ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఎందుకు హాజరుకాలేదు?

అలీ ఖమేనీ అంత్యక్రియలు, మొజ్తబా ఖమేనీ, ఇరాన్, అమెరికా, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, ఒలీవియా ఐర్లండ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కాలేదు.

ఖమేనీకి ఆదివారం వేలమంది ప్రజలు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అలీ ఖమేనీ మిగతా ముగ్గురు కుమారులు మసూద్, ముస్తఫా, మైసంతో పాటు అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐఆర్‌జీసీ అధ్యక్షుడు అహ్మద్ వాహిది, ఇతర అధికారులు ఆదివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు మొజ్తబా ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలీ ఖమేనీని హతమార్చిన వైమానిక దాడిలోనే మొజ్తబా కూడా గాయపడ్డారని వదంతులు వచ్చాయి.

మార్చి ఆరంభంలో ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మొజ్తబా బహిరంగంగా కనిపించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయతోల్లా అలీ ఖమేనీ 1989 నుంచి 2026 ఫిబ్రవరిలో మరణించే వరకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు సర్వోన్నత నాయకుడిగా పనిచేశారు.

దివంగత సుప్రీం లీడర్ అధికారిక అంత్యక్రియలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ వారంలో ఇరాన్, ఇరాక్‌లలో అనేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమానికి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. దీన్ని ఈ "ది ఫ్యూనరల్ ఆఫ్ ది సెంచరీ" అని కొందరు అభివర్ణిస్తున్నారు.

ఖమేనీ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ప్రస్తుతం తెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మత సముదాయంలో ఉంచారు.

షియా మత గురువు జాఫర్ సోభానీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన 97 ఏళ్ల పండితుడు, ఖోమ్‌లోని ఒక మత పాఠశాలలో ఆయన బోధన చేస్తారు.

అలీ ఖమేనీ అంత్యక్రియలు, మొజ్తబా ఖమేనీ, ఇరాన్, అమెరికా, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, తెహ్రన్‌లో వేడి వాతావరణాన్ని చల్లబరిచేందుకు అంత్యక్రియలకు హాజరైన వారిపై నీళ్లు చల్లాలు.

ఇజ్రాయెల్ దాడి చేస్తుందనే భయమా?

ఇరాన్‌లో ఆదివారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఖమేనీ పార్థివ దేహాన్ని సోమవారం గ్రాండ్ మొసల్లా నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత తెహ్రాన్‌లో అంత్యక్రియల ఊరేగింపు జరుగుతుంది.

అంత్యక్రియల కార్యక్రమాన్ని పకడ్బందీ ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మొజ్తబా ఖమేనీ హాజరు కాకపోవడం అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. ఇజ్రాయెల్ ఆయనను కూడా లక్ష్యంగా చేసుకుంటుందేమోనన్న భయాలు కూడా ఉన్నాయి.

అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది. కానీ అది పటిష్ఠంగా లేదు. శాశ్వత శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి. అవసరమైతే మళ్లీ దాడులు చేస్తామని ఇరు వర్గాలు హెచ్చరించాయి.

అలీ ఖమేనీ అంత్యక్రియలు, మొజ్తబా ఖమేనీ, ఇరాన్, అమెరికా, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అంత్యక్రియలకు మొజ్తబా ఖమేనీ తప్ప ఇరాన్‌లోని మిగతా ప్రముఖులంతా హాజరయ్యారు.

ట్రంప్ 'ఆశ్చర్యం'

అంత్యక్రియల కోసం శాంతి చర్చలను వారం రోజులు వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారని ఆక్సియోస్ వార్తా వెబ్‌సైట్ తెలిపింది.

ఇరాన్ పాలనలోని పలువురు ఉన్నతాధికారులు ఒకేచోట ఉన్నారని అమెరికా తలచుకుంటే వారందరినీ 'ఒకే దెబ్బ'లో హతమార్చగలదని ట్రంప్ అన్నారు. కానీ, "మేము అలా చేయము, ఎందుకంటే అప్పుడు చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు" అని ఆయన చెప్పినట్లు ఆక్సియోస్ కథనం వెల్లడించింది.

ఇరానీయులు ఏడవడం చూసి తాను ఆశ్చర్యపోయానన్న ట్రంప్ ప్రజలు, ఖమేనీని ద్వేషిస్తున్నారని తాను భావించానని, బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.

"బూటకపు కన్నీళ్లు కార్చేందుకే మేము 47 ఏళ్ల క్రితం తిరుగుబాటు చేయలేదు. మేము ఎంతో మంది వీరులను త్యాగం చేసింది బూటకపు కన్నీళ్లు కార్చడానికి కాదు" అని అంత్యక్రియల్లో పాల్గొన్న 50 ఏళ్ల జహ్రా సఫాయి అనే మహిళ రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.

అలీ ఖమేనీ అంత్యక్రియలు, మొజ్తబా ఖమేనీ, ఇరాన్, అమెరికా, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఖమేనీ అంత్యక్రియల యాత్రలో 'ట్రంప్‌ను చంపండి' అని నినాదాలు చేశారు.

‘ప్రతీకారం తీర్చుకుంటాం’

అంత్యక్రియల్లో పాల్గొన్నవారు చాలామంది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారని అసోసియేటెడ్ ప్రెస్, ది గార్డియన్ కథనాలు చెబుతున్నాయి.

నమాజ్ చేయడానికి ముందు కవితా పఠనం చేసే సమయంలో కవి మహమ్మద్ రసూలీ "ట్రంప్‌ను అంతం చేయడం ఇప్పుడు మనందరి బాధ్యత" అని అన్నారు.

సంతాప సభ సమయంలో "అమెరికా నశించాలి", "ఇజ్రాయెల్‌ నశించాలి" అని నినాదాలు చేశారు. ఆదివారం నగరంలో ప్రజలు బ్యానర్లు పట్టుకుని కనిపించారు.

ఆ బ్యానర్లపై ‘ట్రంప్‌ను చంపండి’, ‘బీబీ( నెతన్యాహు)ని చంపండి’ అనే నినాదాలు రాసి ఉన్నాయి.

అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజల్లో అనేక మంది ‘ప్రతీకారం తీర్చుకుంటాం’ అని నినాదాలు రాసి ఉన్న బ్యానర్లు పట్టుకున్నారు.

ఒక్క తెహ్రాన్‌లోనే ఈ కార్యక్రమానికి కోటి మందికి పైగా హాజరవుతారని అంచనా. జనసమూహాలను నియంత్రించడానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ మీడియా కోరింది.

గ్రాండ్ మొసల్లా పరిసర ప్రాంతాల్లోని వైద్య కేంద్రాలలో 4,000 మందికి పైగా చికిత్స పొందారని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది.

అంత్యక్రియల వీడియోలలో తీవ్రమైన వేడి కారణంగా చల్లదనం కోసం ప్రజలపై నీళ్ళు చల్లారు. వైద్య బృందాలు ఒక వృద్ధురాలిని స్ట్రెచర్‌పై మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఖమేనీ శవ పేటిక పక్కన తెహ్రాన్ దాడులలో మరణించిన ఆయన ఏడాది మనవరాలు జహ్రా మొహమ్మది గొల్పాయెగానితో సహా నలుగురు బంధువుల శవపేటికలను ఉంచారు.

సోమవారం తెహ్రాన్‌లో ఊరేగింపు అనంతరం ఖమేనీ శవపేటికను మంగళవారం ఖోమ్‌కు తీసుకువెళతారు. ఆ తర్వాత, బుధవారం ఇరాక్‌లోని ఒక ముఖ్యమైన షియా ప్రదేశానికి తీసుకువెళతారు. అనంతరం గురువారం, ఆయన జన్మస్థలమైన మషద్‌లో ఖననం చేస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)