టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

ఫొటో సోర్స్, MLA Pallavi
తమిళ వెట్రి కళగం(టీవీకే) ఎమ్మెల్యే పల్లవి తన నెలల చిన్నారిని సభలు, సమావేశాలకు తీసుకెళ్లడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘‘ముఖ్యమంత్రి విజయ్ టీవీకే ఎమ్మెల్యేకు తగిన సలహా ఇవ్వాలి’’ అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు.
ఐఐటీ మద్రాస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లవి తన నెలల బాబును తీసుకొచ్చారు. దీనిపై కార్తీ చిదంబరం విమర్శలు చేశారు.
దీనిపై శిశు సంక్షేమ కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
చెన్నైలోని తిరు.వి.కె.నగర్ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున గెలిచారు పల్లవి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పల్లవి తన పసికందును తీసుకుని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు వెళుతున్నారు.

మహిళల భద్రత కోసం తమిళనాడు ప్రభుత్వం గత జూన్‌లో 'సింగపెణ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్' అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లవి తన కొడుకును తీసుకొచ్చారు.
ఆగస్టులో అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆమె తన బాబును తీసుకుని వచ్చారు. అసెంబ్లీలోకి వెళ్లేముందు నెలల బాబును ఒక సహాయకురాలికి అప్పగించి సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
ఆ తర్వాత కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు ఆమె తన బాబును వెంటపెట్టుకునే హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Pallavi
ఎమ్మెల్యే పల్లవి ఏమంటున్నారు?
ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఎమ్మెల్యే పల్లవి ఇలాంటి పనులు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు.
"పసికందును ఇంట్లో వదిలి నేను బయటకెలారాగలను? ఇందులో ప్రజల దృష్టిని ఆకర్షించే విషయం ఏముంది?" అని ఆమె ప్రశ్నించారు.
"నేను రాజకీయాలు చేయడానికి బాబును తీసుకురావడంలేదు. ఇతరుల బాధ మీకు అర్థం కాకపోయినా ఆలోచించి మీ అభిప్రాయాలను చెప్పండి. ఎగతాళి చేయకండి" అని ఆమె అన్నారు.
తర్వాత కూడా ఆమె ఇలా వివిధ కార్యక్రమాలకు తన చిన్నారిని తీసుకునే వస్తున్నారు. `
మదురాంతకం ఉప ఎన్నిక సందర్భంగా అక్టోబర్ 2న ముఖ్యమంత్రి విజయ్ ప్రచారం చేశారు. ఆ సమయంలో పల్లవి తన పసిబిడ్డను ఎత్తుకుని సీఎం ప్రచార వాహనం ముందు నిలబడి ఉన్నారు. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి ఆమెను కొంచెం పక్కకు వెళ్లి నిలబడమని సైగ చేశారు. ప్రచార సభలో కూడా పల్లవి బాబుతో కలిసి పాల్గొనడం విమర్శలకు దారితీసింది.

ఫొటో సోర్స్, karthickChidambaram/fb
ప్రచారం కోసమే - కార్తీ చిదంబరం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటీ మద్రాస్‌లో గత ఆదివారం పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పల్లవి పసిబిడ్డను తీసుకొచ్చారు. ఆమెతో నటి కస్తూరి మాట్లాడుతున్న వీడియో మీడియాలో వచ్చింది.
''పల్లవి చేస్తున్న పనిని నేను నిజంగా గౌరవిస్తా. బాబును పల్లవి తనతో పాటు తీసుకొచ్చి పనిచేయడాన్ని సీఎం విజయ్ ప్రోత్సహిస్తున్నారు" అని నటి కస్తూరి అన్నారు.
ప్రచారం కోసమే పల్లవి బాబును వెంట తీసుకొస్తున్నారన్న విమర్శలపై కస్తూరి అభ్యంతరం వ్యక్తంచేశారు.
''గతంలో మహిళలు పొలాల్లో నాట్లు వేసేటప్పుడు చెట్టుకు ఓ పాతచీరతో ఊయలలాంటిది కట్టి అందులో పసిబిడ్డను పడుకోబెట్టి పనిచేసేవారు. అంతేగానీ పిల్లలను వాళ్లు తమకు దూరంగా ఉంచలేదు'' అని కస్తూరి చెప్పారు.
దీనిపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం విమర్శలు చేశారు.
''పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, ప్రసూతి, పితృత్వ సెలవులు వంటి కుటుంబ సంక్షేమ విధానాలకు నేను పూర్తిగా మద్దతిస్తా. అయితే పసికందును పదే పదే బహిరంగ కార్యక్రమాలకు తీసుకువెళ్లడం నిజంగా అవసరంకంటే రాజకీయ ప్రచార స్టంట్లా ఎక్కువగా కనిపిస్తోంది" అని ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
కార్తీ చిదంబరం విమర్శలపై ఎమ్మెల్యే పల్లవి స్పందించలేదు.
అయితే పిల్లల సంక్షేమం కోసం పనిచేసే సామాజిక కార్యకర్తల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శిశు సంక్షేమ కార్యకర్తలు ఏమంటున్నారు?
"శిశువులకు భద్రత, ఆప్యాయత చాలా అవసరం. వారికి ఇన్ఫెక్షన్లు తొందరగా సోకే ప్రమాదముంటుంది. వారిని బహిరంగ ప్రదేశాలకు తీసుకువెళ్లకపోవడమే మంచిది" అని శిశు సంక్షేమ కార్యకర్త దేవనేయన్ అరసు అన్నారు.
''శిశువుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే ప్రసూతి సెలవులిస్తారు. ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది" అని బీబీసీతో చెప్పారు.
''మదురాంతకం ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం విజయ్ పాల్గొన్న సందర్భాన్నే గమనిస్తే ముఖ్యమంత్రిని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అలాంటి ప్రదేశాల్లో పెద్దవాళ్లకే భద్రత ఉండదు. అలాంటి చోటుకు ఎమ్మెల్యే ఒక చిన్నబాబును తీసుకురావడం ఆమోదయోగ్యం కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పిల్లలకు పాలిచ్చేందుకు గదులు అందుబాటులో ఉన్నాయి. బహిరంగ కార్యక్రమాల్లో ఇలాంటివి ఏర్పాటు చేయడం చాలా కష్టం. పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు వ్యవహరించాలి" అని దేవనేయన్ అరసు సూచించారు.
"కుటుంబంలో పిల్లలను చూసుకునేందుకు ఎవరూ లేనప్పుడు వారిని ఇలా కార్యక్రమాలకు తీసుకువెళ్లడంలో తప్పేమీ లేదు" అని తమిళనాడు ప్రగతిశీల మహిళా లాయర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దమయంతి అన్నారు.
‘‘అయితే ప్రతి కార్యక్రమానికి పసిబిడ్డను వెంటతీసుకెళ్లడం సరైనది కాదు. సమాజం కోసం తానెంత కష్టపడి పనిచేస్తున్నానో ఇతరులకు చూపించుకోవాలనుకునే ప్రయత్నంగా కూడా దీనిని భావించవచ్చు'' అని ఆమె అన్నారు.
ఈ అభిప్రాయాన్ని శిశు సంక్షేమ కార్యకర్త కన్య ఖండించారు.
"పిల్లల కోసం ప్రత్యేకంగా సంరక్షకులను నియమించుకోకుండా తల్లే వాళ్లను వెంట తెచ్చుకోవడం మంచి పెంపకంగా చూడొచ్చు. కొన్ని శిశు సంరక్షణ కేంద్రాల్లో చిన్నారులకు హాని జరిగిన ఘటనలున్నాయి. బిడ్డకు తల్లి మాత్రమే రక్షణ కల్పించగలదు. అందులో ఇలా సభలు, కార్యక్రమాలకు తీసుకెళ్లడం కూడా ఉండొచ్చు'' అని ఆమె అభిప్రాయపడ్డారు.
విమర్శలపై స్పందించాలని ఎమ్మెల్యే పల్లవిని కోరేందుకు బీబీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె వివరణ ఇస్తే దానిని ఈ కథనంలో చేర్చుతాం.

చిన్నారుల ఆరోగ్యానికి మంచిదేనా..?
"బహిరంగ ప్రదేశాలకు శిశువులను తీసుకెళ్లకూడదు. పసిపిల్లలను చాలా మంది ఎత్తుకున్నప్పుడు, ముద్దు చేసినప్పుడు, తాకినప్పుడు ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది" అని ఎగ్మోర్ పిల్లల ఆస్పత్రి మాజీ డైరెక్టర్ అరసర్ సీరాళన్ అన్నారు.
"పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లడం సాధ్యం కానప్పుడు వేరే మార్గాలను వెతకాలి. పక్కవాళ్ల ఇళ్లలో పిల్లలను వదిలి వెళ్లడం కూడా సురక్షితం కాదు. బహిరంగ కార్యక్రమాలలో అధిక శబ్దం, పర్యావరణ కాలుష్యం, మితిమీరిన లైటింగ్ వంటివి పిల్లలకు హాని కలిగించవచ్చు. లౌడ్‌స్పీకర్ల నుంచి వచ్చే శబ్దం పిల్లల వినికిడి శక్తిని దెబ్బతీయొచ్చు" అని అరసర్ చెప్పారు.
"కొంతమందికి తమ పిల్లలను బహిరంగ కార్యక్రమాలకు తీసుకెళ్లి ఇతరులకు చూపించాలనే ఆసక్తి ఉండొచ్చు. కానీ దానివల్ల పిల్లల ఆరోగ్యం, సంక్షేమంపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా వాళ్లు అర్ధం చేసుకోవాలి'' అని ఆయన సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























