జంతర్ మంతర్: ‘లైంగికంగా వేధించారు’ అని దిల్లీ పోలీసులపై మహిళా జర్నలిస్టులు చేసిన ఆరోపణలపై ఏం జరిగింది?

నిరసన, మహిళలు, జర్నలిస్టులు, దిల్లీ, పోలీసులు
ఫొటో క్యాప్షన్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట మహిళా జర్నలిస్టులు ఆందోళన చేశారు.
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసన సందర్భంగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు, నిరసనలో పాల్గొన్న ఒక యువతి తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఒక పోలీసు అధికారి, పోలీసు సిబ్బంది తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.

ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏసీపీ వివేక్ భగత్ తన ఛాతీపై చేయివేసి తనను పక్కకు తోసేశారని ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు.

అదే సమయంలో ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్, నిరసనలో పాల్గొన్న ఒక మహిళ కూడా దిల్లీ పోలీసు సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఈ ముగ్గురు మహిళలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుల కాపీలు బీబీసీ దగ్గరున్నాయి.

ఫిర్యాదులు స్వీకరించామని, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక దిల్లీ పోలీస్ అధికారి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒక మహిళా జర్నలిస్ట్ చేసిన ఆరోపణలపై ఏసీపీ వివేక్ భగత్‌ను ప్రశ్నించగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ కేసు దర్యాప్తును దిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్టు దిల్లీ పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు.

"అక్టోబర్ 3, 2026న న్యూదిల్లీ ప్రాంతంలో జరిగిన ఒక నిరసన ప్రదర్శన సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు" అని దిల్లీ పోలీసులు 'ఎక్స్'లో రాశారు.

న్యూదిల్లీ పోలీసులు వారి ఫిర్యాదులను స్వీకరించి, నిష్పక్షపాత విచారణ కోసం క్రైమ్ బ్రాంచ్‌కు పంపించారని తెలిపారు.

నిరసన, మహిళలు, జర్నలిస్టులు, దిల్లీ, పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఫిర్యాదు చేసేందుకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు.

లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆ మహిళలు ఏం చెప్పారు?

ఒక మహిళా జర్నలిస్ట్ మాట్లాడుతున్న వీడియోను కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఫిర్యాదు చేయడానికి దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళానని, దాదాపు మూడున్నర గంటలు వేచి చూసినా తన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు.

తనకు మద్దతుగా చాలా మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ఉన్నప్పటికీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని మహిళా జర్నలిస్ట్ అన్నారు.

నిరసన ప్రదర్శనలో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో వారి నుంచి ఒక బైట్‌ తీసుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ సమయంలో ఎవరో వెనకనుంచి ప్రైవేట్ పార్ట్‌తో తన వీపును తాకుతున్నట్టు అనిపించిందని ఆమె ఆరోపించారు. వెనక్కి తిరిగి చూడగా ఒక పోలీసు తనకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నారని,

ఈ ఘటనకు సంబంధించిన వీడియో తన వద్ద ఉందని ఆమె ఫిర్యాదులో రాశారు.

అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో కనిపించిన మహిళా జర్నలిస్ట్ తన ఫిర్యాదులో పోలీసులు నేహా బోరాను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తాను వీడియో తీస్తున్నానని తెలిపారు.

"ఆమెను అదుపులోకి తీసుకోవడానికి అక్కడ మహిళా పోలీసు అధికారులు ఎవరూ లేరు" అని ఆమె ఆ వీడియోలో చెప్పారు.

"నేను దీనిపై ప్రశ్నించగా వివేక్ భగత్ అనే అధికారి నా ఛాతీపై చెయ్యిపెట్టి నన్ను తోసేశారు. నన్ను అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. నేను ఆయన్ను మళ్ళీ ప్రశ్నించాను. నా దగ్గర వీడియో ఉందని చెబుతూ నన్ను ఒక మూలకు నెట్టమని ఓ మహిళా కానిస్టేబుల్‌కు చెప్పారు" అని ఆమె వీడియోలో వివరించారు.

జంతర్ మంతర్ ప్రదర్శన దగ్గర నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నప్పుడు ఒక పోలీసు అధికారి తనతో అనుచితంగా, అభ్యంతరకరంగా, అసభ్యంగా శారీరక దాడి చేశారని మరో మహిళా నిరసనకారిణి ఆరోపించారు. ఆయన తనను కొట్టారని, ఛాతీపై దాడి చేశారని చెప్పారు.

నిరసన, మహిళలు, జర్నలిస్టులు, దిల్లీ, పోలీసులు
ఫొటో క్యాప్షన్, దిల్లీ పోలీసులు ఏసీపీని రక్షిస్తున్నారా అని సీజేపీ లీగల్ సెల్ ప్రశ్నించింది

ఆ అధికారిని దిల్లీ పోలీసులు రక్షిస్తున్నారా:? సీజేపీ

తీవ్రమైన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులు ఏసీపీని రక్షిస్తున్నారా అని సీజేపీ లీగల్ ఎఫైర్స్ హెడ్ రత్నా సింగ్ ప్రశ్నించారు.

"లైంగిక వేధింపుల కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి దిల్లీ పోలీసులు నిరాకరించారు" అని రత్నా సింగ్ 'ఎక్స్'లో రాశారు.

''ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ జరిపి, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాలని పోలీసులు చెబుతున్నారు. ఇది లలితా కుమారి తీర్పులో నిర్దేశించిన నిబంధనలను పోలీసులు పాటిస్తున్నారా లేదా అనే విషయంలో తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది''

ప్రతి మహిళ సురక్షితంగా ఉంటేనే అందరూ సురక్షితంగా ఉన్నట్టు'' అని రత్నాసింగ్ అన్నారు.

నిరసన, మహిళలు, జర్నలిస్టులు, దిల్లీ, పోలీసులు
ఫొటో క్యాప్షన్, కేసు ఎందుకు నమోదు చేయలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ఏమంటున్నారు?

దిల్లీ మహిళా జర్నలిస్టు ఆరోపణల తర్వాత పోలీసు అధికారుల వ్యవహారశైలిని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

"జంతర్ మంతర్ వద్ద ఒక పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారని ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. గంటల తరబడి వందలాది మంది జర్నలిస్టులు అక్కడ కూర్చుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పోలీసుల ప్రాథమిక భాధ్యత కాదా? వాళ్ళు కనీసం అది కూడా చేయలేదు"అని రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

"ఈరోజే జంతర్ మంతర్ వద్ద వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. కెమెరాలను లాక్కున్నారు, జర్నలిస్టులను ఈడ్చుకెళ్లారు. ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా, పోలీసు అధికారులు మహిళలతో దారుణంగా ప్రవర్తించడాన్ని వీడియో సాక్ష్యాలతో మనం చూశాం," అని ఆయన అన్నారు.

మహిళల భద్రతకు బాధ్యత వహించాల్సిన పోలీసులే మహిళలపై చేయి చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.

నిరసన, మహిళలు, జర్నలిస్టులు, దిల్లీ, పోలీసులు
ఫొటో క్యాప్షన్, మహిళా జర్నలిస్ట్‌ల ఫిర్యాదుపై తక్షణమే చర్య తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కోరింది.

ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రకటన

దిల్లీ పోలీసుల తీరుపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

జర్నలిస్టులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన విషయమని పేర్కొంది.

"ఒక ఏసీపీ తనను వేధించారని, లైంగికంగా దాడి చేశారని ఒక మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఆ ఆమె శనివారం రాత్రి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడానికి చాలా గంటలపాటు ప్రయత్నించానని కానీ పోలీసులు తన ఫిర్యాదుపై ఇంకా చర్య తీసుకోలేదని ఆమె తెలిపారు"

పలు స్వతంత్ర సంస్థలు, పోర్టల్‌లకు చెందిన జర్నలిస్టులు తమ వద్ద ప్రెస్ కార్డులు ఉన్నాయని, తాము మీడియాకు చెందినవారమని పదేపదే చెప్పినప్పటికీ, పోలీసులు వారితో హింసాత్మకంగా, దురుసుగా ప్రవర్తించారు. నిరసనకారులతో పాటు కొంతమంది జర్నలిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు'' అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

మహిళా జర్నలిస్టు ఫిర్యాదుపై దిల్లీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది.

జర్నలిస్టులు తమ పని చేసుకోవడానికి అవసరమైన స్వేచ్ఛ లభించేలా చూడాలని, వారు పోలీసుల దౌర్జన్యం, బెదిరింపులను ఎదుర్కోవలసిన పరిస్థితులు సృష్టించకూడదని కోరింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)