మమత Vs బీజేపీ: పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌పై రాజకీయ నిపుణులు ఏమంటున్నారు?

ఓటర్లు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, రాజేష్ డోబ్రియాల్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

పశ్చిమ బెంగాల్‌లో బుధవారం చివరి దశ పోలింగ్ ముగిసింది. ఈ దశలో 91.66 శాతం ఓటింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశలో ఓటింగ్ శాతం 93.19గా నమోదైంది. మొత్తంగా 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం 92.47గా ఉంది.

పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది.

పోలింగ్ తర్వాత టీఎంసీ, బీజేపీ రెండు పక్షాలు విజయం తమదంటే తమదని ప్రకటించుకున్నాయి. పోలింగ్ ముగియడంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటికీ వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.

బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పినప్పటికీ.. ఈసారి బీజేపీ, టీఎంసీల మధ్య గట్టి పోటీ ఉందని నిపుణులు అంటున్నారు .

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎగ్జిట్ పోల్స్, వాదనలు

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 148 స్థానాలు అవసరం.

టీఎంసీకి 118-138 సీట్లు, బీజేపీకి 150-175 సీట్లు, ఇతరులకు 2-6 సీట్లు లభిస్తాయని పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

టీఎంసీకి 125-140 సీట్లు, బీజేపీకి 146-161 సీట్లు, ఇతరులకు 6-10 సీట్లు లభిస్తాయని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

టీఎంసీకి 177-187 సీట్లు, బీజేపీకి 95-110, కాంగ్రెస్‌కు 1-3, వామపక్షాలకు 0-1 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది.

చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ టీఎంసీకి 130-140 సీట్లు, బీజేపీకి 150-160, ఇతరులకు 6-10 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్

పోలింగ్ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, టీఎంసీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మూడింట రెండు వంతుల ఓట్లతో గెలుస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు .

ఎగ్జిట్ పోల్స్ తర్వాత వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, వాస్తవ ఫలితాలు అంచనాల కంటే కూడా మెరుగ్గా ఉంటాయని, పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని బీజేపీ నాయకుడు ప్రేమ్ శుక్లా అన్నారు.

మమతా బెనర్జీ పాలన నుంచి తమకు విముక్తి కల్పించడానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు.

అయితే ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమే, అవి ఎప్పుడూ కచ్చితమైనవిగా నిరూపణకావు. 2021 ఎన్నికలలో బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పుగా తేలాయి. టీఎంసీ మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంది.

కానీ ఈసారి పోటీ హోరాహోరీగా ఉండేలా కనిపిస్తోంది. బీబీసీ ప్రతినిధి శుభజ్యోతి ఘోష్ ఈ ఎన్నికలను క్షేత్రస్థాయిలో కవర్ చేస్తున్నారు.

"ఎగ్జిట్ పోల్స్‌ను పక్కన పెట్టినా కూడా, పశ్చిమ బెంగాల్‌లో పోటీ హోరాహోరీగా ఉందన్నది స్పష్టం" అని ఆయన అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పలు విధాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. సర్(ఎస్ఐఆర్) తర్వాత, 91 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దీని ఫలితంగా, రెండు దశలలోనూ 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.

ఈ రికార్డు స్థాయి ఓటింగ్ ఎస్ఐఆర్ కారణంగానే జరిగిందని నిపుణులు భావిస్తున్నారని శుభజ్యోతి ఘోష్ అంటున్నారు.

"సర్ వల్లే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించారు. ఏ హక్కును లాగేసుకుంటారో అన్న భయం ప్రజలలో ఏర్పడింది, అందుకే ప్రజలు ఇంత భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు" అని ఆయన అన్నారు.

"మైనారిటీ ఓట్లు 40% కంటే ఎక్కువగా ఉన్న సీట్లు 63 ఉన్నాయి. ఈ సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం తక్కువ, మిగిలిన సీట్లలో ప్రయత్నించవచ్చు" అని సర్వే ఏజెన్సీ సీఎన్ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్, రాజకీయ విశ్లేషకులు భావేష్ ఝా అన్నారు.

ఎన్నికలపై ఎస్ఐఆర్ ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ, "బెంగాల్‌లో మైనారిటీ వర్గానికి 30 శాతం ఓట్లు ఉన్నాయి. ఎస్ఐఆర్ తర్వాత ఇవి తగ్గాయా, లేదా అనేది చూడాలి" అని అన్నారు.

"ఓటింగ్ ఎంత ఎక్కువగా జరిగితే ప్రజాస్వామ్యానికి అంత మంచిది. కానీ అదే సమయంలో, వంద మందిలో ఎనభై మంది ఓటు వేస్తుంటే, వారిలో పది మంది పేర్లను తొలగిస్తే, ఓటింగ్ శాతం కచ్చితంగా పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఒక్క వ్యక్తి ఓటు హక్కును కూడా హరించలేరు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లకు అప్పీల్ చేసుకున్న 30 లక్షలకు పైగా ప్రజల ఓట్లను తొలగించడం సిగ్గుచేటు" అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అన్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు

ఫొటో సోర్స్, ANI

ఓటర్ల గుర్తింపు రాజకీయాలు

"అస్సాం, పశ్చిమ బెంగాల్ రెండింటిలోనూ సంస్కృతి కీలకంగా మారింది. ఎస్ఐఆర్ కారణంగా బెంగాల్‌లో ఓటర్ల గుర్తింపు రాజకీయాలు చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అస్సాం ఎస్ఐఆర్ నుంచి మినహాయించిన రాష్ట్రం. అస్సాంలో సమస్య వేరు. అక్కడ ఎన్‌ఆర్‌సీ అమలు చేశారు. కానీ రెండు రాష్ట్రాలలోనూ ఓటర్ల గుర్తింపు రాజకీయాలు ఒక చర్చనీయాంశంగా మారాయి. అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో మే 4వ తేదీన తెలుస్తుంది" అని శుభజ్యోతి ఘోష్ అన్నారు.

"బెంగాల్ ఒక ప్రత్యేకమైన భాష, సంస్కృతి కలిగిన రాష్ట్రం. అటువంటి రాష్ట్రాలలో భాష చాలా ముఖ్యం. రాష్ట్ర భాష మాట్లాడలేని వారి ప్రభావం అంతగా ఉండదు. ఉదాహరణకు ప్రధానమంత్రి, హోంమంత్రి గుజరాతీయులైతే, గుజరాత్‌లో వారికి దాని ప్రయోజనం లభిస్తుంది, కానీ బెంగాల్‌లో అటువంటి ప్రయోజనం పొందలేం" అని రషీద్ కిద్వాయ్ అంటున్నారు.

అలాంటప్పుడు ఓటర్లు బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ 70-80 శాతం ముస్లింలు మమతా బెనర్జీకి ఓటు వేస్తే, అప్పుడు 40 శాతం హిందువులు కూడా ఆమెకే ఓటు వేయాలి అనుకుందాం. కాబట్టి ఆ శాతం 40 నుంచి సున్నాకి పడిపోవడం సాధ్యం కాదు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, రషీద్ కిద్వాయ్

'టీఎంసీకి మెజారిటీ రాకపోవడమేమీ ఉండదు'

"నేను ఇకపై ఎన్నికల విశ్లేషణ చెయ్యాలనుకోవడంలేదు, అందుకే మౌనంగా ఉన్నాను. కానీ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఒక విషయం కచ్చితంగా చెప్పాల్సిందే. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే, ఈసారి టీఎంసీకి మెజారిటీ రాకపోవడమేమీ ఉండదు" అని భారత్ ప్రఖ్యాత ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

బీజేపీ గెలవాలంటే ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం గానీ, ఓట్ల లెక్కింపులో మోసం చేయడం గానీ వంటి ఏదో ఒక రకమైన ఎన్నికల అవకతవకలకు పాల్పడటం కానీ చేయాలన్న వాదనలతో రషీద్ కిద్వాయ్ ఏకీభవించలేదు.

"ఒక రాజకీయ పార్టీ సున్నా నుంచి 70 సీట్లకు చేరుకుంటే, దాని ఓట్ల శాతం 20-30 శాతం పెరుగుతుంది. ఇది మోసంతో సాధ్యం కాదు. వాస్తవానికి, మన దేశంలో ప్రజలు వర్గాలుగా విడిపోతారు. వారు ఒకరికి సపోర్ట్ చేస్తారు, మరొకరిని వ్యతిరేకిస్తారు" అని ఆయన అన్నారు.

"అయితే కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి, ఒకవేళ మోసం చేయాల్సి వస్తే అక్కడ కూడా చేసి ఉండేవారు, కానీ బీజేపీ అక్కడ విజయం సాధించలేకపోతోంది" అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)