కాంగ్రెస్‌లో నేహా బోరా వంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
సోమవారం దిల్లీ వీధుల్లో ప్రియాంక గాంధీ చేయి పట్టుకుని, రాహుల్ గాంధీతో కలిసి మార్చ్ చేసిన యువ నాయకురాలు నేహా బోరా.
కాంగ్రెస్ విద్యార్థి, యువజన విభాగాల్లోని నాయకుల్లో ఎవరైనా ఆమెను చూసి అసూయపడవచ్చు. తాము ఎందుకు అలా చేయలేకపోయామని ఆలోచించవచ్చు.
2015–2016లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ విద్యార్థి విభాగమైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) తరఫున షెహ్లా రషీద్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
అధ్యక్ష పదవికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విద్యార్థి విభాగం 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్' నుంచి కన్హయ్య కుమార్ గెలుపొందారు.
కన్హయ్యతో పాటు షెహ్లా కూడా అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించేవారు. అయితే, ఐసా నుంచి షెహ్లా విడిపోయి, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సానుభూతి చూపడం ప్రారంభించారు. మరోవైపు కన్హయ్య కాంగ్రెస్‌లో చేరారు.

జేఎన్‌యూలో కమ్యూనిస్ట్ పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ, షెహ్లా రషీద్ వైఖరి మాత్రం ఆశ్చర్యపరిచింది.
ఈ నేపథ్యంలో నేహా బోరా వైఖరి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
రెండో విషయం, నేహా బోరాకు కాంగ్రెస్ పార్టీ అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోంది? మూడవది, కాంగ్రెస్ పార్టీ నుంచి నేహా బోరా లేదా కన్హయ్య కుమార్ లాంటి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు?

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
నేహా కాంగ్రెస్‌లో చేరతారా?
సీపీఐఎం(ఎల్) పోలిట్ బ్యూరో సభ్యుడు, నక్సలైట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన చారు మజుందార్ కుమారుడు అభిజిత్ మజుందార్ మాట్లాడుతూ, పార్టీలో ఏకగ్రీవమవుతున్న విషయాలను, పార్టీ నిర్దేశించిన పనులనే నేహా చేస్తున్నారని చెప్పారు.
"నేహాలో ఉన్న ధైర్యాన్ని పార్టీ కూడా ప్రోత్సహిస్తోంది. ఆమె పార్టీకి బయట ఉండి ఇదంతా చేయడం లేదు. ఇందులో నేహా ఒక్కరే లేరు. అయితే, ప్రస్తుతం ఆమె ధైర్యం, ఉత్సాహం ఎక్కువ మందికి కనిపిస్తున్నాయి. మీడియా కూడా ఆమెకు ప్రాధాన్యం ఇస్తోంది. తాను పార్టీకి భిన్నమని నేహా ఎప్పుడూ చెప్పలేదు. మేం ప్రజాస్వామ్య ఉద్యమం చేస్తున్నంత మాత్రాన కమ్యూనిస్టులం కాదని అర్థం కాదు" అని అభిజిత్ మజుందార్ అన్నారు.
"ప్రియాంక గాంధీ ఆమె భుజంపై చెయ్యి వేసి నడుస్తున్నారంటే నేహా రేపు కాంగ్రెస్‌లో చేరుతారని అర్థం కాదు. నేహా విషయంలో పార్టీకి అలాంటి భయం ఏమాత్రం లేదు. గత విషయాలను పరిశీలిస్తే మీ ఆలోచన సబబే కానీ, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ నేహా మాటలు వింటే ఆమె కేవలం తన ప్రచారం చేసుకుంటున్నారని మీకు ఎప్పటికీ అనిపించదు. ఆమెలో ఆ భావనే లేదు. కమ్యూనిస్టు భావజాల వారసత్వాన్ని ఆమె అలాగే కొనసాగిస్తున్నారు" అని తెలిపారు.
"నేహా కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకానీ, కాంగ్రెస్‌లో చేరిపోతారని అనుకోవడం లేదు. నేహాకు కమ్యూనిస్టు ఉద్యమం పట్ల నిబద్ధత ఉంది. ఈ విషయంలో ఆమెను కన్హయ్యతో పోల్చకుండా పూర్తిగా భిన్నంగా చూస్తాను. కమ్యూనిస్టు నాయకులు అధికారం కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అక్కడ ఉంటేనే ఎన్నికల్లో గెలవగలమని, తమ పార్టీలో ఉంటే విజయం సాధించడం కష్టమని వారు భావిస్తున్నారు" అని సీపీఐ(ఎం) విద్యార్థి సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నాయకురాలు దీప్సితా ధర్ అన్నారు.
"భవిష్యత్తులోనూ నేహాలోని కమ్యూనిస్టు వైఖరిని కాంగ్రెస్ అంగీకరిస్తుందని భావిస్తున్నా. ఆమెను కాంగ్రెస్ నాయకురాలిగా మార్చాలని చూడకూడదని ఆశిస్తున్నాను" అని దీప్సితా చెప్పారు.
నేహాను కన్హయ్యతో పోల్చలేమని అభిజిత్ మజుందార్ కూడా అంటున్నారు.
"చూడండి, కన్హయ్య, నేహాల పద్ధతులు పూర్తిగా వేరు. కన్హయ్య ప్రాచుర్యం పొందిన కొద్దీ సీపీఐకి దూరం అయ్యారు. నేహా మాత్రం ఐసాను బలోపేతం చేస్తున్నారు" అని తెలిపారు.
"ఆమె తనను తాను పార్టీ కంటే గొప్పగా భావించడం లేదు. కన్హయ్యతో పోలిస్తే నేహా మరింత నిబద్ధతతో ఉన్నారు. తనకంటే ఎక్కువ మంది ఫాలోవర్లు నేహాకు ఉన్నారని దీపాంకర్ స్వయంగా చెప్పారు. అయితే, అది మేం భయపడాల్సిన విషయం కాదు. మా విజయంగా భావిస్తున్నాం. యువ కమ్యూనిస్టు నాయకురాలిగా నేహా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. షెహ్లా రషీద్ విషయంలో మాత్రం ఆమెను పార్టీ పట్ల పూర్తి నిబద్ధత కలిగిన నాయకురాలిగా తీర్చిదిద్దలేకపోయామేమోనని మమ్మల్ని మేమే ప్రశ్నించుకుంటాం" అని అభిజిత్ మజుందార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంత ప్రాధాన్యం ఎందుకు?
జులైలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ వామపక్ష సంఘాల కార్యకర్తలను కలిశారు. ఈ సమావేశంలో నేహా కూడా పాల్గొన్నారు. అప్పట్లోనూ రాహుల్ గాంధీ సీజేపీ నాయకులకు దూరంగానే ఉన్నారు. మరి నేహాకు రాహుల్ గాంధీ ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు?
"కాంగ్రెస్‌కు మరో మార్గం లేదు. మొదట్లో సీజేపీని కాంగ్రెస్ ఒక ముప్పుగా భావించింది. అన్నా హజారే ఉద్యమం నాటి అనుభవాలను కాంగ్రెస్ ఇంకా మర్చిపోలేదు. అభిజిత్, ఆశుతోష్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కలుస్తున్నారు. దీంతో దీని వెనుక ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం ఏదైనా ఉందేమోనని కాంగ్రెస్ భావించింది" అని అభిజిత్ మజుందార్ అన్నారు.
"అలాంటి పరిస్థితుల్లో నేహా, ఇతర కమ్యూనిస్టు యువతను కలుపుకొని వెళ్లడంలో రాహుల్‌కు ఎలాంటి ముప్పు కనిపించలేదు. నేహా గొంతుక వినిపిస్తున్న తీరుకు తగినట్లుగా ఆమెతో కలిసి నడవాలని రాహుల్ భావించారు. రాహుల్‌లో మరో కోణాన్ని కూడా మేం గమనించాం. కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు వామపక్ష వాదనల్లా అనిపిస్తాయి. అయితే, తన పార్టీతో రాహుల్‌కు ఎంతవరకు సమన్వయం ఉందనేది తెలియదు" అని అభిజిత్ అన్నారు.
నేహా బోరా లేదా కన్హయ్య కుమార్ వంటి యువ నాయకులను కాంగ్రెస్ ఎందుకు తయారు చేయలేకపోతోంది?
"స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గత 60–70 ఏళ్లుగా కాంగ్రెస్ ఎక్కువగా అధికారంలోనే ఉంది. కాబట్టి, కాంగ్రెస్ పోరాటాల ద్వారా ఎదిగిన పార్టీ కాదని చెప్పడంలో తప్పులేదు. ఆరు, ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నందున ఏదైనా సాధించేందుకు అది పోరాడాల్సిన అవసరం రాలేదు. పోరాటంలోనే మేధోపరమైన సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. అధికారంలో ఉన్నప్పుడు మేధోపరమైన ఆలోచనా శక్తి బలహీనపడుతుండటం ఎప్పటి నుంచో చూస్తున్నాం.. పోరాటంలోకి దిగినప్పుడు ఆలోచనల్లో పదును పెరుగుతుంది" అని దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు అపూర్వానంద్ అన్నారు.
"సోవియట్ యూనియన్ చరిత్రను పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది. అక్కడ కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాకముందు, ముఖ్యంగా 1905 నుంచి 1917 వరకు ఉన్న కాలాన్ని చూడండి. ఆ సమయంలో రచయితలు, కవులు, కళాకారులు చాలామంది కమ్యూనిస్టు పార్టీకి చెందినవారే. రచయితలు, కళాకారులు, మేధావులు సాధారణంగా అధికారాన్ని వ్యతిరేకిస్తుంటారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేహా వంటి నాయకులు కాంగ్రెస్‌లో ఎందుకు ఎదగడం లేదు?
అయితే, గత 12–13 ఏళ్లలో ఇదే ప్రభుత్వ హయాంలో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, నేహా బోరా వంటి నాయకులు ఎదిగారు. మరి కాంగ్రెస్‌లో ఇలాంటి నాయకులు ఎందుకు తయారు కాలేదు?
"చాలాకాలం అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌కు ఒక ప్రత్యేకమైన స్వభావం అలవాటైంది. ఇప్పటికీ అది పూర్తిస్థాయి ప్రతిపక్ష పార్టీగా మారలేకపోయింది. కాంగ్రెస్‌ను పోరాటాల ద్వారా ముందుకు సాగే పార్టీగా మార్చడానికి రాహుల్ గాంధీకి 13–14 ఏళ్లు పట్టింది. ఇటీవలి కాలం వరకు కాంగ్రెస్ మొత్తం వ్యవహారశైలిని గమనిస్తే, అది అధికార పార్టీగానే కనిపిస్తుంది. బీజేపీ అధికారంలో నుంచి దిగిపోతే తర్వాత ఎవరు వస్తారు? మేమే వస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. అంటే, తాము అధికారంలోకి రావాల్సిన పార్టీగానే ఆలోచిస్తోంది. అధికారంలో ఉండటం కాదు, పోరాడటమే మీ పని అని పార్టీకి నమ్మకం కలిగించేందుకు రాహుల్ గాంధీ చాలా కష్టపడాల్సి వచ్చింది" అని ప్రొఫెసర్ అపూర్వానంద్ అన్నారు.
కమ్యూనిస్టు పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే యువ నాయకుల పోరాట పటిమ ఎందుకు తగ్గిపోతోంది?
"కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన మాట్లాడే తీరు, స్వభావం మారాయి. అయితే, నేను కన్హయ్యపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. కేవలం గమనించిన విషయాన్ని చెబుతున్నాను. కన్హయ్య ఏమైనా రాజీ పడ్డారా? లౌకికవాద, ప్రజాస్వామ్య సూత్రాల విషయంలో రాజీ పడ్డారా? అన్నదే ప్రశ్న. ఇప్పుడు ఆయన మతపరమైన వ్యక్తిగా కనిపిస్తున్నారని కొందరు అనవచ్చు. అయితే, రాహుల్ గాంధీ కూడా తాను శివభక్తుడినని చెప్పుకుంటారు కదా" అని ప్రొఫెసర్ అపూర్వానంద్ అన్నారు.
"ప్రజల మధ్యకు వెళ్లి పోరాడే నాయకుడిగా కన్హయ్యకు ఉన్న గుర్తింపు బలహీనపడింది. ఎందుకంటే, ఆయనకు మరో బాధ్యత అప్పగించారు. కమ్యూనిస్టు పార్టీల పునాది ఇప్పటికీ వర్గ రాజకీయాలే. అంటే, ఒక నిర్దిష్ట వర్గం ప్రజల సమస్యలను ప్రస్తావించడమే వర్గ రాజకీయాలుగా మారిపోయింది. కానీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉన్నప్పుడు మరింత విస్తృతమైన ప్రజలతో చర్చలు జరిపే, వారి మధ్య ఏకాభిప్రాయం సాధించే అవకాశాన్ని కల్పించుకోవాలి. ఒక వర్గానికే పరిమితమయ్యే భాషలో మాట్లాడితే అది సాధ్యం కాదు. దురదృష్టవశాత్తూ, ఈ సమస్య కమ్యూనిస్టు పార్టీలకే పరిమితం కాలేదు. సామాజిక న్యాయం కోసం పనిచేసే రాజకీయ పార్టీల్లోనూ కనిపిస్తోంది" అని అపూర్వానంద్ వివరించారు.
"లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వంటి నాయకులు ఒక దశలో తమపై తమకు ఎంతో నమ్మకం పెంచుకున్నారు. ఆ తర్వాత విఫలమయ్యారు. ఇలాంటి నాయకులు కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎదిగినప్పుడు, ఆ తర్వాత ఆ పార్టీల్లో తమకు తగినంత స్వేచ్ఛ లేదని భావిస్తారు. ఎందుకంటే, అక్కడ ప్రజాస్వామ్య రాజకీయాలకు అవసరమైన విస్తృత అవకాశాలు లేవు" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























