'హెల్మెట్ ఇవ్వకపోయి ఉంటే ప్రాణాలు పోయుండేవి', పశ్చిమ బెంగాల్‌లో ఏం జరుగుతోంది?

మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, బీజేపీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, తనపై బీజేపీ ప్రణాళిక ప్రకారం దాడి చేసిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

తన మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని చేర్చుకోవద్దంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై ఒత్తిడి తెచ్చారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

ఎన్నికల అనంతర హింసాకాండలో మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పుర్‌లో రాళ్ల దాడి జరిగింది.

తీవ్ర ఉద్రిక్తతల నడుమ అభిషేక్ బెనర్జీని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తరలించారు. తనపై హత్యాయత్నం జరిగిందని, బీజేపీనే దీనికి బాధ్యత వహించాలని అభిషేక్ బెనర్జీ అన్నారు.

ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఘటన అనంతరం, అభిషేక్ బెనర్జీని మొదట కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆయనను పరామర్శించేందుకు మమతాబెనర్జీ అక్కడికి వెళ్లారు.

ఆ తర్వాత అభిషేక్ బెనర్జీని అపోలో ఆసుపత్రి నుంచి బేలే వ్యూ ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆస్పత్రి సీఈవోతో మమతా బెనర్జీ వాగ్వాదానికి దిగినట్టుగా కనిపిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేబ్‌జీత్ సర్కార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు .

ఇందులో మమతా బెనర్జీ ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టు కనిపించింది.

"ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో ప్రవర్తించిన తీరుకు మమతా బెనర్జీ సిగ్గుపడాలి. సీఐడీ సమన్ల నుంచి అభిషేక్ బెనర్జీని కాపాడే ప్రయత్నమా ఇది? నిజంగా చికిత్స అవసరమైన రోగులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇబ్బందులు పడకూడదు. చట్టానికి ఎవరూ అతీతులు కారు" అని ఆ పోస్టులో దేబ్‌జీత్ సర్కార్ రాశారు.

అభిషేక్‌కు తీవ్రమైన గాయాలు కాలేదని కూడా వైద్య నివేదికల్లో ఉందని, ఆస్పత్రి సీఈవోను మమతా బెనర్జీ బెదిరించారని ఆయన పేర్కొన్నారు.

మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, బీజేపీ

ఫొటో సోర్స్, ANI

శనివారం రాత్రి ఆస్పత్రిలో అసలేం జరిగింది?

వైరల్ అయిన వీడియో క్లిప్‌లో మమతా బెనర్జీ ఆస్పత్రి సీఈవోని ఉద్దేశించి, "సారీ.. మీరు తప్పు చేశారు. మీకు మేం ఎంత సాయం చేశామో గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు." అని అంటున్నట్లు ఉంది.

"ఆస్పత్రికి వచ్చిన ఏ రోగికైనా మీరు చికిత్స అందించలేదంటే.. అందుకు మీరు సిగ్గుపడాలి. ఈ అహంకారాన్ని అందరూ గుర్తుంచుకుంటారు. మీరు ఆస్పత్రి నడుపుతున్నారు, బీజేపీ అధికారంలో ఉందని మీరు డాక్టర్లను బెదిరిస్తున్నారు.''

శనివారం రాత్రి జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మమతా బెనర్జీ "అభిషేక్ బెనర్జీని చేర్చుకోవద్దని బీజేపీ ప్రభుత్వం ఆస్పత్రులను బెదిరిస్తోంది" అని ఆరోపించారు.

"రెండు ఆస్పత్రులూ ఆయన గాయాల తీవ్రతను గుర్తించాయి. ఐటీయూ (ఇంటెన్సివ్ థెరపీ యూనిట్)కు తరలించాయి" అని మమత తెలిపారు.

అభిషేక్‌ను చేర్చుకోవద్దంటూ పోలీసులు, బీజేపీ నాయకుల నుంచి తనకు 'బెదిరింపు కాల్స్' వస్తున్నాయని ప్రైవేట్ ఆసుపత్రి సీఈవో తనకు చెప్పినట్లు మమత ఆరోపించారు.

"అభిషేక్ ఛాతీలో రక్తం గడ్డకట్టినట్లు స్వతంత్ర వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. శరీరం మొత్తం గాయాలున్నాయి. ఈ విషయం వైద్యుల నివేదికలో ఉంది. ఆ రాళ్ల దాడిలో ఆయన అక్కడికక్కడే చనిపోయే అవకాశముంది. స్థానిక యువకులు హెల్మెట్ ఇవ్వకపోయి ఉంటే, తలకు తీవ్ర గాయమై ప్రాణాలు పోయుండేవి'' అని మమత అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ వైద్యుల నివేదికను విలేఖరుల ఎదుట చదివి వినిపించారు. అభిషేక్ బెనర్జీ ముఖం, మెడ, వీపుపై తీవ్ర గాయాలైనట్లుఆ నివేదికలో ఉందని తెలిపారు.

మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, బీజేపీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కల్యాణ్ బెనర్జీని మమతా బెనర్జీ పరామర్శించారు.

కల్యాణ్ బెనర్జీపై దాడి ఆరోపణలు

అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజు ఆదివారం(మే 31)న టీఎంసీ మరో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కూడా మూక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆయన తన సొంత నియోజకవర్గమైన హుగ్లీలోని చాందితాలా ప్రాంతానికి వెళ్లారు. ఇందుకు సంబంధించి బయటికొచ్చిన వీడియోలో కల్యాణ్ బెనర్జీ కింద పడిపోయి ఉన్నారు. తల పట్టుకుని కనిపించారు. గుంపును అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

తన తలకు గాయమైందని ఆయన చెప్పారు.

కొందరు కల్యాణ్ బెనర్జీకి నల్లజెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు.

ఈ సంఘటన తర్వాత ఆయన తన అనుచరులతో కలిసి అక్కడే నిరసన వ్యక్తంచేశారు.

ఈ ఘటన తర్వాత కల్యాణ్ బెనర్జీ నివాసానికి వెళ్లిన మమతా బెనర్జీ ఆయన్ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

"నిన్న (శనివారం) బీజేపీ మద్దతుదారులు టీఎంసీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ అభిషేక్ బెనర్జీపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘోరమైన ఘటనకు సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి. లోక్‌ సభలో మా చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీపై ఇవాళ బీజేపీ ప్రణాళికాబద్ధంగా దాడి చేసింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది'' అని మమతా బెనర్జీ అన్నారు.

మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, బీజేపీ

ఫొటో సోర్స్, ANI

అభిషేక్ బెనర్జీపై దాడి ఎలా జరిగింది?

ఒక టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని కలిసేందుకు అభిషేక్ బెనర్జీ సోనార్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరిగాయి.

కార్యకర్త ఇంటికి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండటంతో అభిషేక్ బెనర్జీ తన వాహనంలో అక్కడికి వెళ్లలేక బైక్‌పై వెళ్లారు.

ఆ సమయంలో స్థానికులు కొందరు అభిషేక్ బెనర్జీని మోటార్ సైకిల్ పైనుంచి కిందకు లాగి రాళ్లు, గుడ్లతో దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.

భద్రతా సిబ్బంది ఆయన్ను రక్షించారు. మొదట ఆయన్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, ఆ తర్వాత మరో ఆసుపత్రికి తరలించారు.

అభిషేక్ బెనర్జీ రాత్రి సుమారు 11 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

ఈ ఘటన వెనక బీజేపీ కుట్ర ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, భద్రతా సిబ్బంది ఆయన్ను రక్షించి హెల్మెట్ అందించారని బీజేపీ పేర్కొంది.

దాడి కేసులో ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, బీజేపీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అభిషేక్ బెనర్జీకి హెల్మెట్ ఇచ్చి, పోలీసులు రక్షణ కల్పించారని బీజేపీ అంటోంది.

దాడి తర్వాత అభిషేక్ బెనర్జీ ఏమన్నారు?

అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని 'ఇండీ కూటమి' పార్టీలు ఖండించాయి. ఆయనకు సంఘీభావం తెలిపాయి.

లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జేఎంఎం నాయకుడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో సహా పలువురు నాయకులు దీనిపై ప్రకటనలు చేశారు.

తనకు మద్దతు తెలిపిన వారందరికీ అభిషేక్ బెనర్జీ ధన్యవాదాలు తెలిపారు.

రాహుల్ గాంధీ ప్రకటనను షేర్ చేస్తూ, "అధికారం తాత్కాలికం. ప్రజల సంకల్పం శాశ్వతం. నేను ప్రజలకు మాత్రమే తలవంచుతాను. అధికారంలో ఉన్నవారికి ఎప్పటికీ కాదు" అని రాశారు.

''ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి, దేశాన్ని విభజించాలని చూసేవారిపై మా పోరాటం కొనసాగిస్తాం. భారత్ ఐక్యంగా నిలుస్తుంది. భయం, ద్వేషం, హింస, బెదిరింపుల రాజకీయాలను ఓడించి, ప్రజల గొంతు వినిపించేలా మనమందరం కలిసికట్టుగా కృషి చేస్తాం.

గత ఏడాది ఆపరేషన్ సిందూర్ కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో సభ్యునిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ నేను ఐదు దేశాలను సందర్శించాను. నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడ్డాను" అని ఆయన రాశారు.

''తమను తాము జాతీయవాద సంరక్షకులు అని చెప్పుకునే వారు జరిపిన రాజకీయ హింసకు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఇవాళ నేను బాధితుణ్ని. ఇదే నేటి బీజేపీ వాస్తవికత. మీరు వారికి మద్దతిస్తే మిమ్మల్ని దేశభక్తులు అంటారు. వారిని ప్రశ్నిస్తే, మీరు టార్గెట్‌గా మారతారు. వారితో నిలబడితే, మిమ్మల్ని ప్రశంసిస్తారు. వారికి వ్యతిరేకంగా నిలబడితే, మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తారు" అని అభిషేక్ బెనర్జీ తన పోస్టులో విమర్శించారు.

మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, బీజేపీ

ఫొటో సోర్స్, Sanjay Das

ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ ప్రజలు 15 ఏళ్ల టీఎంసీ పాలనపై విసిగిపోయి ఉన్నారని బీజేపీ నేతలంటున్నారు.

బీజేపీ ఏమంటోంది?

అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని బీజేపీ నాయకుడు సుకాంత్ మజుందార్ ఖండించారు.

"ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. టీఎంసీ, అభిషేక్ బెనర్జీపై బెంగాల్ ప్రజల్లో ఆగ్రహం ఉంది. మనం బెంగాల్‌లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది" అని ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

మనం బెంగాల్ రాజకీయాలను హింస రహితంగా మార్చాలని, శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని సుకాంత్ మజుందార్ అన్నారు.

"చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదు. భద్రతా సిబ్బంది హెల్మెట్ ఇచ్చి ఆయన్ను రక్షించారు. పోలీసులు రక్షణ కల్పించారు. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. 15 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో ఆలోచించాలి?" అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.

"టీఎంసీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ప్రజలు స్పందిస్తూ నిరసన తెలుపుతున్నారు. టీఎంసీ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు, సమస్యలకు ఇది ప్రతిచర్య" అని హుమాయున్ కబీర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన టీఎంసీ నుంచి విడిపోయి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.