టాలీవుడ్ : ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం దేనికి, 5 ప్రశ్నలు -జవాబులు

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం వర్తింపచేయాలని తెలుగునాట ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం పొరుగు రాష్ట్రాలతోపాటు, మల్టీప్లెక్స్‌ల్లోనూ అమల్లో ఉన్నందున తమకూ వర్తింపచేయాలన్నది వీరి డిమాండ్.
దీనిపై కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. అటు ఎగ్జిబిటర్లు, ఇటు నిర్మాతలు దీనిపై వాడివేడిగా ప్రెస్మీట్లు పెట్టారు.
తాజా వివాదం గురించి చర్చించడానికి మే 15న తెలుగు ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు సమావేశం అయ్యారు.
మరి ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందా?
అసలు ఇంతకీ తెలుగు సినిమా రంగాన్ని వేధిస్తున్న సమస్యలేంటి? వీటికి పరిష్కారాలేంటి?

1. ఎగ్జిబిటర్ల డిమాండ్ ఏంటి?
ప్రస్తుతం తెలుగు నాట థియేటర్లకు ఫిక్స్డ్ రెంటల్ పద్ధతి అమల్లో ఉంది.
దీనివల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్రంగా నష్టపోతున్నాయని ఎగ్జిబిటర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఆడినా ఆడకపోయినా తాము భారీగా అద్దెలు, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు.
దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాల్లో లాగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్సంటేజ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మొదటి వారం టికెట్ వసూళ్లలో 60 శాతం రెండో వారం 50 శాతం మూడో వారం నుంచి 40 శాతం వాటా థియేటర్లకు ఇవ్వాలని, లేదంటే సినిమాలను ప్రదర్శించబోమని చెబుతున్నారు.
తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం తాజా ఆందోళనలో చురుగ్గా వ్యవహరిస్తోంది.
దీనిపై ప్రముఖ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ సహా పలువురు థియేటర్ యజమానులు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
''కొంతకాలంగా ఎగ్జిబిటర్లు కరెంటు బిల్లులు, టాక్సులు కట్టలేక గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. ఎవరినో లక్ష్యం చేసుకున్నది కాదు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం మొత్తం పర్సెంటేజ్ విధానం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇలా జరగడంలేదు. గత 10 ఏళ్లలో దాదాపు 3000కి పైగా ఉన్న థియేటర్లలో 1372 థియేటర్లు మూతపడ్డాయి. మల్టీప్లెక్స్‌ల మాదిరే సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజీ ఇవ్వాలి. రెంటల్ సిస్టం వల్ల థియేటర్లు ఏడాదిలో 9 నెలలు నష్టాల్లో నడుస్తున్నాయి" అని ఎగ్జిబిటర్లు అన్నారు.

2. నిర్మాతలు ఏమంటున్నారు?
యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ పర్సంటేజ్ విధానాన్ని వ్యతిరేకించనప్పటికీ, కొన్ని షరతులు విధిస్తోంది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దాదాపు 60కి పైగా సినిమాలకు ఈ రూల్ వర్తింపజేయడం సాధ్యం కాదని, కేవలం భవిష్యత్తులో ప్రారంభమయ్యే కొత్త చిత్రాలకే ఇది వర్తింపచేయాలని వారు అంటున్నారు.
దీంతో పాటు, చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డిజిటల్ టికెట్ ట్రాకింగ్ సిస్టమ్ లేదని, హౌస్‌ఫుల్ కలెక్షన్లు ఉన్నా సరైన లెక్కలు చూపించడం లేదనేది నిర్మాతల ఆరోపణ. ఇప్పటికే చాలా సినిమాలు నిర్మాణంలో ఉన్నందున, కొత్తగా ప్రారంభించబోయే వాటికి మాత్రమే ఈ విధానం అమలు చేయాలని నిర్మాతలు కోరుతున్నారు.
దీనిపై నిర్మాత నాగవంశీ సహా పలువురు నిర్మాతలు విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ''థియేటర్ల యాజమాన్యాలు రాత్రికి రాత్రే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, వెంటనే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని బెదిరించడం సరి కాదు. కొత్త విధానాలు పద్ధతి ప్రకారం రావాలి. పర్సంటేజ్ విధానం కంటే ముందు, థియేటర్ల గ్రేడింగ్, రన్ ట్రాకింగ్, వీపీఎఫ్ చార్జీల తొలగింపు, మెయింటెనెన్స్ ఛార్జీల విషయంలో పారదర్శకత కావాలి. థియేటర్లను రెనోవేట్ చేసి సౌకర్యాలు (టాయిలెట్స్, ప్రొజెక్షన్, సౌండ్) మెరుగుపరిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా వస్తారు. థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గించాలి'' అని నిర్మాతలు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
3. టాలీవుడ్‌ను వేధిస్తున్న సమస్యలేంటి?
ఆర్థిక పరంగా సినిమా రంగం ఎదుర్కొంటోన్న సమస్యల గురించి ప్రముఖ పాత్రికేయులు రంగావఝుల భరద్వాజ బీబీసీకి వివరించారు.
భారీ పారితోషికాల భారం: పెద్ద సినిమా బడ్జెట్లో దాదాపు సింహ భాగం కేవలం అగ్ర హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్లకే సరిపోతోంది.
మిగిలిన కొద్ది భాగంతోనే బడ్జెట్‌తోనే స్క్రీన్ క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్ భరించాల్సి వస్తోంది. ఈ పెట్టుబడిని రికవరీ చేయడానికి నిర్మాతలు టికెట్ ధరలను విపరీతంగా పెంచాల్సి వస్తోంది.
ఓటీటీ విడుదల తేదీలు: సినిమా థియేటర్లలో విడుదలైన 4 వారాలకే డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లోకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. థియేటర్ల మనుగడ సాగాలంటే ఈ విండోను కనీసం 8 వారాలకు పెంచాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రేక్షకుడిపై ఆర్థిక భారం: టికెట్ ధరలు, థియేటర్ క్యాంటీన్లలో ఆహార పదార్థాల రేట్లు సామాన్య కుటుంబానికి భరించలేని స్థాయికి చేరాయి.
ఫలితంగా టాక్ కొంచెం అటుఇటుగా ఉన్నా ప్రేక్షకుడు థియేటర్‌కు రాకుండా ఓటీటీ విడుదల కోసం ఇళ్లలోనే వేచి చూస్తున్నాడు.

ఫొటో సోర్స్, ugc
4. కమిటీ దేని కోసం?
తాజా వివాదం గురించి చర్చించడానికి మే 15న తెలుగు ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు సమావేశం అయ్యారు.
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఆధ్వర్యంలో ఆ సమావేశం జరిగింది.
మొత్తంగా ఈ సమస్య పరిష్కారానికి 15 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ, 2 నెలల్లో దానిపై నివేదిక ఇవ్వాలని ఫిలిం చాంబర్ ఆదేశించింది.
''పర్సంటేజీ విధానం గురించి థియేటర్ల వారు తీసుకున్న నిర్ణయానికి ప్రొడ్యూసర్లు సానుకూలంగా స్పందించారు. దీనిపై ఒక కమిటీ వేశారు. వారు తొందర్లోనే నివేదిక ఇస్తారు. థియేటర్లలో ఏ,బీ,సీ ఇలా ఉంటాయి కాబట్టి దేనికి ఎంత పర్సంటేజీ అనేది కమిటీ ఫైనల్ చేయబోతోంది. తరువాత చాంబర్ ఆ వివరాలు ప్రకటిస్తుంది'' అని మీడియాకు చెప్పారు నిర్మాత దిల్ రాజు.

ఫొటో సోర్స్, Getty Images
5. ఏమిటీ పర్సంటేజీ విధానం?
ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అద్దె రూపంలో నియమిత మొత్తం చెల్లిస్తారు.
దాని వల్ల సినిమా సూపర్ హిట్ అయినా వారికి అదనపు లాభం రాదు.
అలా కాకుండా, వాటా విధానం అంటే, ఉదాహరణకు మొదటి వారంలో రాబడిలో 55 నుంచి 60 శాతం నిర్మాతలు/డిస్ట్రిబ్యూటర్లకు, మిగిలిన 40 నుంచి 45శాతం ఎగ్జిబిటర్లకు వెళ్లేలా, రెండో వారంలో 50 శాతం ఎగ్జిబిటర్లకు, 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వెళ్లేలా ఏర్పాటు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.
మల్టీప్లెక్సుల్లో ఇది ఇప్పటికే అమలులో ఉంది (ఈ శాతాలు ఉదాహరణ కోసమే,ఇవి ప్రాంతాన్ని బట్టి మారతాయి.)
రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న విడుదల కోసం సిద్ధమైంది.
అయితే తమ డిమాండ్లు తేలే వరకూ ఆ సినిమా విడుదల చేయబోమని తెలంగాణ థియేటర్ యజమానులు కొందరు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. కానీ, దానిపై చాలా మంది నిర్మాతలు స్పందించారు.
ఇలా ఒక సినిమాను లక్ష్యం చేసుకోవడం సరికాదని వారు అన్నారు.
కొందరు నిర్మాతలు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు.
''జూన్ 4న పెద్ది విడుదల అవుతుంది. దానిలో ఎవరికీ ఎటువంటి సందేహాలూ అక్కర్లేదని'' ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























