దక్షిణ కోస్తా రైల్వే జోన్: విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభం.. ఈ కొత్త జోన్ పరిధిలోకి ఏపీలోని 4 రైల్వే డివిజన్లు

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి.

కొత్తగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉంటాయి. విశాఖలోని జోనల్ ప్రధాన కార్యాలయం నుంచి వీటి పరిపాలన సాగుతుంది.

కొత్త జోన్ పరిధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉంటాయి.

ప్రస్తుతం ఈ డివిజన్లు వేర్వేరు జోన్ల పరిధిలో ఉండగా, ఇకపై విశాఖలోని జోనల్ ప్రధాన కార్యాలయం నుంచి పరిపాలన సాగనుంది.

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక.. రైల్వే జోన్‌ సాకారమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

ఎన్నో పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే అని తెలిపారు.

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుపై ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ వద్ద నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త జోన్‌ ఏర్పాటుతో లక్షల మంది ప్రయాణికులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

రైల్వేను అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే కృషి చేసినట్లు చెప్పారు.

రైల్వే జోన్ అంటే ఏమిటి?

భారతీయ రైల్వే వ్యవస్థల్లో లక్షలాది ఉద్యోగులు, వేల రైళ్లు, వేల కిలోమీటర్ల ట్రాక్‌లను ఒకే కేంద్రం నుంచి నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే రైల్వేను అనేక జోన్లుగా విభజించారు.

రైల్వే జోన్ అనేది ఒక ప్రాంతంలోని రైల్వే వ్యవస్థను నిర్వహించే పరిపాలనా యూనిట్.

ఒక రాష్ట్రంలో జిల్లాలను పాలించేందుకు కలెక్టర్ కార్యాలయాలు ఉన్నట్లే, రైల్వేలో జోన్‌లు ఉంటాయి.

ఒక రైల్వే జోన్ కింద సాధారణంగా అనేక డివిజన్లు ఉంటాయి.

జోన్ ఏం చేస్తుంది?

  • రైళ్ల నిర్వహణ
  • ట్రాక్‌ల సంరక్షణ
  • స్టేషన్ల అభివృద్ధి
  • సిగ్నలింగ్ వ్యవస్థ
  • ఉద్యోగుల పరిపాలన
  • భద్రతా పర్యవేక్షణ
  • బడ్జెట్ వినియోగం
  • కొత్త పనుల ప్రతిపాదనలు వంటి అంశాలను చూసుకుంటుంది.

జోన్‌కు జనరల్ మేనేజర్ అధిపతిగా ఉంటారు. డివిజన్లను డివిజనల్ రైల్వే మేనేజర్లు నిర్వహిస్తారు.

దక్షిణ కోస్తా జోన్ రాకముందు పరిస్థితి ఎలా ఉండేది?

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే వ్యవస్థ మొత్తం ఒకే జోన్ కింద ఉండేది కాదు.

విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు సౌత్ సెంట్రల్ (దక్షిణ మధ్య) రైల్వే పరిధిలో ఉండేవి. వాల్తేరు డివిజన్ (ఇది విశాఖపట్నం జోన్‌గా మారింది) ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉండేది.

అంటే, రాష్ట్రంలోని రైల్వే పరిపాలన రెండు వేర్వేరు జోన్ల మధ్య విభజించి ఉండేది.

ఇప్పుడు, దక్షిణ కోస్తా జోన్ ఏర్పడటంతో ఈ నాలుగు డివిజన్లు ఒకే జోన్ కిందకు వచ్చాయి.

ఇప్పటివరకు సికింద్రాబాద్, భువనేశ్వర్ వంటి నగరాల్లోని జీఎంలకు నివేదించాల్సి వచ్చేది.

ఇకపై విశాఖపట్నంలోనే జోన్ ప్రధాన కార్యాలయం ఉంటుంది.

నాలుగు డివిజన్ల డీఆర్‌ఎంలు విశాఖలోని జీఎంకు నివేదిస్తారు. అనేక పరిపాలనా నిర్ణయాలు స్థానికంగా తీసుకునే అవకాశం ఉంటుంది.

చాలామందికి "జోన్ వచ్చింది" అంటే కొత్త రైల్వే వ్యవస్థ ఏర్పడిందని అనిపించవచ్చు.

కానీ, వాస్తవానికి ఇది పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమే.

రైళ్లు ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ కింద నడుస్తాయి.

టికెట్ ధరలు, కొత్త రైళ్లు, పెద్ద ప్రాజెక్టుల వంటి కీలక నిర్ణయాలు ఇప్పటికీ రైల్వే బోర్డు, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటాయి.

ఎంత పెద్దది ఈ జోన్?

రైల్వే శాఖ వివరాల ప్రకారం…దక్షిణ కోస్తా జోన్ పరిధిలో 3,532 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ ఉంది.

డబుల్, ట్రిపుల్ లైన్లతో కలిపి మొత్తం ట్రాక్ పొడవు 6,454 కిలో మీటర్లకు చేరుతుంది.

ఈ జోన్‌లో మొత్తం 385 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

నాలుగు డివిజన్లలో కలిపి సుమారు 62 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

విశాఖలోని జోనల్ ప్రధాన కార్యాలయంలో అదనంగా 1,200 మందికి పైగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

జోనల్ కార్యాలయాన్ని ప్రస్తుతం విశాఖపట్నంలోని సిరిపురం ప్రాంతంలోని "ది డెక్" భవనంలో ఏర్పాటు చేశారు.

ఉద్యోగ అవకాశాలపై అంచనాలు

ప్రత్యేక జోన్ కోసం ఉద్యమించిన సంస్థలు, ప్రజా ప్రతినిధులు ఒక వాదనను ముందుకు తెచ్చారు.

రైల్వే నియామకాలు, పరీక్షా కేంద్రాలు, పరిపాలనా నిర్ణయాల్లో స్థానిక యువతకు తగిన ప్రాధాన్యం లభించలేదని వారు గతంలో వాదించారు.

జోన్ ప్రధాన కార్యాలయం విశాఖలో ఉండటం వల్ల నియామక ప్రక్రియలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు రాష్ట్రంలోనే నిర్వహించే అవకాశం పెరుగుతుందని వారు భావిస్తున్నారు.

అయితే, రైల్వే నియామకాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

ఆదాయ సామర్థ్యమెంత?

రైల్వే యూనియన్ నాయకులు చలసాని గాంధీ బీబీసీతో మాట్లాడారు.

‘‘ రైల్వే ఆదాయంలో సరకు రవాణాదే ప్రధాన వాటా. పాత వాల్తేరు డివిజన్ దేశంలో అత్యధిక సరకు రవాణా నిర్వహించే డివిజన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే కొత్తవలస - కిరండూల్ (కేకే) రైలుమార్గం దీనికి ప్రధాన ఆధారం’’ అని చెప్పారు.

జోన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేకే లైన్ కొత్తగా ఏర్పడిన రాయగఢ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది.

అయినప్పటికీ, విశాఖపట్నం డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 40 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

మొత్తం దక్షిణ కోస్తా జోన్ పరిధిలో ఏటా 100 మిలియన్ టన్నుల వరకు సరకు రవాణా జరిగే అవకాశం ఉందని అంచనా.

సరకు, ప్రయాణికుల రవాణా ద్వారా సంవత్సరానికి సుమారు రూ.15,500 కోట్ల ఆదాయం రావచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

జోన్ వల్ల లాభమెంత?

జోనల్ ప్రధాన కార్యాలయం రాష్ట్రంలోనే ఉండటం వల్ల కొన్ని పరిపాలనా నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది.

స్టేషన్ అభివృద్ధి, చిన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ట్రాక్ అప్‌గ్రేడేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరగవచ్చు.

అయితే, కొత్త జోన్ ఏర్పడిందనే కారణంతో వెంటనే కొత్త రైళ్లు లేదా భారీ పెట్టుబడులు వస్తాయని భావించలేమని వారు చెబుతున్నారు.

అలాంటి నిర్ణయాలు ఇప్పటికీ రైల్వే బోర్డు, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదాలపై ఆధారపడి ఉంటాయి.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఒక పరిపాలనా మైలురాయిగా పరిగణిస్తున్నప్పటికీ, దాని విజయాన్ని నిర్ణయించేది జోన్ ఏర్పాటు కాదు.

రాబోయే సంవత్సరాల్లో ఈ జోన్ ఎంతమేర పెట్టుబడులను ఆకర్షిస్తుంది? ఎంత ఆదాయం సమకూరుతుంది? వంటివి కూడా ముఖ్యమైన విషయాలు అని యూనియన్ నాయకులు చలసాని గాంధీ బీబీసీతో అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)