You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్యాబ్లెట్లలో వెజ్, నాన్ వెజ్ ఉంటాయా?
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
అనారోగ్యానికి గురైనప్పుడు మనం వేసుకునే కొన్ని మందుల్లో (ఔషధాల్లో) జంతు సంబంధిత పదార్థాలు అంటే నాన్‌వెజ్ ఉంటుందనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు.
అదేంటి ట్యాబ్లెట్లలో కూడా నాన్ వెజ్ ఉంటుందా అని మీలో కొంతమంది ఆశ్చర్యపోవచ్చు.
కొన్ని రకాల ట్యాబ్లెట్లు, ద్రవరూప మెడిసిన్స్ అంటే సిరప్‌లలో జంతువుల ఎముకలు లేదా చర్మం నుంచి తయారు చేసిన జెలాటిన్ అనే పదార్థాన్ని వాడతారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ జర్నల్‌లో 2012 ఫిబ్రవరిలో ప్రచురితమైన ఒక సర్వే ప్రకారం, ప్రతి నలుగురు రోగుల్లో ఒకరు తమ విశ్వాసాలకు విరుద్ధంగా, జెలాటిన్ ఉన్న మందులను తమకు తెలియకుండానే తీసుకుంటున్నట్లు తేలింది.
భారత్‌లో శాకాహార, మాంసాహార ఆహార ఉత్పత్తుల్ని గుర్తించేలా ప్యాకెట్లపై ఆకుపచ్చ రంగు చుక్క, ఎరుపు రంగు చుక్క లేబులింగ్ తప్పనిసరి.
కానీ ఔషధాలు, క్యాప్సూల్స్‌కు ఈ నియమం వర్తించదు.
రోగుల ప్రాణాలను కాపాడే ఔషధాల్లో వాడిన పదార్థాల మూలాలను తెలుసుకోవడం తప్పనిసరేం కాదని 2013లో సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రాణాలను నిలబెట్టే ఔషధాల విషయంలో శాకాహారం, మాంసాహారం వంటి తేడా ఉండదని వ్యాఖ్యానించింది.
వెజ్, నాన్‌వెజ్ ఔషధాలను గుర్తించేలా వాటిపై ఆకుపచ్చ, ఎరుపు రంగు గుర్తులు ఉంచాలని వచ్చిన ప్రతిపాదనలను డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ) కూడా తిరస్కరించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఔషధాలకు సంబంధించి సలహాలు, సూచనలు అందించే భారత అత్యున్నత సంస్థ డీటీఏబీ.
అయితే, భారత్‌లో కొన్ని ఫార్మా సంస్థలు స్వచ్ఛందంగా కొన్ని రకాల ఔషధాలపై ఈ గుర్తులను ప్రచురిస్తున్నాయి.
నాన్ వెజ్ క్యాప్సూల్స్ అంటే ఏమిటి?
ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్‌లో జెలాటిన్ ఉండే భాగాలను నాన్ వెజ్ భాగంగా పరిగణిస్తారు.
ఈ జెలాటిన్ అనేది ఆవులు, పందులు, చేపలు వంటి జంతువుల ఎముకలు, చర్మం నుంచి తీసిన కొల్లాజెన్ అనే ప్రోటీన్ ద్వారా తయారవుతుంది. దీన్ని క్యాప్సూల్స్‌కు బయటి కవచంగా ఉపయోగిస్తారు.
సాధారణంగా ఔషధాల రూపంలో మనం తీసుకునే క్యాప్సూల్ తొడుగు శాకాహార, మాంసాహార పదార్థాలతో తయారవుతుందని అమెరికాకు చెందిన 'పబ్ మెడ్ సెంట్రల్' ఆధ్వర్యంలో నడిచే 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' పేర్కొంది. జెలాటిన్‌తో తయారైతే మాంసాహారం, హెచ్‌పీఎంసీ (హైడ్రాక్సీప్రొఫైల్ మిథైల్ సెల్యులోజ్) లేదా స్టార్చ్ ఆధారితమైతే శాకాహారంగా తేల్చింది.
అందుకే ఈ జెలాటిన్ తొడుగు ఉన్నవాటిని నాన్-వెజ్ క్యాప్సూల్స్ అంటారు. ఈ జెలాటిన్ చాలా చౌకగా, సులభంగా లభిస్తుంది.
‘ట్యాబ్లెట్‌గానే చూడాలి’
ఆరోగ్యాన్ని కాపాడే మందుల విషయంలో చాలామంది రోగులు తమ ఆహార అలవాట్లను పట్టించుకోరని.. అరుదుగా కొందరు మాత్రం వేరే ఆప్షన్ ఉందేమో చూడమంటారని పెద్దపల్లిలోని శ్రీకృష్ణ హాస్పిటల్స్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చాడ కృష్ణారెడ్డి ‘బీబీసీ’తో చెప్పారు.
'ట్యాబ్లెట్లలో వెజ్, నాన్ వెజ్ ట్యాబ్లెట్లు ఉంటాయి. కొంతమంది రోగులు తమకు నాన్‌వెజ్ ట్యాబ్లెట్లు వద్దంటూ వెజ్ ట్యాబ్లెట్లు మాత్రమే వాడతామని అడుగుతారు. ఇలా అడిగేవాళ్లు చాలా తక్కువే ఉంటారు. మేం వాళ్లకు నచ్చజెప్పుతాం. ఆ ట్యాబ్లెట్‌కు ప్రత్యామ్నాయం ఉంటే వాటిని సిఫార్సు చేస్తాం. కానీ, కొన్ని నాన్ వెజ్ ట్యాబ్లెట్లకు వెజ్ కాంబినేషన్స్ ఉండవు. అలాంటప్పుడు వాళ్లకు నచ్చజెప్పి నాన్ వెజ్ ట్యాబ్లెట్ వాడేలా ఒప్పిస్తాం. కానీ కొందరు ఆయుర్వేదిక్ ఇతర సంప్రదాయ వైద్యాల వైపు మళ్లుతుంటారు. ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడే మందుల విషయంలో ఇలాంటివి చూడకపోవడమే ఉత్తమం' అని డాక్టర్ చాడ కృష్ణారెడ్డి అన్నారు.
మొక్కల ఆధారిత బైండర్లతో వెజ్ ట్యాబ్లెట్లు
వెజ్ క్యాప్సూల్స్ అంటే తయారీదారులు మొక్కల నుంచి తీసిన హెచ్‌పీఎంసీ లేదా స్టార్చ్ ఆధారిత పదార్థాలతో క్యాప్సూల్స్ పైతొడుగును తయారు చేస్తారు.
చాలా ట్యాబ్లెట్‌లలో (క్యాప్సూల్స్ కాకుండా) ఔషధాన్ని గట్టిగా ఉండేలా చేయడానికి సాధారణంగా మొక్కల ఆధారిత బైండర్లు, ఫిల్లర్లు వాడతారని హైదరాబాద్‌కు చెందిన ఫార్మసిస్ట్ స్వాతి ‘బీబీసీ’తో చెప్పారు.
ట్యాబ్లెట్లలో ఉండే యాక్టివ్ డ్రగ్‌లో కాకుండా దాని చుట్టూ ఉండే క్యాప్సూల్ తొడుగులో లేదా అదనపు భాగాల్లోనే నాన్‌వెజ్ పదార్థాలను వాడతారని ఆమె అన్నారు.
కొన్ని క్యాప్సూల్స్ తయారీలో ఫిష్ ఆయిల్ కూడా వాడతారని ఆమె తెలిపారు.
గుర్తించడం ఎలా?
ట్యాబ్లెట్ లేదా క్యాప్సూల్ జంతు సంబంధిత పదార్థాలతో తయారైందా లేదా అనేది తెలుసుకోవడానికి ఫార్మసిస్ట్ స్వాతి కొన్ని సూచనలు ఇచ్చారు.
ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయాలి: కొన్ని ఫార్మా కంపెనీలు ఔషధాల ప్యాకేజింగ్‌పై వెజ్ అయితే ఆకుపచ్చ రంగు చుక్క, నాన్ వెజ్ అయితే ఎరుపు రంగు చుక్క గుర్తును ముద్రిస్తాయి.
ఏయే పదార్థాలున్నాయో చూడండి: ట్యాబ్లెట్ లేదా క్యాప్సూల్ స్ట్రిప్‌పై ఉన్న పదార్థాల జాబితాలో జెలాటిన్ అని ఉంటే అది సాధారణంగా నాన్-వెజ్ అని అర్థం. హెచ్‌పీఎంసీ, వెజిటబుల్ సెల్యులోజ్, ప్లాంట్ బేస్డ్ అని ఉంటే వెజ్ అని అర్థం.
వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడగండి: ఔషధాల విషయంలో శాకాహారానికే మీకు ప్రాధాన్యం ఉంటే, మీకు సరిపోయే 'వెజ్ ప్రత్యామ్నాయాల' గురించి మీ డాక్టర్‌ను లేదా ఫార్మసిస్ట్‌ను అడగడం మంచిది.
(నోట్: ఇది అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు, చికిత్సలు, మందులకు సంబంధించిన విషయాలలో నేరుగా వైద్యుల సూచనలు పాటించాలి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)