You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌పై 'భూ కుంభకోణం' ఆరోపణలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య 'పొలిటికల్ హీట్', అసలు వివాదం ఏమిటి?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబం ఉజ్జయినిలోని ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టుల పరిధిలో 168 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో సీఎం యాదవ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్.. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ వాదనలను తోసిపుచ్చడమే కాకుండా, కాంగ్రెస్‌కు 'కులతత్వ' మనస్తత్వం ఉందంటూ ఆరోపించింది.
'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ఉటంకిస్తూ, సీఎం మోహన్ యాదవ్ 'భూ కుంభకోణంలో పాలుపంచుకున్నారని' ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
ఈ భూముల కొనుగోలు ఆరోపణలపై సీఎం మోహన్ యాదవ్ లేదా మధ్యప్రదేశ్ సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మోహన్ యాదవ్‌పై విపక్షాల ఆరోపణలు ఇవే
కాంగ్రెస్ నేత పవన్ ఖేడా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) జితూ పట్వారీ బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎం మోహన్ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
"సీఎం మోహన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి ఉజ్జయినిలో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్న 168 ఎకరాలలో.. 111 ఎకరాల భూమి సింహస్థ కుంభమేళా జరిగే ప్రాంతంలోనే ఉంది. 2035 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉజ్జయినిలో అభివృద్ధి పనులు జరగాల్సిన ప్రాంతంలోనే మోహన్ యాదవ్ కుటుంబం భూములు కొనుగోలు చేసింది. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటారని ఆశించలేం" అని పవన్ ఖేడా అన్నారు.
"ఉజ్జయిని, అయోధ్యలతో దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ప్రజల నమ్మకాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాల నుంచి డబ్బు లూటీ చేయడం భక్తులను నమ్మకాలపై వెన్నుపోటు పొడిచినట్లే. ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా జరగబోతోంది. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రికి తెలుసు. దానికి సంబంధించిన ఫైళ్లు ఆయన వద్దకే వెళ్తాయి, కాబట్టి ఆయన తన కలంబలంతో మార్పులు చేర్పులు చేయగలరు" అని ఆరోపించారు.
మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వందల ఎకరాల భూమి కొనుగోలు చేశారని జితూ పట్వారీ ఆరోపించారు.
"ఉజ్జయినిలో రూ.500 కోట్ల విలువైన భూమిని ఒక ట్రస్ట్‌కు కేవలం 1 రూపాయికే ఇచ్చేశారు. ఆ ట్రస్ట్‌కు ట్రస్టీగా శ్రీరామ్ జీ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన మోహన్ యాదవ్‌కు సాంస్కృతిక సలహాదారు" అని జితూ పట్వారీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.
శివసేన నాయకురాలు, రాజ్యసభ మాజీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా దీనిపై స్పందించారు. ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పంచుకుంటూ.. "అయోధ్యలోని భగవాన్ శ్రీరాముడి పవిత్ర భూమి నుంచి బాబా మహాకాల్ భూమి వరకు కేవలం బీజేపీ మహా అవినీతి మాత్రమే కనిపిస్తోంది" అని రాశారు.
స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ "జాతీయవాదం పేరుతో కళ్లలో దుమ్ము కొట్టి ఎలాంటి ఆటలు ఆడుతున్నారు. మోహన్ యాదవ్ దీనికి సమాధానం చెప్పాలి లేదా రాజీనామా చేయాలి" అని తెలిపారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పుడు మోహన్ యాదవ్ ఇంటికి వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సూచించారు.
"అయోధ్య, ఉజ్జయిని కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, కాశీ, మథుర ఇంకా మిగిలే ఉన్నాయి. ఈడీ అధికారులారా, నిద్ర లేచి ఉంటే మోహన్ ఇంటికి కూడా వెళ్లండి. మహాకాల్ క్షేత్రంలో ఎందుకు దోపిడీ చేశారో అడగండి. అయినా మీరు గొంతు విప్పరని దేశ ప్రజలందరికీ తెలుసు" అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
సీఎం మోహన్ యాదవ్‌ను కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలు ఇవే:
సీఎం మోహన్ యాదవ్‌ను పీసీసీ చీఫ్ జితూ పట్వారీ కొన్ని ప్రశ్నలు అడిగారు-
- సంబంధిత ప్రాంత మాస్టర్ ప్లాన్‌లో చేసిన మార్పులను ప్రభుత్వం బయటపెట్టగలదా?
- అక్కడ ముందే భూములు ఉన్న రైతులకు ఈ ప్రాజెక్టుల గురించిన సమాచారం ఉందా?
- ఈ వ్యవహారంపై న్యాయ విచారణకు మీరు చొరవ చూపగలరా?
- అసలు రూ. 500 కోట్ల విలువైన భూమిని రూ. 1 కే ఎందుకు ఇచ్చారు?
- పత్రికల్లో వచ్చిన కథనం అబద్ధమైతే, ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?
- సీఎం అయిన తర్వాత మోహన్ యాదవ్ కుటుంబం అంత వేగంగా కొనుగోలు చేసిన భూములకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?
బీజేపీ ఏమంటోంది?
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్ అన్నారు.
"ముఖ్యమంత్రి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన నామినేషన్ ప్రకారం.. ఆయన పేరిట ఉన్న 17 ఎకరాల భూమిలో ఇప్పటివరకు ఎలాంటి మార్పూ లేదు. సీఎం మోహన్ యాదవ్ భార్య సీమా యాదవ్ పేరిట ఉన్న 12.29 ఎకరాల భూమిలో కూడా 2026 నాటికి ఎలాంటి మార్పు రాలేదు" అని హేమంత్ ఖండేల్వాల్ అన్నారు.
"కాంగ్రెస్ ఆరోపణల్లో 'సిద్ధి వినాయక్' అనే కంపెనీ ప్రస్తావన ఉంది. ఆ కంపెనీకి 2023లో 68 ఎకరాల భూమి ఉండగా, అది జూన్ నాటికి 65 ఎకరాలకు తగ్గింది. ముఖ్యమంత్రి 2017లోనే ఈ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు" అన్నారు.
"సీఎం మోహన్ యాదవ్ కుమారుడు వైభవ్ వద్ద కూడా 2023 కంటే ముందే 16 ఎకరాల భూమి ఉంది. మోహన్ యాదవ్ సీఎం అయిన తర్వాత ఆయన కుమారుడి భూముల్లోనూ ఎలాంటి మార్పూ రాలేదు. పైగా ఈ భూములన్నీ మాస్టర్ ప్లాన్ అమలు కావడానికి ముందే కొన్నవి. ముఖ్యమంత్రి కోడలు శాలిని యాదవ్ (ఇటీవలే వైభవ్‌తో వివాహం జరిగింది) పది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అది కూడా మాస్టర్ ప్లాన్ పరిధికి వెలుపల ఉంది" అని ఆయన అన్నారు.
అంతేకాదు, భూ వివాదం ఆరోపణల్లో ప్రస్తావించిన బంధువుల వివరాలు పూర్తిగా తప్పని హేమంత్ ఖండేల్వాల్ అన్నారు.
ముఖ్యమంత్రికి గానీ, ఆయన కుటుంబానికి గానీ ఆయా విషయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
"బంధువులకు సొంతంగా వ్యాపారాలు, స్వతంత్ర అస్తిత్వం ఉన్నాయి. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. వారిపై చేసిన ఆరోపణలు కూడా తప్పే" అన్నారు.
కాంగ్రెస్‌కు కులతత్వ మనస్తత్వం ఉందని హేమంత్ ఖండేల్వాల్ ఆరోపించారు.
కాంగ్రెస్ వాదనతో విభేదించిన అఖిలేష్ యాదవ్
మధ్యప్రదేశ్ సీఎంపై వచ్చిన భూ ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ఆయన కాంగ్రెస్ వాదనతో విభేదించారు.
మోహన్ యాదవ్‌ను బద్నాం చేయడానికి బీజేపీనే ఈ కుట్ర పన్నిందని అఖిలేష్ యాదవ్ లఖ్‌నవూలో విలేఖరులతో మాట్లాడుతూ ఆరోపించారు.
"మోహన్ యాదవ్‌ను చెడుగా చిత్రీకరించేందుకే బీజేపీ ఈ కుట్రకు తెరలేపింది. ఒకవేళ మోహన్ యాదవ్‌పై ఈ ఆరోపణలు నిజమే అనుకుంటే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏకంగా 300 నుంచి 600 ఎకరాల భూమి తీసుకున్నారు. మోహన్ యాదవ్ భూములు కొనడం పెద్ద వింతేమీ కాదు. గతంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు? బీజేపీ తన ముఖ్యమంత్రిని మార్చాలని అనుకుంటోంది, అందుకే ఇలాంటి ఆరోపణలు చేయిస్తోంది" అన్నారు.
అంతేకాకుండా, "మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులను వారు తొలగించాలనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించడానికే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల తొలగింపునకు కుట్రలు జరుగుతున్నాయి" అని అఖిలేష్ పేర్కొన్నారు.
అసలు భూ ఆరోపణలు ఏమిటి?
'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక 2026 జూన్ 23న ఒక కథనం ప్రచురించడంతో సీఎం మోహన్ యాదవ్‌కు సంబంధించిన ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఆ కథనం ప్రకారం.. 2023 డిసెంబర్ 13న మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు 137 ప్లాట్లను కొనుగోలు చేశాయి.
ఈ 137 ప్లాట్ల మొత్తం వైశాల్యం దాదాపు 168 ఎకరాలు ఉంటుందని, వీటిని సుమారు రూ. 45 కోట్లకు కొనుగోలు చేశారు. కొన్ని ప్లాట్లను ఆ తర్వాత విక్రయించారని, 2026లో జరిగిన కొన్ని లావాదేవీల రికార్డులు ప్రస్తుతానికి ప్రభుత్వ పత్రాల్లో పూర్తిగా అప్‌డేట్ కాలేదు.
ముఖ్యమంత్రి భార్య సీమా యాదవ్, కుమారుడు వైభవ్ భార్య శాలిని యాదవ్, సోదరులు నందలాల్, నారాయణ్ యాదవ్, నారాయణ్ భార్య రేఖా యాదవ్, వారి కుమారుడు అభయ్ యాదవ్, చుట్టాలు గోవింద్ యాదవ్, నిలేష్ యాదవ్‌లు ఈ భూములు కొన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రధానంగా రెండు ప్రశ్నలను లేవనెత్తింది:
- మొదటిది, కొనుగోలు చేసిన భూములలో ఎక్కువ భాగం హైవేలు లేదా కొత్త రోడ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లోనే ఉన్నాయి.
- రెండోది, మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన కుటుంబ సభ్యులకు చాలా భూములు ఉన్నాయి. కానీ, ఆయన సీఎం కాగానే ఈ కొనుగోళ్ల వేగం హఠాత్తుగా పెరిగింది.
ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ మే 2023లోనే విడుదలైందని కథనం పేర్కొంది. ఆ సమయంలో మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎం కాకపోయినప్పటికీ.. ఆయన రాజకీయ జీవితం ఉజ్జయినితోనే ముడిపడి ఉంది. మోహన్ యాదవ్ 2004 నుంచి 2010 వరకు ఉజ్జయిని అభివృద్ధి సంస్థ (యూడీఏ) చైర్మన్‌గా ఉన్నారు. అలాగే 2011 నుంచి 2013 వరకు మధ్యప్రదేశ్ పర్యటక అభివృద్ధి సంస్థ అధినేతగా పనిచేశారు. 2013 నుంచి ఆయన ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.
"ఆయన సీఎం అయిన తర్వాత ఉజ్జయిని, దాని పరిసర ప్రాంతాలలో కొత్త రోడ్లు, హైవే ప్రాజెక్టులను ప్రకటించారు. ఇలాంటి ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాల చుట్టుపక్కల భూముల ధరలు పెరగడం ఖాయమని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. అందువల్ల లాభాల కోసం ఇక్కడ పెట్టుబడి పెట్టడాన్ని లాభదాయకంగా భావించారు" అని కథనం వివరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)