆ మహిళా పోలీస్ అధికారి కేసుని తిర‌గ‌దోడితే దొర‌క్కుండా జార్జ్ ఎలా ప్లాన్ చేశాడ‌నేది సెకండ్ పార్ట్‌.

లేడీ ఆఫీసర్ పాత్ర ఎలా ఉందంటే?

దృశ్యం-3లో మోహ‌న్‌లాల్ తీసిన సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది. అక్క‌డి నుంచి క‌థ ప్రారంభ‌మ‌వుతుంది. అత‌ని పెద్ద కూతురు పెళ్లీడుకి వ‌స్తే సంబంధాలు చూస్తూ వుంటాడు. వ‌రుణ్ హ‌త్య కేసుని తిర‌గ‌తోడ్డానికి ఒక టీవీ చానెల్ లేడీ రిపోర్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తూ వుంటుంది. జార్జ్ వ‌ల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఒక పోలీస్ అధికారి ప‌గబ‌ట్టి వుంటాడు.

ఈ నేప‌థ్యంలో జార్జ్ కూతురికి వ‌స్తున్న సంబంధాలను ఎవ‌రో చెడ‌గొడుతూ వుంటారు. త‌న చుట్టూ ఏదో జ‌రుగుతూ వుంద‌ని జార్జ్‌కి అర్థ‌మ‌వుతుంది. త‌న కూతురిని, కుటుంబాన్ని మ‌ళ్లీ ఎలా కాపాడుకున్నాడ‌నేది క‌థ‌. కొడుకుని పోగొట్టుకుని డిప్రెషన్‌తో అమెరికాకు వెళ్లిపోయిన లేడీ ఆఫీస‌ర్ రోల్ ఏంట‌నేది కూడా కీల‌కం.

పతాక సన్నివేశాలు తప్ప...

దృశ్యం రెండు భాగాలు హిట్ కావ‌డానికి కార‌ణం బిగువైన స్క్రీన్ ప్లే. దృశ్యం-3లో అది లోపించింది. మొద‌టి పార్ట్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ , హీరో ఫ్యామిలీ ఎమోష‌న్ క‌ల‌గ‌ల‌సి వుంటాయి. రెండో పార్ట్‌లో కూడా ఇది కొన‌సాగింది. హీరోకి తాను చేస్తున్న‌ది త‌ప్ప‌ని తెలుసు. కానీ ఫ్యామిలీని కాపాడుకోడానికి వేరే దారి లేదు. భావోద్వేగాల‌తో పాటు షాకింగ్‌కి గురి చేసే స‌న్నివేశాలు రెండు భాగాల్లో వున్నాయి.

పార్ట్‌-3లో సంఘ‌ర్ష‌ణ అర్థం కావ‌డానికి స‌గం స‌మ‌యం స‌రిపోతుంది. రెండు భాగాలు చూసిన‌వాళ్ల‌కి అంత‌కు మించి వుంటుంద‌నే అంచ‌నా వుంటుంది. క‌థ టేకాఫ్‌కే గంట పట్టింది. జార్జ్ మీద ప‌గ పెట్టుకున్న వాళ్లు పెద్ద‌గా సాధించింది కూడా వుండ‌దు. హీరో తెలివి, ఎత్తుగ‌డ‌ల‌కి స్కోప్ లేదు. క్లైమాక్స్ చివ‌రి 15 నిమిషాలు త‌ప్ప‌, మిగ‌తా అంతా న‌త్త‌న‌డ‌క‌, లూజ్ స్క్రిప్ట్‌.

బ‌హుశా తెలుగులో వెంక‌టేశ్‌కి స్క్రిప్ట్ న‌చ్చి వుండ‌దు. అందుకే న‌టించ‌లేదు. మ‌ళ‌యాళం చూడ‌కుండా తెలుగు మాత్ర‌మే చూసిన వాళ్ల‌కి దృశ్యం-3 గంద‌ర‌గోళంగా వుంటుంది. తెలియ‌ని మ‌లయాళ న‌టుల‌తో ఐడెంటిపై కావడం క‌ష్టం. పాత క‌థ‌నంతా గుర్తు పెట్టుకుని పార్ట్ 3 చూడాల్సిరావ‌డం స‌హ‌నానికి ప‌రీక్ష‌.

‘మోహన్ లాల్ నటన ఎలా ఉందంటే...’

మోహ‌న్‌లాల్ న‌ట‌న‌కి పేరు పెట్ట‌లేం. డ‌బ్బింగ్ కూడా ఆయ‌నే చెప్పుకున్నాడు. క్లైమాక్స్‌లో ఆయ‌న న‌ట‌న గుర్తుండిపోతుంది. మీనాకి పెద్ద ప్రాధాన్య‌త లేదు. మిగ‌తా న‌టులంతా ఓకే. క‌థ‌లో బ‌ల‌మైన స‌న్నివేశాలు, సంఘ‌ర్ష‌ణ‌, ఎమోష‌న్ లేదు. ఇది పెద్ద లోపం. పార్ట్ -4 కూడా ఉన్న‌ట్టు సూచ‌న ఇచ్చారు. ఇక ఇక్క‌డితో వ‌దిలేయ‌డం మంచిది. చెట్టు పేరు చెప్పి కాయ‌ల్ని ప‌దేప‌దే అమ్మ‌లేం.

ప్ల‌స్ పాయింట్స్:

1.మోహ‌న్‌లాల్ న‌ట‌న‌

2.బీజీఎం

3.క్లైమాక్స్‌

మైన‌స్ పాయింట్స్:

1.న‌త్త న‌డ‌క స్క్రీన్ ప్లే

2.ఎడిటింగ్ (159 నిమిషాల నిడివి అన‌వ‌స‌రం)

3.ఎమోష‌న్ లోపించ‌డం

ఫైన‌ల్‌గా పార్ట్‌ 3కి అంత దృశ్యం లేదు.

(నోట్: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)