ఓ వ్యాన్ డ్రైవర్ ఇచ్చిన లిఫ్ట్ పోలీసులకు నిందితుడిని ఎలా పట్టించిందంటే...

    • రచయిత, జేమ్స్ మెక్‌కార్తీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఒక సాయుధ పోలీస్ ఆఫీసర్‌కు సకాలంలో లిఫ్ట్ ఇచ్చి, పారిపోతున్న అనుమానితుడిని పట్టుకోవడంలో సహాయపడిన వ్యాన్ డ్రైవర్‌ను అధికారులు అభినందించారు.

జూన్ 16న సాయుధ పోలీసులు ఒక అనుమానితుడిని తరుముతున్న సమయంలో.. ఈ డ్రైవర్ చొరవ తీసుకుని సహాయం చేసిన దృశ్యాలు పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డయ్యాయి.

యూకేలోని ఒక ప్రధాన వీధిలో దాడి తర్వాత అనుమానితుడు పారిపోతుండగా, భారీ ఆయుధాలు ధరించిన పోలీసులు ఆయన్ని అందుకోలేక ఇబ్బంది పడటాన్ని వ్యాన్ డ్రైవర్ గమనించారు.

అనుమానితుడు మొదట పోలీసుల నుంచి తప్పించుకొని, మార్గేట్‌లోని తివోలి రోడ్ వైపు పరుగెత్తారని కెంట్ పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో డ్రైవర్ వెంటనే తన వ్యాన్‌ను ఆపి, సదరు పోలీసు అధికారితో "వెనుక సీట్లోకి ఎక్కండి" అని చెప్పారు.

అధికారి లోపలికి ఎక్కి, వ్యాన్ స్లైడింగ్ డోర్ ఇంకా తెరిచే ఉండగానే.. "పోనియ్, పోనియ్! థ్యాంక్స్ బ్రదర్. ఆ పోలీస్ ఆఫీసర్‌ను ఫాలో అవ్వు" అనడం వీడియోలో కనిపించింది.

అనుమానితుడు పారిపోతున్న దిశలో డ్రైవర్ వ్యాన్‌ను వేగంగా నడపగా, ఆ అధికారి దారి చూపిస్తూ సూచనలు ఇచ్చారు. కాలినడకన అనుమానితుడిని తరుముతున్న మరో పోలీసును, అలాగే ఆ అనుమానితుడిని దాటుకుని ముందుకు వెళ్లిన తర్వాత వ్యాన్ ఆపారు.

వెంటనే వ్యాన్ దిగిన సాయుధ అధికారి, అనుమానితుడి వైపు తుపాకీ గురిపెట్టి అదుపులోకి తీసుకున్నారు.

చివర్లో పోలీసు అధికారి కృతజ్ఞతలు చెప్పగా ఆ డ్రైవర్ స్పందిస్తూ.. "నేను సహాయపడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది" అని చెప్పారు.

'నిజంగా కృతజ్ఞతలు'

కెంట్ పోలీస్ సూపరింటెండెంట్ విల్ లే స్పందిస్తూ, "బాధ్యతాయుతమైన ఆ డ్రైవర్ సమయస్ఫూర్తితో, స్వార్థం లేకుండా చేసిన సహాయం వల్లే పోలీసులు ఆ ప్రమాదకరమైన వ్యక్తిని పట్టుకోగలిగారు" అన్నారు.

"ఆ పౌరుడు, వాహనం సకాలంలో సహకరించకపోతే ఈ అరెస్ట్ సాధ్యమయ్యేది కాదేమో. తన ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడంలో తను అందించిన సహకారానికి ఆయన గర్వపడాలి. ఆయన చేసిన సహాయానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అని విల్ లే అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)