ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు

- రచయిత, కేథరీన్ ఎల్లిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కోకో సాగు చేయడం ఆపేసినప్పుడు, మళ్లీ ఎప్పటికీ ఆ పంట వేయనని ప్రతిజ్ఞ చేసుకున్నారు రైతు పెరెయా.
కొలంబియాలోని మెటా ప్రావిన్స్‌లో.. ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న తన కొద్దిపాటి పొలంలో కోకో మొక్కలను పీకేసి, వాటి స్థానంలో కసావా, అరటి వంటి పంటలను సాగు చేశారు.
రైతులను కోకో సాగును విరమింపజేయడానికి ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యామ్నాయ సాగు కార్యక్రమంలో(క్రాప్ సబ్‌స్టిట్యూషన్ ప్రోగ్రామ్) చేరిన వేలాది మందిలో పెరెయా ఒకరు.
అయితే ప్రభుత్వం ఇస్తామన్న సహాయంలో చాలా భాగం ఆయనకు అందలేదు. రోడ్లు లేకపోవడం, తరచూ వచ్చే వరదల కారణంగా తాను పండించిన పంటలను అమ్ముకోవడం కూడా కష్టమైంది.
దీంతో నిరాశకు గురైన పెరెయా, 2024లో మళ్లీ కోకో సాగు ప్రారంభించారు.
"ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ పిల్లలు ఉండి, పని లేకపోతే ఇంకేం చేస్తాం? ఎలాంటి సహాయం అందకపోతే మళ్లీ అదే పంట వేయాల్సి వస్తుంది" అని పెరెయా చెప్పారు.
కోకో ఆకులను అక్కడి స్థానిక కమ్యూనిటీలు సంప్రదాయంగా టీలు, ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
అయితే ప్రస్తుతం వాటిలో ఎక్కువ భాగాన్ని కొకైన్‌గా మారుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా సరఫరా అయ్యే కొకైన్‌లో దాదాపు 70 శాతం కొలంబియా నుంచే వస్తుందని అంచనా.


"ఇతర పంటలతో పోలిస్తే కోకోకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దిగుబడి త్వరగా వస్తుంది. రైతులు ఏడాదికి మూడు లేదా నాలుగు పంటలు వేయగలరు. రవాణా కూడా సులభం. తమకు ఎంత ధర వస్తుందో రైతులకు ముందుగానే తెలిసిపోతుంది" అని కోకో ఎకానమీ, ప్రత్యామ్నాయ సాగు వ్యూహాలపై పరిశోధనలు చేస్తున్న కొలంబియా పరిశోధకులు లూకస్ మారిన్ ల్లానెస్ చెప్పారు.
మారిన్ పాల్గొన్న పరిశోధనల ప్రకారం, కోకో సాగు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కూడా ఊతమిస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కొన్నిచోట్ల మున్సిపాలిటీల జీడీపీ 10 శాతం వరకు పెరగడానికి ఇది దోహదపడింది.
కొలంబియాలో కోకో సాగు చేసే రైతులు ఈ పంటను విడిచిపెట్టి చట్టబద్ధమైన జీవనోపాధిని ఏర్పరచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ సాగు కార్యక్రమాలను రూపొందించింది.
అయితే ప్రస్తుతం కోకో సాగు విస్తీర్ణం 2.5 లక్షల హెక్టార్లకు పైగా చేరి రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అనేక మంది కొలంబియా రైతులు తమను ప్రభుత్వం నిరాశపరిచిందని అంటున్నారు.
ఎలెనా హెర్నాండెజ్ 1990లలో కోకో సాగు విస్తరించిన సమయంలో ఎక్కువ ఆదాయం కోసం గువియారే ప్రాంతానికి వెళ్లారు.
"ఆ రోజుల్లో డబ్బు ఎక్కువగా ఉండేది. ఎక్కడ చూసినా డబ్బే. కొంత డబ్బు దాచుకుని ఒక చిన్న ఇల్లు కొనగలిగాను" అని ఆమె చెప్పారు.
అయితే కోకో పరిశ్రమ అభివృద్ధితో పాటు హింస, అభద్రత కూడా పెరిగాయి. ఆ ప్రాంతాలపై ఆధిపత్యం కోసం సాయుధ గ్రూపులు పోరాడగా, ప్రభుత్వం ఆ పంటలను తొలగించడం, వాయుమార్గంలో రసాయనాల పిచికారీ చేయడం, అరెస్టులు చేయడం ద్వారా ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రయత్నించింది.
ఈ చర్యల వల్ల కుటుంబాల ఆదాయం దెబ్బతిన్నా, కోకో సాగును మాత్రం అడ్డుకోలేకపోయాయి.
దీంతో 2017లో అప్పటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ సాగు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, హెర్నాండెజ్ వెంటనే అందులో చేరారు. కోకో సాగును విరమిస్తే ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ఈ కార్యక్రమంలో సుమారు లక్ష కుటుంబాలు చేరాయి.
ప్రతి కుటుంబానికి రెండేళ్ల పాటు విడతల వారీగా 3.6 కోట్ల కొలంబియా పెసోలు(సుమారు రూ.10.6 లక్షల) ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.
"ఈ కార్యక్రమాన్ని మాకు వివరించిన తీరు చూస్తే మా ప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అనిపించింది" అని హెర్నాండెజ్ చెప్పారు.
పీఎన్‌ఐఎస్‌గా పిలిచే ఈ అక్రమ పంటల ప్రత్యామ్నాయ జాతీయ కార్యక్రమం 2016లో ప్రభుత్వం, కొలంబియాలోని అతిపెద్ద గెరిల్లా సంస్థ ఫార్క్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఫలితంగా రూపుదిద్దుకుంది.
రైతులు కోకో మొక్కలను పీకేస్తే, వారికి వ్యవసాయ నిపుణుల నుంచి సాంకేతిక సహకారం, నేల నిర్వహణపై సలహాలు కూడా అందించాలని నిర్ణయించారు.
ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ అవి పరిమిత స్థాయిలోనే అమలయ్యాయి. పీఎన్‌ఐఎస్ మాత్రం అప్పటివరకు చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రయత్నం. ప్రారంభంలో అది విజయవంతమవుతున్నట్టే కనిపించింది.
దక్షిణ మెటా, గువియారే ప్రాంతాల్లోని కొన్నిచోట్ల కోకో పొలాల స్థానంలో నిమ్మ తోటలు, అరటి తోటలు, చిన్న పశుపోషణ కేంద్రాలు ఏర్పడ్డాయి. హెర్నాండెజ్ వంటి అనేక మంది రైతులు కోకో సాగుకు దూరంగానే ఉన్నారు.
అయితే దానర్థం వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతమైనదిగా భావిస్తున్నారని కాదు.
"ప్రభుత్వానికి మా రైతుల పట్ల పెద్దగా నిబద్ధత లేదు. మాతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు" అని హెర్నాండెజ్ చెప్పారు. కార్యక్రమం ప్రారంభ దశలోనే తలెత్తిన సమస్యలను ఆమె ప్రస్తావించారు.
ఆర్థిక సహాయం ఆలస్యంగా అందేది. సాంకేతిక సహకారం కూడా అనేక సందర్భాల్లో అందలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యవస్థ బలహీనంగా ఉండటం, వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సహాయం చాలా సందర్భాల్లో గ్రామాలకు చేరలేదు.

రాజకీయ ప్రాధాన్యతలు మారడంతో ఈ కార్యక్రమం ఊపు కోల్పోయింది. 2018లో కొలంబియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఇవాన్ డూకే నేతృత్వంలోని ప్రభుత్వం, ప్రత్యామ్నాయ సాగు కంటే కోకో నిర్మూలన, భద్రతా వ్యూహాలపైనే మళ్లీ దృష్టి సారించింది.
2022లో ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో అధికారంలోకి వచ్చే నాటికి పీఎన్‌ఐఎస్ కార్యక్రమం ఆలస్యమై, గ్రామీణ ప్రాంతాలకు చేరడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
అయితే కొంతమంది రైతులు పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. దక్షిణ మెటాలోని ప్యూర్టో రికో ప్రాంతానికి చెందిన డొరాల్బా బెహరానో విషయంలో, నిలిచిపోయిన సహాయం తిరిగి అందడం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మెరుగుపడింది.
"ఈ కార్యక్రమానికి ముందు మేము చాలా భయంతో ఉండేవాళ్లం. పోలీసులు, సైన్యం మమ్మల్ని జైలుకు పంపుతారనే భయంతో కోకో పేస్ట్‌ను దాచిపెట్టాల్సి వచ్చేది" అని ఆమె చెప్పారు. కోకో పేస్ట్ అనేది కొకైన్ తయారీలో ఉపయోగించే మరింత సాంద్రీకృత రూపం. ఉత్త ఆకులను విక్రయించడంకంటే దీని ద్వారా సాగుదారులకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది.
"ఇప్పుడు నాకు మనశ్శాంతి ఉంది. నేనెక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలను. గుట్టుగా బతకాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పారు.
తమ ప్రాంతంలో కోకో కాకుండా ఇతర పంటలు, ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించి అమ్ముకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు సహాయం అందిస్తోందని ఆమె తెలిపారు.
ప్రత్యామ్నాయ సాగు కార్యక్రమాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు కొలంబియా వెలుపల ఉన్న పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. అమెరికా, యూరప్‌లలో కొకైన్‌కు కొనసాగుతున్న భారీ డిమాండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త మార్కెట్లు ఏర్పడుతున్నాయి.
"ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఆ డిమాండ్‌ను తీర్చేందుకు సరఫరా కూడా పెరుగుతోంది. అందువల్ల సమీప భవిష్యత్తులో కూడా కొలంబియాలో కోకో సాగు కొనసాగుతుంది" అని బొగోటాలోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆండీస్‌కు చెందిన భద్రత, మాదకద్రవ్యాల అధ్యయన కేంద్రం కో-డైరెక్టర్ మైకెల్ వెయిన్‌ట్రాబ్ చెప్పారు.
కొలంబియాలో భద్రతా పరిస్థితులు ఇప్పటికీ సున్నితంగానే ఉన్నాయని, అందువల్ల అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ సాగు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కష్టమవుతోందని వెయిన్‌ట్రాబ్ చెప్పారు.
2016 శాంతి ఒప్పందం తర్వాత ఫార్క్‌లోని పెద్ద భాగం రద్దయినప్పటికీ, ఆ ఖాళీని ఇతర సాయుధ గ్రూపులు భర్తీ చేశాయి. అవే తరచుగా అక్రమ రవాణా మార్గాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై నియంత్రణ సాధిస్తున్నాయి.
దీన్ని పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం టోటల్ పీస్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో వివిధ సాయుధ, నేర ముఠాలతో శాంతి చర్చలు నిర్వహిస్తోంది. అయితే ఈ దిశగా పురోగతి పరిమితంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
గత ఏడాది ప్రభుత్వం పీఎన్‌ఐఎస్ కార్యక్రమంలో లోపాలను సరిదిద్దుతూ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రెన్‌హసేమోస్ అనే ప్రత్యామ్నాయ సాగు కార్యక్రమాన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో కూడా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే కేవలం పంట మార్పిడికే పరిమితం కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో అభివృద్ధి చేయడంపైనా దృష్టి సారిస్తోంది. ఇందులో రహదారుల అభివృద్ధి, విశ్వవిద్యాలయ విద్యకు అవకాశం, డిజిటల్ కనెక్టివిటీ, మెరుగైన గృహ వసతి వంటి అంశాలు కూడా ఉన్నాయి.
"కోకో అనేది ఒక వ్యాపారం. అది నేరపూరిత వ్యాపారమే కావచ్చు, కానీ మిగతా వ్యాపారాల మాదిరిగానే పనిచేస్తుంది. రెన్‌హసేమోస్ లక్ష్యం కేవలం కోకో మొక్కను మాత్రమే కాదు, దాని చుట్టూ ఏర్పడిన మొత్తం ఆర్థిక వ్యవస్థను తొలగించి దాని స్థానంలో ప్రత్యామ్నాయాలను తీసుకురావడం. ప్రాసెసింగ్ నుంచి వ్యవసాయ పరిశ్రమ, రవాణా, లాజిస్టిక్స్ వరకు అన్నింటినీ ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయడమే మా ఉద్దేశం" అని కొలంబియాలో అక్రమ పంటల ప్రత్యామ్నాయ కార్యక్రమాల బాధ్యతలు చూసే ప్రభుత్వ సంస్థ డైరెక్టర్ గ్లోరియా మిరాండా చెప్పారు.
అయితే ఇలాంటి కార్యక్రమాలు దీర్ఘకాలిక మార్పు తీసుకురాగలవా అన్న సందేహాలు ఇప్పటికీ ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. కోకో సాగు నిరంతరం పెరుగుతుండటం వల్లే ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఫలించలేదని ల్లానెస్ అభిప్రాయపడ్డారు.
తనతో పాటు తన పొరుగువారికి కోకో సాగును వదిలేసేందుకు ప్రభుత్వ సహాయం త్వరలో అందుతుందనే నమ్మకం పెరెయాకు లేదు.
"ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా వదిలేసింది" అని కోకో మొక్కల నడుమనున్న తన చెక్క ఇంటి ముందు నిలబడి ఆయన చెప్పారు. "మేము రోజు గడవడానికే బతుకుతున్నాం. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండదు" అని ఆయన అన్నారు.
ప్రస్తుతానికి తాను కోకోనే సాగు చేస్తానని ఆయన చెప్పారు. "నేను నేరస్థుడినని కాదు. నాకు మరో మార్గం లేదు కాబట్టి. మేము మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులం కాదు. నేను అలాంటివాడినైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బతికుండేవాడిని కాదు" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























