గుడ్‌నైట్.
లైవ్ పేజీ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం మరిన్ని తాజా వార్తలతో కలుద్దాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
దీప్కేను విమానంలోనే అదుపులోకి తీసుకోవడంపై దిల్లీ పోలీసులు స్పందించారు. దీప్కేకు మరో ఇద్దరికి దిల్లీలో నిరసన తెలిపేందుక అనుమతి లేదని పోలీసులు చెప్పారు. మరోపక్క పేపర్లపై సంతకాలు పెట్టాల్సిందిగా పోలీసులు తనను బలవంతం చేశారని అభిజిత్ దీప్కే చెప్పారు.
గుడ్‌నైట్.
లైవ్ పేజీ ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం మరిన్ని తాజా వార్తలతో కలుద్దాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, Reuters
రష్యా యుక్రెయిన్‌ల మధ్య “ఇంధన వనరులపై దాడుల విరమణకు అంగీకారం కుదిరిందని ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.
దీనిపై రష్యా స్పందించలేదు.
ట్రంప్ ప్రకటన తనకు “కొత్త వార్త” అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నట్లు అమెరికా వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ తెలిపింది.
అంతకుముందు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను “తక్షణమే ఆపాలి” అని అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్‌ను హెచ్చరించారు. ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.
“రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపివేస్తే, మేం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడం ఆపేస్తాం” అని జెలియన్‌స్కీ ఆదివారం చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
సుప్రీంకోర్టుకు సోమవారం పాదయాత్రగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించనున్నట్టు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
సుప్రీంకోర్టుకు చేరుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి దేశవ్యాప్త విజ్ఞప్తులతో కూడిన ఒక వినతిప్రతం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇప్పటికే సీజేఐకి లేఖలు రాశారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే యువత, విపక్షాలు , పౌర సమాజం కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా తనతో కలిసి రావాలని రాహుల్ గాంధీ కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ డోభాల్, మోహన్ భాగవత్ భారత ప్రజల గొంతును నొక్కలేరని రాహుల్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
తల్లిదండ్రులతో మాట్లాడేందుకు తాను నిరాకరించినట్టు పోలీసులు చేసిన వ్యాఖ్యలపై అభిజీత్ దీప్కే ఎక్స్‌లో స్పందించారు.
ఆదివారం ఉదయం పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత అభిజీత్ దీప్కే తన నాయనమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు స్వగ్రామానికి వెళ్లారు.
దిల్లీ పోలీసుల ప్రెస్‌మీట్ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన అభిజీత్ దీప్కే అనేక ప్రశ్నలు సంధించారు.
“మా నాయనమ్మతో కలిసి నివసించే నా కజిన్‌తో మాట్లాడటానికి అనుమతించమని అభ్యర్థించాను. కనీసం నా కజిన్ నంబర్ అయినా తీసుకోవడం కోసం కొన్ని నిమిషాల పాటు నా ఫోన్ ఇవ్వమని అడిగాను. ఆ విషయాన్ని వీడియో నుంచి ఎందుకు డిలీట్ చేశారు?” అని దీప్కే ప్రశ్నించారు.
దిల్లీ పోలీసులు ఫోన్ వాడుకోవడానికి ఎందుకు అనుమతించలేదు? నేను నా లాయర్‌తో మాట్లాడాలని అభ్యర్థించాను. దానికి కూడా నిరాకరించారని దీప్కే చెప్పారు.
సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తన తండ్రికి ఫోన్ చేస్తామని పోలీసులు చెప్పారని దీప్కే పేర్కొన్నారు.
“మరుసటి రోజు నన్ను చాలా కాలం రోజులు జైలుకు పంపుతారని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పమన్నారు” అని ఆయన రాశారు.
“మా నానమ్మ మరణం తర్వాత మా కుటుంబానికి మీరు ఇంకెంత మానసిక వేదన కలిగించాలనుకున్నారు?” అని దీప్కే తన పోస్ట్ ద్వారా ప్రశ్నించారు.
“తెల్లవారుజామున 3:30 గంటలకు మా తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఏమిటి? వాళ్ళను మరింత బాధపెట్టాలనుకున్నారా? తెల్లవారు జామున 3.30 గంటలకు మీలో మానవత్వం ఉదయించిందా?. నాయనమ్మ చనిపోయి బాధలో ఉంటే అరెస్ట్ పేపర్ల మీద సంతకం చేయమని ఒత్తిడి చేశారు. మా లాయర్‌తో మాట్లాడే వరకు సంతకం చేయడానికి నేను నిరాకరించాను” అని దీప్కే వివరించారు.
అభిజీత్ దీప్కేతో పాటు ఇతర సీజేపీ నాయకుల్ని విమానంలోనే అదుపులోకి తీసుకోవడంపై వస్తున్న విమర్శలకు దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు
షాదరా జోన్ డీసీపీ నేహా యాదవ్ సీజేపీ ఆరోపణలపై స్పందించారు.
దీప్కేతో పాటు మరో ఇద్దరికి దిల్లీలో నిరసన తెలిపేందుకు అనుమతి లేదని అందుకే వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
దీప్కే నాయనమ్మ మరణం గురించి తెలియగానే పోలీసులు ఆ విషయాన్ని ఆయనకు చెబుతున్నప్పుడు రికార్డు చేసిన వీడియోను ఆమె ప్లే చేశారు.
తర్వాత దీప్కేను స్వగ్రామానికి వెళ్లేందుకు అనుమతించారు. కానీ దీప్కే నిరాకరించారని డీసీపీ నేహా యాదవ్ పేర్కొన్నారు.
పునరాలోచించుకోవడానికి పోలీసులు సమయం ఇచ్చారని, అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదని కూడా ఆమె తెలిపారు.
తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పోలీసులు అవకాశం కల్పించినా అభిజీత్ దీప్కే దాన్ని కూడా వద్దన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సీజేపీ నాయకులు దిల్లీ పోలీసులపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.
గత నిరసనల సమయంలో దీప్కే చట్టాన్ని ఉల్లంఘించారని ఈసారి కూడా అలాగే చేశారని దిల్లీ పోలీసులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో నిరసనలకు సంబంధించి అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు లైవ్‌లా వెబ్‌సైట్ తెలిపింది.
అక్టోబర్ 10వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ సహా పలు ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనకు దిగనున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలు, మెట్రో సేవలను నిలిపివేయకుండా నియంత్రిత పద్ధతిలో నడపాలని అక్టోబర్ 9న సుప్రీం కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి మెట్రో స్టేషన్లను మూసివేశారని, ఇది కోర్టు ధిక్కరణ అని చెప్పడానికి పిటిషనర్లు ప్రాథమికంగా తగిన ఆధారాలను సమర్పించారని సుప్రీం కోర్టు పేర్కొందని లైవ్ లా తెలిపింది.
ఈ వ్యవహారంపై సమాధానాలు దాఖలు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, దిల్లీ పోలీస్ కమిషనర్, డీఎంఆర్‌సీ ఛైర్మన్ డి.తారాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
అక్టోబర్ 13 లోగా కౌంటర్ అఫిడవిట్లు, కోర్టు ఆదేశాలను ఎంతవరకు అమలు చేశారో తెలిపే నివేదికలను దాఖలు చేయాలని సంబంధిత అధికారులందరినీ కోర్టు కోరింది.
ప్రస్తుతానికి వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
కేసు తదుపరి విచారణలో దాఖలు అయ్యే సమాధానాలు, ఆదేశాల అమలుపై సమర్పించిన నివేదికలను బట్టి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Reuters
పవన్ కాంత్ దిగవల్లి,
బీబీసీ ప్రతినిధి
సెంట్రల్ దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి నిరసనకారులకు భద్రతా బలగాలకూ మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
కన్నాట్‌ప్లేస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, దిల్లీ పోలీసులను మోహరించారు.
మహిళా నిరసనకారులను దిల్లీ మహిళా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి బస్సుల్లో ఎక్కించి తరలిస్తున్నారు.
ఎక్కడికక్కడ వేర్వేరు గుంపుల్లో నిరసనకారులు జంతర్ మంతర్ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తమ పట్ల విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
సెంట్రల్ దిల్లీలో ఇంటర్‌నెట్ పని చేస్తోంది. కొన్ని రోడ్లపై బారికేడ్లను తొలగిస్తున్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
ప్రతీ వాహనాన్నీ పోలీసు బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
కన్నాట్‌ప్లేస్‌లో దుకాణాలను తెరిచారు. అయితే జంతర్ మంతర్‌కు వెళ్లే అన్ని మార్గాలనూ పోలీసులు మూసివేశారు.

ఫొటో సోర్స్, Alexander KAZAKOV / POOL / AFP via Getty Images
ప్రధాని నరేంద్ర మోదీ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఎక్స్‌లో నివాళులర్పిస్తూ ఎమర్జెన్సీ పై వ్యాఖ్యానించారు.
"లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నా. ఆయన ప్రభావం అనేక తరాల వరకు నిలిచింది. దేశ నవనిర్మాణానికి ప్రజాజీవితం ఒక మాధ్యమంగా మారగలదనే నమ్మకాన్ని ఆయన ప్రజల్లో నింపారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన నిర్భయంగా విప్పిన గళం ఎంతో విశేషమైనది."
జేపీగా, లోక్‌నాయక్‌గా ప్రసిద్ధి పొందిన జయప్రకాశ్ నారాయణ్, 1974 లో అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం నినాదాన్ని ఇచ్చారు.
1975 లో ఆయన ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత ప్రతిపక్ష ఉద్యమానికి నాయకత్వం వహించారు, దీనివల్ల ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్ళవలసి వచ్చింది.
ఆ తర్వాత 1977 లో దేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది.

పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నేరుగా ప్రధాని మోదీపై విమర్శల దాడి చేశారు.
అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ రత్నా సింగ్ విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.
నాయనమ్మ మృతి చెందడంతో అభిజీత్ దీప్కే స్వగ్రామానికి వెళ్లడంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు.
“భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోదీ అత్యంత పిరికి ప్రధానమంత్రి” అని అశుతోష్ రాంకా అన్నారు.
“ఇదే ప్రభుత్వం నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను విమానంలో ఎక్కించి దేశం నుంచి పంపించివేసింది. మమ్మల్ని మాత్రం విమానం నుంచి దించేసింది” అని సౌరవ్ దాస్ ఆరోపించారు.
“మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు పోలీసులు మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాఫియా డాన్లలా వచ్చి మమ్మల్ని తీసుకుపోయారు. మా ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను మహిళా పోలీసులు తీసుకున్నారు. కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు” అని ఆయన అన్నారు.
“నన్ను ఆర్‌కే పురంలో అశుతోష్‌ను బల్లభ్‌గఢ్‌కు, అభిజీత్‌ను కూడా ఎక్కడికో తీసుకువెళ్లారు. మమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు, మా న్యాయవాదితో మాట్లాడటం మా ప్రాథమిక హక్కు అని అడిగా. కానీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి హక్కులు ఉండవని మాకు చెప్పారు. నిరసనకారులతో దిల్లీ పోలీసులు ఇంకెంత క్రూరంగా వ్యవహరించారో” అని సౌరవ్ దాస్ అన్నారు.
“మా ఫోన్‌ను ఏం చేశారోనని మాకు ఆందోళనగా ఉంది. మా ఫోన్‌ను క్లోన్ చేశారని అనుమానంగా ఉంది. రేపు మా ఫోన్‌ను క్లోన్ చేసి సాక్ష్యంగా సమర్పిస్తారు” అని సౌరవ్‌దాస్ అన్నారు.

సర్‌కు వ్యతిరేకంగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఎఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, ఆదివారం రామకృష్ణ ఆశ్రమ మార్గ్‌లో నిరసనకు దిగారు.
ఘటనా స్థలిలో ఉన్న బీబీసీ విలేఖరి రాఘవేంద్ర రావు, నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ధృవీకరించారు.
నేహా బోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, ఆమె పరుగులు పెడుతున్నట్టు కనిపించారు.
అక్టోబర్ 2 నుంచి దిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలలో నేహా బోరా ప్రముఖంగా నిలిచారు. దాదాపు ప్రతి నిరసన తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శనివారం,దిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్లే రహదారులపై కట్టుదిట్టమైన భద్రత నడుమ, ఆమె అకస్మాత్తుగా దిల్లీహాట్‌కు చేరుకుని నిరసన తెలపడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆదివారం కూడా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Prabhat Kuamr/BBC

ఫొటో సోర్స్, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేసినట్లు సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.
శనివారం ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.
"అభిజిత్, అశుతోష్, సౌరవ్‌లను ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు" అని రత్నా సింగ్ తెలిపారు.
"దిల్లీ పోలీసు అధికారి ఒకరు ఈరోజు ఉదయం నాకు ఈ సమాచారం ఇచ్చారు. సీజేపీ లీగల్ హెడ్ హోదాలో, మా తరఫున హాజరయ్యే ఇతర వకీళ్లతో కలిసి నేను పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటాను" అని చెప్పారు.
అంతకుముందు, సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ముందస్తు నిర్బంధంలో ఉంచామని, వారిని నేడు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ముగ్గురు నాయకుల నిర్బంధంపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
"మోదీ, షా ఎంతలా భయపడ్డారంటే నేడు వారు పిల్లలను అపహరిస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు

ఫొటో సోర్స్, Sofiane ALSAAR / AFP via Getty Images
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో కనీసం 12 మంది మరణించగా, 309 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
యెమెన్‌కు చెందిన హూతీలు ఇలాంటి దాడులు చేసినట్లు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది.
మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, అమెరికా, జోర్డాన్, పాలస్తీనా, సిరియా, సూడాన్, ఈజిప్టుకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని సౌదీ పౌర విమానయాన సంస్థ తెలిపింది.
ఈ దాడి నేపథ్యంలో కింగ్ ఖాలిద్ విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు.
హూతీలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించిన సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి.. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించింది.

ఫొటో సోర్స్, x.com/neha
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగుతాయని అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రకటించారు.
సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నేహా బోరా, శనివారం దిల్లీ హాట్ 'జంతర్-మంతర్'గా మారిందని, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని చెప్పారు.
"సామాన్యులను జైళ్లలో పెడతారా లేక జ్ఞానేశ్ కుమార్‌నా అనేది మీరే తేల్చుకోండి. మేం ఆదివారం కూడా వీధుల్లోకి వస్తాం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్‌ఐఆర్ రద్దు డిమాండ్‌తో నిరసన ప్రదర్శన చేస్తాం" అని అన్నారు.
మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత అజింక్య శిందే ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి ఆదివారం జరగనున్న నిరసన వివరాలు వెల్లడించారు.
"జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లం" అని ఆయన పేర్కొన్నారు.
తాము రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్-మంతర్ వైపు కవాతు చేస్తామని అజింక్య చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో జంతర్-మంతర్‌కు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందంపై జెలియెన్ స్కీ చేసిన విమర్శలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా నుంచి లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేసేందుకు కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల.. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు డబ్బు అందించినట్లవుతుందని జెలియెన్ స్కీ హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇచ్చే బహుమతిగా జెలియెన్ స్కీ అభివర్ణించారు.
శనివారం వైట్‌హౌస్ వెలుపల విలేఖరులతో ట్రంప్ మాట్లాడారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులకు జెలియెన్ స్కీ అనుమతులు ఇస్తూ.. ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.
‘‘ఆయన ఈ పని కచ్చితంగా ఆపేయాలి’’ అన్నారు. ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని సూచించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.