కాంగ్రెస్, తృణమూల్ విలీనమైతే లాభమెవరికి, నష్టమెవరికి?

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్షం రాజకీయ మనుగడ అంత తేలిక కాదు.

కాంగ్రెస్ 1977లో అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)-సీపీఎం 2011లో అధికారాన్ని కోల్పోయింది. ఇంతవరకూ కోలుకోలేదు.

ఈ ఏడాది అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు మమతా బెనర్జీకి దూరం జరిగారు. తిరుగుబాటు వర్గం అసెంబ్లీలో సొంతంగా ప్రతిపక్షనేతను నియమించుకుంది.

టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో 20 మంది తిరుగుబాటు చేశారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీకి, తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలేమంటున్నారు?

ఈ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీని కలిశారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా రాహుల్ గాంధీని కలిశారు.

ఈ సమావేశాలతో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌లో విలీనం కావచ్చని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇరు పార్టీలు దీన్ని ఖండించాయి.

"సోనియా గాంధీ, మమతా బెనర్జీల మధ్య జరిగిన సమావేశం గురించి మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇది స్నేహపూర్వక సమావేశం. ఇద్దరు మహిళానేతలకు చాలా కాలంగా వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. అందుకే సంభాషణలో కొన్ని వ్యక్తిగత అంశాలు కూడా చర్చకు వచ్చాయి" అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ 'ఎక్స్'‌లో పోస్టు చేశారు.

విలీనం వార్తలపై తానేమీ మాట్లాడలేనని, పార్టీ అగ్ర నాయకత్వం మాత్రమే దాని గురించి చెప్పగలదని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ అన్నారు.

విలీనం లేదా అలాంటి ప్రతిపాదన గురించి తనకేమీ తెలియదని అయితే పశ్చిమ బెంగాల్‌లో ఎదురైన రాజకీయ ఎదురుదెబ్బల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వైఖరి మారినట్టు కనిపిస్తోందని పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌధురి అన్నారు.

"నేను జ్యోతిష్యుణ్ని కాదు. విలీనం, చర్చల గురించి నాకేమీ తెలియదు. ఏదైనా విషయంపై అధికారిక నిర్ణయం తీసుకుంటే మమ్మల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు" అని అధిర్ రంజన్ చౌధురి ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

"పార్టీ చెల్లాచెదురవుతున్నట్టు అనిపిస్తోంది. సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారు'' అని ఆయన అన్నారు.

"ఇన్నేళ్లగా ఆమెకు కాంగ్రెస్ నేతలను కలవాలని అనిపించలేదు. బహుశా ఇప్పుడు కలవాలని భావిస్తున్నట్టుంది" అని అధిర్ రంజన్ చౌధురి వ్యంగ్యంగా అన్నారు.

సోనియా గాంధీ, మమతా బెనర్జీల మధ్య సమావేశంపై రాజకీయ ఊహాగానాలు జోరుగా సాగుతున్న తరుణంలో, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశంపై చర్చలు జరుగుతున్న వేళ అధిర్ రంజన్ చౌధురి ఈ ప్రకటన చేశారు.

వామపక్షాల వ్యూహమేంటి?

"దిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్‌కు మంచి వార్తలు రావడం లేదు. పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో త్వరలో భారీ మార్పులు జరిగే అవకాశముంది. కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి వెళ్లినవారు ఉన్నారు. టీఎంసీ తర్వాత ఎన్‌సీపీ గురించి చర్చలు జరిగాయి. ఇప్పుడు విలీనం గురించి చర్చ జరుగుతోంది. బెంగాల్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని నేను ముందే చెప్పాను. ఇక్కడి రాజకీయ ప్రయాణాలు ఎప్పుడూ ఒకే రీతిలో సాగవు" అని విలీనం వార్తలపై వ్యాఖ్యానిస్తూ, సీనియర్ జర్నలిస్ట్, రచయిత సాయంతన్ ఘోష్ 'ఎక్స్'లో రాశారు.

మరో సీనియర్ జర్నలిస్ట్ సబా నఖ్వీ కూడా స్పందించారు.

"కాంగ్రెస్, టీఎంసీ విలీనమైతే అది టీఎంసీని దాని అస్తవ్యస్త, పతన స్థితి నుంచి బయటపడేసి, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం బలహీనపడడం వంటి సమస్యలపై కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. టీఎంసీ భారీ ఓటు బ్యాంకును పొందే అవకాశం ఉన్నందున ఇది కాంగ్రెస్‌కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అధిర్ రంజన్ చౌధురికి ఇది మంచి వార్త కాదు. బెంగాల్‌లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ అధిర్ రంజన్ చౌధురికి పార్టీలో కీలకస్థానంలో ఉన్నారు" అని అభిప్రాయపడ్డారు.

"వామపక్ష పార్టీలకు కూడా ఇది నచ్చదు. వారు ముందుగా మమతా బెనర్జీని బలహీనపరిచి, ఆ తర్వాత బీజేపీకి సవాలు విసరాలనే వ్యూహంపై చాలా కాలంగా పనిచేస్తున్నారు. టీఎంసీ బలహీనపడిన తర్వాత, ప్రతిపక్ష రాజకీయాల్లో ఏర్పడే శూన్యాన్ని తాము పూరించగలమని వారు ఆశించారు" అని విశ్లేషించారు.

‘మమత కాంగ్రెస్‌కు కట్టుబడి ఉండగలరా?’

టీఎంసీ-కాంగ్రెస్ విలీనాన్ని ఒక బ్యాడ్ ఐడియాగా సీనియర్ జర్నలిస్ట్, రచయిత వీర్ సంఘ్వీ భావిస్తున్నారు.

"టీఎంసీ వల్ల కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనముండదు. మమతా బెనర్జీ బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజాదరణ కోల్పోయిన పరిస్థితిలో ఇప్పుడున్నారు" అని వీర్ 'ది ప్రింట్'లో రాశారు.

"ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కొత్తగా ప్రారంభించి బీజేపీ వ్యతిరేక రాజకీయ రంగంలో వాటాను ఎందుకు పొందకూడదు? మమతా బెనర్జీ ప్రజాదరణ లేమి భారాన్ని కాంగ్రెస్ ఎందుకు మోయాలి? ఏ పార్టీ అయినా మమతా బెనర్జీతో సమన్వయం చేసుకోగలదా? నాయకురాలిగా ఆమెకున్న గొప్ప బలమే, మిత్రపక్షంగా ఉన్నప్పడు అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఆమె ఒక అధికార కేంద్రం. ఎవరికీ ఎప్పుడూ జవాబుదారీగా ఉండలేరు.

ఆమె కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా దాదాపు అందరితోనూ విభేదించారు. ఆమె బీజేపీతో చేతులు కలిపినప్పుడు కూడా వివాదాలు తలెత్తాయి. ఆమె మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు, కాంగ్రెస్ కార్యకర్తలను టీఎంసీలో చేరమని ప్రోత్సహించి, బెంగాల్ కాంగ్రెస్‌ను బలహీనపరచడమే ఆమె చేసిన అతిపెద్ద కృషి.

ఇంకో విషయం మమతా బెనర్జీ ఒక పోరాటపటిమగల, అనూహ్యంగా స్పందించే రాజకీయ నాయకురాలే కాకుండా, అందరూ సులభంగా కలిసిపోగలిగే నాయకురాలు అనుకుందాం. తన రాష్ట్రంలో మూడుసార్లు రాజకీయ పట్టును పూర్తిగా కొనసాగించిన ఒక నాయకురాలు. పార్టీ క్రమశిక్షణను స్వచ్ఛందంగా అంగీకరించి, కాంగ్రెస్ అధ్యక్షుడికి ఆమె విధేయత చూపడాన్ని మీరు ఊహించగలరా?

కాంగ్రెస్‌లో మమతా బెనర్జీ నిజంగా గౌరవించే వ్యక్తి బహుశా సోనియా గాంధీ ఒక్కరే. కానీ టీఎంసీ, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీకి ప్రభావం మమతా బెనర్జీపై పెద్దగా ఉండేది కాదు. కీలకమైన సమయం వచ్చినప్పుడు మమతా బెనర్జీ ఎవరి మాటా వినరు'' అని వీర్ సంఘ్వీ విశ్లేషించారు.

కాంగ్రెస్ నుంచి మమత ఎందుకు బయటకు వచ్చారు?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, పశ్చిమ బెంగాల్‌లో 1977 వరకు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. కానీ శరణార్థుల సంక్షోభం, నక్సలైట్ ఉద్యమం వల్ల పార్టీలో విభేదాలు పెరిగాయి.

ప్రియరంజన్ దాస్‌మున్షీ, సోమెన్ మిత్రా వంటి నాయకులు కూడా లెఫ్ట్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి సమష్టిగా ప్రయత్నించారు. కానీ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో వామపక్ష పార్టీలకు రాజకీయంగా లాభం కలిగింది.

1982లో కాంగ్రెస్ 49 శాతం ఓట్లతో స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, అంతర్గత విభేదాలు దాని బలాన్ని బలహీనపరిచాయి.

1992లో సోమన్ మిత్రా చాలా స్వల్ప మెజారిటీతో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షపదవిని గెలుచుకున్నారు. కానీ మమతా బెనర్జీ ఎదుగుదల ఆయన ప్రాభవాన్ని మరుగున పడేసింది.

మిత్రాకు సీతారాం కేసరి, ప్రణబ్ ముఖర్జీల మద్దతు ఉంది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు మమతను 1997 జనవరిలో కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు.

పార్టీ నుంచి తనను బహిష్కరించడంపై మమత చాలా బాధపడ్డారని, కాంగ్రెస్ ఇప్పటికీ ఆమె బహిష్కరణ ప్రభావం నుంచి కోలుకోలేకపోయిందని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య హిందుస్థాన్ టైమ్స్‌కు గత ఏడాది ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

1998లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఇది వామపక్ష పార్టీలకు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలిచింది.

1996 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 82 స్థానాలు గెలుచుకోగా, 2001 నాటికి కేవలం 26 స్థానాలకే పరిమితమైంది.

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ మరింత దూకుడుగా మారారు. ఆమెను బహిష్కరించిన అదే కాంగ్రెస్ 2001లో తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కేవలం 26 సీట్లను గెలుచుకుంది.

2011లో కాంగ్రెస్ ఒక చిన్న భాగస్వామిగా మమత ప్రభంజనంతో 42 స్థానాలను గెలుచుకుంది.

ఈ భాగస్వామ్యం విఫలమవడంతో 2016లో కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని 44 సీట్లు గెలుచుకుంది. కానీ 2021 నాటికి కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

2021 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం, ఐఎస్ఎఫ్ కూటమిని ఏర్పాటు చేశాయిగానీ ఐఎస్ఎఫ్ మాత్రమే ఒక సీటును గెలుచుకుంది. పశ్చిమబెంగాల్ చరిత్రలో వామపక్షాలు, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం అదే మొదటిసారి.

1947 నుంచి 1990ల వరకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రధానంగా వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య పోరాట క్షేత్రంగా ఉండేవి. కానీ 2010వ దశాబ్దం ఈ సమీకరణాన్ని మార్చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.