తమిళనాడు: ఎవరీ రాధన్ పండిట్ వెట్రివేల్, విజయ్‌కు ఓఎస్‌డీగా నియమితులైన రోజే ఎందుకు తొలగించారు?

జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌

ఫొటో సోర్స్, Radhan Pandit/Instagram

    • రచయిత, విజయానంద్ అరుముగమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమిళనాడు ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాలను చూడటానికి ప్రత్యేక అధికారిగా ఎంపికైన జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకాన్ని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది.

ఆయన నియామకాన్నిఅనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.

దీన్నిపై అసెంబ్లీలో మాట్లాడిన డీఎంకే ఎమ్మెల్యే ప్రేమలత.. ''ఈ నియమాకం ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు?'' అని ప్రశ్నించారు.

ఇంతకీ ఈ రాధన్ పండిట్ వెట్రివేల్‌ ఎవరు? 24 గంటల్లోపే ఆయన నియామకాన్ని ఎందుకు రద్దు చేశారు?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు ప్రత్యేక రాజకీయ అధికారిగా రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం (మే 12) ఒక ఉత్తర్వు జారీ చేసింది. ''ఈ నియామకానికి సంబంధించిన నిబంధనలపై ఒక ప్రత్యేక ప్రకటన జారీ చేస్తాం'' అని కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'సముచితం కాదు'

రాధన్ పండిట్ వెట్రివెల్‌కు ప్రభుత్వ పదవి ఇవ్వడం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.

'' శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ కర్తవ్యం. ముఖ్యమంత్రి రాజకీయ విభాగం కార్యదర్శిగా నియమితులైన రాధన్ పండిట్, వాస్తవానికి ఒక జ్యోతిష్యుడు'' అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

'' ప్రభుత్వ ఖర్చుతో అలాంటి వ్యక్తిని అధికారిగా నియమించడం వల్ల జ్యోతిష్యంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. ప్రభుత్వం చేసిన ఈ నియామకం సరైనది కాదు" అని ఆయన విమర్శించారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి వీరపాండ్యన్ కూడా ఇదే తరహాలో విమర్శించారు.

''ఒక ప్రముఖ జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రి రాజకీయ విభాగానికి ప్రత్యేక అధికారిగా నియమించడం ఆశ్చర్యకరంగా ఉంది. తమిళగ వెట్రి కళగం లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని ప్రముఖంగా ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ దేవుడిని నమ్మవచ్చు, పూజించవచ్చు. అది ఆయన వ్యక్తిగత జీవన శైలి. కానీ, ప్రభుత్వానికి మతపరమైన గుర్తింపు ఉండకూడదనేది దేశం అనుసరిస్తున్న సంప్రదాయం'' అని వీరపాండ్యన్ అన్నారు.

''శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధమైన ఆలోచనలను అభివృద్ధి చేసి, బలోపేతం చేయాలని భావించే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజకీయ విభాగపు అధికారిగా జ్యోతిష్యుడిని నియమించడం సరైనది కాదు'' అని ఆయన విమర్శించారు.

"నాకేం అర్థం కావడం లేదు. ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వ ప్రత్యేక అధికారి పదవి ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా వివరించగలరా?" అని కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువళ్లూరు ఎంపీ శశికాంత్ సెంథిల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తన పేజీలో ప్రశ్నించారు.

తమిళనాడు విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే) నాయకుడు తిరుమావళన్
ఫొటో క్యాప్షన్, తమిళనాడు విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే) నాయకుడు తిరుమావళన్

'ప్రభుత్వ సభ్యునిగా అవకాశం'

ఇదే సమయంలో, తమిళనాడు విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే) నాయకుడు తిరుమావళన్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''పార్టీ (టీవీకే) అధికార ప్రతినిధి రాధన్ పండిట్. అందువల్ల, ఆయన ఆ పార్టీ సభ్యుడికి అవకాశం ఇచ్చారని మేం భావిస్తున్నాం" అని అన్నారు.

''ఆయన జ్యోతిష్యుడు అయి ఉండొచ్చు. జ్యోతిష్యాన్ని నమ్మడం వేరు. మత రాజకీయాల్లో పాల్గొనడం వేరు '' అని తిరుమావళన్ అన్నారు.

బుధవారం, టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడంలో నిమగ్నమై ఉంది. అదే సమయంలో, రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని విమర్శిస్తూ డీఎంకే ఎమ్మెల్యే ప్రేమలత మాట్లాడారు.

''నేను రాజ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు, ప్రతిఒక్కరూ ఆయన్ను స్వాగతించారు. కానీ, ఇప్పుడు తన రాజ గురువుగా ఉన్న వ్యక్తినే ప్రత్యేక రాజకీయ అధికారిగా నియమించుకున్నారు. ఒకవేళ ఆయన రాజ గురువు అయితే, దాన్ని గోప్యంగా ఉంచుకోవచ్చు. యువతకు మీరు ఏ ఉదాహరణను ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి'' అని ప్రేమలత విమర్శించారు.

''ప్రజాస్వామ్యాన్ని నమ్మిన యువత ఈ పాలనను ఈ ప్రభుత్వ చేతుల్లో పెట్టింది. రాబోయే తరాలకు ఈ ప్రభుత్వం ఒక ఉదాహరణగా నిలవాలి'' అన్నారు.

జ్యోతిష్యులను నియమించే విషయంపై వివిధ వర్గాల నుంచి వివాదాలు తలెత్తడం మొదలైంది. ఈ నియామకానికి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి.

దీంతో, టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకున్న గంటల వ్యవధిలోనే రాధన్ పండిట్ నియామకాన్ని రద్దు చేసింది.

రాధన్ పండిట్ వెట్రివేల్
ఫొటో క్యాప్షన్, రాధన్ పండిట్ వెట్రివేల్

ఎవరీ రాధన్ పండిట్ వెట్రివేల్?

తమిళనాడు మాజీ, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తాను ఆధ్యాత్మిక గురువునని రాధన్ పండిట్ వెట్రివేల్ తన సోషల్ మీడియా పేజీలో ప్రస్తావించారు.

గత 40 ఏళ్లుగా జ్యోతిష్యానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు.

ఈరోడ్ జిల్లాకు చెందిన రాధన్ పండిట్ వెట్రివేల్, 1990వ దశకం చివర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు పరిచయమయ్యారు.

ఆయన కొంతకాలం పాటు జయలలితకు జ్యోతిష్య సలహాలు ఇచ్చారని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

శశికళ మద్దతుదారులకు, ఈ జ్యోతిష్యుడికి మధ్య వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి శశికళ బంధువు రావణపై చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రాధన్ పండిట్ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు చేసిన తర్వాత రిపోర్టర్లను కలిసిన జ్యోతిష్యుడు, ''మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంటే నాకు ఎంతో గౌరవం. నా ఆస్తులను అక్రమంగా కాజేయడానికి రావణ ప్రయత్నిస్తున్నారు'' అని ఆరోపించారు.

శశికళ

ఫొటో సోర్స్, @AIADMKOfficial/X

ఫొటో క్యాప్షన్, జయలలితకు నివాళి అర్పిస్తున్న శశికళ

అదే సమయంలో రాధన్ పండిట్ ఒక వీక్లీ మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

''నేను చేసిన పనులకు చాలా మంది బహుమతులు అందించారు. అది నా కష్టానికి తగిన ప్రతిఫలం. నేను ఎవరినీ మోసం చేసి దీన్ని సంపాదించుకోలేదు" అని ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

''ఒకవేళ పెరియామ్మ (జయలలిత) దాన్ని అడిగితే, ఆమెకు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను ఒంటరిగా వదిలేయాలని రావణను అడిగాను. నన్ను బెదిరిస్తూ డబ్బులను కాజేయాలని రావణ ప్రయత్నిస్తున్నారు'' అని రాధన్ పండిట్ వెట్రివేల్ చెప్పారు.

ఈ ఆరోపణలపై రావణ అసిస్టెంట్ మోహన్ వివరణ ఇచ్చారు. ''వెట్రివేల్ అనే పేరున్న వ్యక్తి గురించి గార్డెన్‌లో (జయలలిత నివాసం) వారికి తెలుసు. వారే ఆయనను అక్కడకు రావద్దని చెప్పారు. కానీ దీనికి రావణనే కారణమని వెట్రివేల్ నిందిస్తున్నారు'' అని మోహన్ చెప్పారు.

ఈ ఫిర్యాదును పోలీసులు విచారిస్తున్నారు. కానీ, మరిన్ని వివరాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.

విజయ్

ఫొటో సోర్స్, TNDIPR

'విజయ్ పరిచయం.. పార్టీ వైఖరి'

ఆ తర్వాత 2024లో విజయ్ తమిళగ వెట్రి కళగంను ప్రారంభించినప్పుడు రాధన్ పండిట్ ఆయనకు పరిచయం అయ్యారు.

గత ఏడాదిగా వెట్రివేల్ డిజిటల్ మీడియాలో ''విజయ్ ముఖ్యమంత్రి అవుతారు'' అనే ఆలోచనను ప్రచారం చేస్తూ వస్తున్నారు.

తమిళగ వెట్రి కళగం ముఖ్య అధికార ప్రతినిధులలో ఒకరిగా కూడా రాధన్ పండిట్ వెట్రివేల్ నియమితులయ్యారు. ఆ సమయంలో అదంత చర్చ కాలేదు.

'నేను చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు'

ఎన్నికల ఫలితాలకు ముందు పలు మీడియా సంస్థలకు రాధన్ పండిట్ వెట్రివేల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు.

''విజయ్ సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ పది అదనపు ఓట్లను తెస్తారు. ఇది సరదా సమావేశం కాదు'' అన్నారు.

''మెజారిటీతో విజయ్ ముఖ్యమంత్రి అవుతారు'' అని ఆ ఇంటర్వ్యూల్లో రాధన్ పండిట్ వెట్రివేల్ తెలిపారు.

మే 4న ఫలితాల కౌంటింగ్ మొదలైనప్పుడు, టీవీకే ముందంజలో ఉందని వార్తలు వచ్చాయి

దీని తర్వాత.. నీలన్ ‌కరైలోని విజయ్ ఇంటి ముందు మీడియా సందడి మొదలైంది.

సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్, టీవీకే నాయకుడి ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఆ సమయంలో రాధన్ పండిట్‌తో బీబీసీ మాట్లాడింది.

'' విజయ్ ముఖ్యమంత్రి అవుతారని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా నన్నెవరూ నమ్మలేదు'' అన్నారు.

ప్రస్తుత వివాదంపై రాధన్ పండిట్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)