You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'శిథిలాల కింద నుంచి బాధితుల మూలుగులు, అరుపులు వినిపించాయి'
- రచయిత, టిఫనీ టర్న్‌బుల్, కెల్లీ ఎన్‌జీ, లీయెరె వెన్‌తాస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
బుధవారం సాయంత్రం వెనెజ్వెలా నేల ఒక్కసారిగా తీవ్రంగా కంపించడం ప్రారంభించగానే కారకస్‌లోని తన అపార్ట్‌మెంట్ గోడలు తనపై కూలిపోతాయేమోనని వెరోనికా భయపడిపోయారు.
‘నేను చనిపోతాననుకున్నాను’ అని ఆమె బీబీసీతో చెప్పారు.
ఆ రోజు జాతీయ సెలవు దినం కావడంతో ఆమె తన తల్లితో కలిసి ఇంట్లో ఉండగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో కొన్ని సెకన్ల వ్యవధిలో రెండు భూకంపాలు నగరాన్ని కుదిపేశాయి.
మొదటి భూకంపం తీవ్రత 7.2గా, రెండోది 7.5గా నమోదైంది.
వెనెజ్వెలా రాజధాని కారకస్ వీధుల్లో శిథిలాలు పేరుకుపోయాయి. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కొన్ని వీడియోల్లో ప్రజలు సహాయం కోసం అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.
వెనెజ్వెలాలో విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో గందరగోళం మరింత పెరిగింది.
రాత్రి కాగానే ఇళ్లను కోల్పోయిన అనేకమంది స్థానికులు తమ ఇళ్లు, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వీధుల్లోనే వేచి ఉన్నారు.
వెరోనికా బీబీసీ ముండో జర్నలిస్టు వాలెంటినా ఒరోపెజా సోదరి. భూకంపాల తర్వాత తన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి వాలెంటినా గంటల తరబడి ప్రయత్నించారు.
భూకంప ప్రకంపనలను వివరిస్తూ వెరోనికా పంపిన ఒక వాయిస్ సందేశం వాలెంటినా ఫోన్‌కు చేరింది. అందులో వెరోనికా "భయంకరమైన" ప్రకంపనల గురించి చెబుతుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆమె తల్లి గొంతు వినిపించింది. ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదు.
ఆందోళనకు గురైన వాలెంటినా తన కాంటాక్టుల ద్వారా సహాయం కోరడం ప్రారంభించారు. అదే సమయంలో వారి వీధిలో కూలిపోయిన భవనాల చిత్రాలు ఆమె ఫోన్‌కు చేరసాగాయి.
ఎట్టకేలకు వెరోనికాను సంప్రదించగలిగారు. తాను, తన తల్లి క్షేమంగా ఉన్నామని వెరోనికా తెలిపారు. అయితే తమ ఇల్లు దాదాపు నాశనమైందని చెప్పారు.
"భవనం పూర్తిగా ధ్వంసమైంది. గోడలన్నీ పగిలిపోయాయి" అని ఆమె అన్నారు.
వెనెజ్వెలా రాజధానిని భారీ భూకంపం తాకడం ఇదే మొదటిసారి కాదు.
అయితే బుధవారం సంభవించిన భూకంపాలు మరింత తీవ్రంగా, ఎక్కువసేపు కొనసాగాయని వాలెంటినా తల్లి తెలిపారు.
"ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామని నేను ఎప్పుడూ ఊహించలేదు" అని ఆమె వణుకుతున్న స్వరంతో చెప్పారు.
తూర్పు కారకస్‌కు చెందిన కోరో మార్టినెజ్ కూడా రాయిటర్స్ వార్తా సంస్థతో ఇదే విషయాన్ని తెలిపారు.
"ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు" అని 56 ఏళ్ల మార్టినెజ్ చెప్పారు.
"భారీ శబ్దం వినిపించింది. ఇంట్లో వస్తువులు కిందపడ్డాయి. ఫ్రిజ్‌లో ఉన్న జగ్గులు కూడా పడిపోయాయి" అని ఆమె గుర్తు చేసుకున్నారు.
కారకస్ నగర నడిబొడ్డులో ఉన్న పాలోస్ గ్రాండెస్‌లో ఏడో అంతస్తు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న బీబీసీ ముండో జర్నలిస్టు నికోల్ కొల్‌స్టర్ తన ఇంటి కిటికీలు కంపించడం మొదలుకాగానే అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. చాలా కొద్ది సమయమే దొరికిందామెకు.
"నన్ను నేను రక్షించుకోవడానికి ప్రధాన ద్వారం, రాతి గోడ మధ్య నిలబడటమే నాకు తోచింది. భవనం నా మీద కూలిపోతుందని అనుకున్నా" అని ఆమె అన్నారు.
వీధిలోకి వచ్చిన తర్వాత శిథిలాల కుప్పల కింద నుంచి ప్రజల మూలుగులు వినిపించాయని ఆమె చెప్పారు.
ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన వారు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ కనిపించారని వెల్లడించారు.
"తమ పెంపుడు జంతువులను బయటకు తీసుకురాలేకపోయామని తీవ్ర ఆవేదనలో ఉన్నవారు చాలామంది ఉన్నారు" అని కొల్‌స్టర్ చెప్పారు.
కారకస్‌కు చెందిన ఉపాధ్యాయుడు అలన్ చుంగ్ కూడా అలాంటి వారిలో ఒకరు. తన రెండు పిల్లులు ప్రాణాలతో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆయన ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
" నా అపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్లి అవి క్షేమంగా ఉన్నాయో లేదో చూడలేకపోయాను. అవి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ఆయన బీబీసీ రేడియో 4 టుడే కార్యక్రమానికి తెలిపారు.
కారకస్‌కు ఉత్తరాన ఉన్న అత్యంత ప్రభావిత రాష్ట్రం లా గ్వైరా వంటి ప్రాంతాల నుంచి సమాచారం అందడానికి మౌలిక సదుపాయాలు దెబ్బతినడం అడ్డంకిగా మారింది.
అయితే అక్కడి నుంచి వచ్చిన చిత్రాలు, వీడియోల్లో కూలిపోయిన భవనాలు, భారీ అగ్నిప్రమాదాలు, కార్లను తాత్కాలిక ఆశ్రయాలుగా ఉపయోగిస్తున్న ప్రజలు కనిపిస్తున్నారు.
ఇళ్లకు తిరిగి వెళ్లలేని వారు లేదా వెళ్లడానికి భయపడుతున్న వారు వీధుల్లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర రాజధానిలోని తాత్కాలిక ఆసుపత్రులకు గాయపడినవారు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.
నగరంలో డజన్ల కొద్దీ భవనాలు కూలిపోయాయని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు.
పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే విషయాన్ని కూడా అధికారులు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)