ఐదోసారి: శంకుస్థాపనల్లోనే కడప స్టీల్‌ ప్లాంట్‌, పేర్లు మార్చుతూ, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేశారంటే...

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మొదటిసారి: 2007 జూన్‌ 10వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి 'బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌' స్టీల్‌ ప్లాంట్‌కి శంకుస్థాపన చేశారు.

రెండోసారి: 2018 డిసెంబర్‌ 27న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు కంబాలదిన్నె వద్ద ఇదే స్టీల్‌ ప్లాంట్‌కి శంకుస్థాపన చేశారు.

మూడో సారి: 2019 డిసెంబర్‌ 23న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద శంకుస్థాపన చేశారు.

నాలుగో సారి: 2023 ఫిబ్రవరి 14న వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఇదే స్టీల్‌ప్లాంట్‌ పనులకు మరోసారి శంకుస్థాపన చేశారు.

ఇప్పుడు ఐదోసారి: కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులకు జూలై 3వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్‌ బీబీసీతో మాట్లాడుతూ ధృవీకరించారు.

కడప ఉక్కు పరిశ్రమ నేపథ్యం ఏంటి?

రాయలసీమ ప్రజల దశాబ్దాల కలగా అభివర్ణించే కడప ఉక్కు కర్మాగారం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

దాదాపు 19 ఏళ్లుగా నాలుగు మార్లు పేరు మార్చుకుని...ఆ నాలుగు సార్లు కూడా కేవలం శంకుస్థాపనలకే పరిమితమైన ఈ స్టీల్‌ ప్లాంట్‌కి మళ్లీ శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అసలు ఎందుకు ఇన్నిమార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు కొలిక్కి రాలేదు? అసలేమిటీ కడప ఉక్కు నేపథ్యం?

‘బ్రాహ్మణి స్టీల్స్‌ పేరుతో’

మొదటిసారి 2007 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్‌ పేరుతో ఈ ప్రాజెక్టుకు తొలిసారి శంకుస్థాపన చేసి 10,670 ఎకరాల భూములను కేటాయించారు.

జమ్మలమడుగు రూరల్‌ ఏరియాలో ఈ ప్లాంట్‌ పనులు మొదలుపెట్టారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన రెడ్డికి ఈ స్టీల్‌ప్లాంట్‌ పనులు అప్పజెప్పడం, అప్పట్లో ఆయనపై ఓబులాపురం గనుల ఆరోపణలు రావడం, సీబీఐ కేసులు.. తదనంతర పరిణామాల నేపథ్యంతో పాటు వై.ఎస్‌. హఠాన్మరణం తర్వాత ఈ ప్లాంట్‌ పనులు నిలిచిపోయాయి.

‘రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరుతో’

2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో ఈ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రధాన హామీగా కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. 2014లో ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఆ తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఇక్కడ ఫీజిబిలిటీ లేదనే వాదనలు తీసుకువస్తోందని ఆక్షేపించిన అప్పటి సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతుందని ప్రకటించారు.

ఆ మేరకు 2018 డిసెంబర్‌ 27న రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరుతో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో శంకుస్థాపన చేశారు. అయితే నాలుగు నెలలకే ఎన్నికలు రావడంతో పనులు మొదలు కాలేదు.

‘ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌’

2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది డిసెంబర్‌ 27న గతంలో చంద్రబాబు చేసిన ప్రదేశంలో కాకుండా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట శంకుస్థాపన చేశారు.

కానీ కరోనా ప్రభావంతో పనులు మొదలుకావడంలో జాప్యం జరిగిందని అప్పట్లో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.

‘వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరుతో’

2023 ఫిబ్రవరి 14న వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌గా పేరు మార్చి పెద్దదండ్లూరు– సున్నపురాళ్లపల్లె సమీపంలోనే మరోసారి వై.ఎస్‌. జగన్‌ శంకుస్థాపన చేశారు. 16 వేల కోట్ల రూపాయల వ్యయంతో 6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీని రెండు దశల్లో ఏర్పాటు చేస్తామని ఆ సందర్భంగా ప్రకటించారు.

ఈ ప్లాంట్‌ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యు( జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.

‘రెండేళ్లలో పూర్తిచేస్తాం’

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని ఈ సారి తప్పకుండా చేపడతామని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఆ మేరకు 2025లో మేలో కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు వేదికపైనుంచి ఓ ప్రకటన చేశారు చంద్రబాబు.

జూన్‌ 12 లోపు కడప ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఏడాది తర్వాత, వచ్చే నెల జూలై 3న మరోసారి కడప ఉక్కు పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని ఇటీవలి మంత్రిమండలి సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్ధసారధి చెప్పారు.

''ఈ సారి స్టీల్‌ ప్లాంట్‌ పనులకు కేవలం శంకుస్థాపన కాదు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా పనులు మొదలు కానున్నాయి. ఈ కర్మాగారానికి రెండు దశల్లో కలిపి 16,350 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. జిందాల్‌ సంస్థనే ఇది చేపట్టనుంది. మొదటి దశలో పదిలక్షల టన్నుల సామర్ధ్యం ఉన్న ప్లాంట్‌ నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కచ్చితంగా పూర్తవుతుందన్న నమ్మకం మాకుంది'' అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్‌ బీబీసీతో చెప్పారు.

మేం చేపట్టిన పనులే కదా.. వైసీపీ

కడప స్టీల్‌ ప్లాంట్‌ ఘనత ఎప్పటికైనా తమదేనని వైసీపీ అంటోంది.

''నాడు వై.ఎస్‌. తీసుకువచ్చారు. తర్వాత వై.ఎస్‌. జగన్‌ పనులు మొదలు పెట్టారు. చాలా వరకు అయ్యాయి కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాము కుదుర్చుకున్న సంస్థతోనే పనులు చేస్తామని చెబుతోంది.

మేం మొదటి నుంచి చెబుతోంది అదే. వై.ఎస్‌. జగన్‌ చేపట్టిన పనులను కొనసాగించడం తప్పించి మీరు కొత్తగా చేసేదేమీ లేదు'' అని వైఎస్సార్‌ కడప జిల్లా వైసీపీ సీనియర్‌ నేత సురేశ్ బాబు బీబీసీతో అన్నారు.

ఈసారైనా పూర్తయితే చాలంటున్న ప్రజలు

ఉక్కుపరిశ్రమ వస్తుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు దక్కుతాయని ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు.

‘‘ఈసారైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు మొదలై నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తయితే చాలు’’ అని కడప జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు శివరాం అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)