విపక్షాల పాదయాత్రకు అడ్డంకులు.. దారి మార్చుకుని సుప్రీంకోర్ట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రతిపక్షాల నాయకులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పవన్‌కాంత్ దిగవల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి పార్టీలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నప్పటికీ రాహుల్ గాంధీ దారి మార్చుకుని సుప్రీంకోర్ట్‌కు చేరుకున్నారు.
సుప్రీంకోర్ట్‌కు చేరుకున్నాక పిటిషన్ దాఖలు చేైసినట్లు రాహుల్ టీం ‘బీబీసీ’కి ధ్రువీకరించింది.
బారాఖంబా నుంచి సుప్రీంకోర్ట్ వైపు మొదలైన ఈ మార్చ్‌ను తొలుత మండీహౌస్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో నాయకులు, వారి వెంట భారీగా ఉన్న పార్టీల శ్రేణులు మండీహౌస్ నుంచి వెనక్కు మళ్లాయి.
అక్కడి నుంచి ఇండియాగేట్‌కు వెళ్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు ‘బీబీసీ’తో చెప్పారు.
అయితే, ఇండియా గేట్ వద్ద రాహుల్ గాంధీ ఉన్న వాహనాన్ని ఆపేందుకు అనుమతించలేదు.
ఇండియా గేట్ నుంచి తిలక్ మార్గ్‌లో సుప్రీంకోర్టు వైపు వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించారు.
పోలీసులను దాటుకుంటూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కొందరు నాయకులు సుప్రీంకోర్ట్ గేట్ బి వద్దకు చేరుకోగలిగారు.

బారాఖంబా నుంచి బస్‌లో
తొలుత ఈ పాదయాత్ర దిల్లీ నగర నడిబొడ్డుగా పరిగణించే కన్నాట్ ప్లేస్ సమీపంలోని బారాఖంబా మెట్రో స్టేషన్ నుంచి మొదలైంది.
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా కొందరు ప్రతిపక్ష నాయకులు బస్సులో బారాఖంబా మెట్రో స్టేషన్ బయట ఉన్న రోడ్డుపైకి చేరుకున్నారు.
అక్కడ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్ష పార్టీల కార్యకర్తలు, వందల మంది విద్యార్థులు ఉన్నారు.
బారాఖంబా మెట్రో స్టేషన్ నుండి మండీ హౌస్ వరకు ఉన్న రహదారి జనంతో నిండిపోయింది. వాళ్లలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని కనిపించారు.
కాగా పాదయాత్రగా వెళ్తున్న విపక్ష నాయకులను మండీ హౌస్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో నాయకులున్న బస్, ఇతర వాహనాలు, నడుచుకుంటూ వస్తున్న పార్టీల కార్యకర్తలు అంతా అక్కడి నుంచి ఇండియాగేట్ దారిలోకి మళ్లారు.

ఫొటో సోర్స్, REUTERS/Priyanshu Singh
సీజేఐని కలవాలని..
కాగా పాదయాత్రగా వెళ్లి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)కు మెమొరాండం ఇవ్వాలన్నది విపక్షాల ఆలోచన.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బారాఖంబా నుంచి సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర చేశాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెమోరాండం ఇస్తామని రాహుల్ గాంధీ శనివారమే ప్రకటించారు.
విపక్షాల పాదయాత్రలో కొందరు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.
అయితే, విపక్ష నేతలతో సమావేశం కావడానికి సీజేఐ నిరాకరించారు.
"విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను" అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.

రెండు రోజుల ముందు ఏం జరిగింది?
విపక్షాల నిరసన కంటే ముందు శనివారం(అక్టోబర్ 10న) కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) దిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చినప్పటికీ అనుమతులు దొరకలేదు.
సీజేపీ ప్రధాన నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను వారు దిల్లీ చేరుకోగానే విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.
నిరసనకారులెవరూ జంతర్ మంతర్ వరకు చేరుకోలేకపోయారు.
అనంతరం ఆదివారం కూడా సెంట్రల్ దిల్లీ అంతటా పోలీసులు పెద్దఎత్తున కనిపించారు. ఆదివారం కూడా వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.


ఓటర్ల జాబితాను నవీకరించే క్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణతో సీజేపీ, ప్రతిపక్ష పార్టీలు ఈ నిరసనలు చేపడుతున్నాయి.
సోమవారం(అక్టోబర్ 12) నాటి విపక్షాల ఆందోళనలో బారాఖంబా నుంచి సుప్రీంకోర్టు వరకు పెద్దఎత్తున జనం కనిపించారు.
ఈ నిరసనలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరా, ఇతర విపక్షాలు, అనుబంధ సంఘాలకు చెందిన అనేక మంది నాయకులు ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























