ఇటలీ ప్రధాని మెలోని: ‘‘ఫోటో కోసం వేడుకున్నాననడం ట్రంప్ అల్లిన కట్టుకథ’’

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

తనతో ఫోటో దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్‌ను తాను ''ప్రాధేయపడ్డానని'' ఇటాలియన్ టీవీకి ట్రంప్ చెప్పిన మాటలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య బహిరంగ విభేదాలకు దారితీశాయి.

ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమైనవని మెలోని వ్యాఖ్యానించారు. వచ్చేవారం ప్రారంభంలో అమెరికాలో పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగమంత్రి ఆంటోనియో తజానీ తన పర్యటన రద్దుచేసుకున్నారు.

ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లాలన్న ట్రంప్ నిర్ణయం తరువాత ఈ ఇరువురి నాయకుల మధ్య గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయో ప్రస్తుత బహిరంగ మాటల యుద్ధం సూచిస్తోంది.

‘నేను నాదేశం ఎవరినీ ప్రాధేయపడం’

ఈ వారం ఫ్రాన్స్‌లోని ఏవియన్ లెస్ బియాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ట్రంప్, మెలోని సన్నిహితంగామాట్లాడుకుంటూ కనిపించారు. తమ మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పూలేదని, పరస్పర నిందారోపణలులాంటివి లేవని తర్వాత మెలోని చెప్పారు.

ఇటలీ లా7టీవీ చానల్‌కు తర్వాత ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ''తనతో ఫోటో దిగాలని ఆమె బతిమాలుకున్నారు. ఆమె విషయంలో జాలిపడుతున్నాను'' అని ట్రంప్ ఆరోపించారు.

జీ7 సదస్సులో చాలా సార్లు మెలోని, ట్రంప్ మాట్లాడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఓ చిన్న సోఫాలో కూర్చుని వాళ్లిద్దరూ మాట్లాడకుంటూ కనిపించారు. ఆ సమయంలో మెలోని నవ్వుతూ ఉన్నారు.

''నేను మాట్లాడినందుకు బహుశా ఆమె సంతోషంగా ఉండొచ్చు'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. లా7 చానల్ ట్రంప్ అసలు మాటలను ఇంగ్లీషులో ప్రసారం చేయలేదు. వాటిని ఇలాటిలియన్‌లో వాయిస్‌ఓవర్ రూపంలో వినిపించింది.

ట్రంప్ వ్యాఖ్యలు నమ్మలేనట్టుగా ఉన్నాయని మెలోని వ్యాఖ్యానించారు. తాను ‘‘దిగ్భ్రాంతికి గురయ్యానని’’ తన ఇన్‌స్టాగ్రామ్‌లోని 70లక్షలమంది అనుచరులను ఉద్దేశించి చేసిన సంక్షిప్త ప్రసంగంలో చెప్పారు. ''మిత్రపక్షాలతో అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు, ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు'' అని మెలోని అన్నారు.

''పాశ్చాత్య దేశాల శత్రవులతో, అమెరికా శత్రువులతో ఆయన అదే స్థాయి దృఢ వైఖరి ప్రదర్శించకపోవడం విచారకరం. వారి విషయంలో ఆయన చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు...ఈ విషయం మాత్రం నేను చెప్పగలను''

''ఒక విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాల్సిఉంది. నేను గానీ, ఇటలీగానీ ఎప్పుడూ, ఎవరినీ ప్రాధేయపడం'' అని మెలోని చెప్పారు.

ఇరాన్ యుద్ధం తర్వాత అమెరికా, ఇటలీ మధ్య పెరిగిన దూరం

దీనిపై స్పందించాల్సిందిగా బీబీసీ వైట్‌ హౌస్‌ను కోరింది.

ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, మెలోని దానిపై స్పందించడం వంటివాటికి కొన్ని ఘటనల నేపథ్యం ఉంది. ఒకప్పుడు మెలోని, ట్రంప్ మధ్య రాజకీయంగా సన్నిహిత సంబంధాలున్నాయి. తర్వాత వరుస ఘటనలతో ఈ సంబంధాలు బలహీనపడ్డాయి.

మెలోని 2022లోఇటలీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరైన ఒకే ఒక యూరోపియన్ నాయకురాలు మెలోనినే. ట్రంప్‌తో యూరప్ సంబంధాలను బలోపేతం చేసే వారధిగా అప్పుడామెను యూరోపియన్ యూనియన్ నేతలు భావించారు.

అయితే ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని మెలోని బహిరంగంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ట్రంప్ ఏప్రిల్‌లో ఇటలీ డైలీ కొర్రియర్ డెల్లా సెరాకు ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ''ఆమెకు ధైర్యం ఉందనుకున్నాను. కానీ నా అంచనా తప్పు'' అని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

పోప్ లియో- 14 ‘నేరాల నియంత్రణలో బలహీనంగా ఉన్నారని, విదేశాంగ విధానం సరిగా లేదని’ ట్రంప్ చేసిన ఆరోపణలు అంగీకారయోగ్యం కాదని మెలోని అన్నారు.

‘అమెరికాకు ఈయూ దూరం కావాలనే చర్చ’

ట్రంప్ తాజా ఇంటర్వ్యూ తర్వాత ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాట్టారెల్లా మెలోనికి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ఇటలీవ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాలకు చెందిన నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఇటలీ ప్రధానితో అంత అహంకారంతో మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ప్రతిపక్ష డెమెక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్ ఫిలిఫ్పో సెన్సీ అన్నారు.

ఇటలీని అవమానపర్చకూడదని ఫైవ్ స్టార్ మూమెంట్ లీడర్ జూసెప్పే కాంటె అన్నారు. అమెరికాతో సానుకూల సంబంధాల కోసం ఇటలీ జాతీయ గౌరవాన్ని త్యాగం చేయకూడదని వ్యాఖ్యానించారు.

పలువురు యూరప్ నేతలపై చేస్తున్నట్టుగానే మెలోనిపై ట్రంప్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని మెలోని సొంత పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి చెందిన సెనెట్ గ్రూప్ లీడర్ లూసియో మలన్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు ట్రంప్ ప్రతిష్టకు, అధికారానికే ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని హెచ్చరించారు.

నిజానికి జీ7 సదస్సు వీడియో గమనిస్తే ట్రంప్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉందని మలన్ అభిప్రాయపడ్డారు. అవసరమైనప్పుడు అమెరికాకు కాదు అని చెప్పగల మెలోని గత రికార్డు ట్రంప్‌కు అసహనం కలిగించి ఉండొచ్చని విశ్లేషించారు.

''మెలోనిపై దాడి చేస్తే మా అందరిపై చేసినట్టే'' అని ప్రభుత్వ కూటమిలోని లీగ్ పార్టీకి చెందిన మట్టెవో సాల్విని వ్యాఖ్యానించారు.

ఈ వివాదం మెలోని, ట్రంప్ మధ్య చిన్న గొడవ మాత్రమే కాదు. ఇదొక ట్రెండ్‌కు ఉదాహరణ.

ఒకప్పుడు యూరోపియన్ మిత్రపక్షాలు ట్రంప్ వెన్నంటి ఉండేవి. ఇప్పుడు అవి ప్రశ్నించడానికి సన్నద్ధంగా ఉన్నాయి.

అఫ్గానిస్తాన్‌లో యూకే, దాని మిత్రపక్ష బలగాలపై ట్రంప్ చేసిన విమర్శలను యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తప్పుపట్టారు.

మెలోనీలానే ఇటీవల మరికొందరు ఇరాన్‌తో అమెరికా యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. యూఎస్ బాంబర్లు తమ వైమానిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు.

ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై వ్యాఖ్యలు చేసిన తర్వాత యూరప్ దేశాలు మరింత గట్టిగా ఉంటున్నాయని దౌత్యవేత్తలు చెబుతున్నారు.

యూరప్ మరింత స్వతంత్రంగా వ్యవహరించాలనే చర్చలు మరోసారి జరుగుతున్నాయి. అట్లాంటిక్ సముద్రం అవతల, నమ్మకాన్ని కోల్పోతున్న మిత్రదేశంపై ఆధారపడకుండా యూరప్ దేశాలు స్వతంత్రంగా ముందుకు వెళ్లాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యూరప్ అంతటా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల అభిప్రాయాలను కూడా నేతలు ప్రతిబింబిస్తున్న భావన కలుగుతోంది.

ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న రైట్ వింగ్ యూరోపియన్ పార్టీలు కూడా ఇప్పుడు అమెరికా రాజకీయ నేతలకు దూరంగా ఉండడం మొదలుపెట్టాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)