అయోధ్య కానుకల దొంగతనం కేసు: అదుపులో 8 మంది, వారు గుడిలో ఏం చేసేవారంటే..

    • రచయిత, అర్షద్ అఫ్జల్ ఖాన్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సిట్ ప్రాథమిక నివేదికను సమర్పించింది. అనంతరం, గురువారం అర్ధరాత్రి 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

రామాలయ విరాళాల పెట్టెల నుంచి నగదు, విలువైన వస్తువుల దొంగతనం ఆరోపణలపై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్.. బీబీసీకి తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఒకటి రెండు రోజుల్లో వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు.

"అయోధ్య గురించి వస్తున్న వార్తలపై సిట్ ఏర్పాటు చేశామని చెప్పాం. సిట్ నివేదిక రాగానే మా చర్యలు కూడా మొదలవుతాయన్నాం. అన్నట్లుగానే నివేదిక రాగానే తక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. నేను హామీ ఇస్తున్నా. చెప్పినట్లుగానే పాలేవో, నీళ్లేవో తేల్చి తీరుతాం" అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు.

"ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం ఆమోదయోగ్యం కాదు. సనాతన విశ్వాసాలతో ఆడుకునే వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అన్నారు.

రామమందిర కానుకల దొంగతనంపై ఆరోపణలు చేస్తున్న వారి గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

"రామభక్తులకు అగ్నిపరీక్ష పెట్టకండి. వారి నమ్మకాలతో ఆడుకోవడం ఆపండి. నిజాలు, స్పష్టమైన ఆధారాలు లేకపోతే ఆరోపణలు-ప్రత్యారోపణలు ఆపండి. ఆధారాలు ఉంటే సిట్ ముందు పెట్టండి" అన్నారు.

"సిట్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఉన్నతాధికారుల బృందం పని చేస్తున్నప్పుడు రాజకీయ ప్రకటనలు ఆపాలి" అని సీఎం అన్నారు.

కేసు వివరాలేంటి?

ఎఫ్ఐఆర్‌లో ఉన్న నిందితులంతా.. 40 విరాళాల పెట్టెలను మందిర సేవా కేంద్రానికి తరలించి, ఆ సొమ్మును లెక్కించే బృందంలోని సభ్యులే. ఆలయ నిధుల అక్రమ మళ్లింపులో వారి పాత్రపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉద్యోగి దొంగతనం చేయడం, నమ్మకద్రోహం, మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ప్రాథమిక విచారణ అనంతరం, టిన్నూ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ, కరుణేష్ పాండే, రామాశంకర్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.

టిన్నూ యాదవ్ పర్యవేక్షణ పాత్రలో ఉండగా, మిగిలిన వారంతా నగదు లెక్కించే పనిలో ఉండేవారు.

మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి సేకరించిన సొమ్మును అక్రమంగా మళ్లించిన ఘటనకు సంబంధించిన కేసు ఇది. ఫిర్యాదు ప్రకారం, నిందితులు పరస్పరంగా సహకరించుకుంటూ కుట్రతో భక్తులు సమర్పించిన సొమ్మును మళ్లించారు. ట్రస్ట్ నిధులను దుర్వినియోగం చేశారు.

ఈ ఘటనలపై జూన్ 13న ఆరోపణలు రావడంతో ట్రస్ట్ అభ్యర్థన మేరకు సిట్ ఏర్పాటైంది. దీనికి విజయ్ విశ్వాస్ పంత్ నాయకత్వం వహిస్తున్నారు. కమిటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీలరత్న కుమార్ కూడా ఉన్నారు.

విధానపరమైన లోపాలు, దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అని విచారించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు.

అరెస్టయిన నిందితులు ఎవరు?

1. రామాశంకర్ యాదవ్ (టిన్నూ)

  • బాధ్యత: విరాళాల పెట్టెల పర్యవేక్షణ, వాటిని బేస్‌మెంట్‌కు చేర్చడం.
  • ఆరోపణ: విరాళాల పెట్టెల నుంచి కోట్ల రూపాయల మళ్లింపు, అయోధ్య పరిసరాల్లో ఆస్తుల కొనుగోలు.

2. లవకుష్ మిశ్రా

  • బాధ్యత: కానుకలు, నగదు లెక్కింపు.
  • ఆరోపణ: కానుకలను దొంగిలించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడం. ఇంటి నుంచి రూ. 12 లక్షలు రికవరీ.

3. అనుకల్ప్ మిశ్రా

  • బాధ్యత: కౌంటింగ్ రూమ్‌లో నగదు లెక్కించడం.
  • ఆరోపణ: కౌంటింగ్ రూమ్ నుంచి డబ్బు దొంగిలించి బాత్రూమ్‌లో దాచడం, లక్షల ఆస్తులు కూడబెట్టడం.

4. సుభాష్ చంద్ర శ్రీవాస్తవ

  • బాధ్యత: క్యాష్ కౌంటింగ్ సిబ్బంది ఇన్‌ఛార్జ్.
  • ఆరోపణ: పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దొంగతనంలో భాగస్వామ్యం.

5. కరుణేష్ పాండే

  • బాధ్యత: విరాళాల సొమ్మును కౌంటింగ్ రూమ్‌కు తీసుకురావడం, లెక్కించడం.
  • ఆరోపణ: కానుకల సొమ్ము దొంగిలించి అయోధ్య పరిసరాల్లో ఆస్తులు కొనుగోలు చేయడం.

6. మనీష్ యాదవ్

  • బాధ్యత: విరాళాల పెట్టెల నుంచి వచ్చిన నగదు లెక్కింపు.
  • ఆరోపణ: కానుకల దొంగతనం. ఇంటి నుంచి 36 లక్షల రూపాయల రికవరీ.

7. అవినాష్ శుక్లా

  • బాధ్యత: విరాళాల సొమ్మును కౌంటింగ్ రూమ్‌కు తీసుకురావడం, లెక్కించడం.
  • ఆరోపణ: కానుకల సొమ్ము దొంగిలించి ఆస్తులు కొనుగోలు చేయడం.

8. రామాశంకర్ మిశ్రా

  • బాధ్యత: విరాళాల పెట్టెలను కౌంటింగ్ రూమ్‌కు చేర్చడం, పర్యవేక్షించడం.
  • ఆరోపణ: ఇతర నిందితులతో కలిసి కానుకల సొమ్మును మళ్లించడం.

విరాళాల ప్రశ్నపై డిప్యూటీ సీఎం ఆగ్రహం

రామమందిర విరాళాల గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన విలేఖరులతో "నేను అడుగుతున్నాను, బాబ్రీ మసీదు విరాళాలు సేకరించారా.. సేకరించారు కదా? దాని గురించి అడగండి, ఎవరైనా అడుగుతున్నారా?" అని ప్రశ్నించారు.

సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే రాజకీయాలు చేస్తున్నాయని బ్రజేష్ పాఠక్ ఆరోపించారు. అవినీతిపై బీజేపీ ప్రభుత్వం 'జీరో టోలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని' డిప్యూటీ సీఎం అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)