గోవా: ఒకనాడు భారీగా వచ్చిన విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు?

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

గోవా దక్షిణ ప్రాంతం అంచున పొడవాటి ఇసుక తీరరేఖలో నెలవంక ఆకృతిలో ఉండే పాలోలెమ్ బీచ్ వద్ద మధ్యాహ్న సమయమైంది. భానుడు భగభగలాడి పోతున్నాడు. అయినా సముద్రంలో పర్యటకుల హుషారును ఆ ఎండ ఏమాత్రం ఆపలేకపోతోంది.

భారతదేశపు పార్టీ రాజధానిగా తరచూ పిలిచే గోవాలో బీచ్ వైపుండే గుడిసెల్లాంటి తాత్కాలిక వసతి గృహాలు, తక్కువ ఖర్చుతో దొరికే హోటళ్లు పర్యటకులతో నిండిపోయాయి.

అయితే కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ఇక్కడ వచ్చిన మార్పేంటంటే ఒకప్పుడు పాలోలెమ్‌తో పాటు గోవాలోని ఇతర బీచ్ గ్రామాల్లో యూరోపియన్లు, రష్యన్లు ఎక్కువ కనిపించేవారు. ఇప్పుడు ఆ పర్యటకులు కనిపించడం లేదు.

ఇక్కడ ఉన్నవారంతా దాదాపుగా దేశీయ పర్యటకులే. ఇది గమనిస్తే విదేశీ పర్యటకులకు గోవాపై ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది.

అయితే దేశీయ పర్యటకుల సంఖ్య బాగా పెరిగింది. మారుమూల ప్రాంతాల ప్రజల్లో కూడా గోవాపై ఆకర్షణ పెరిగింది.

మారుమూల ప్రాంతాల నుంచి గోవాకు పర్యటకులు

గోవా పర్యటకశాఖ విడుదల చేసిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2017లో గోవాను దాదాపు 9 లక్షలమంది విదేశీ పర్యటకులు సందర్శించారు. 2025 నాటికి ఆ సంఖ్య దాదాపు 5 లక్షలకు పడిపోయింది. 2016లో దేశీయ పర్యటకుల సంఖ్య 68 లక్షలుంటే, గత ఏడాది వారి సంఖ్య కోటి దాటింది.

ప్రపంచ భౌగోెళిక రాజకీయ పరిస్థితులు విదేశీ పర్యటకులపై ప్రభావం చూపుతున్నాయని గోవా పర్యటక శాఖ ఇటీవల తెలిపింది.

'భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు మేం ఒకవైపు నిరాశగానూ, మరోవైపు ఆశావాదంతోనూ ఉండాల్సి వస్తోంది’’ అని గోవా పర్యటక మంత్రి రోహన్ ఖాంటే స్థానిక మీడియాకు చెప్పారు.

అయితే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడం ఇటీవలి సంక్షోభాలకంటే ముందే జరిగింది. 1960లు, 1970లో హిప్పీల సంస్కృతి ప్రాచుర్యంలో ఉన్న కాలం నుంచే తక్కువ ఖర్చుతో కూడిన విహార కేంద్రంగా గోవాను ఇష్టపడుతూ వచ్చిన విదేశీ పర్యటకులు ఇప్పుడెందుకు దూరమవుతున్నారు?

‘అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం’

''ప్రజల పరిస్థితి బాలేదు. ముందు కోవిడ్, తర్వాత యుక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు మిడిల్ఈస్ట్ పరిణామాలతో విమాన ప్రయాణం బాగా ఖరీదైన వ్యవహారంగా మారింది. కాబట్టి డబ్బు ప్రభావం చాలా ఉంది'' అని ఐదోసారి గోవా పర్యటనలో ఉన్న రష్యన్ బ్యాలే డ్యాన్సర్ సోఫీ చెప్పారు.

''నా స్నేహితుల్లో కొందరు ఈ ఏడాది గోవా కాకుండా తుర్కియే లేదంటే ఈజిప్టు వెళ్తున్నారు. అవి మాకు దగ్గరగా ఉండడం, తక్కువ ఖర్చులో వెళ్లగలిగే అవకాశం ఉండడం ఇందుకు కారణం'' అని ఆమె అన్నారు.

గత 20 ఏళ్ల నుంచి న్యూకాజిల్ నుంచి గోవా వస్తున్న రికో కూడా యూరప్ పర్యటకుల గురించి ఇలాగే చెప్పారు.

''మా దేశంలో ప్రస్తుతం విదేశీ పర్యటనలకు ఖర్చుపెట్టడానికి ఎక్కువ డబ్బు లేదు. గత మూడేళ్లగా పర్యటకులు సొంత దేశంలోనే సెలవులు గడపడానికే మొగ్గు చూపుతున్నారు'' అని ఆయన తెలిపారు.

''వీసా ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడం, అలాగే ఐదేళ్ల వీసా ఖర్చులు పెరగడం కూడా పర్యటకుల సంఖ్య తగ్గడానికి కారణమని బీబీసీతో మాట్లాడిన వాళ్లలో సగం మందికిపైగా అభిప్రాయపడ్డారు.

‘వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్‌ నుంచి గోవాకు గట్టిపోటీ’

ఎర్నెస్ట్ డియాస్ గోవా పర్యటక విభాగం కమిటీలో సభ్యులు. ట్రావెల్ చార్టర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. హోటళ్లు తక్కువ ధరకు లభించడం, ఆన్ ఎరైవల్ వీసా సౌకర్యాలు ఉండటంతో యూరప్, రష్యా పర్యటకులను ఆసియాలోని వియత్నాం, శ్రీలంక సహా ఇతర ప్రాంతాలవైపు మొగ్గుచూపేలా చేస్తోందని ఎర్నెస్ట్ డియాస్ చెబుతున్నారు.

''ప్రస్తుతం పర్యటకులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరి నిమిషంలో ట్రిప్‌లు ప్లాన్ చేస్తున్నారు. వీసా ప్రక్రియ ఆలస్యమవడం అన్నది విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడంలో కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తోంది'' అని డియాస్ బీబీసీతో చెప్పారు.

ఇటీవల ఒక పెద్ద రష్యన్ చార్టర్ గ్రూపు తమ గోవా పర్యటనను రద్దుచేసుకుని, దాని బదులుగా వియత్నాం వెళ్లిందని ఆయన చెప్పారు. ‘‘అక్కడ డిమాండ్ బాగా పెరిగింది’’ అని తెలిపారు.

ఆన్ -అరైవల్ వీసాలకే కాకుండా, తక్కువ ఖర్చతో ప్రయాణం చేయగలగడం కూడా గోవాతో పోలిస్తే ఈ దేశాలు మెరుగ్గా నిలవడానికి ప్రధాన కారణమని చెప్పారు.

వీసా ప్రక్రియతో పాటు గోవాతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండడం ఈ దేశాలు పర్యటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం.

దేశీయ పర్యటకుల పెరుగుదల, అలాగే సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలు ఉండే మైస్ ఎకానమీ కూడా పెరగడంతో మంచి స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్ల ధరలు విదేశీ పర్యటకులకు ఖరీదుగా మారాయాని డయాస్ చెప్పారు.

అలాగే సముద్ర తీరానికి దగ్గరగా ఉండే తక్కవ ధర రిసార్టులు గోవాలో పరిమితంగా ఉన్నాయి. కానీ వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్‌లో గోవాతో పోలిస్తే సగం ధరకు, లేదంటే ఇంకా తక్కువ ధరకే ప్యాకేజీ డీల్స్ లభిస్తున్నాయి.

‘యాప్‌లో ట్యాక్సీ బుక్ చేసుకోలేం’

లండన్ గాత్విక్ నుంచి నేరుగా గోవా వచ్చే ఎయిర్ ఇండియా సర్వీస్ నిలిపివేయడం కూడా ప్రభావం చూపింది.

పాలోలెమ్‌కు ఉత్తరంగా ఉన్న బెనాలియం బీచ్‌లోని తాత్కాలిక వసతి గృహంలో ఉన్న నికోలా అనే హెయిర్ డ్రెస్సర్ బీబీసీతో మాట్లాడారు. మూడు వారాలు గోవాలో గడిపేందుకు ఆమె తన స్నేహితులు అల్సిన్, డ్వేన్‌తో కలిసి వచ్చారు. ఎయిర్ ఇండియా సర్వీసు రద్దు చేయడంతో ముంబైలో అనుకోకుండా ఆగాల్సి వచ్చిందని, అది సౌకర్యవంతంగా లేదని ఆమె చెప్పారు.

ఈ ఏడాది తన సోదరుడు గోవాకు బదులు శ్రీలంక వెళ్లారని చెప్పారు.

''శ్రీలంక వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ ఖర్చు తక్కువ ఉంటుంది. గోవాతో పోలిస్తే చాలా శుభ్రంగా ఉంటుందని మా సోదరుడు అనుకున్నాడు'' అని ఆమె చెప్పారు.

బీచ్‌లను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కానీ బీచ్‌కు వెళ్లేరోడ్లు చెత్తతో నిండిపోయి చూడడానికి బాగుండడం లేదని డియాస్ అంగీకరించారు.

స్థానిక ట్యాక్సీ యూనియన్లు యాప్ ఆధారిత సర్వీసులను వ్యతిరేకించడంతో అక్కడ ట్యాక్సీల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అది కూడా పెద్ద సమస్యగా మారిందని ఆయన తెలిపారు.

''ఇది రాతియుగంలో ఉంటున్నట్టు అనిపిస్తుంది. మీ యాప్‌లో మీరు ట్యాక్సీ బుక్ చేసుకోలేరు. స్థానిక యూనియన్లు యాప్‌లను వ్యతిరేకిస్తాయి''అన్నారు.

పర్యటకరంగంపై ఆధారపడిన గోవా ఆర్థిక వ్యవస్థకు ఈ పరిస్థితులు మంచివి కావు.

విదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు

గోవాలో ప్రసిద్ధి చెందిన బాగా బీచ్‌కు దగ్గర షెర్విన్ లోబో అనే వ్యక్తికి వంద గదులున్న హోటల్ ఉంది. ఈ హోటల్‌కు వచ్చే విదేశీ పర్యటకుల సంఖ్య 10శాతం తగ్గిందని ఆయన చెప్పారు. స్థానిక బుకింగ్స్ వల్ల ఆ ప్రభావం కొంచెం తగ్గినప్పటికీ తన హోటల్ లాంటి వాటిల్లో విదేశీ పర్యటకులు ఉండడమే బాగుంటుందని, వాళ్లు ఎక్కువ రోజులు ఉంటారని, దీనివల్ల గదులు నిండిపోయి ఉంటాయని ఆయన అన్నారు.

విదేశీ పర్యటకులు విహారయాత్రలకు వెళ్తారని, బైక్‌లు అద్దెకు తీసుకుంటారని, స్థానిక షాక్స్, రెస్టారెంట్లలో తింటారని ఆయన చెప్పారు. భారత పర్యటకులు మాత్రం పూర్తిస్థాయి ప్యాకేజ్ ఎంచుకుంటారని విదేశీ పర్యటకులు తగ్గడం వల్ల మొత్తం పర్యటకవ్యవస్థపై ప్రభావం పడిందని అన్నారు.

సమస్యను స్థానిక ప్రభుత్వం గుర్తించిందని డియాస్ చెప్పారు. అయితే ఈ సమ్యను గోవా చాలా కాలం నిర్లక్ష్యం చేసిందని అంగీకరించారు.

''విదేశీ పర్యటకులను ఆకర్షించడానికి మేం వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాం. ఇటీవలే పోలండ్ వెళ్లాం. తర్వాత స్కాండినేవియా వెళ్తాం. రానున్న ఏళ్లలో ఆసియా, ఆఫ్రికా నుంచి కూడా మరింతమంది పర్యటకులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది'' అని ఆయన అన్నారు.

అయితే ఆసియాలో చవకగా, శుభ్రంగా, పర్యటకులకు అనుకూలంగా ఉన్న దేశాలనుంచి పోటీ పెరుగుతోంది. తెల్లని చర్చిలు, రంగురంగుల పోర్చుగీస్ ఇళ్లు, ప్రశాంతంగా జీవించే ప్రజలు గోవా ప్రత్యేకతలు. అయితే విదేశీ పర్యటకులను ఆకర్షించడానికి గోవా మరింత చెమటోడ్చాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)